సంపాదకీయం

కందిపప్పుకు ‘బిటి’ పోపు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కందిపప్పు, మినపపప్పు, సెనగపప్పు ఇంకా ఇతర రకాల పప్పుల ధరలు మరింత పెరగడానికి వీలైన సంస్కరణలను కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక వ్యవహారాల సలహాదారుడు అరవింద సుబ్రహ్మణ్యన్ నాయకత్వంలోని నిపుణుల బృందం వారు రూపొందించారట. ఈ నిపుణుల బృందం వారు తమ నివేదికను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారట. పప్పు ధాన్యాల సాగుబడి విస్తీర్ణం, ఉత్పత్తి, ధరలు అనూహ్యరీతిలోగురి అవుతున్న పరివర్తనను గురించి అధ్యయనం చేయడానికై ఈ సుబ్రహ్మణ్యన్ అధ్యయన బృందాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించింది. అధ్యయనం ముగించిన బృందంవారు కార్యాచరణ కోసం సిద్ధం చేసిన నివేదికలోని ప్రతిపాదనలు పప్పుల ధరలు మరింత పెరగడానికి మాత్రమే దోహదం చేయగలవు. రైతులకు లభిస్తున్న కనీసపు మద్దతు ధరలను పెంచాలన్న ప్రతిపాదన మినహా మిగిలిన సూచనలు ప్రపంచీకరణ ప్రభావితాలు. ఆర్థిక నిపుణులు, నిపుణుల బృందాలు చేసే అధ్యయనాల తీరుతెన్నులు చేసే నిర్ధారణలు సామాన్య ప్రజలకు అర్థం కావడంలేదు. అందువల్ల నిపుణులు చేస్తున్న ప్రతిపాదనలు దేశానికి మంచి చేస్తాయని విశ్వసించడం మినహా సామాన్యులు చేయగలిగిందేమీ లేదు. కందిపప్పు ఇతర పప్పుల ధరలు ఇంకా పెరగడానికి వీలు కల్పించే ప్రతిపాదనలను నిపుణులు కేంద్ర ప్రభుత్వానికి నివేదించడం ఒక ఉదాహరణ మాత్రమే. పప్పులు దిగుమతి చేసుకొని ధరలను తగ్గించానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఏడాదికి పైగా ప్రయత్నిస్తుండడం నడచిపోతున్న చరిత్ర. గత ఏడాది జూన్ జూలై నెలలనుంచి ‘కంది బొబ్బలు’ చెలరేగాయి. కిలో డెబ్బయి రూ పాయల కందిపప్పు రెండువందల పది రూపాయల స్థాయిని చేరడం చరిత్ర. బర్మానుంచి ఇతర దేశాలనుంచి నాసిరకం కందిపప్పును భారీగా దిగుమతి చేసుకొని కేంద్ర ప్రభుత్వం ధరల ‘నిలకడ’ను సాధించగలిగింది. ఆ తరువాత ఖరీఫ్ పంట, రబీ పంట విపణి వీధులకు తరలి వచ్చిన తరువాత ధర తగ్గినప్పటికీ గత ఏడాది మే, జూన్ నెలలనాటి స్థాయికి దిగజారడం అసంభవమని తేలిపోయింది. ప్రస్తుతం కిలో నూటముప్పయి నుండి నూట అరవై వరకు వ్యాపారులు తమ అదను కొద్దీ కందిపప్పు ధరకు పదునుపెట్టి వినియోగదారుల వద్ద దండుకుంటున్నారు. ఒకేసారి మూడు రెట్లు పెరగడంతో గగ్గోలు పుట్టిన తరువాత కొంతమేరకు మాత్రమే ధర తగ్గడం, స్థిరపడడం అన్ని రకాల ఆహార ధరలకు స్వభావంగా మారడం ప్రపంచీకరణలో భాగం..మూడు వందల శాతం పెరిగి, వందశాతం తగ్గుతున్న ధరలు వినియోగదారులను మభ్యపెడుతున్నాయి. ధరలు తగ్గాయన్న బ్రాంతికి వినియోగదారులు గురి అవుతున్నారు. కానీ ఏడాది క్రితం లేదా పదిహేను నెలల క్రితం ఉండిన ధరలకంటె రెట్టింపునకు కందిపప్పును ఇతర పప్పులను వినియోగదారులు ఇప్పుడు కొనవవలసి వస్తోంది. ఇదీ ప్రపంచీకరణ యుగంలో దళారీలు దోచుకుంటున్న తీరు. ఈ ధరలను తగ్గించడానికి కాక మరింత పెంచడానికి ఇప్పుడీ సుబ్రహ్మణ్యన్ సంఘం ప్రతిపాదనలను సిద్ధం చేసిందట.
ఈ ప్రతిపాదనలలో ప్రధానమైనది పప్పుల ఎగుమతిపై ఆంక్షలను పూర్తిగా తొలగించడం. టోకు వ్యాపారులు, చిల్లర వ్యాపారులు నిలువ ఉంచుకోదగిన పప్పుల పరిమాణం పరిమితులను తొలగించడం మరో ప్రధానమైన ప్రతిపాదన. జీవజన్యువుల మార్పిడి-జెనటిక్ మాడిఫికేషన్- ద్వారా రూపొందే పప్పుల పంటలను ప్రోత్సహించాలన్నది మరో ప్రతిపాదన. ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యం-పిపిపి-ద్వారా పప్పు ధాన్యాలను సేకరించడానకి ఒక కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడ ఈ బృందం వారు సిఫార్సు చేశారట. ఈ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినట్లయితే పప్పుల ధరలు కృత్రిమమైన కొరతలు పెరగడమే కాక సేకరణ ప్రక్రియలో దళారీలు వ్యవసాదారులను మరింతగా ఇబ్బందుల పాలు చేయడానికి గొప్ప అవకాశం లభించి తీరుతుంది. భారత ఆహార సంస్థ-ఎఫ్‌సిఐ-వారు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రైతులనుంచి ఆహార ఉత్పత్తులను భారీగా సేకరిస్తున్నాయి. నిలువ చేయడానికి తగినన్ని గిడ్డంగులు లేక ఆహారధాన్యాలు పాడైపోవడం నడుస్తున్న చరిత్ర. గిడ్డంగులు, నిలువ ప్రక్రియ ప్రమాణాలు పెంచడం ప్రధానం. ఈ సుబ్రహ్మణ్యన్ సంఘం వారు ఈ సంగతి మాట్లాడడం లేదు. సేకరించడానికి మరో అఖిల భారత వ్యవస్థను ఏర్పాటు చేయాలట. ఎఫ్‌సిఐ చాలదా? పైగా ఈ నూతన వ్యవస్థలో ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యం ఏమిటో మరి.
జెనెటిక్ మాడిఫికేషన్ పరిజ్ఞానం ద్వారా తయారయ్యే విత్తనాలలో, వంగడాలలో పంటలలో బాసిలస్ తురింజెనిసిస్ అన్న జీవరసాయనం నిహితమై ఉంది. విత్తనం మొక్కగా ఎదిగిన కొద్దీ ఈరసాయన ప్రభావం విస్తరించిపోతుంది. దీనివల్ల పంటల దిగుబడి, ఉత్పత్తుల పరిమాణం పెరుగుతుందన్నది, సమర్ధకుల ప్రచారం. కానీ ఈ బాసిలస్ తురింజెనిసిస్-బిటి- రసాయన ప్రభావంతో పంటలను తిని మానవులు, జంతువులు చిత్ర విచిత్ర వ్యాధులకు గురి అవుతారన్నది ‘వ్యతిరేకుల’ నిర్ధారణ. బిటి విష రసాయన ప్రభావంతో బిటి పంటలు ఉత్పత్తి అవుతున్న భూమి క్రమంగా వ్యవసాయానికి పనికిరాకుండా పోతుందట. నిస్సారంగా, నిర్జీవంగా మారిపోతుందట. పంటలను నష్టం చేసే వింత రంగురంగుల పురుగులు, కీటకాలు ఈ బిటి ప్రభావంతో పుట్టుకొస్తున్నాయి కూడ. వ్యవసాయ క్షేత్రాలను మాత్రమే కాక పరిసరాలను ప్రకృతిని కూడ పాడు చేయగల బిటి పంటలు పండించరాదని వాటిని నిషేధించాలని మనదేశంలోను, ప్రపంచవ్యాప్తంగాను ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇంతవరకు మనదేశంలో బిటి పత్తిని మాత్రమే పండిస్తున్నారు. విదేశాలకు చెందిన విత్తనాల పంపిణీ సంస్థలు వేలాదికోట్ల రూపాయలను మన రైతులనుంచి ప్రజలనుంచి దోచుకొని తమ దేశాలకు తరలించడానికి బిటి పత్తి ఉపయోగపడింది. ఇప్పుడు బిటి ఆవాలను కూడ మననెత్తికెత్తడానికి రంగం సిద్ధమైంది. ఈ వైపరీత్యాలకు తోడు పప్పు ధాన్యాలకు కూడ బిటి జాడ్యాన్ని సంక్రమింపచేయాలని ఈ సుబ్రహ్మణ్యన్ బృందం నడుం బిగించడం అంతుపట్టని వ్యవహారం. ఈ ప్రతిపాదనలోని ఔచిత్యం సామాన్యులకు అర్థం కావడం లేదు. మాన్యులు వివరించాలి..
రైతులకు ప్రస్తుతం క్వింటాలునకు ఐదువేల యాబయి రూపాయల చొప్పున కందులకు కనీసపు మద్దతు ధర అమలులో ఉంది. దీన్ని వచ్చే ఏడాదినుండి ఆరువేల రూపాయలకు పెంచుతారట. కానీ రైతులకు లభిస్తున్న ఈ ధరలకు, విపణి వీధిలో వ్యాపారులకు వినియోగదారులు చెల్లిస్తున్న ధరలకు మధ్య చాలా తేడా ఉంటోంది. ఈ తేడా దళారీల అక్రమలాభం. ప్రస్తుతం టోకు వ్యాపారులు నాలుగువేల క్వింటాళ్ల పప్పులను మాత్రం నిలువ ఉంచుకోవచ్చు. అయినప్పటికీ కృత్రిమంగా కొరతను సృష్టించే వ్యవస్థ విస్తరించిపోయింది. ఈ నియంత్రణ పరిమితి తొలగిపోతే కృత్రిమమైన కొరతలు మరింతగా విస్తరిస్తాయి. దిగుమతి చేసుకుంటున్నప్పటికీ పప్పుల కొరత తీరడం లేదు. ధరలు తగ్గడంలేదు. ఎగుమతులపై ఆంక్షలను ఎత్తివేయడం ఏమిటి? ప్రపంచీకరణ మాయల మరీచ మృగం మరింతగా మిరుమిట్లు కొలుపుతోంది.