దక్షిన తెలంగాణ

పాపం కౌముది (కథ)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కౌముది కొత్తగా కాలేజీలో చేరింది. కాలేజీ వాతావరణం చాలా కొత్త. అపుడే రాజీవ్‌తో పరిచయం కలిగింది.
రానురాను పరిచయం స్నేహంగా మారింది. దానితో పాటు చనువూ పెరిగింది. దానికి కారణం రాజీవ్ కౌముదికి లెసన్స్‌కు సంబంధించినవేకాకుండా ఎన్నో సందేహాలు తీరుస్తుండేవాడు. ఇద్దరూ వాళ్ల ఇంటి వ్యక్తిగత విషయాలు కూడా మాట్లాడుకునే వరకు వచ్చింది.
ఓ రోజు రాజీవ్ తన మనసులోని మాట కౌముది ముందు వ్యక్తం చేశాడు.
కౌముది ‘సారీ’ చెప్పింది. తనకలాంటి ఆలోచనే లేదని చెప్పింది.
కౌముదిపై ప్రేమ, ఆలోచనలు ఆమె మాటలు విన్న రాజీవ్ అవాక్కయ్యాడు. అయినా అదంతా పట్టించుకోక కౌముదితో స్నేహంగానే (ఉంటున్నాడు) ఉన్నట్లుగా నటిస్తున్నాడు!
***
వారం రోజులుగా కౌముది కాలేజీకి రావడం లేదు. చాలా సున్నితమైన స్వభావం గల కౌముది రాజీవ్ మాటలకు బాధపడింది. ఎక్కువగా ఆలోచించడం, నిద్ర లేకపోవడంతో అనారోగ్యానికి గురైంది. తాను ఎంతో ఆత్మీయంగా, స్నేహంగా మాట్లాడితే తనను మరోలా అర్థం చేసుకుని, మనస్సు నొచ్చుకునేలా మాట్లాడిన రాజీవ్ మాటల్ని మరచిపోలేక పోవటమే ఆమె అనారోగ్యానికి కారణం!
చాలా రోజుల తరువాత ఆ రోజు కౌముది కాలేజీకి రావటం.. అదే కాలేజీలో కొత్తగా చేరిన కళ్యాణ్ కౌముదిని పలకరించాడు.
తాను, తన చదువు తప్ప ఇంకే విషయం పట్టించుకోని కళ్యాణ్, కౌముది-రాజీవ్‌ల విషయం చూచాయగా విని కౌముదిని ఓదార్చాడు.
ఈ వారం పది రోజులుగా తాను ‘మిస్సైన లెసన్స్’ అన్నీ కవరు చేసుకుంది కళ్యాణ్ ద్వారా కౌముది.
ఆమెకు అర్థంకానివన్నీ అడిగి తెలుసుకుంది. వాళ్లిద్దరూ మంచి స్నేహితులయ్యారు. అతని స్నేహంలో రాజీవ్ మాటలు, తాను ‘హర్ట్’ అయిన విషయం అన్నీ మరచిపోయింది కౌముది.
***
‘హలో’! అంటూ ఒంటరిగా కనబడిన కౌముదిని నిలిపేశాడు రాజీవ్.
‘ఏంటీ నాతో స్నేహం, కలిసి తిరగటం ‘బోర్’కొట్టి, కళ్యాణ్‌తో స్నేహం మొదలుపెట్టావా? బాగుందే నీ ఆట!’ అన్నాడు రాజీవ్!
కౌముది గుండెల్లో కలుక్కుమంది. రాజీవ్‌తో మాట్లాడటం ఇష్టం లేక, అప్పటికెలాగో తప్పించుకుంది!
ఆ రోజు పండుగ కారణంగా సెలవు. తెల్లవారి కాలేజీ ఉన్నా, స్టూడెంట్స్ ఎక్కువగా లేరు. ముఖ్యంగా కౌముది ఫ్రెండ్స్ ఎవరూ రాలేదు. తప్పకుండా వస్తానని చెప్పిన జ్యోతి ఏవేవో కారణాలు చెబుతూ కాలేజీకి రావటం లేదని ఫోన్ చేసింది.
కళ్యాణ్ వాళ్ల ఊరికి వెళ్లాడు. ఇంకేం! రాజీవ్‌కు మంచి అవకాశం దొరికింది. కళ్యాణ్‌తో మాట్లాడటం మానేయమని, తనను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశాడు.
తనపై తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకున్నారని, చదువు పూర్తి చేసేవరకు పెళ్లి గూర్చిన ఆలోచనే చేయనని తెగేసి చెప్పింది కౌముది.
దానితో రెచ్చిపోయిన రాజీవ్ సంస్కారాన్ని కూడా మరచిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడాడు.
చివరకు ఏ ప్రమేయం లేని కౌముది తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ల ఫ్యామిలీ మొత్తం రాజీవ్ బెదిరింపులకు గురైంది!
రోజురోజుకు కౌముదికి రాజీవ్ వల్ల టార్చర్ ఎక్కువైంది.
కౌముది అడ్రస్ కోసం రాజీవ్ చాలానే ప్రయత్నించాడు. ఆమె ఫ్రెండ్స్‌ను ఎందరినో అడిగాడు. తెలియక కొందరు, తెలిసినా చెప్పడం ఇష్టం లేక చాలామంది మాకేం తెలియదంటూ తప్పించుకున్నారు. వీళ్ల వ్యవహారం ఏమీ తెలియని సరళ ద్వారా కౌముది అడ్రస్ పట్టుకున్నాడు రాజీవ్. కౌముది అడ్రస్‌కు బెదిరింపు లేఖలు, ఫోన్లు రావడంతో కాలేజీలో నిర్బంధం ఎక్కువైంది.
ఎలాగో సెకండియర్ ఎగ్జామ్స్ పూర్తిచేసింది కౌముది.
ఆ రోజు ఆఖరు పేపరు, కౌముది హాయిగా ఊపిరిపీల్చుకుంది. ఇక రాజీవ్ బెడద కొన్నాళ్లవరకైనా ఉండదని!
రాజీవ్ మాత్రం కౌముదిని వదల్లేదు. మారు పేర్లతో బెదిరింపు లేఖలు పంపడం మొదలైంది.
ఇక, చదువుపై విరక్తి కలిగిన కౌముది దూరపు బంధువైన గోపాల్‌కు ఇల్లాలైంది.
ఇప్పుడు కౌముది రెండేళ్ల పాపకు తల్లి. హాయిగా ఏ చీకూ చింతా లేకుండా కాపురం చేసుకుంటోంది.
పాపం-కౌముది!...తన కోరికలేవీ నెరవేరలేదు.
తన కారణంగా తన కుటుంబం బాధపడటం ముఖ్యంగా ఎంతో సిన్సియరే ప్రిన్సిపాల్‌గా పేరుగాంచిన తన తండ్రి, అన్నపూర్ణమ్మలాంటి తల్లి, ఇంకా లోకం తెలియని తోబుట్టువులు రాజీవ్ కారణంగా క్షణక్షణం టార్చర్ అనుభవించడం కౌముది సహించలేకపోయింది. అందుకే తన కోరికలన్నీ తనలోనే సమాధి చేసుకుంది.
భవిష్యత్తులో ప్రయివేట్‌గానైనా ‘ఎగ్జామ్స్’ రాసి డిగ్రీ పూర్తి చేయాలనుకున్న కౌముది ఆశను కాలం తీరుస్తుందో! లేదో వేచిచూడాలి.

- గరిశకుర్తి శ్యామల,
కామారెడ్డి, సెల్.నం.9490189081

అంతరంగం

కవిత్వంలో సామాజిక
అంశాలు ప్రతిబింబించాలి

- డాక్టర్ కపిలవాయి లింగమూర్తి

చిరునామా:
ఇం.నం.17-110, వాణీసదనం,
విద్యానగర్ కాలనీ, నాగర్‌కర్నూల్
మహబూబ్‌నగర్ జిల్లా - 509 209
ఫోన్.నం: 08540-226437

ఆధునిక కవులు సామాజిక అంశాలను ప్రతిబింబింపజేస్తూ కవిత్వాన్ని పండించాలని ప్రముఖ సాహితీవేత్త, బహుగ్రంథకర్త డాక్టర్ కపిలవాయి లింగమూర్తి అభిప్రాయపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా అమ్రాబాదు మండలం..జినుకుంట గ్రామానికి చెందిన ఆయన తన పధ్నాల్గవ ఏటనే రచనా వ్యాసాంగాన్ని ప్రారంభించారు. ఆయన తెలుగు, సంస్కృత భాషల్లో పండితులు. వివిధ ప్రక్రియల్లో 80 గ్రంథాలకు పైగా వెలువరించి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశారు. భాగవత కథాతత్వం, సాలగ్రామ శాస్త్రం, స్వర్ణ శకలాలు, మాంగళ్యశాస్త్రం, శతకాలు, స్థల పురాణాలు, పాలమూరు మాండలికాలు ఆయన రచనల్లో ప్రముఖమైనవి! సాహిత్యంలోని క్లిష్టమైన ప్రక్రియల్లో అనగా చిత్రపది, బంధాలు, శబ్దపది, అలంకారాలు, యతులతో చమత్కారాలు వంటి రచనలతో ఖ్యాతి గడించిన ఘనత ఆయనది. వృత్తిరీత్యా శ్రీ వేంకటేశ్వర ప్రాచ్యకళాశాల పాలెం నుండి ఉపన్యాసకునిగా ఉద్యోగ విరమణ చేసిన ఆయన నేడు తన ఎనభై ఎనిమిదో ఏట కూడా రచనా వ్యాసాంగాన్ని ప్రవృత్తిగా కొనసాగించడం విశేషం!
మహబూబ్‌నగర్ జిల్లా అంతా విస్తృతంగా పర్యటించి.. మరుగునపడిన శాసనాలు, చరిత్ర, జానపద నోళ్లలో నానే అపూర్వమైన విలువైన విషయాలను సేకరించి గ్రంథస్థం చేశారు. మరుగున పడ్డ తాళపత్రాలను వెలికి తీసి.. దానిలోని వ్యాఖ్య విశేషాలను పరిష్కరించారు. అనేక స్థల చరిత్రలు, దేవాలయాల కథలకు ప్రాణం పోసి తమ పరిశోధనా పటిమను చాటుకున్నారు.
ఉస్మానియా తెలుగు, మధురై, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయాల్లో డాక్టర్ కపిలవాయి గారి సాహిత్యం.. రచనలపై ఆరుగురు పరిశోధనలు చేసి డాక్టరేటు పట్టాలు పొందారు. సుమారు రెండు వందల గ్రంథాలకు రాసిన ముందుమాటలు నిండు శోభను కూర్చాయి. అనేక ప్రభుత్వ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సాహితీ సంస్థలు ఆయనను పురస్కారాలతో సత్కరించాయి. ఎందరో వర్ధమాన, ప్రవర్ధమాన రచయితలను తమ అసమాన సాహితీ ప్రజ్ఞతో ప్రభావితుల్ని చేసిన డాక్టర్ కపిలవాయి లింగమూర్తి గారితో ‘మెరుపు’ ముచ్చటించి ఆయన అంతరంగాన్ని ఆవిష్కరింపయత్నించింది. ఆయనతో ‘మెరుపు’ జరిపిన ముఖాముఖి..
ఆ మీరు రచనా వ్యాసాంగం వైపు ఆసక్తి చూపడానికి
ప్రేరణ ఎవరిచ్చారు?
నేను నా పధ్నాల్గవ ఏటనే రచనల పట్ల మక్కువ చూపడానికి మా మామగారైన పెద్ద లక్ష్మయ్య గారు ప్రధాన కారకులు.. చదువు చెప్పిన గురువులు కూడా నన్ను సాహిత్యం వైపు దృష్టి పెట్టేలా చేశారు. ముఖ్యంగా వేటూరు ప్రభాకర శాస్ర్తీ, నిడుదవోలు వెంకట్రావు గారల ప్రోత్సాహం చాలా లభించింది.
ఆ మీ దృష్టిలో కవిత్వం అంటే ఏమిటి?
కవిత్వంలో రసం, ధ్వని, అలంకారం ఉండాలి..కవిత్వం సామాజిక చైతన్యానికి దోహదపడాలి!
ఆ నేటి కవులు, రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
నేటి కవులు, రచయితలు అధ్యయనం పట్ల శ్రద్ధ చూపాలి. ప్రాచీణ, ఆధునిక కవితా లక్షణాలను ఆకలింపు చేసుకోవాలి.. కవిత్వంలో సామాజిక సమస్యలను ప్రతిబింబింపజేయాలి.. ప్రజల పక్షాన నిలిచి.. పాలకులను సరైన దారిలో నడిపించేందుకు కవులు, రచయితలు తమ కలాలకు పని కల్పించాలి.
ఆ మీరు సాహిత్యంలో అనేక ప్రక్రియలో రచనలు చేశారు
కదా.. మీకు ఏ ప్రక్రియ అంటే ఎక్కువ ఇష్టం?
కపిలవాయి: నాకు పద్యం..అంటే ఇష్టం.
ఆ మరుగునపడ్డ మన తెలంగాణ సాహిత్యం వెలుగులోకి
తేవాలంటే ఏం చేయాలి?
తాళపత్రాలలో నిక్షిప్తంగా వున్న సాహిత్యాన్ని పరిష్కరించే కార్యక్రమాలు చేపట్టాలి. విశ్వవిద్యాలయాల్లో తెలంగాణ సాహిత్య సంబంధ అంశాలపైనే పరిశోధనలు జరిగేలా పిహెచ్‌డి అభ్యర్థులను ప్రోత్సహించాలి. యక్షగానాలు, సంకీర్తనలపై సమగ్ర పరిశోధన జరిగేలా చూడాలి.
ఆ సాహిత్యపరంగా మీరు సాధించవలసిందేమైనా
మిగిలి ఉందని భావిస్తున్నారా?
వివిధ ప్రక్రియల్లో 80 గ్రంథాల వరకు వెలువరించానన్న తృప్తి వుంది. ఇంకా 30 గ్రంధాలు అముద్రికంగా ఉన్నాయి. సుమారు 200 మంది కవులు రచయితలకు ముందుమాటలు, పీఠికలు రాశాను.. వివిధ విశ్వవిద్యాలయాల్లో నా రచనలపై పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నవి! ఇక డాక్టరేట్‌తో పాటు బిరుదులు, సన్మాన సత్కారాలెన్నో పొందాను.. తెలంగాణ సాహిత్యం ఇంకా వెలుగులోకి వస్తే సంతోషిస్తా!

ఇంటర్వ్యూ: దాస్యం సేనాధిపతి
కరీంనగర్, సెల్.నం.9440525544

రచనలకు ఆహ్వానం

నవ, యువ, ఔత్సాహిక రచయితలూ ఈ పేజీ మీది... మీ ఆలోచనలకు అక్షర రూపం... సమాజానికి కావాలి మణిదీపం! మీరు కథలు, కవితలు, కథానికలు, కార్టూన్లు, జోకులు, పుస్తక సమీక్షలు, పుస్తకావిష్కరణలు, ఇలా ఏదైనా, మీరు రాసిన అక్షరానికి అచ్చురూపం ఇచ్చి, ఆవిష్కరించే అద్భుత అవకాశమే ఈ ‘మెరుపు’. మీ కలాలకు పదును పెట్టండి...
నిస్తేజంగా ఉన్న భావుకతను మేల్కొలపండి.

ఈ ‘మెరుపు’లో మీరు తళుకులీనండి.
మీ రచనలను కింది చిరునామాకు పంపండి.

మనోగీతికలు

ఓ ప్రభూ!
ఓ ప్రభూ! ఎక్కడున్నావు?
నీ తొలి కిరణాలు నా హృదయపు లోగిలిపై
జ్ఞాపకాలై..
అలసి సొలసిన నా మనసుకు
సాంత్వననిస్తున్నాయి!
మా గుండె గదుల నిండా..
సూర్యోదయపు లాలిత్వాన్ని
సూర్యాస్తమయపు సౌందర్యాన్ని నింపి
నీలాలనతో విశ్వాసాన్ని నిర్మించావు!
కానీ...
జీవితమనే ప్రవాహంలో కొట్టుకుపోయి..
రాత్రనక, పగలనక దాసున్నయి..
బంధాలనే సంకెళ్లకు చిక్కుకున్నాను!
ప్రతీ ఉషోదయం వేదననే
చవి చూస్తున్నా!
కాలం మిగిల్చిన గాయాలతో..
నా హృది జతకట్టే ఉంది!
ఎన్ని మెట్కెక్కినా..
ఇంకా ఉన్న చోటే నిల్చున్నట్లుంది!
క్షణ భంగురమైన జీవనంలో..
అలలవోలే..
నా రాగాలు..అనురాగాలు..బంధాలు
త్రెంచుకోలేక..
ప్రభాతమన బాల్యం కనుమరుగైంది!
మధ్యాహ్నమనే యవ్వనం వాడిపోయింది!
ఇంకేముంది!
సాధించాలనుకున్న సంతోషం
ఓడిపోయిన నక్షత్రమైంది!
కాలం గాయంపై..వెక్కిరిస్తూ
వృద్ధాప్యం నాట్యమాడుతోంది!
సాయంత్రం నీ రెండలా..
ఇప్పుడు నీ కదలికల్ని
ముగ్ధంగా, వౌనంగా
నిరీక్షించడం తప్పా..
నాకింకేముంది ప్రభూ!

- టి.వసంత, నిజామాబాద్, సెల్.నం.8686961611

ఆమె
ఆమె కళ్లలో ఏ మత్తు మందున్నదో కానీ
ఆ చూపు తప్పించుకోలేదు!
ఆమె మేనెంతెంత సుకుమారమో కానీ
అది చూచి నే పరవశించేను!
ఆమె మనసెంత బంగారమో కానీ
బందీని కాకుండ ఉండలేను!
ఆమె అధరాలలో ఏ సుధ ఉన్నదో కానీ
ఆస్వాదించి పులకించిపోతాను!
ఆమె నా అందాల నవమోహిని
ఆమె ఒక శృంగార రసవాహిని

- ఎ.గజేందర్ రెడ్డి
కరీంనగర్, సెల్.నం.9848894086

స్వాగతం!
అక్కడ సృజనలు విప్పారులూలు
అక్కడ వృక్షాలు ఆడుకుంటాయి..
కొమ్మలు కమ్మ పాడుతాయి..
రెమ్మలు తపస్సు చేస్తాయి..
నేలలు నెర్రెలు బారుతాయి...
నెర్రెల్లోంచి సుమ గంధాలు వీస్తాయి
రాత్రి పున్నమి వెనె్నలలో
తెల్లవారేదాకా రమణీయానుభూతినిస్తాడు..
తెల్లని కాగితంపై నల్లని
అక్షరాలతో చక్కని స్పందనలై
ఉషోదయానికి
స్వాగతం పలుకుతాయి!

- గుండు రమణయ్య గౌడ్
పెద్దాపూర్, జూలపల్లి
సెల్.నం.9440642809

భరోసాకై..
ఒకనాడు..
కాగజ్‌నగర్ కాగితపుమిల్లు
శ్రమ జీవుల సౌందర్యంతో
కల కలలాడింది!
కలల ఒడిలో తేలియాడిన జీవితాలు
నేడు..
కలలు కల్లలై
విలవిల్లాడుతున్నాయి!
నాడు సైరన్ మోతతో..
మిల్లులో అడుగిడిన జీవాలు
నేడు రైలు కూతతో..
పొట్ట చేతపట్టవలసకై
పరుగులు తీస్తున్నాయి!
ఓట్లకే..
పనికొచ్చే కార్మికులయినా..
నేతల బాసలు నీటిపై రాసే రాతలమైనా
ఇంకా ఆసరాకోసం
చేతులు చాస్తున్నారు!
బ్రతుకు భరోసాకై..
ఆత్రంగా ఎదురుచూస్తున్నారు!
- రామోజు రమేష్ బాబు
కాగజ్‌నగర్, సెల్.నం.9866193224

ఓ కొత్త పువ్వా!

నాజూకు లతతో జత కట్టిన
ఓ కొత్త పువ్వా!
నీ నవ్వే...
ఆమనికి పంచును అందాలు!
నీ కవ్వింపుతో..
కదులుతాయి మా హృదయతరంగాలు!
నీ వర్ణాలతోనే..
ప్రకృతికి సౌందర్యాభరణాలు!

- కూర్మాచలం వేంకటేశ్వర్లు
కరీంనగర్, సెల్.నం.7702261031

మృత్యుమోహిని

మోహినిలా వస్తుందది!
దాన్ని చూడగానే
మోహంతో మైమరుస్తాడు మనిషి!
దానికి ప్రాణాలు లేవు
కానీ అది మనిషి ప్రాణాలనే తీస్తుంది
దాన్ని ఆస్వాదించినంతకాలం
స్వర్గాలు కళ్లముందే తాండవిస్తాయి
నరకాలు స్మృతిపథంలోకే రావు
డబ్బు పోతే పోయిందనీ
అబ్బో! ఎంతో ఖుషీ వచ్చి చేరిందనీ
తన్మయుడైపోతాడు మనిషి
డబ్బుతో బాటు మానమూ పోయినా
తబ్బిబ్బులో అన్నీ వదిలేస్తాడు వాడు
కుటుంబ సౌఖ్యం గుటుక్కుమంటున్నా
పుటుక్కున ప్రాణం పోతున్నా
పూట పూటకూ అందుతున్న నిషాతో
పొద్దూ మాపూ గడచిపోతుంది
కొన్నాళ్లకు జీవితమే తెల్లవారిపోతుంది!
ప్రమాద రూపంలో
కరాళ మృత్యుకూపంలో
నిరర్థకంగా!
నిష్ప్రయోజనంగా!!

- డా. అయాచితం నటేశ్వర శర్మ, కామారెడ్డి, సెల్.నం.9440468557

తెలుగు వెలుగు
తెలుగులోని
వెలుగును గ్రహించుదాం
మాతృ భావనతో
మదిని పులకరింపజేద్దాం!
అజ్ఞానపు తీరాలను దాటించి.. తెలుగు
మనసులో తేనెల మమతలు కురిపించుతుంది!
పర భాషా వ్యామోహం...
పాశ్చాత్య ధోరణులను పెంచుతుంది!
తెలుగు పదబంధాల పాయసం
ఎంతో మధురం!
దానితోనే...
మన జీవితం సుందరం!

- హనుమాండ్ల రమాదేవి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ జిల్లా
సెల్.నం.9959835745

మల్లె మన్నింపుమా...
మండుటెండల్లో మలయ మారుతాలను
సృష్టించగలవు
శీతాకాలంలోను మనుషుల యదలో
వలపుకుంపట్లను రగిలించగలవు
గమ్మతె్తైన వాసనతో యువతకు మత్తెక్కించగల..
ఓ మల్లెమాలికా!
మగువులమై పుట్టి మూఢ ప్రేమతో గాయపరచి
కొనగోటితో నీ కంఠాన్ని త్రుంచినా
సూది దారాల సాయంతో
నీ జాతినంతా బంధించి మాల కూర్చినా
చాలదన్నట్లు నీ పీకనులిమి
ప్రాణమును తీసుడేగాక
పన్నీరుగ మార్చినా,అత్తరుగా చేసినా
మగువల చెంత చిరునవ్వుతో పులకరింతువే!
గానీ అలకబూనవు
ఇంత ప్రేమ నీకెట్లు కలిగె మగువపైన?
మగువ మనసే మల్లెలై విరియునా ఏమని
పురుషులంతా సందేహించుచుండ
నిజమని నవ్వే ఓ
మల్లియలారా ఓ రుణము దీర్చగ!
మిమ్ముల కన్నయ్య కంఠాన వేసెద!
కన్నయ్య దగ్గర మీ నోరు విప్పరా!
మా గోజ చెప్పరా
ఓ మల్లెమాలా
మన్నింపవా నా కోరిక!

- బి.హరిప్రియా గిరిధర్ రావు, కరీంనగర్, సెల్.నం.9133293384

email : merupuknr@andhrabhoomi.net

నిర్వహణ : దాస్యం సేనాధిపతి dasyamsenadhipathi10@gmail.com
ఈ శీర్షికకు కవితలు, కథలు, సాహితీ వ్యాసాలు, కొత్త పుస్తకాల సమీక్ష/పరిచయం, కార్టూన్లు ఈ క్రింది చిరునామాకు లేదా ఈ-మెయల్‌కు పంపండి.

మెరుపు శీర్షికకు.. ఎడిటర్, ఆంధ్రభూమి దినపత్రిక, జగిత్యాల రోడ్, కరీంనగర్. merupuknr@andhrabhoomi.net

- గరిశకుర్తి శ్యామల