కృష్ణ

ఇ-పోస్ అదుర్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఫిబ్రవరి 19: ప్రజా పంపిణీ వ్యవస్థను పేదలకు మరింత చేరువగా తీసుకెళ్లడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమస్థానంలో నిలిచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసలందుకుందని జిల్లా కలెక్టర్ బాబు ఎ పేర్కొన్నారు. పారదర్శకంగా, అర్హులైన లబ్థిదారులకే అన్ని నిత్యావసర సరుకులు ఒకేసారి నెల మొదటివారంలోనే, అందజేయగలగడం వల్ల పేదలకు పూర్తిస్థాయి ప్రయోజనం అందుతోందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 2015 ఏప్రిల్ నెలలో వెయ్యిమంది రేషన్ కార్డుదారులు ఉన్న 511 చౌకధరల దుకాణాలలో ఇ-పోస్‌ను ప్రారంభించామన్నారు. అనంతరం మే నెల నుంచి జిల్లాలోని 2 వేల 163 చౌకధరల దుకాణాలకు ఇ-పోస్‌ను విస్తరించడం జరిగిందన్నారు. నగదు బదిలీ కాబినెట్ సెక్రటరీ పీయూష్‌కుమార్ శనివారం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో కలెక్టర్ మీడియాతో మాట్లాడారు.

రెండు అంచెల ప్రయోజనాలు
ఇ-పోస్ వల్ల రెండు ప్రయోజనాలున్నాయని, ఖచ్చితంగా లబ్థిదారునికే నిత్యావసరాలు సకాలంలో అందజేయడం మొదటి ప్రయోజనమైతే, లబ్థిదార్లకు పంపిణీ చేయగా మిగిలిన సరుకులు (క్లోజింగ్ బ్యాలెన్సు) ఖచ్చితంగా గుర్తించి ఆ మేరకు నిత్యావసర సరుకులపై ప్రభుత్వం చేస్తున్న వ్యయాన్ని తగ్గించడం రెండో ప్రయోజనమన్నారు. ఇ-పోస్ విధానం అమలు ద్వారా జిల్లాలో ఈ ఏడాది జనవరి నెల వరకు 9 నెలల కాలంలో 12 లక్షల మంది పేదలకు నిత్యావసర సరుకులు సకాలంలో పంపిణీ చేయగా, 57 కోట్ల 16 లక్షల మేర ప్రభుత్వ ధనం ఆదా చేయడం జరిగిందన్నారు.
జిల్లాలో గత 9 నెలలుగా 13 వేల 626 మెట్రిక్ టన్నుల బియ్యం, 838 మెట్రిక్ టన్నుల పంచదార, 279 మెట్రిక్ టన్నుల గోధుమలు, 295 మెట్రిక్ టన్నుల గోధుమపిండి, 527 మెట్రిక్ టన్నుల కందిపప్పు, 3 వేల 279 కిలో లీటర్ల కిరోసిన్‌ను ఆదా చేయడం జరిగిందన్నారు.
పేదలకు కిలో బియ్యం రెండు రూపాయలకు ప్రభుత్వం యిస్తోందని, ఇందుకు ప్రతి కిలో బియ్యంపై రాష్ట్ర ప్రభుత్వం 26.64 పైసల సబ్సిడి ఇస్తోందన్నారు. ఇంత పెద్ద ఎత్తున ప్రజాధనం సబ్సిడీగా ఇస్తున్నందున ఇది దుర్వినియోగం కాకుండా ఆపాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై వుందన్నారు. అదేవిధంగా పంచదారపై కిలోకు రూ.18.50పైసలు, కందిపప్పుపై కిలోకు రూ.71.25 పైసలు, కిరోసిన్‌పై లీటరుకు 47 రూపాయల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందన్నారు. ఇవన్నీ సక్రమంగా అర్హులైన పేదలకు అందాలని ఎటువంటి పరిస్థితుల్లో నిత్యావసరాలపై యిస్తోన్న సబ్సిడీ పక్కదారి పట్టకూడదని భావించామన్నారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టామన్నారు.

వివిధ రాష్ట్రాలను, ప్రధాని కార్యాలయం దృష్టిని ఆకర్షించిన ఇ-పోస్
ప్రజా పంపిణీ వ్యవస్థ (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం) బలోపేతం చేసేవిధంగా రూపొందించిన ఇ-పోస్ విధానం దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆకర్షించిందని, ప్రధాని కార్యాలయం సైతం ఇ-పోస్ అమలుపై ఆసక్తి కనబరిచిందని కలెక్టర్ బాబు ఎ పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలంలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఇ-పోస్ విధానం మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అమలు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారన్నారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జెట్లితో భేటీ అయి ఇ-పోస్ విధానాన్ని వివరించామన్నారు.

ముఖ్యమంత్రి ప్రశంసలు
రాష్ట్రంలో పేదలకు ఇ-పోస్ ద్వారా నిత్యావసర సరుకులు అందించడంలో 86.05 శాతంతో కృష్ణా జిల్లా ప్రథమస్థానంలో ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో ప్రశంసించారన్నారు. 81.46 శాతంతో అనంతపురం, 75.38 శాతంతో శ్రీకాకుళం జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయని కలెక్టర్ తెలిపారు. గత 5 రోజులుగా జిల్లాలో వివిధ రాష్ట్రాలకు కేటాయించబడిన 18 మంది సభ్యులతో కూడిన శిక్షణ ఐఎఎస్ యువబృందం జిల్లాలో అమలుపరచుతున్న సంక్షేమ కార్యక్రమాలకు నేరుగా నగదు బదిలీ విధానంపై ఒక స్పష్టమైన అవగాహనను కలిగించామన్నారు.

పిసిసి కార్యాలయంగా ఆంధ్రరత్న భవన్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 19: సుదీర్ఘ చరిత్ర కల్గిన ఆంధ్రరత్న భవన్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయంగా రూపుదిద్దుకుంది. నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా నియమితులైన మల్లాది విష్ణు ఆధ్వర్యంలో ఇటీవల కాలంలో మొదటి అంతస్తులో స్వల్ప మరమ్మతులు చోటుచేసుకున్నాయి. పిసిసి అధ్యక్షునిగా నియమితులైన రఘువీరారెడ్డి మొదటి నుంచి కూడా విజయవాడలో పిసిసి కార్యాలయాన్ని ఏర్పాటుచేయాలని తహతహలాడుతూ వచ్చారు. ఏళ్ల తరబడి మూతబడి వున్న గ్రౌండ్‌ఫ్లోర్‌ను సుమారు రూ.50 లక్షలతో ఆధునీకరించటం జరిగింది. విజయవాడ కేంద్రంగా పిసిసి కార్యక్రమాలను విస్తృతం చేసే కార్యక్రమంలో భాగంగా ఇందులో ఏర్పాటైన పిసిసి కార్యాలయాన్ని ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతల్లో ఉత్సాహం నెలకొంది. ఈ కార్యక్రమానికి ఎపి వ్యవహారాల ఇన్‌చార్జి తిరువక్కరసు, ఎఐసిసి ఎస్‌సి సెల్ చైర్మన్ కొప్పుల రాజు, కేంద్ర మాజీ మంత్రులు కోట్ల సూర్యప్రకాశరెడ్డి, జెడి శీలం, పనబాక లక్ష్మి, పల్లంరాజు, రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు, పలువురు మాజీ రాష్ట్ర మంత్రులు, పిసిసి కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా కార్యవర్గ సమావేశం అనంతరం సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాల్లో అధికారపక్ష వైఖరిపై వివిధ జిల్లాల అధ్యక్షుల నుంచి పిసిసి అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి నివేదికలు స్వీకరించారు. పార్టీ అభివృద్ధి కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేయటం జరిగింది.

చైనా సహకారంతో నగరంలో 10 వేల గృహాలు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, ఫిబ్రవరి 19: నగరంలో ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా చేపట్టాల్సిన 10 వేల ఇళ్ల నిర్మాణం, సినరేజ్ ప్రాజెక్టుపై సమగ్రమైన ప్రణాళికలతో ముందుకు రావాలని కలెక్టర్ బాబు ఎ చైనా బృందానికి తెలియజేశారు. స్థానిక కలెక్టర్ ఛాంబర్‌లో శుక్రవారం విజయవాడ నగరంలో చేపట్టాల్సిన వివిధ అభివృద్ధి పనులపై కలెక్టర్ ప్రణాళికలను రూపొందించి అమలుపరచడంలో మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్ చైనాకు చెందిన జిఐఐసి ముఖ్య కార్యనిర్వహణాధికారి జిహాంగ్ జోహె తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు ఎ మాట్లాడుతూ నగరంలోని కెనాల్ ప్రాంతంలో నివసించే కుటుంబాలకు వచ్చే ఏడాదిలోగా పదివేల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించామన్నారు. ఇందుకోసం తగిన ప్రతిపాదనలతో మ్యాప్‌లను రూపొందించుకుని నివేదిక పంపాలని సూచించారు. రాష్ట్రంలో పది లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. కృష్ణా జిల్లాలో ఈ ఏడాది పట్టణ ప్రాంతంలో పదివేల గృహాలు, గ్రామీణ ప్రాంతాలలో 15 వేల వ్యక్తిగత గృహాలను నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. చైనా సాంకేతిక పరిజ్ఞానంతో కూడి వేగవంతంగా వివిధ ప్రాజెక్టుల (హౌసింగ్, సినరేజ్ తదితర) నిర్మాణానికి ఉత్తమమైన మార్గాలను ప్రతిపాదనలతో, నమూనాలతో ముందుకు రావాలని కలెక్టర్ తెలియజేశారు. ప్రభుత్వం ప్రకటించే టెండర్ ప్రక్రియ ద్వారా ఆయా నిర్మాణ పనులలో భాగస్వామ్యం అవ్వవచ్చని విజయవాడ నగరంలో జి+ తరహాలో భవనాల నిర్మాణానికి చొరవ చూపుతున్నట్లు కలెక్టర్ బృందానికి వివరించారు. నగరంలోని మురుగుకాలువల స్థితిగతులను అధ్యయనం చేసి రూపొందించిన ప్రతిపాదనలను అందజెయ్యాలని వీటిపై తగిన నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ బాబు ఎ తెలియజేశారు. నగరంలో 150 ఎమ్‌ఎల్‌డి కెపాసిటీ గల వాటర్ ప్లాంట్‌ను నిర్మించనున్నట్లు ఇందులో భాగంగా మార్చి నెల నాటికి 60 ఎమ్‌ఎల్‌డిల వాటర్ ప్లాంట్‌లను వినియోగంలోకి తీసుకువస్తున్నామని ఆయన తెలియజేశారు. నగరంలో భవన నిర్మాణాలు చేపట్టే ప్రాంతాన్ని పరిశీలించవలసిందిగా కలెక్టర్ బాబు ఎ తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో భాగంగా కనీసం ఎకరాకు 260 పైగా ఇళ్లునిర్మించేలాగా తగిన ప్రణాళికలతో రావాలని కలెక్టర్ తెలియజేశారు.

ఏంటీ నత్తనడక పనులు?
కాంట్రాక్టర్‌పై కమిషనర్ వీరపాండియన్ ఆగ్రహం
విజయవాడ (కార్పొరేషన్), ఫిబ్రవరి 19: రోడ్డు విస్తరణ పూర్తయినా సైడ్ డ్రైయిన్ నిర్మాణ పనులు ప్రారంభించని సంబంధిత కాంట్రాక్టర్ తీరుపై విఎంసి కమిషనర్ వీరపాండియన్ తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే కాకుండా తక్షణమే ఆయా పనులు ప్రారంభించకపోతే తగు అధికారిక చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా శుక్రవారం చిట్టినగర్ నుంచి మిల్క్‌ప్రాజెక్టు వద్ద ఆయా పనులను పరిశీలించిన ఆయన ఇంజనీరింగ్ అధికారుల పనితీరుపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు. రానున్న కృష్ణాపుష్కరాలే కాకుండా నగరం రాష్ట్ర రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న ప్రస్తుత తరుణంలో పెరుగుతున్న ట్రాఫిక్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని చేపట్టిన రోడ్ల అభివృద్ధికి కాంట్రాక్టర్లు సహకరించకపోవడం శోచనీయమన్నారు. ప్రస్తుతం మిల్క్‌ప్రాజెక్టు వద్ద రోడ్డును 80 అడుగుల రోడ్డుగా అభివృద్ధి చెస్తున్న తరుణంలో అందుకనుగుణంగా సైడ్ డ్రైయిన్ల నిర్మాణం చేపట్టాల్సి వుందని తెలిపారు. అలాగే స్థానిక ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద రోడ్డు విస్తరణకు అవరోధంగా ఉన్న మూడు నివాసాల తొలగింపునకు సత్వరమే చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, సిఇ ఎంఎ షుకూర్, అసిస్టెంట్ సిటీప్లానర్ సూరజ్, ఇఇ ఓంప్రకాష్ పాల్గొన్నారు.

ఐదేళ్లలో ఊహలకందని విజయవాడ
పెనమలూరు, ఫిబ్రవరి 19: రాబోయే ఐదు సంవత్సరాల్లో విజయవాడ ప్రాంతం ఊహలకందని విధంగా అభివృద్ధి చెందబోతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం పెనమలూరు మండలం తాడిగడపలోని ఎల్‌వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ప్రాంగణంలో ఐ బ్యాంక్‌ను ప్రారంభించి తదనంతరం జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. సింగపూర్ కన్నా విజయవాడలో వ్యాపారం చేయడం కష్టంగా మారుతోందని కారణం ఇంటి అద్దెలు, భూముల ధరలు ఎక్కువగా వుండటంగా భావిస్తున్నారని, ఇలాగే కొనసాగితే పారిశ్రామికవేత్తలు ఇతర ప్రాంతాలకు తరలిపోతారని హెచ్చరించారు. హైదరాబాద్ సమీప ప్రాంతాల్లో తాను సిఎంగా వున్నప్పుడు ప్రభుత్వం తరుపున ఒక్క ఎకరా కూడా కొనుగోలు చేయలేదని లక్షలాది ఎకరాలు ప్రభుత్వ భూమిని వినియోగించడంతో అభివృద్ధి పథంలో దూసుకెళ్లిందన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లావాసులు ధరలు పెంచకుండా సహకరించాలని, ఉద్యోగస్థులు సైతం రావాలంటే భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలోని విద్యార్థులు ప్రపంచ దేశాల్లో పలు రంగాల్లో రాణిస్తున్నారని కొంతమంది తిరిగి స్వదేశానికి వచ్చి సేవలందిస్తున్నారని కొనియాడారు. సేవా కార్యక్రమాలు చేయాలంటే రాజకీయాల్లోకే రావాల్సిన అవసరం లేదని జీవితంలో డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని సద్వినియోగపర్చటం కూడా నేర్చుకోవాలన్నారు. ప్రేమ్‌జీ, బిల్‌గేట్స్ లాంటి ప్రముఖులు తమ సంపాదనలో ఎక్కువ శాతం సామాజిక సేవకు కేటాయించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. కృష్ణాజిల్లాలో పుట్టినవారు ప్రపంచమంతా పెట్టుబడులు పెట్టారని, కారణాలేవైనా స్థానికంగా మాత్రం ఒక పరిశ్రమ కూడా ఇంతవరకు లేదని ఇకనైనా మార్పు రావాలని సూచించారు. రాష్ట్రాన్ని మెడికల్ హబ్‌గా మార్చేందుకు ప్రణాళికాపరంగా చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో ఆసుపత్రుల్లో సేవలందిస్తామన్నారు. మామ ఎన్‌టిఆర్‌తో పాటు అత్త కూడా గతంలో అమెరికా వెళ్లి గుండె ఆపరేషన్లు చేయించుకున్నారని, రాబోయే రోజుల్లో విదేశాల నుండి సైతం మన రాష్ట్రానికే వచ్చి వైద్యం చేసుకునే విధంగా తయారు చేస్తానన్నారు. అమరావతిలో ఎల్‌వి ప్రసాద్ ఆస్పత్రి నిర్మాణానికి స్థలం కేటాయించడానికి సిద్ధంగా వున్నామని, ఆధునిక వసతులతో విదేశీయుల్ని సైతం ఆకర్షించే విధంగా నిర్మించాలని కోరారు. రాష్ట్రంలో ఒక అంధుడు కూడా వుండటానికి వీలు లేకుండా కార్యక్రమాలను చేపడితే ప్రభుత్వం తరుపున ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధంగా వున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు.

వసతి గృహాల్లో పిల్లలను బాధ్యతగా పెంచాలి
పాయకాపురం, ఫిబ్రవరి 19: ప్రభుత్వ వసతి గృహాలలో ఉండే పిల్లలను బాధ్యతగా పెంచాలని, ఆ దిశగా చర్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగతంగా తీసుకున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు అన్నారు. స్థానిక పాయకాపురం రాధనగర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో రూ 250 లక్షలతో నిర్మించిన ఎస్సీ బాలికల సంక్షేమ వసతి గృహాన్ని మంత్రి, స్థానిక శాసన సభ్యులు బొండా ఉమామహేశ్వరరావుతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన తరగతుల విద్యార్ధుల సంక్షేమానికి కట్టుబడి పని చేస్తుందని అన్నారు. గతంలో ఎటువంటి వసతులు లేని సమయంలో మేము చదువుకున్నాం, కష్టపడి చదివితేనో, మనోవికాశం పెంచుకోవడం ద్వారా మాత్రమే ఉన్నత స్థాయికి చేరుకోగలమన్నారు. జిల్లాలో 3 బాలికల, 2 బాలుర వసతి గృహాలు ఒక్కొక్కటి రూ 2.50 కోట్లతో నిర్మించడం జరుగుతోందని తెలిపారు. ఇందుకు సంబంధించిన నిధులను ఇప్పటికే విడుదల చేయడం జరుగుతోందని రావెల తెలిపారు. జిల్లాలో 118 ప్రీ మెట్రిక్ వసతి గృహాల్లో 8555 మంది విద్యార్ధిని, విద్యార్ధులు చదువుతున్నారని తెలిపారు. 96 భవనాలు ప్రభుత్వ భవనాలలోను, 23 భవనాలు ప్రైవేట్ భవనాలలో కొనసాగుతున్నాయని తెలిపారు. సభకు బొండా ఉమామహేశ్వరరావు సమాధ్యక్షత వహించి మాట్లాడుతూ విద్యార్ధులు చదువుల కోసం ఎంతైనా నిధులు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేశారు. కులాంతర వివాహాలు చేసుకునే వారికి ప్రభుత్వం రూ 50 వేలు ఆర్ధిక సహాయం ఇవ్వడం జరుగుతోందని తెలియజేశారు. ఈ సమావేశంలో స్థానిక కార్పొరేటర్ పైడి తులసి, 57 డివిజన్ కార్పొరేటర్ జగదీష్, కో ఆప్షన్ సభ్యులు దేవమణి, తదితరులు పాల్గొన్నారు.

నేటి జడ్‌పి సమావేశానికి
‘తాగునీటి సమస్యే’ ప్రధాన అజెండా
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 19: నేడు జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో జిల్లాలో నెలకొన్న తాగునీటి సమస్యే ప్రధాన అజెండాగా మారనుంది. జఠిలంగా మారిన తాగునీటి సమస్యపై అధికార పక్షాన్ని దుమ్మెత్తి పోసేందుకు ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సిద్ధమయ్యారు. జిల్లాలో గతంలో ఎన్నడూ లేని విధంగా తాగునీటి సమస్య ఏర్పడింది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఏర్పడిన తాగునీటి సమస్యను అధిగమించేందుకు అధికార పక్షంతో ఎంతో శ్రమిస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవల జిల్లాకు చెందిన మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర తాగునీటి సమస్యను ముఖ్యమంత్రికి పూర్తి స్థాయిలో తెలియపర్చటంతో శ్రీశైలం ప్రాజెక్టు నుండి ఇటీవల 4టియంసిల నీటిని విడుదల చేశారు. ప్రకాశం బ్యారేజీ నుండి విడుదల జరిగినా ఆ నీరు ఏ మాత్రం అక్కరకు రాలేదు. నేటికీ పూర్తి స్థాయిలో మంచినీటి చెరువులు నిండలేదు. ప్రతిపక్షం దీన్ని ఒక అవకాశంగా మల్చుకుని అధికార పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నీటి రాజకీయం వేడెక్కింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా నీటి రాజకీయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్ష విమర్శలను తిప్పికొట్టేందుకు అధికార పక్షం కూడా సంసిద్ధంగా ఉంది. గత రెండు మూడు జడ్‌పి సమావేశాలకు గైర్హాజరైన జిల్లాకు చెందిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు నేడు జరిగే సమావేశానికి హాజరు కానున్నారు. వేదిక మీద దేవినేని ఉంటే సభ అంతా ఏకపక్షంగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జడ్‌పి చైర్‌పర్సన్ గద్దె అనూరాధ కూడా సమావేశాన్ని సక్రమంగా నడిపేందుకు కృషి చేస్తున్నారు. రాజకీయపర వాదనలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా శాఖల వారీగా సమీక్షలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు జరగనున్న జడ్‌పి సర్వసభ్య సమావేశంలో నీటి సమస్యపై ప్రతిపక్షం ఏ విధంగా పోరాడుతుందో వేచి చూడాల్సిందే.

జన్మభూమి కమిటీలు
చురుగ్గా పని చేయాలి
* విధి విధానాలపై త్వరలో శిక్షణా తరగతులు
* త్వరలో పోర్టుకు శంకుస్థాపన
* టిడిపి విస్తృత స్థాయి సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రభూమి బ్యూరో
మచిలీపట్నం, ఫిబ్రవరి 19: జన్మభూమి కమిటీలు చురుగ్గా పని చేయాలని రాష్ట్ర బిసి సంక్షేమ, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కోరారు. బందరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని శుక్రవారం సాయంత్రం స్థానిక టౌన్‌హాలులో నిర్వహించారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన మంత్రి రవీంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో జన్మభూమి కమిటీల పాత్ర కీలకమన్నారు. గ్రామ స్థాయిలో సంక్షేమ పథకాలకు అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసే గొప్ప అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి కమిటీలకు అప్పగించారన్నారు. కానీ చాలా చోట్ల జన్మభూమి కమిటీలు చురుగ్గా పని చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధి విధానాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిని చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలతో పాటు జన్మభూమి కమిటీలపై ఉందన్నారు. జన్మభూమి కమిటీల విధి విధానాలపై జిల్లా వ్యాప్తంగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. బందరు నియోజకవర్గానికి సంబంధించి ఈ నెల 26, 27తేదీల్లో కమిటీలతో భేటీ అయ్యి వారిని అన్ని విధాలా చైతన్యవంతుల్ని చేస్తామన్నారు. బందరు ప్రాంత చిరకాల వాంఛ బందరు పోర్టుపై ప్రభుత్వం స్పష్టమైన విధానాలతో ముందుకు వెళుతుందన్నారు. మరో మూడు నెలల్లో భూసమీకరణకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. తుళ్ళూరు తరహా ప్యాకేజీని ప్రకటించి అవసరం మేర భూములు తీసుకుంటామన్నారు. అమరావతిలో చేపట్టిన తాత్కాలిక రాజధాని ప్రారంభోత్సవ నాటికి బందరు పోర్టు పనులకు శంకుస్థాపన చేస్తామన్నారు. బందరు అభివృద్ధికి ఏర్పాటు చేసిన ‘మడ’కు సమర్ధవంతమైన అధికారులను నియమించడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాల పెంపుకు చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు. అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలో ఇప్పటికే భూగర్భ జలాలు పెరిగాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన భవిష్యత్తు తరాలకు ఒక స్వర్ణయుగం కానుందన్నారు. పనీపాట లేని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను పట్టించుకోవల్సిన అవసరం లేదన్నారు. పార్లమెంట్ సభ్యులు కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రధాన అడ్డంకి ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే జగన్ ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడని విమర్శించారు. డబ్బుతో రాజకీయం చేయాలన్న జగన్ నేడో రేపో జైలుకు వెళ్ళడం ఖాయమన్నారు. ప్రజల మేలుకోరే ఏకైక నాయకుడు చంద్రబాబేనన్నారు. బిసిలతో పాటు కాపులను కూడా సామాజికంగా అభివృద్ధి పర్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగా కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేశారన్నారు. అలాగే కాపుల స్థితిగతుల కోసం మంజునాధన్ కమీషన్‌ను ఏర్పాటు చేశారన్నారు. కమీషన్ నివేదిక ఆధారంగా కాపులను బిసిల్లో చేర్చడం జరుగుతుందన్నారు. ఈ విషయంలో బిసిలు ఏ మాత్రం ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. కాపులను బిసిల్లో చేర్చడం వల్ల బిసిలకు ఎటువంటి అన్యాయం జరగదన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ ఇప్పటికే జాతీయ స్థాయి పార్టీగా అవిర్భవించిన తెలుగుదేశం రానున్న యేడాదిలో కోటి మంది సభ్యులు గల పార్టీగా రూపాంతరం చెందనుందన్నారు. అవకాశవాద రాజకీయ శక్తులను తిప్పికొట్టాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్, ఎంపిపి కాగిత వెంకటేశ్వరరావు, జడ్‌పిటిసి లంకే నారాయణ ప్రసాద్, మార్కెట్ యార్డు చైర్మన్ గోపు సత్యనారాయణ, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు తాతా నారాయణరావు, టిడిపి నాయకులు బూరగడ్డ రమేష్ నాయుడు, గొర్రిపాటి గోపిచంద్, తలారి సోమశేఖర్, ఇలియాస్ పాషా తదితరులు పాల్గొన్నారు.
రోకలిబండతో భర్తపై దాడి

తోట్లవల్లూరు,్ఫబ్రవరి 19: భార్య భర్తల మధ్య మనస్పర్థలు తీవ్ర స్థాయికి చేరి చివరకు భార్య భర్తను రోకలిబండతో బాధిన సంఘటన మండల కేంద్రమైన తోట్లవల్లూరులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం తోట్లవల్లూరు గ్రామానికి చెందిన బాణవతు శారద కుమార్తె బాలనందికి సుమారు రెండు సంవత్సరాల క్రితం కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన కుర్రా సతీష్ నాయక్‌తో వివాహం జరిగింది. వివాహం అయిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య అభిప్రాయభేదాలు రావటంతో భార్యభర్తలు ఇద్దరు ఒకరికి ఒకరు సంబంధం లేకుండా దూరంగా ఉంటున్నారు. వీరికి ఐదునెలల కుమారుడున్నాడు. శుక్రవారం ఉదయం భర్త సతీష్ నాయక్ భార్యను కలుసుకునేందుకు తోట్లవల్లూరు వచ్చాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో భర్తపై రోకలిబండతో దాడి చేయటంతో తీవ్రగాయాలపాలయ్యాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ఆందోళనకరంగా వున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. దాడికి ఉపయోగించిన రోకలిబండను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అట్టహాసంగా పెనుగంచిప్రోలు బయలుదేరిన తిరుపతమ్మ
జగ్గయ్యపేట, ఫిబ్రవరి 19: రంగుల మహోత్సవం పూర్తి చేసుకొని తిరుపతమ్మ అమ్మవారు జగ్గయ్యపేట నుండి పెనుగంచిప్రోలుకు పయనమయ్యారు. శుక్రవారం వేకువజామున ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్, పాలకమండలి సభ్యులు, అధికారులు సాంప్రదాయ పూజల అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణలు, డప్పు వాయిద్యాలు, మేళతాళాల మధ్య గోపయ్య, తిరుపతమ్మతో సహా సహదేవతలతో పల్లకీల్లోకి తరలించారు. అనంతరం పట్టణం నుండి ఊరేగింపుగా బయలుదేరిన అమ్మవారికి అడుగుడుగునా జనం తమ మొక్కులు తీర్చుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6గంటల ప్రాంతంలో బయలుదేరిన అమ్మవారు మధ్యాహ్ననికి పట్టణ పరిధి దాటింది. నందిగామ డిఎస్‌పి రాధేష్ మురళి ఆధ్వర్యంలో సిఐ లచ్చునాయుడు ప్రత్యేక పోలీసు బలగాలతో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు.
నేతల ప్రత్యేక పూజలు
ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ వేకువజామునే అమ్మవారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. వైకాపా రాష్ట్ర నేత సామినేని ఉదయభాను, మున్సిపల్ కార్యాలయ సెంటర్‌లో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, వైకాపా కౌన్సిలర్‌లు పాల్గొన్నారు. అమ్మవారి పయనం సందర్భంగా పలు సంస్థలు, సంఘాలు భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ఎమ్మెల్యే రాజగోపాల్ భక్తులకు పులిహోర, మంచినీళ్లను అందించారు.
శ్రీ సంగమేశ్వర స్వామిని దర్శించుకున్న మంత్రి రవీంద్ర
నాగాయలంక, ఫిబ్రవరి 19: మండల పరిధిలోని సంగమేశ్వరం గ్రామంలో వేంచేసియున్న శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం రాష్ట్ర బిసి సంక్షేమం, చేనేత, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా ఆలయాన్ని దర్శించేందుకు వచ్చిన మంత్రి రవీంద్రకు ఆ గ్రామ సర్పంచ్ కోలా పద్మావతి, గ్రామ పెద్దలు స్వాగతం పలికారు. సంగమేశ్వరం గ్రామానికి చెందిన మత్స్యకారులు తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై మంత్రికి వినతిపత్రం సమర్పించారు. రవీంద్ర వెంట ఎఎంసి ఛైర్మన్ మండవ బాలవర్ధనరావు, ఎంపిపి సజ్జా గోపాలకృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు వర్రే రాంబాబు, రాష్ట్ర బలహీన వర్గాల వికాస పరిషత్ కన్వీనర్ లకనం నాగాంజనేయులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
పాము కాటుకు మహిళ మృతి
గుడ్లవల్లేరు, ఫిబ్రవరి 19: పాముకాటుకు మహిళ మృతి చెందిన సంఘటన స్థానిక నెహ్రూ నగర్‌లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. విఆర్‌ఓ ప్రభాకరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నెహ్రూనగర్‌కు చెందిన ఉచ్చుల మేరి (40) కుళాయి వద్ద నీరు పట్టుకునేందుకు వెళ్ళింది. ఆ సమయంలో పాము ఆమెను కాటువేసింది. దీన్ని గమనించిన భర్త ఉచ్చుల పిచ్చిరాజు ఆస్పత్రికి తరలిస్తున్న సమయంలో మృతి చెందింది. ఆమెకు ఒక కుమారుడు ఉన్నాడు. విఆర్‌ఓ వివరాలు సేకరించారు.
వైభవంగా శ్రీలక్ష్మీనృసింహ సుదర్శన మహాయాగం
నందిగామ, ఫిబ్రవరి 19: మండలంలోని మాగల్లు గ్రామంలో మదన గోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో వైభవంగా జరుగుతున్న అష్టోత్తర సహస్ర కుండాత్మక శ్రీలక్ష్మీ నృసింహ సుదర్శన మహాయాగంలో భాగంగా రెండవ రోజైన శుక్రవారం ఉదయం ఆగమ వాచస్పతి శ్రీమాన్ వేదాంతం రాజగోపాల చక్రవర్తి, ఆగమ ప్రవర, నృసింహ ఉపాసకులు శ్రీమాన్ పరాంకుశం వాసుదేవాచార్యులుల ఆధ్వర్యంలో వేద స్వస్తి, శ్రీకరముగ విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనము, అగ్నిమధన, ప్రధాన యాగశాలలో అగ్నిప్రతిష్ఠలు వైభవంగా జరిగాయి. పెద్ద సంఖ్యలో భక్తులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆలయ ఇఒ గడుపూడి కోటేశ్వరరావు, ఆలయ అర్చకులు అంగర సీతారామాచార్యులు (రాంబాబు)లు తదితరులు ఏర్పాట్లు పర్యవేక్షించారు.
విద్యుదాఘాతానికి కాంట్రాక్ట్ కార్మికుడి మృతి
ఎ కొండూరు, ఫిబ్రవరి 19: విద్యుత్ షాక్‌కు గురై యువకుడు మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటకు చెందిన ఆర్ రమణ (23) 221 జాతీయ రహదారి విస్తరణ పనుల్లో భాగంగా విద్యుత్ స్తంభాలను తొలగించి, కొత్త స్తంభాలను ఏర్పాటుకు సబ్ కాంట్రాక్టర్ వద్ద పని చేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం కంభంపాడు 132/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ సిబ్బంది సరఫరా నిలిపివేశామని చెప్పడంతో పిఎసిఎస్ సమీపంలో విద్యుత్ స్తంభం ఎక్కి రమణ వైర్లు లాగుతుండగా విద్యుత్ సరఫరా అవ్వడంతో షాక్ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సిపిఎం మండల కార్యదర్శ జట్టి వెంకటేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ డివిజన్ నాయకుడు డి రాముడు, జిల్లా గిరిజన సంఘం ప్రధాన కార్యదర్శి గోపిరాజులు డిమాండ్ చేసారు.