మెయన్ ఫీచర్

విద్యారంగంలో వింత పోకడలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

"మార్కుల్ని ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలని మా తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తున్నారు..’ అంటూ మాచారెడ్డి మండలంలోని లచ్చాపేట ప్రభుత్వ పాఠశాల పదోతరగతి విద్యార్థి శ్యాం వీడ్కోలు సందర్భంగా సమావేశానికి హాజరైన ఓ విద్యావేత్తకు చేసిన ఫిర్యాదు ఇది. ఎన్ని మార్కులు తెచ్చుకున్నా ఇంకా తెచ్చుకోవాలనేది ఆ మాటల్లోని సారాంశం. ఈ సమావేశానికి కొంతమంది తల్లిదండ్రులు వచ్చినా, శ్యాం తల్లిదండ్రులు మాత్రం రాలేదు. ‘ప్రశాంతంగా పరీక్షలు రాయి. తర్వాత మీ తల్లిదండ్రులతో మాట్లాడుతా’నంటూ ఆ విద్యావేత్త విద్యార్థికి భరోసా ఇచ్చాడు. ఇదొక్క శ్యాం సమస్య మాత్రమే కాదు. పదోతరగతి పరీక్షల్ని రాయబోతున్న ఇరు రాష్ట్రాల్లోని దాదాపు పది లక్షల మంది విద్యార్థుల సమస్య. ఈ సమస్యకు సమాధానం తల్లిదండ్రులకు ఎలాగూ తెలియదు. కాని అత్యధిక ఉపాధ్యాయులకే తెలియకుండా పోవడం బాధాకరం.
తెలంగాణ ఉద్యమకాలంలో విద్యారంగం గూర్చి కూడా నినదించడం జరిగింది. విద్యారంగాన్ని కబ్జా చేసి తనకు నచ్చిన విధంగా, పోటీతత్వంతో నడుపుతూ మొత్తంగా విద్యావిధానాన్ని కార్పొరేట్ విద్య భ్రష్టు పట్టించిందని ఆరోపణలు చేశారు. రాష్ట్ర విభజన తరువాత విద్యా,వైద్య రంగాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయని భావించారు. కాని రెండు సంవత్సరాలు కావస్తున్నా ఆనుకున్న మార్పులు జరగకపోగా, అశాస్ర్తియ మార్పులకు గురవుతున్నది. ఎదో చేయాలి కాబట్టి చేయడం, విద్యారంగాన్ని మార్చాలి కాబట్టి మార్చడం అనే వింత ధోరణలు విద్యారంగంలో చోటు చేసుకుంటున్నాయి. ఈ మార్పులపట్ల ఉపాధ్యాయ సంఘాలకు, విద్యార్థి సంఘాలకు పట్టింపు లేకుండా పోవడం మరో అంశం.
గత దశాబ్ద కాలంగా విద్యారంగం మూస, బట్టీ విధానంలో కొనసాగుతున్నదని, దీన్ని మార్చాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా సిలబస్ భారంతోపాటు, పుస్తకాల భారం అధికమైందని, వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని ఎన్‌సిఎఫ్-2005తో పాటుగా, యశ్‌పాల్ కమిటి సిఫార్సుల్ని చేసింది. కొంతమేరకు ఆయా స్థాయిల్లో వీటి చర్చలు జరిగినా, అనుకున్న దిశగా ముందుకు సాగని పరిస్థితి. కొఠారీ ప్రస్తావించిన కామన్ స్కూలు విధానం గాని, నైబర్‌హుడ్ స్కూలు విధానంపై గాని కాంగ్రెస్, జనతా, జనతాదళ్, యుపిఎ, ఎన్‌డిఎ ప్రభుత్వాలతో పాటు ఏ ప్రాంతీయ పార్టీకి పట్టినట్టుగా లేదు. ఈ విషయంగా మహబూబ్‌నగర్ విద్యార్థులు రాష్ట్ర హైకోర్టుకు రాసిన లేఖల ఆధారంగా హైకోర్టు స్పందించి తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించిన విషయం అలహాబాద్ హైకోర్టు యుపి ప్రభుత్వాన్ని మొట్టికాయలు వేసిన విషయం కూడ ఏ ప్రభుత్వానికి చెవికెక్కలేదు. ఏ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వానికైనా ఎక్కుతుందనే నమ్మకం లేదు. కొన్ని ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు గతంలో ఈ విషయంగా నినదించినా, హైకోర్టు వ్యాఖ్యల సందర్భంగా కనీసంగా స్పందించకపోవడం, ఓ ఉద్యమ రూపాన్ని రూపొందించకపోవడం వాటి దిగజారుతున్న రాజకీయాలకు నిదర్శనం.
పైగా అశాస్ర్తియ విధానాల్ని పరస్పర విరుద్ధమైన పెడగాజీ పద్ధతులను ప్రభుత్వాలు, ముందేసుకుంటే వాటికి జేజేలు కొట్టడం, బస్సుయాత్రలు చేయడం జరుగుతున్నది. ఏ దృక్పథంతో కెజి టు పిజిఅనే నినాదాన్ని తెరాస ప్రభుత్వం ముందుకు తెచ్చిందో విశే్లషించు కాని, దాని అసలు రంగును బహిర్గతం చేసి సమాజాన్ని చైతన్యం చేయాల్సిన అభ్యుదయ సంఘాలే కెజిటు పిజి పథకాన్ని వెంటనే అమలు చేయాలని ప్రకటనలివ్వడం, డిమాండ్ చేయడం ఆయా సంఘాల నిబంధనావళికే విరుద్ధంగా ఉంటున్నాయి. పరోక్షంగా ఈ పథకం ఇప్పటికే ఉండి అస్తవ్యస్తంగా నడుస్తున్నది. కెజి చదువులైన ప్రీప్రైమరీ విధానం ప్రభుత్వ రంగంలో లేదు కాని, అంగన్‌వాడి విధానం ఈ కోవలోనిదే. పోతే అమెరికాతో సహా అభివృద్ధి చెందిన దేశాల్లో ఈ విధానమే లేదు. మానస వికాసం కోసం, ఆరోగ్య రీత్యా బాల వికాస కేంద్రాల్ని మాత్రం ఆయా ప్రభుత్వాలు నడుపుతున్నాయి. సమీకృత ఆహార విధానం అనే నినాదంతో ఇంటిగ్రేటెడ్ ఛైల్డ్ డెవలప్‌మెంట్ కార్యక్రమాల్ని నడిపినా, దేశవ్యాపితంగా 45 శాతానికి పైగా అయిదు సంవత్సరాల లోపు పిల్లలు పౌష్టికార లోపంతో బాధపడుతున్నట్టు ప్రభుత్వమే నిర్వహిస్తున్న కుటుంబ సర్వేలు తెలుపుతున్నాయి. కేటాయిస్తున్న నిధులు, పెడుతున్న ఖర్చులు పిల్లలకు చేరకముందే పెద్దలు తన్నుకుపోవడం ఈ దేశంలో మామూలే. వీటిని సమర్ధవంతంగా నడపలేని ప్రజా ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగంలో ఇప్పటికే ఉన్నవిధానాన్ని సమూలంగా మారుస్తున్నారంటూ, ఊహాజనిత ఆలోచనల్ని చేస్తున్నాయి. గతంలో చెన్నారెడ్డి, వైఎస్‌ఆర్, కిరణ్‌కుమార్ రెడ్డి అభ్యుదయ స్కూళ్లంటూ, సక్సెస్ స్కూళ్లంటూ, మాడల్ స్కూళ్లంటూ ప్రారంభించి వాటినో దిక్కులేని సంస్థలుగా వదిలేశారు. చంద్రబాబు హయాంలో చేయని ప్రయోగంలేదు. ఈ ప్రయోగాల్ని నిశితంగా విశే్లషించని సంఘాలు, ఈ సంస్కరణల మాయాజాలంలో ఇరుక్కుంటున్నాయి.
ఇప్పటికే విద్యారంగం అనేక మేనేజ్‌మెంట్ల కింద, మాల్ సంస్థల కింద వుంటూ, ప్రభుత్వ రంగంలోనే ప్రభుత్వ, గిరిజన, సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్‌గా, జిల్లా, మండల, పరిషత్ స్కూళ్లుగా, నేరుగా ప్రభుత్వ స్కూళ్లుగా, చీలికలు పేలికలుగా ఉన్నాయి. వీటికి అదనంగా ఉన్నత వర్గాల కోసం పబ్లిక్ స్కూళ్లు, కేంద్ర ప్రభుత్వ పాఠశాలలకు తోడు నవోదయ పాఠశాలలున్నాయి. ఒక్కో మేనేజ్‌మెంట్‌ది ఒక్కో విధానం. పాఠ్యాంశాల్లో, ప్రణాళికల్లో, పరీక్షల విధానంలో వ్యత్యాసాలు, ఏ ఒక్కదానికి మరొక దానితో పొంతన వుండదు. మధ్యలో కెజిబివిలు మరో ప్రత్యామ్నాయ సంస్థగా ఎదిగిపోయాయి. ఇవన్నీ రాజకీయ, ఆర్థిక లబ్దికై ఏర్పాటు చేసినవే. ఇలా ప్రభుత్వ యాజమాన్య విద్యాలయాల్లోనే కామన్ కరిక్కులం, మాధ్యమం లేకపోవడం, కొన్నింటిలో అష్ట మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం, సక్సెస్ స్కూళ్లని నడపడంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఏ ఒక్క విద్యావిధానం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం కాదు. ఆ దిశగా అడుగులే వేయలేని స్థితి. ఈ సంథికాలంలో బలోపేతం కావల్సిందానికన్నా మరింత ఎక్కువగా ప్రైవేటు విద్య బలోపేతమై ప్రభుత్వ విద్యారంగానే్న శాసిస్తున్నది.
ఈ పరిస్థితి ఎక్కడదాకా పోయిందంటే, పోటీని తట్టుకోవడానికి, పిల్లల్ని తమ సంస్థల్లో చేర్చుకోవడానికై నవంబర్‌లోనే పర్మిషన్ ప్రక్రియను, డిసెంబర్‌లో సిలబస్‌ను పూర్తి చేయడం, జనవరి నుంచే పై తరగతుల విషయాలను బోధించడం అనే తప్పుడు ధోరణులకు మార్గాలు వేసాయి. వీటన్నింటిని నియంత్రించాల్సిన ప్రభుత్వాలు, ప్రభుత్వ పాఠశాలలు కూడా ఇలాగే నడవాలన్న ఆదేశాల్ని ఇస్తున్నాయి. ఆచరించాలని చెబుతున్నాయి. ఇవన్నీ అశాస్ర్తియ విధానాలని తెలిసినా, కిమ్మనకుండా ఉపాధ్యాయులు ఆచరిస్తున్నట్టు రిపోర్టుల్ని పంపిస్తున్నారు. ఉపాధ్యాయులకు మనోధైర్యాన్నిచ్చి, ఈ అశాస్ర్తియ విధానాన్ని ఆచరించవద్దని చెబుతూ, ప్రభుత్వంతో చర్చించాల్సిన సంఘాలు మిన్నకుంటున్నాయి. ఇక మేధావులకైతే ఇవేవీ పట్టడం లేదు. అందరిది గొర్రెదాటు విధానమే!
మనదేశ రుతువులకు అనుగుణంగా మన విద్యా సంవత్సరం రూపొందించబడింది. విద్యాసంవత్సరం ముగిసిన తరువాత ప్రశాంతతో, అమ్మమ్మల, నాయనమ్మల సంస్కృతిని పూర్తిగా దెబ్బతీసి సంవత్సరమంతా కోచింగ్‌ల పేర, సమ్మర్ క్యాంపుల పేరున, పరీక్షల పేరున, ఎంట్రెన్స్‌ల పేరున సొమ్ము చేసుకోవడం మామూలైపోయింది. వీటి ద్వారానే పిల్లల ఎదుగుదల అనే తప్పుడు భావాలకు తల్లిదండ్రులు గురౌతున్నారు. పైగా ఈ అవలక్షణాలన్నీ రూపుదిద్దుకున్న తర్వాతనే, అవలక్ష ణాలున్న సమాజం ఎదగడం మొదలైంది. తెరాస ప్రభుత్వం నిపుణుల సలహాల్ని తీసుకొని, ఆరోగ్యంగా విద్యారంగాన్ని నడపాల్సింది పోయి, పులిని చూసి నక్కలు వాత పెట్టుకున్నట్టుగా కాక, నక్కలాంటి ప్రైవేటు విధానాన్ని చూసి పులి అని భ్రమించి, ఈ మార్చి 21 నుంచే నూతన విద్యాసంవత్సరం ప్రారంభమని, నెలజులపాటుగా, పై తరగతుల సిలబస్‌ను బోధించాలనడం, వేసవిలో కూడా విద్యార్థులకు మనశ్శాంతి లేకుండా చేయడమే అవుతుంది.
చేపట్టాల్సిన సంస్కరణల్ని చేపట్టకుండా, పెడగాజీ సూత్రాలకు భిన్నంగా విద్యావిధానాన్ని ప్రభుత్వం భ్రష్టు పట్టిస్తుంటే, నిలువరించాల్సిన ఉపాధ్యాయ సంఘాలు వౌనం వహించడం వాటి నిరాసక్తతను చూపుతున్నాయి. మొత్తంగా స్వేచ్ఛలేని విద్యార్థులు సమిధలౌతుంటే, తల్లిదండ్రులు నిర్వీర్యులవుతున్నారు. పైగా ఇవన్నీ విద్యార్థులకు మేలుకేననే తప్పుడు భావనలు పెంపొందుతున్నాయి. ఇప్పటికే పరీక్షలనే భూతం విద్యార్థులను భయానికి గురి చేస్తుంటే మారబోయే విద్యా సంవత్సరం మరిన్ని చేదు గుళికల్ని విద్యార్థులకు మింగించబోతున్నది. ఉపాధ్యాయులకు పట్టదు. సంఘాలకు చెవికెక్కదు. తల్లిదండ్రులకు కనీస పరిజ్ఞానం ఉండదు. రాజకీయాలు, రాజకీయ నాయకులు, వీరి తాబేదార్లు విద్యారంగాన్ని నిర్దేశిస్తుంటే, రూపుదిద్దుకునేది ఓ అనారోగ్య వ్యవస్థనే! ఇప్పటికే రోగం బాగా ముదిరింది. కావల్సింది శస్త్ర చికిత్సనే!

- డా. జి.లచ్చయ్య సెల్: 9440116162