ఖమ్మం

ఎట్టకేలకు జిల్లాకు సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 14: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు సోమ, మంగళవారాల్లో ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమానికి ఖమ్మం జిల్లాలో తాను 2009 నవంబర్ 29నుంచి చేపట్టిన దీక్షనే ఊపిరిలూదిందని, ఆ జిల్లా ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని చెప్పుకొచ్చిన ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో అడుగు పెట్టేందుకు మాత్రం ఏడాదిన్నరకు పైగా సమయాన్ని తీసుకున్నారు. 2015వ సంవత్సరంలో భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవానికి హాజరైనప్పటికీ ఆయన మణుగూరులో భద్రాద్రి ధర్మల్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం మినహా ఎటువంటి కార్యక్రమాల్లో పాల్గొనలేదు. హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా రోడ్డుమార్గంలోనే భద్రాచలం చేరుకున్నప్పటికీ ప్రజలకు అభివాదం చేయడం మినహా మరే కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. పక్కనే ఉన్న వరంగల్, నల్గొండ జిల్లాలకు అనేక సార్లు వచ్చి అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి ప్రయత్నించిన కెసిఆర్ ఖమ్మం జిల్లాపై నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఖమ్మం జిల్లా అంటే కెసిఆర్‌కు భయమని, వామపక్షాలు బలంగా ఉన్నందు వల్లే నిలదీస్తారనే భయంతో జిల్లాకు రావడంలేదని విమర్శలు వెల్లువెత్తాయి. అయితే వాటిని అంతే స్థాయిలో తిప్పికొట్టడంలో అధికార పార్టీ నాయకులు విఫలమయినప్పటికీ తుమ్మల చరిష్మాతో పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయారు. ప్రధానంగా అభివృద్ధే మంత్రంగా ప్రజల్లో బలపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటనలో ఖమ్మం నగరంలో మురికివాడలను సందర్శించనున్నారు. అక్కడి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకొని వాటి పరిష్కారానికి అక్కడికక్కడే ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ముదిగొండ మండలం ముత్తారం గ్రామంలో సీతారామ ఆలయంలో పూజలు నిర్వహించి, తిరుమలాయపాలెం మండలంలో మాదిరిపురం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన అనంతరం అక్కడే భారీ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అక్కడి నుంచి టేకులపల్లి మండలం రోళ్ళపాడు గ్రామం వద్ద శ్రీరామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
కార్పొరేషన్ ఎన్నికలకు నోటిఫికేషన్ రానున్నదని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఖమ్మం కార్పొరేషన్‌పై గులాబీ జెండా ఎగురవేయడానికి ఈ పర్యటన ఉపయోగపడుతుందని ఆ పార్టీ భావిస్తోంది. మరోవైపు కెసిఆర్ ఖమ్మం పర్యటన జిల్లాలో అభివృద్ధికి మరింత ఊతమిస్తుందని కూడా భావిస్తున్నారు.
గెలుపే లక్ష్యంగా...
* ఆకర్ష్‌లో టిఆర్‌ఎస్ విజయం
* అధికార పార్టీలో చేరుతున్న ఇతర పార్టీల నేతలు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 14: ఖమ్మం నగరంలో ప్రత్యర్థులను మట్టికరిపించేందుకు టిఆర్‌ఎస్ అనుసరిస్తున్న వ్యూహం సత్ఫలితాలనిస్తోంది. ప్రధానంగా ఖమ్మం నగరాన్ని టార్గెట్ చేస్తూ టిఆర్‌ఎస్ నేతలు వేసిన ప్రణాళిక విజయాన్ని సాధించింది. నగరంలోని 50 డివిజన్లలో పలుమార్లు రహస్యంగా సర్వేలు నిర్వహించిన అధికార పార్టీ నేతలు ఆయా డివిజన్లలో గెలిచే వారిని తమ పార్టీలోకి తీసుకురావడంలో విజయం సాధిస్తున్నారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రధాన నేతలను టిఆర్‌ఎస్‌లోకి ఆహ్వానిస్తున్నారు. ఇటీవల కాలంలో టిడిపికి చెందిన ప్రముఖ నేతలు టిఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా తాజాగా టిడిపి నగర కమిటీ కన్వీనర్‌తో పాటు కమిటీ సభ్యుల్లో అనేక మంది ముఖ్యమంత్రి కెసిఆర్ రాక సందర్భంగా అధికార పార్టీలో చేరనున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రధాన నేతలను కూడా ఆకట్టుకుంటున్నారు. వీరిలో అనేక మంది కార్పొరేషన్ ఎన్నికలకు ముందే అధికార పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఒక్కటి కూడా దక్కకుండా క్లీన్‌స్వీప్ చేసే దిశగా రాష్టమ్రంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యూహరచనతో ఇతర పార్టీల నేతలు అధికార పార్టీవైపు క్యూ కడుతున్నారు.
టిఆర్‌ఎస్‌లో చేరేందుకు టిడిపికి చెందిన మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు ఇప్పటికే నిర్ణయించుకోగా ఖమ్మం మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నాయకుడు యూనిస్ సుల్తాన్ కూడా టిఆర్‌ఎస్‌లో ముఖ్యమంత్రి సమక్షంలో చేరనున్నట్లు సమాచారం. ఖమ్మం నగరంలో ఏ డివిజన్‌లోనూ టిఆర్‌ఎస్‌కు ప్రత్యర్థులుగా గట్టి అభ్యర్థి ఉండకుండా ముందస్తుగానే ప్రణాళికలు చేస్తూ నాయకులను చేర్చుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నా అధికార పార్టీల నేతలు మాత్రం తమ పని తమదే అన్నట్లుగా నేతలను చేర్చుకుంటున్నారు.

అధికార దాహంతోనే పార్టీని మోసం చేశారు
* ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటా
* టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో నామ నాగేశ్వరరావు
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 14: అధికార దాహంతోనే కన్నతల్లిలాంటి పార్టీని మోసం చేసి అధికార పార్టీలోకి వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, ఖమ్మం మాజీ ఎంపి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక టిఎన్జీవోస్ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం ఆ పార్టీ అధ్యక్షుడు తుళ్ళూరి బ్రహ్మయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన నామ మాట్లాడుతూ గత 30 ఏళ్ళగా పార్టీలో అనేక పదవులు అనుభవించి, అధికారాన్ని అనుభవించి, కార్యకర్తల కష్టం, శ్రమతో రాజకీయాల్లో ఎదిగిన నాయకులు వారిని, తల్లిలాంటి పార్టీని మోసం చేసి వెళ్తున్నారని విమర్శించారు. ఎంతో మంది గొప్ప నాయకులను టిడిపి తయారు చేసిందని, ఇలాంటి నాయకులు వస్తుంటారు, పోతుంటారు పార్టీ మాత్రం స్థిరంగా ఉంటుందన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి అనేక సంక్షోభాలు ఎదుర్కొంటు వస్తూనే ఉందని, ఇది కొత్త కాదని, పార్టీ అంతమైందని విమర్శించినవారే లేకుండా పోయారని, పార్టీ వీడిన నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. త్వరలో జరగనున్న కార్పోరేషన్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తనవంతు కృషి చేస్తానని, ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రజల్లోకి టిడిపిని తీసుకెళ్ళాలన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో రాజకీయ ఉగ్రవాదానికి తెరాస తెర లేపిందని, కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో నామ ఆధ్వర్యంలో పని చేసి పార్టీని గెలిపించుకుంటామన్నారు. పార్టీకి కార్యకర్తలే అండగా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకుమారి, డాక్టర్ రామనాధం, ఫణీశ్వరమ్మ, వెంకట్రామయ్య, హరిప్రియ, శ్యామల, నారాయణ, మల్లారెడ్డి, కూరపాటి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

ఆందోళనలో టిఆర్‌ఎస్ నేతలు
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 14: ఖమ్మం కార్పొరేషన్‌లో ఇతర పార్టీల నుంచి భారీగా నేతలను చేర్పించుకోవడంపై అధికార టిఆర్‌ఎస్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి కొందరు, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి చేరిన వారు మరికొందరు, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించడమే లక్ష్యంగా కొంతకాలంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందుకోసం లక్షలాది రూపాయలు ఖర్చుచేసిన వారు కూడా ఉన్నారు. అయితే ఇటీవల కాలంలో టిడిపి, కాంగ్రెస్‌లకు చెందిన ప్రముఖులను టిఆర్‌ఎస్‌లో చేర్చుకోవడం ఆయా డివిజన్లలో కొత్తగా చేరిన వారికి కార్పొరేటర్‌గా అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముందు నుంచి పార్టీ అభ్యర్థిత్వం వస్తుందని నమ్మకంతో లక్షల ఖర్చుతో ప్రచారం నిర్వహించిన వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా గత వారంరోజుల్లో టిడిపి, కాంగ్రెస్‌ల నుంచి టిఆర్‌ఎస్‌లో చేరిన నేతల డివిజన్లలో ముందు నుంచి అధికార పార్టీలో ఉన్న నేతలు ఆందోళన వ్యక్తం చేయడంతో పాటు అవసరమైతే ముఖ్యమంత్రికి కూడా విజ్ఞప్తి చేస్తామని చెప్పడం గమనార్హం. ఒకవైపు నేతలు పార్టీని వీడుతుండటంతో టిడిపి, కాంగ్రెస్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ నేతల్లో ఆందోళనలు వ్యక్తమవుతుండగా టిఆర్‌ఎస్ నేతల్లో మాత్రం నిరాశ వ్యక్తమవుతోంది. కొత్తగా వచ్చిన వారు తమ లక్ష్యానికి అడ్డుగా నిలుస్తున్నారని, రాష్టమ్రంత్రి తుమ్మల తమను ఎలా సర్దుబాటు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం.
పార్టీ కోసం ఎంత కష్టపడ్డా ప్రతికూల ఫలితాలే
* కార్యకర్తల ప్రయోజనం కోసమే టిఆర్‌ఎస్ వైపు
* మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు
ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 14: గత 33 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం తాను ఎంతో కష్టపడ్డానని, కాని ఏప్పుడూ ప్రతికూల ఫలితాలే ఎదురయ్యేవని మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం తన ఇంటిలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ఆవిర్భావం నుంచి రూపాయి ఫలితం ఆశించకుండా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేశానని, ప్రతి ఎన్నికలో పార్టీ గెలుపు కోసం బాధ్యతగా పని చేశానన్నారు. గత కొంత కాలంగా పార్టీని నాయకులు వీడుతున్నా తాను ముందుండి పార్టీని నడిపించేందుకు కష్టపడ్డానని, దీనికి పార్టీ నుంచి తనకు పూర్తి సహకారం అందలేదన్నారు. హైదరాబాద్ ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపికి మనుగడలేదని, తన వెంట ఉన్న కార్యకర్తలను, ప్రజలను అభివృద్ధి చేసేందుకే ఆ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లోకి చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. జిల్లాలో సిఎం పర్యటన సందర్భంగా టిఆర్‌ఎస్‌లో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
తుమ్మల తర్వాత ప్రాధాన్యం
జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తర్వాత తనకు ప్రాధాన్యత దక్కుతుందని పోట్ల ఆశాభావం వ్యక్తం చేశారు. టిడిపిలో ఎంతో కష్టపడ్డా 4,5 స్థానాల్లోనే ఉండేవాడినని, ప్రస్తుతం తనకు ప్రాధాన్యత కల్పిస్తామని తుమ్మల హామీ ఇచ్చారని చెప్పారు. తనతో పాటు పార్టీని వీడిన వారికి కూడా తగిన ప్రాధాన్యత దక్కుతుందని స్పష్టం చేశారు. జిల్లాలో టిఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేస్తామని, ప్రభుత్వం చేపట్టే సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తామన్నారు. తనతో పాటు తెలుగుదేశం పార్టీ నగర ఎన్నికల కమిటీ అధ్యక్షుడు మందడపు రామకృష్ణ పార్టీకి రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరతారని పేర్కొన్నారు. ఘ

సిఎం రాకకు ముస్తాబవుతున్న ఖమ్మం

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 14: రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఖమ్మం పర్యటన ఖరారుకావడంతో నగరం ముస్తాబవుతోంది. నగరంలో ఏర్పాటు చేసిన రోడ్డు డివైడర్లకు రంగులు అద్దడం, రోడ్లను శుభ్రం చేయడం, డివైడర్‌లలో రంగురంగు పూల మొక్కలు, షో మొక్కలను నాటారు. శనివారం రాత్రి వరకు డివైడర్‌లలో కనపడని మొక్కలు అనేకచోట్ల ఆదివారం ఉదయం నగర ప్రజలకు దర్శనమిచ్చాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు సిఎంను ఆకట్టుకునే విధంగా నగరాన్ని ముస్తాబు చేస్తున్నారు. సిఎం రాక ఖమ్మం నగర రూపునే మార్చిందని, నెలల తరబడి జరుగుతున్న రోడ్లు, డివైడర్ల అభివృద్ధి పనులు రాత్రికిరాత్రే పూర్తి కావడం ఆనందంగా ఉందని ప్రజలు వెల్లడిస్తున్నారు. నగరంలో ప్రధాన కూడళ్ళలో ఏర్పాటు చేసిన రింగుల నిర్మాణం, డివైడర్లకు రంగులు వేసి పూల మొక్కలు వేయడంతో నగర రోడ్లకు కొత్త శోభను తీసుకొచ్చాయి. కాల్వొడ్డు నుండి వైరా రోడ్డు మీదుగా శ్రీశ్రీ సర్కిల్ వరకు, ఇల్లెందు క్రాస్ రోడ్డు నుంచి కైకొండాయిగూడెం స్టేజి వరకు, జడ్పి సెంటర్ నుంచి ప్రకాశ్‌నగర్ వరకు, కాల్వొడ్డు నుంచి ఎంబిగార్డెన్స్ వరకు, బైపాస్ రోడ్డులలో ఏర్పాటు చేసిన డివైడర్లకు రంగులు వేసి, వాటిలో పూల మొక్కలు నాటడంతో నగరానికి కొత్తదనం తీసుకొచ్చాయి. ముఖ్యమంత్రికి విన్నపం
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి
నమస్కరించి వ్రాయునది...
విషయం : తాగునీరు, పారిశుద్ధ్యం, బస్సు సౌకర్యం కల్పించాలి
అయ్యా,
మేము ఖమ్మం నగర వాసులం. గత అనేక సంవత్సరాలుగా మురికి ప్రాంతాల్లో ముక్కులు మూసుకొని గడిపాము. ఉండేందుకు ఇళ్ళు లేవు, తాగేందుకు నీళ్ళు లేవు. చుక్క నీటి కోసం అరకిలోమీటర్ తిరగాలంటే పరిస్థితి అర్థం చేసుకోండి. ఇటీవల కాలంలో ఎనె్నస్పీ కాల్వస్థలం ఆక్రమణ పేరుతో ఉన్న గుడిసెలను కూల్చారు. మమ్మల్ని ఎక్కడో ఊరు బయట పడేశారు. అక్కడ మా పరిస్థితి గందరగోళం. అక్కడ ఉన్నప్పుడు మా పిల్లలు పాఠశాలకు వెళ్ళాలన్నా, నగరానికి వెళ్ళాలన్నా సులభంగా ఉండేది. ప్రస్తుతం మాకు అడవి ప్రాంతంలాంటి వైఎస్‌ఆర్ నగర్‌లో స్థల సౌకర్యం కల్పించగా, మరికొంతమందిని ఖమ్మంకు సుమారు 15కిలోమీటర్ల దూరంలో ఉన్న శివాయిగూడెం సమీపంలోకి మార్చారు. మా పిల్లలు చదువుకునేదెలా మేం ఖమ్మంకు వచ్చేదేలా.. కనీసం తాగేందుకు మంచినీటి సౌకర్యం కల్పించి, మా ప్రాంతాలకు బస్సు సౌకర్యాలను కల్పించేలా చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ....
మీ
ఖమ్మం నగరవాసులు
- ఖానాపురం హవేలి,్ఫబ్రవరి 14
ఇందిరా సాగర్ పేరు మార్చితే ఆందోళన తథ్యం : భట్టి
వైరా, ఫిబ్రవరి 14: ఇందిరా సాగర్‌కు పేరు మార్చి శ్రీరామ సాగర్‌గా నామకరణం చేస్తే కాంగ్రెస్‌పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఆందోళన చేస్తామని కాంగ్రెస్‌పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టివిక్రమార్క హెచ్చరించారు. ఆదివారం స్థానిక నీటిపారుదల శాఖ విశ్రాంతి కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలనే ఆలోచన ఉంటే ప్రాజెక్టు నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి కానీ ప్రాజెక్టుల పేర్లు మార్చుతాననడం సరైన నిర్ణయం కాదని అన్నారు. ప్రజలకు చేసే సేవల కన్నా ఎక్కువగా ఎన్నికల మీద దృష్టి పెట్టి ప్రభుత్వ ఖజానా ఖాళీ చేస్తున్నారని ఆరోపించారు. ఇందిరా గాంధీ భారత్ దేశం గర్వపడేలా దేశసేవ చేసిన ఆమె పేరు మార్చడం మంచిదికాదన్నారు. అలా కాక మార్చితే తగిన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, నాయకులు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్‌రావు, నాయకులు రాచబంటి నాగేశ్వరావు, బోళ్ళ గంగారావు, దొడ్డా పుల్లయ్య, దాసరి దానియేలు, శీలం వెంకటనర్సిరెడ్డి పాల్గొన్నారు.

ఖమ్మంలో సినీ నటి ప్రణీత
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 14: నగరంలో కార్పోరేట్ స్థాయిలో వస్త్ర దుకాణాలు వెలుస్తున్న క్రమంలో ఆదివారం విఆర్‌కె సిల్క్స్ ఆధ్వర్యంలోని కాంచీపురం చేనేత పట్టు వస్త్రాల సంగమాన్ని ప్రముఖ సినీ నటి ప్రణీత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో ఇప్పటికే 13 షోరూమ్‌ల ద్వారా వస్త్ర ప్రియులకు 800 మాస్టర్ డిజైనర్లతో 50 వేలకు పైగా డిజైన్లలో విఆర్‌కె ఆధ్వర్యంలో స్వంత మగ్గాలపై నేసిన వస్త్రాలు ఇప్పుడు ఈ షోరూమ్‌లో అందుబాటులో ఉన్నాయన్నారు. తయారీ ధరలకే ఈ షోరూమ్‌లో అన్ని రకాల వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం బ్రాంచ్ మేనేజర్లు శ్రీకాంత్, హరిప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు.