సంపాదకీయం

ద్రవ్యోల్బణ క్రీడ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చక్కెర ధరలు పెరిగాయి, ఇంకా ఇంకా పెరుగుతాయట! మందు పేరు చెప్పగానే జబ్బు నయమైందన్నది సార్వకాలిక లోకోక్తి...జ్వరం రావడానికి దోహదం చేసే మందులు కూడ ఉన్నాయన్నది మరి కొందరు చెప్పే మాట! కానీ జ్వరం వస్తోందా? లేక తగ్గుతోందా? అని నిర్ధారించుకొనలేకపోవడం మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన మహా విషయం. ద్రవ్యోల్బణం పెరుగుతోంది, కాదు కాదు...ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతోంది! తగ్గినదానికి చిహ్నం టమాట పండ్లు కారుచౌక అయినప్పటికీ కొనేవారు లేక నగరాలలోని వాణిజ్య వాటికల్లో కుళ్లిపోతుండడం. రూపాయికి సైతం కిలో చొప్పున కొనే వ్యాపారులు లేక వ్యవసాయదారులు ఈ అతిప్రధానమైన ఆహారాన్ని పొలంలోనే వదిలిపెట్టడం...పశువులు సైతం టమాటా తిని తిని మొహం మొత్తి నోరు తెరవడానికై భయపడుతున్నాయట! వ్యవసాయదారులను ఆదుకొనడానికై హైదరాబాద్ వంటి చోట్ల రైతుబజార్‌లో టమాటాల ధరను పెంచుతున్నారట. వినియోగదారులు సైతం టమాటా ధరలను మరీ తగ్గించి ఆ పండును అవమానించరాదని నిర్ణయించుకున్నారు. అందువల్ల ఆరేడు రూపాయలకు కిలో చొప్పున ఆనందంగా కొనుక్కుని వెడుతున్నారన్నది ద్రవ్యోల్బణం సమర్ధకులు ఆనందించవలసిన వ్యవహారం. ద్రవ్యోల్బణం మరీ తగ్గితే ఆర్థిక మాంద్యం ఏర్పడిపోయి స్థూల జాతీయ ఆదాయం పెరుగుదల సన్నగిల్లిపోతుందట! అందువల్ల ద్రవ్యోల్బణం ఎంతో కొంత పెరుగుతూ ఉండవలసిందే మరి! ఇలా పెంచడానికి ఇప్పుడు చక్కెర వ్యాపారులు నడుములను బిగిస్తున్నారు. జూలై నెలలో అన్నిరకాల ద్రవ్యోల్బణాలు రెండేళ్లలో మునుపెన్నడూ లేనంతగా పెరిగిపోయాయనన్నది ఆధికారిక సమాచారం. ఆహార ద్రవ్యోల్బణం, చిల్లర ద్రవ్యోల్బణం, టోకు ద్రవ్యోల్బణం, సాధారణ ద్రవ్యోల్బణం వంటివన్నీ పెరుగుదలను సూచించాయట! ఎండు మిరపకాయలు, పప్పులు వంటి వాటి ధరలు భయంలేకుండా పెరిగిపోతున్నాయి. ఇంగువ తదితర సుగంధ ఆహార సామగ్రి ధరలు గుట్టు చప్పుడు కాకుండా పెరుగుతున్నాయి. గుట్టు చప్పుడు కాకుండా పెరగడం ఎందుకంటే వీటిని కొని తినేవారి సంఖ్య మిరపకాయల వినియోగదారుల సంఖ్యతో పోలిస్తే తక్కువ మరి! నెలకోసారి కొనుక్కునేవారు ఏ ఆహార వస్తువు ధర ఎంత పెరిగినప్పటికీ పట్టించుకోవడం లేదు. గత నెలలో ఎంతకు కొన్నదీ వారికి గుర్తుండదు మరి! ఇలా గుర్తులేకపోవడం వ్యాపార వర్గాలకు వరం. ఆగస్టులో కిలో ముప్పయి ఎనిమిది రూపాయలకు కొన్న చక్కెరను వినియోగదారులు సెప్టెంబర్‌లో కిలో నలబయి ఆరు రూపాయలు చెల్లించి కొనేశారు! మాధ్యమాలలో ప్రచారం అయినప్పుడు మాత్రమే మధ్యతరగతి వారు ఆహార సామగ్రి ధరలు పెరుగుతున్న సంగతిని గుర్తించడం నగరాలలోని యాంత్రిక జీవనంలో భాగం! పల్లెపట్టులలో సైతం ధరలు పెరుగుతున్నట్టు ఆశ్చర్యంగా చర్చించుకుంటున్నారు తప్ప నొచ్చుకోవడం తగ్గిపోయింది. ఇలా నొచ్చుకోకపోవడం దేశమంతటా కొలువుతీరుతున్న కృత్రిమ ప్రగతి ప్రభలకు చిహ్నం...అందుకే అతి త్వరలో చక్కెర ధరలు కిలో యాబయి రూపాయల స్థాయికి చేరనున్నాయన్నది కుతూహలానికి మాత్రమే కారణమవుతుంది! ప్రపంచీకరణ మాయాజాలం విస్తరిస్తున్న తీరు ఇది...
ద్రవ్యోల్బణం పూర్తిగా తగ్గిపోరాదట! అలా తగ్గిపోవడం సున్న స్థాయికి చేరడం, ధరలు నెలల తరబడి పెరగకపోవడం ప్రగతి చిహ్నం కాదట! మేనేజబుల్-నియంత్రించదగిన- స్థాయిలో ద్రవ్యోల్బణం ఉండడం ప్రగతి చిహ్నమని విదేశాలలో స్వచ్ఛందం ముసుగువేసుకున్న పరపతి సంస్థలు- రేటింగ్ ఏజెన్సీస్ తరచు హెచ్చరికలు చేస్తున్నాయి. ద్రవ్యోల్బణాన్ని అందువల్ల ప్రభుత్వాల వారు పెంచుతున్నారు. ఇలా పెంచడానికి ఆర్థిక మంత్రులు కనిపెట్టిన సులభమైన ఉపాయం వడ్డీని తగ్గించడం. వడ్డీ తగ్గిన వెంటనే వినియోగదారులు భారీ మోత్తాలను బ్యాంకులనుండి ఋణాల రూపంలో తీసుకుంటారట! ఈ ఋణాలను పెట్టుబడులుగా పెట్టి పరిశ్రమలను, ఉత్పాదక పథకాలను పెట్టుబడిదారులు పెంచుతారట! తద్వారా ఉత్పత్తులు పెరిగిపోయి కారుచౌకగా వస్తువులు ప్రధానంగా ఆహారం వస్తువులు వినియోగదారులకు లభిస్తాయి, స్థూల జాతీయ ఉత్పత్తికి-జిడిపి- ఎనిమిదినుంచి పదిశాతం వరకు ప్రతి సంవత్సరం పెరగనున్నది, ఎగుమతులు పెరిగి విదేశీయ వాణిజ్యంలో లోటు తగ్గిపోతుంది. అందువల్లనే గతంలో ప్రణవ్ ముఖర్జీ, పళనియప్పన్ చిదంబరం, ప్రస్తుతం అరుణ్‌జైట్లీ వంటి ఆర్థిక మంత్రులందరు వడ్డీని క్రమంగా తగ్గించాలన్నది రిజర్వుబ్యాంకుకు ఇచ్చిన సలహా!
ఈ సలహా వల్లనే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ అనేక సార్లు వాణిజ్య బ్యాంకులకు లభించే ఋణాల వడ్డీని, బ్యాంకులు చెల్లించే ఋణాల వడ్డీని కూడ అనేకసార్లు తగ్గించాడు. నాలుగవ తేదీనుండి కొత్త గవర్నర్ బాధ్యతలను స్వీకరించిన ఊర్జితపటేల్ కూడ ద్రవ్యోల్బణం తగ్గిపోతుందన్న ప్రకటనలు చేసాడు! అందువల్ల రఘురామ్ రాజన్ విధానమే ఊర్జిత పటేల్ కూడ వడ్డీలను పెంచడం తద్వారా ద్రవ్యోల్బణం తగ్గించడం తద్వారా అమలు జరిగే అవకాశం ఉంది. కానీ ఆర్థికమంత్రి మాత్రం ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ పర్వాలేదు, కానీ జిడిపి పెరగాలన్న విధానాన్ని పదే పదే చెప్పుకొస్తున్నారు! అందువల్ల జిడిపి పెరగడం మాత్రమే కావలసిన రోగనిరోధం. ద్రవ్యోల్బణం 21 నెలలలో అత్యధికమని, 24 నెలల్లో అత్యధికమని ఆధికారికంగా ప్రకటనలు వెలువడుతుండడం ఈ రోగ నిరోధంలో భాగం కాదు. వస్తు, సేవల పన్ను-గుడ్స్ అండ్ సేవింగ్స్-జిఎస్‌టి-టాక్స్-పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ అయినట్టయితే ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందట! అయినప్పటికీ చట్టం అమలులోకి రాకపూర్వమే ద్రవ్యోల్బణం పెరుగుతోంది. ఇది మందు పేరు చెప్పగానే వ్యాధి నయమైనట్టు కావచ్చు, లేదా జ్వరం రావడానికి దోహదం చేసే మందు ఇది కావచ్చు! ఈ విషయంలో ఎవరికి తగినట్టుగా వారు విశే్లషణలను గుప్పిస్తున్నారు. జిఎస్‌టిని వ్యతిరేకిస్తూ న్యాయస్థానాలలో పిటిషన్లు దాఖలు కాగలవని అధికార భారతీయ జనతాపార్టీ నాయకుడు, ప్రముఖ ఆర్థిక వేత్త డాక్టర్, ఆచార్య సుబ్రహ్మణ్యస్వామి స్వయంగా హెచ్చరించి ఉన్నాడు.
బహుళవస్తువుల చిల్లర వ్యాపార రంగంలో విదేశీయులకు అనుమతి ఇచ్చే విషయమై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వాణిజ్యమంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం విచిత్రమైన పరిణామం. మల్టీబ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐ-విదేశీయ ప్రత్యక్ష నిధులను అనుమతించే విధానాన్ని మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండిన సమయంలోనే కేంద్ర ప్రభుత్వం అమలు జరిపింది. ఫలితంగా వాల్‌మార్ట్ వంటి విదేశీయ సంస్థలు దోపిడీ దుకాణాలను ఏర్పాటు చేయడం మొదలైంది! అందువల్లనే కందిపప్పు, ఇతర పప్పుల ధరలు గతంలోనే భయంకరంగా పెరిగాయన్నది జరిగిన ప్రచారం...ఇప్పుడు చక్కెర ధరలు పెరగడానికి సైతం రిటైల్ రంగంలో విదేశీయులు చొరబడిపోవడమే కారణమన్నది జనం భావిస్తున్న అభిప్రాయం. కానీ మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలో ఎఫ్‌డిఐను ఇంకా అనుమతించలేదని నిర్మలమ్మ చెబుతోంది. మరి వాల్‌మార్ట్ దుకాణాలు మూసేశారా? లేదా? చక్కెర ధర పెరుగుదలకు అసలు కారణం ఏమిటి?