ఖమ్మం

ఎన్నికల బరిలో 291మంది అభ్యర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఫిబ్రవరి 26: ఖమ్మం కార్పొరేషన్‌లో 50డివిజన్లకు గానూ 283మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మొత్తం 587మంది నామినేషన్లు వేయగా 11నామినేషన్లు పరిశీలనలో తిరస్కరించబడ్డాయి. మిగిలిన 288మంది శుక్రవారం ఉపసంహరణల సమయానికి తమ నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో మిగిలిన 291మంది బరిలో నిలిచినట్లయింది. అయితే అన్ని ప్రధాన రాజకీయ పార్టీల్లోనూ కొన్ని డివిజన్లలో రెబల్ అభ్యర్థులు రంగంలో ఉండటం గమనార్హం.
కాగా ఉపసంహరణలు ఆధ్యంతం ఆసక్తికరంగా సాగాయి. ఆయా పార్టీల ప్రధాన నేతలు తమ ప్రధాన అభ్యర్థి కాకుండా మిగిలిన వారిని పోటీలోంచి తప్పించేందుకు చేసిన ప్రయత్నాలు కొంతమేరకే సఫలీకృతమయ్యాయి. చివరి నిమిషం వరకు రెబల్స్‌ను ఏదో ఒక విధంగా బుజ్జగిస్తూ, ప్రలోభాలకు గురిచేస్తూ వారు ఉపసంహరించుకునేలా ప్రయత్నాలు చేశారు. అయితే ఉపసంహరణల గడువు ముగిసే సమయంలో మాత్రం అధికార టిఆర్‌ఎస్, కాంగ్రెస్ వర్గీయుల మధ్య రగడ నెలకొంది.
గేటుదూకిన ఎమ్మెల్యే
అధికార పార్టీ నాయకులు సమయం దాటినా కార్యాలయంలోనే ఉన్నారంటూ ప్రతిపక్ష పార్టీ, కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ గేటుదూకి లోనికి ప్రవేశించారు. అధికార పార్టీ నాయకులకే అధికారులు కొమ్ము కాస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ లోనికి ప్రవేశించి రిటర్నింగ్ అధికారిపై మండిపడ్డారు. కమిషనర్ గదికి వెళ్ళి ఎందుకు వారిని ఉంచారంటూ వేణుగోపాల్‌రెడ్డిని నిలదీశారు. పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, మాజీమంత్రి వనమా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు అయితం సత్యం ఎమ్మెల్యే పువ్వాడ అధికార పార్టీ నాయకుల తీరును ఎండగట్టారు. సిసి కెమేరాలు ఫుటేజీలు పరిశీలించి ఎన్నికల నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించిన అధికార పార్టీ నాయకులు రెడ్యానాయక్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్‌ను హెచ్చరించారు. తాను నామినేషన్ల పర్యవేక్షకుడిని మాత్రమేనని, లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానన్నారు. దీంతో ఆగ్రహంతో ఉన్న నాయకులు చల్లబడ్డారు. అనంతరం రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదును కమిషనర్‌కు అందజేశారు.
కంటతడిపెట్టిన అభ్యర్థులు
తమకే బి ఫామ్ ఇస్తామని నమ్మబలికి మోసం చేశారంటూ అధికార టిఆర్‌ఎస్ 38వ వార్డుకు నామినేషన్ వేసిన అభ్యర్థి తేజావత్ ఉమాదేవి కంటతడిపెట్టింది. అదే వార్డులో నివాసముంటున్న తనకు కాకుండా రమణగుట్ట ప్రాంతానికి చెందిన మరో మహిళకు కేటాయించడంతో ఆవేదనకు లోనై టిఆర్‌ఎస్ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసింది.
బుజ్జగింపులు
మేయర్ పదవిని దక్కించుకునేందుకు ఆయా డివిజన్లలో పరిస్థితులను అధిగమించేందుకు ఎక్కువ మందితో పార్టీలు నామినేషన్లు వేయించాయి. ఎవరికి వారికే టిక్కెట్ ఇస్తామని చెప్పడంతో అందరూ ఆశతో ఎదురుచూశారు. అయితే ఉపసంహరణల గడువు సమయంలో వారిని బుజ్జగించి, బెదిరించి నామినేషన్ ఉపసంహరింపజేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అనేక కార్పొరేషన్ కార్యాలయంలోనే రోదించారు. అధికార పార్టీ అగ్రనేతలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రెడ్యానాయక్, పలువురు టిఆర్‌ఎస్ నాయకులు గ్రూపులుగా ఏర్పడి రెబల్స్‌తో తమ అభ్యర్థిత్వాలను ఉపసంహరింపజేశారు. దీంతో ఆశావాహుల్లో నిరాశ ఎదురైంది. నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.

మేయర్ ఎన్నిక
మార్చి 15న
ఆంధ్రభూమి బ్యూరో
ఖమ్మం, ఫిబ్రవరి 26: ఖమ్మం కార్పోరేషన్‌లో నామినేషన్ల గడువు పూర్తి అయిన వెంటనే మేయర్, డెప్యూటి మేయర్ ఎన్నికకు ఎన్నికల సంఘం షెడ్యూల్డ్ విడుదల చేసింది. వచ్చే నెల 6వ తేదీన ఎన్నికలు జరగనుండగా 9వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనున్నది. 11వ తేదీన మేయర్, డెప్యూటి మేయర్ల ఎన్నికకు నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు. 15వ తేదీ ఉదయం 11 గంటలకు మేయర్, డెప్యూటి మేయర్ ఎన్నిక జరగనున్నది. అంతకు ముందుగానే అభ్యర్థులు ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఎన్నికల నిబంధనలను
ఉల్లంఘిస్తున్న అధికార పార్టీ
* ప్రజాసామ్యాన్ని అపహస్యం చేస్తున్న పాలకులు
* ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 26: ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ, అధికార దుర్వినియోగానికి టిఆర్‌ఎస్ పాల్పడుతోందని టిపిసిసి వర్కింగ్ ప్రసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్లకు జరుగుతున్న ఎన్నికల్లో యంత్రాంగాన్ని రాజకీయ అవసరాలకు వాడుకుంటూ టిఆర్‌ఎస్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తోందని ధ్వజమెత్తారు. ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల ఉపసంహరణలో అధికార పార్టీకి చెందిన నేతలు సమయం ముగిసిన తర్వాత కూడా రెబల్ అభ్యర్థులను, అధికారులను బెదిరించి ఉపసంహరింప చేశారన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే రెడ్యానాయక్ ప్రత్యక్షంగా పాల్గొని ప్రజాసామ్యాన్ని అపహస్యం చేశారన్నారు. కూడబెట్టిన అక్రమ సంపాదనతో ఎన్నికల్లో గెలిచే ప్రయత్నాలను ఖమ్మం ప్రజలు అడ్డుకుంటారన్నారు. సిఎం జిల్లా పర్యటన కేవలం కార్పొరేషన్ ఎన్నికల కోసమే సాగిందని, ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టలేదని పేర్కొన్నారు. ఎన్నికల నిధులు సేకరించేందుకు జిల్లాలోని ప్రాజెక్ట్‌ల నిధులను అంచనాకు మించివేశారన్నారు. లకారంచెరువు 5కోట్ల అగ్రిమెంట్‌కు అధనంగా 13కోట్లను కలిపారన్నారు. ఐదు లక్షలు దాటితే టెండర్లను పిలవల్సి ఉండగా వాటికి తిలోధకాలు ఇచ్చి లకారం చెరువు పేరుతో దోపిడికి పాల్పడ్డారని, ఆసొమ్ముతోనే ఎన్నికల్లో పాల్గొంటున్నారన్నారు. కోట్లతో ఖమ్మం ఓటర్లను కొనలేరని, కార్పొరేషన్‌లో ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారన్నారు. ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని, ఖమ్మం కార్పొరేషన్ కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేఖరుల సమావేశంలో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా అధ్యక్షుడు ఐతం సత్యం, వనమా వెంకటేశ్వరరావు, జహీర్‌అలీ, తాజుధ్దీన్ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి
ప్రజలే బుద్ధిచెబుతారు
* సిపియం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని
ఖమ్మం (కల్చరల్), ఫిబ్రవరి 26: టిఆర్‌ఎస్ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెపుతారని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. స్థానిక సుందరయ్యభవన్‌లో శుక్రవారం ఖమ్మం డివిజన్ స్ధాయి పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా తమ్మినేని మాట్లాడుతూ అధికార దాహాంతో టిఆర్‌ఎస్ ప్రభుత్వం రాజకీయ విలువలను పాతరేస్తుందని విమర్శించారు. కెసిఆర్ వాగ్దానాలన్నీ ఒక బూటకమని, అవి తేటతెల్లం అయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఖమ్మం మున్సిపాలిటిని 40 సంవత్సరాలు ఏకదాటిగా మచ్చలేని పాలన అందించిన చరిత్ర సిపిఎంకే దక్కిందన్నారు. ఖమ్మం కార్పోరేషన్‌లో ప్రజలు సిపిఎంనే ఆదరిస్తారని ఆయన తెలిపారు. సిపిఎం జిల్లా కమిటి సభ్యుడు వై విక్రమ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి పోతినేని సుదర్శనరావు, నాయకులు నున్నా నాగేశ్వరరావు, పొన్నం వెంకటేశ్వర్లు, బుగ్గవీటి సరళ, ఏజె రమేష్, మచ్చా వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్య, ఖమ్మం డివిజన్ కార్యదర్శి యర్రా శ్రీనివాసరావు, అఫ్రోజ్‌సమీనా, బండారు యాకయ్య, టి విష్ణు వర్ధన్, ఎంఎ ఖయూం తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 8 నుంచి 21 వరకు
భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు
* 15న శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం
భద్రాచలం, ఫిబ్రవరి 26: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 8 నుంచి 21వ తేదీ వరకు వసంత పక్షప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని వైదిక కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు బ్రహ్మోత్సవాల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 8న దుర్ముఖి నామ సంవత్సరాది ఉగాది పండుగ, నూతన పంచాంగ శ్రవణం, తిరువీధి సేవ ఉంటాయి. ఏప్రిల్ 11వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 13న అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం, 14న ఎదుర్కోలు ఉత్సవం, 15న శ్రీరామనవమి, సీతారాముల కల్యాణం, 16న మహాపట్ట్భాషేకం, 17న సదస్యము, మహదాశీర్వచనం, 21న చక్రతీర్థ, ధ్వజావరోహణం, ద్వాదశ ప్రదక్షిణలు, ద్వాదశారాధనలు, శ్రీపుష్పయాగం నిర్వహించాలని వైదిక కమిటీ దేవస్థానం ఈఓకు నివేదిక ఇచ్చింది.
రూ.80 లక్షలతో ఏర్పాట్లు: ఇదిలా ఉండగా శ్రీరామనవమికి రూ.80 లక్షలతో దేవస్థానం ఏర్పాట్లకు శ్రీకారం చుడుతోంది. భక్తులకు చక్కని సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. ఈ మేరకు టెండర్లను పిలుస్తున్నారు. 60 క్వింటాళ్ల తలంబ్రాలను భక్తులకు పంపిణీకి సిద్ధం చేస్తున్నారు. 150 కిలోల ముత్యాలతో పాటు భక్తుల అవసరాన్ని బట్టి మరో 10 కిలోల ముత్యాలను కొనుగోలు చేసేందుకు దేవస్థానం కార్యాచరణ చేస్తోంది.
మాయమాటల టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పాలి

ఖమ్మం(మామిళ్ళగూడెం), ఫిబ్రవరి 26: మాయమాటలతో ప్రజలను మభ్యపెడుతూ ఇతర పార్టీల్లోని అభ్యర్థులను లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న అధికార పార్టీ నేతలను ప్రజలు నిలదీయడమే కాకుండా కార్పోరేషన్ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని టిడిపి మాజీ ఎంపి నామ నాగేశ్వరరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలు విజ్ఞప్తి చేశారు. కార్పోరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయనగర్ కాలనీ, బ్యాంక్‌కాలనీ, విడివోస్ కాలనీలలో శుక్రవారం విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా తాను ఎంపిగా ఉన్న సమయంలో ఆ ప్రాంతంలో చేసిన అభివృద్ధి పనులను ప్రస్తావిస్తూ ప్రజలను తమ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరగా అనేక చోట్ల సానుకూల స్పందన వచ్చింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ హయంలోనే ఖమ్మం నగరంలో అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న నేతలు టిడిపి హయంలోనే చేశారనే విషయాన్ని గుర్తుచేసుకోవాలన్నారు. అధికార పార్టీ ప్రజలను మభ్యపెట్టేందుకు మాయ మాటలు చెప్తుందని, చైతన్యవంతులైన ఖమ్మం ప్రజలు వాటిని గమనిస్తున్నారన్నారు. కార్పోరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమాలలో టిడిపి అభ్యర్థులు భూక్యా భిక్షపతిరాథోడ్, తాళ్ళూరి జీవన్‌కుమార్, ఆలస్యం కృష్ణకుమారి, దుద్దుకూరి సుమంత్, కేతినేని హరీష్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
కాగా 5వ డివిజన్‌లో టిడిపి అభ్యర్థి ఏలూరి శ్రీనివాసరావుకు మద్దతుగా ఆ డివిజన్‌లో పెద్దలు ప్రచారం నిర్వహించారు. స్థానికుడిగా ఉన్న ఏలూరిని గెలిపించాల్సిన అవశ్యకతను వివరించారు. నాడు చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత ప్రభుత్వం వాటి పేర్లు మార్చి చేసే పనులను వివరిస్తూ ప్రచారం నిర్వహించారు. కాగా అనేక చోట్ల మహిళలు ఏలూరికి హారతులు పట్టడం విశేషం.
22వ డివిజన్‌లో టిడిపి అభ్యర్థి సరిపుడి సతీష్ గడపగడప తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. స్థానికంగా విస్తృత పరిచయాలు కలిగి ఉండడంతో అందరు ఆయనకు మద్దతు ఇస్తామని బాహటంగానే స్పష్టం చేశారు. మాజీ ఎంపి నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్రలు స్థానికులతో పార్టీ అభ్యర్థి సతీష్‌ను గెలిపించుకునేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి చర్చించారు.
నాటి వైఎస్ పథకాలే నేడు శ్రీరామరక్ష
ఖమ్మం(గాంధీచౌక్), ఫిబ్రవరి 26: నాడు ప్రజల సంక్షేమం కోసం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయాన్ని దక్కిస్తాయని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర అధ్యక్షుడు, ఖమ్మం ఎంపి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన తమ పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ భారీ ర్యాలీతో ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల బాధలను తీర్చడంలో నాడు వైఎస్ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల గుండెల్లో నిలిచాయన్నారు. వాటినే కొన్ని పేర్లు మార్చి ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్నదని, ప్రజలు ఈ విషయాన్ని గమనిస్తున్నారన్నారు. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపించడం ద్వారా వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై తమకు ఉన్న అభిమానాన్ని ప్రజలు తెలియజెప్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో ఒకరిగా మెలిగే వారే తమ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారని, వారిని గెలిపిస్తారని వెల్లడించారు. ఈ సందర్భంగా పొంగులేటికి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనేక చోట్ల పూలు చల్లుతూ తమ సమస్యలను తెలియజేస్తూ ప్రజలు స్వాగతం పలకగా ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైతే తన నిధుల నుంచైనా కేటాయింపులు జరుపుతానని చెప్పారు. అధికార పార్టీ మాయ మాటలను నమ్మవద్దని, ప్రజలకు అండగా ఉండే వారిని గెలిపించుకోవాలని స్పష్టం చేశారు. పొంగులేటి వెంట పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అభ్యర్థులు పాల్గొన్నారు.

యువతిపై అత్యాచారం కేసులో
నలుగురు నిందితుల అరెస్ట్
సత్తుపల్లి, ఫిబ్రవరి 26: ఓ యువతిని అత్యాచారం చేసిన కేసులో నలుగురు యువకులను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సత్తుపల్లి డీఎస్పీ కవిత చెప్పారు. శుక్రవారం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈనెల 24వ తేదిన పెనుబల్లి మండలం చీన్యా తండాకు చెందిన ఓ గిరిజన యువతికి సాయికృష్ణ అనే యువకుడు ఫోన్‌లో పరిచయమయ్యాడు. ఈ మేరకు ఆ యువతి సత్తుపల్లి వస్తున్నానని తెలపడంతో సాయికృష్ణ తన స్నేహితుడైన చల్లా కమల్‌ను పంపించి ద్విచక్ర వాహనంపై పట్టణ శివారులోని తామర చెరువు వద్దకు తీసుకెళ్ళాడు. అనంతరం మిగిలిన ముగ్గురు యువకులు మద్యం తీసుకొని వెళ్ళి బలవంతంగా ఆ యువతికి తాగించి మొదటగా వంగా సాయికృష్ణ, అనంతరం షేక్ సాధిక్‌లు అత్యాచారానికి పాల్పడ్డారని డీఎస్పీ తెలిపారు. ఈ సమయంలో ఆ యువతి పెద్దగా కేకలు వేయడంతో భయపడిన చల్లా కమల్, గుడిమెట్ల సందీప్‌లు అక్కడి నుండి పరారయ్యారన్నారు. ఆ యువతి అక్కడి నుంచి 100కు డయల్ చేయడంతో తమకు మెసేజ్ అందిందని వెంటనే తమ సిబ్బంది అక్కడకు వెళ్ళగా వారు కూడా పరారయ్యారని చెప్పారు. ఈ కేసులో నిందితులైన వంగా సాయికృష్ణ, షేక్ సాదిఖ్‌లు బిటెక్ ఫైనలియర్, చల్లా కమల్ బి.టెక్ మూడో సంవత్సరం, గుడిమెట్ల సందీప్ డిగ్రీ చదువుతున్నారన్నారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ, 376 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. నిందితులను పట్టుకునేందుకు కృషిచేసిన సీఐలు రాజేంద్ర, రాజిరెడ్డి, ఎస్‌ఐలు శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సిబ్బంది దామోదర్, డీవిఆర్ తదితరులను అభినందించారు.

నాల్గవ తరగతి ఉద్యోగుల క్రీడలు ప్రారంభం
ఖమ్మం(స్పోర్ట్స్), ఫిబ్రవరి 26: తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల జిల్లా స్థాయి క్రీడలు స్థానిక సర్దార్ పటేల్ స్టేడియంలో శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. పోటీలకు ముఖ్య అతిధిగా వచ్చిన జాయింట్ కలెక్టర్ దివ్య జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ మండలాల నుంచి వచ్చిన ఉద్యోగులు మార్చ్ఫాస్ట్ చేయగా క్రీడావందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనడం అభినందనీయమన్నారు. గత 16సంవత్సరాల నుంచి పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులను ఆమె అభినందించారు. ఉద్యోగులకు ఏమైనా సమస్యలు ఉంటే తనకు తెలియబర్చాలని ఆమె అన్నారు. టిఎన్జీఓ అధ్యక్షులు కూరపాటి రంగరాజు పోటీలను జెసి ప్రారంభించి ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కోడి లింగయ్య మాట్లాడుతూ గత 16సంవత్సరాల నుంచి అధికారుల సహకారంతో వివిధ క్రీడాంశాలలో పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా గౌరవ అధ్యక్షులు వెంకన్న, క్రీడల కార్యదర్శి విఎస్ చారిలు మాట్లాడుతూ ఉద్యోగులకే కాకుండా ఉద్యోగుల పిల్లలకు, రిటైర్డ్ ఉద్యోగులకు, మహిళా ఉద్యోగులకు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలు మూడురోజుల పాటు జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం అర్బన్ తహశీల్దార్ వెంకారెడ్డి, ప్రచార కార్యదర్శి చావా నారాయణ, జిల్లా క్రీడాధికారి కబీర్‌దాస్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ప్రజలు కాంగ్రెస్ వైపే...
* ఎమ్మెల్యే అజయ్‌కుమార్ ధీమా
ఖమ్మం(ఖిల్లా), ఫిబ్రవరి 26: ఖమ్మం నగర ప్రజలు కాంగ్రెస్ వైపే ఉన్నారని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక 24వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థి మిక్కిలినేని నరేంద్రకు మద్దతుగా సతీసమేతంగా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయంలోనే ఖమ్మం నగరంలో అభివృద్ధి జరిగిందని, సాధారణ ఎన్నికల్లో కూడా ఈ ప్రాంతంలో కాంగ్రెస్‌కే మెజారిటి వచ్చిందని వెల్లడించారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్య పెడుతూ అధికార పార్టీ ప్రచారం నిర్వహిస్తుందని, అనేక చోట్ల ప్రజలు ఆ పార్టీ నేతలను సమస్యలపై నిలదీస్తున్నారన్నారు. 24వ డివిజన్‌లో తాగేందుకు నీరు లేక రెండేళ్ళుగా పాలకులు పట్టించుకోకపోతే తమ పార్టీ అభ్యర్థిగా ఉన్న నరేంద్ర ప్రతి ఇంటికి తాగునీటిని సరఫరా చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు అభ్యర్థి నరేంద్ర, స్థానిక నేతలు పాల్గొన్నారు.

వైభవంగా జీవ ధ్వజస్తంభ
ప్రతిష్ఠోత్సవం
ఖమ్మం(కల్చరల్), ఫిబ్రవరి 26: నరగంలోని రజకవీధిలో పర్సా అనంతరామయ్య సోదరుల ధర్మసంస్థ, సంస్కృత పాఠశాలలు సంయుక్తంగా నిర్మించిన శ్రీఅరుణాచలేశ్వర సహిత శ్రీ కనకదుర్గ, శ్రీవల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన విగ్రహ, జీవ ధ్వజస్తంభ ప్రతిష్టామహోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా జరిగాయి. గత 5 రోజులుగా నూతన ఆలయంలో జరిగిన కార్యక్రమాలకు నగర వాసులతో పాటు శివారు గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని తరించిపోయారు. ఆలయ ప్రాంత ప్రజలు తమ ఇంటి ఆడబిడ్డలను 5 రోజల ముందుగానే పిలిపించుకొని భక్తి కార్యక్రమాల్లో మునిగితేలారు. ప్రజలందరికి ఆయురారోగ్యాలు కలగాలని, అష్ట్యాశ్వర్యాలు సిద్ధించాలని, సకల దోషాలు తొలగాలని వేద పండితులు ప్రతిష్టామహోత్సవం సందర్భంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయనిర్మాణ కర్త, చైర్మన్ డాక్టర్ పర్సా పట్ట్భారామారావు, కార్యనిర్వాహణాదికారి పి నారాయణాచార్యులు పాల్గొన్నారు.