సంపాదకీయం

అనివార్య విలీనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలానుగుణంగా అనివార్యమైన మార్పులను స్వాగతించాల్సిందే! ఏ వ్యవస్థలోనైనా మార్పుతోనే రాణింపు ఉంటుందన్న వాస్తవం ఎన్నో సందర్భాల్లో రుజువైంది. కాలం చెల్లిన, వర్తమానానికి ఏ మాత్రం ఉపయోగపడని ఎన్నో చట్టాలకు దశలవారీగా కేంద్రం చరమగీతం పాడుతున్న నేపథ్యంలో తాజాగా రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కూ స్వస్తి పలికి దాన్ని వార్షిక సాధారణ బడ్జెట్‌లో విలీనం చేయడం అభినందనీయ పరిణామం. రైల్వే ప్రత్యేక బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనాల కంటే కూడా రాజకీయ ప్రయోజనాలకు ఇది ఆలవాలంగా మారిందన్నది ఎంతైనా వాస్తవం. సమాజంలో పాతుకుపోయిన కొన్ని సంప్రదాయాలను వదిలించుకోవడం ఎంత కష్టమో.. ఎంత అసాధ్యమో చెప్పడానికి గత 69 సంవత్సరాలుగా రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ సంప్రదాయాన్ని అనివార్యంగా కొనసాగించడమే నిదర్శనం. దీన్ని విడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందా లేదా అన్న దానిపై దాదాపు ఏడు దశాబ్దాలుగా చర్చోపచర్చలు జరుగుతూనే వచ్చాయి. అయినా, రైల్వే బడ్జెట్‌ను జనరల్ బడ్జెట్‌లో భాగంగా చేసే ప్రయత్నం మాత్రం ఎన్నడూ జరుగలేదు. గతంలో కేంద్రంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినా ఆ సాహసం చేయలేకపోయాయి. రెండున్నరేళ్ల క్రితం చారిత్రక రీతిలో కేంద్రంలో పగ్గాలు చేపట్టిన మోదీ సర్కార్ దశలవారీగా చేపడుతున్న వ్యవస్థాగత మార్పుల్లో భాగమే రైల్వే ప్రత్యేక బడ్జెట్‌కు మంగళం పాడటం. అలాగే ఆలస్యంగానైనా దాన్ని సాధారణ బడ్జెట్‌లో అంతర్భాగం చేయ డం. ఆంగ్ల పాలకుల హయాం లో అదీ 1924లో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ ప్రతిపాదన జరిగింది. అందుకు కారణం.. పాలనాపరమైన ఇతర రంగాల కంటే కూడా అప్పట్లో రైల్వేలకు అధికంగా నిధులు కేటాయించాల్సి రావడమే. అప్పట్లో రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ అనివార్యమే అయినా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా నాటి వారసత్వాన్ని వదిలించుకునేందుకు ఇప్పటి వరకూ గట్టి ప్రయత్నం జరగలేదు. పైగా, దాదాపు గత ఏడు దశాబ్దాల కాలంలో దేశంలో అనేక రంగాలు అత్యధిక స్థాయిలో అభివృద్ధిని సాధించాయి. అలాగే మొదట్లో ఉన్నంతగా రైల్వేలపైనే అత్యధిక స్థాయిలో నిధులను వెచ్చించాల్సిన అగత్యమూ లేదు.
మొత్తం బడ్జెట్‌తో పోలిస్తే రైల్వేల వాటా తగ్గుతూనే వచ్చిం ది. 2016-17 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన సాధారణ బడ్జెట్ కేటాయింపుతో పోలిస్తే రైల్వేల వాటా కేవలం ఆరు శాతం మాత్రమే ఉండటం ఇందుకు నిదర్శనం. అంతేకాదు, ఒకప్పుడు రైల్వే ఆదాయం ఎక్కువగా ఉన్నా.. కొనే్నళ్ల క్రితమే పరిస్థితి మారిపోయింది. దేశీయ పౌర విమానయానం ద్వారా లభిస్తున్న ఆదాయం రైల్వే ఆదాయం కంటే ఎక్కువే కావడం ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన విషయం. దీన్నిబట్టి చూస్తే రైల్వేల కంటే కూడా ఎన్నో రంగాలు ఎన్నో విధాలుగా అత్యధిక స్థాయి కేటాయింపుల్ని పొందుతూనే ఉన్నాయి. దాదాపు పాతికేళ్ల క్రితమే నాటి పీవీ హయాంలో దేశ ఆర్థిక వ్యవస్థ ద్వారాలు తెరుచుకున్నాయి. అప్పటి నుంచి ఎన్నో రంగాలు రైల్వేలను మించిన స్థాయిలోనే ఆదాయాన్ని ఆర్జించడమూ జరుగుతోంది. అందుకు బలమైన కారణం లేకపోలేదు. తొంభైయవ దశకంలో దేశ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయి. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలే అనివార్యమయ్యే పరిస్థితీ ఏర్పడింది. సొంత బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని పార్టీలు మిత్రపక్షాలకు పదవుల తాయిలాలతో సంకీర్ణ ప్రభుత్వాలనే స్థాపించాయి. అలా ప్రభుత్వంలో భాగంగా మారిన పార్టీలకు కోరిన పదవుల్ని ఇవ్వడమూ ప్రభుత్వ మనుగడ దృష్ట్యా నాటి పాలకులకు అనివార్యంగా మారింది. అలా వచ్చిన పార్టీలకు రైల్వే మం త్రిత్వ శాఖే ఇటు రాజకీయంగానూ, ఇతరత్రానూ లాభదాయకమైంది. ఆవిధంగా రైల్వేలకు ప్రత్యేక బడ్జెట్ కొనసాగింపూ రాజకీయ అవసరం అయిందే తప్ప ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగానూ దీనివల్ల ఉపయోగం జరుగలేదు. రైల్వే శాఖను చేజిక్కించుకుంటే తమతమ రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ధి పొందవచ్చునన్న భావనతోనే నాటి సంకీర్ణ భాగస్వామ్య పక్షాలు రైల్వే పదవినే డిమాండ్ చేస్తూ వచ్చాయనడమూ అతిశయో క్తి ఏమీ కాదు. కానీ 2014 లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీ య స్థాయిలో పరిస్థితి మారిపోయింది. ఏవరి ప్రాపకంపైనా పనిచేయాల్సిన అగత్యం లేని ప్రభుత్వం పగ్గాలు చేపట్టింది.
రైల్వేల ప్రత్యేక బడ్జెట్‌కు స్వస్తి పలకడానికి ఇంతకుమించిన అవకాశం గతంలో లేదు.. భవిష్యత్‌లో వస్తుందని చెప్పలేం కాబట్టి మోదీ సర్కార్ ఆ సాహసం చేసేసింది. అంటే.. రైల్వే బడ్జెట్‌ను ఓట్లను ఆకట్టుకునే అయస్కాంతంగా భావించాల్సిన అవసరం గానీ.. ఆ విధంగా ముందుకు వెళ్లాల్సిన అగత్యం గానీ కేంద్రానికి లేదు కాబట్టే ఈ విలీనం సునాయాసమైంది. ఎవరి మెప్పుకోసమో లేక ఇంకెవరి డిమాండ్ల కోసమో కాకుండా దేశ ఆర్థిక స్థితిగతుల్ని దృష్టిలో పెట్టుకునే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పడం ఎంతైనా వాస్తవం. ఈ తాజా పరిణామంతో సమీప భవిష్యత్‌లోనే అనేక మార్పులూ రాబోతున్నాయి. సాధారణంగా మూడు రోజుల పాటు ఏటేటా బడ్జెట్ ప్రక్రియ జరుగుతుంది. మొదట రైల్వే బడ్జెట్, అనంతరం ఆర్థిక సర్వే, ఆ తర్వాత కేంద్ర బడ్జెట్ అన్నది ఈ వరుస. ఇకనుంచి ఈ ఆర్థిక ప్రక్రియ రెండు రోజుల్లోనే ముగిసిపోతుంది. మొదట ఆర్థిక సర్వే, ఆ తర్వాత సాధారణ బడ్జెట్. ప్రయాణికుల చార్జీల పెంపు, కొత్త రైళ్లు, లైన్ల ఏర్పాటు వంటి జంఝాటనల నుంచి రైల్వే మంత్రికి పూర్తిగా విముక్తి లభిస్తుంది. ఏ నిర్ణయం తీసుకున్నా అది మొత్తం బడ్జెట్‌లో భాగంగానే జరిగిపోతుంది కాబట్టి దీనివల్ల ఇతరత్రా తలెత్తే సమస్యలూ ఉండవు. రాజకీయ అవసరాల కోసం ఎప్పటికప్పుడు ప్రయాణికుల చార్జీలను తగ్గిస్తూ రావడం వల్ల.. అలాగే అనివార్యమైనా వాటిని పెంచకపోవడం వల్ల అనేక రకాలుగా రైల్వేలు నష్టాన్ని ఎదుర్కొంటూ వచ్చాయి. లైన్ల విస్తరణ, కొత్త రైళ్లను ప్రవేశ పెట్టడం వంటి ఎన్నో అత్యవసర నిర్ణయాలకు నిధుల లేమి వల్ల అవరోధం ఏర్పడింది. తాజా నిర్ణయం నేపథ్యంలో రైల్వే చార్జీల హెచ్చింపు, తగ్గింపులనూ పూర్తిగా రాజకీయాలకు అతీతంగా జరిగేలా చూడాలి. అందుకు వీలుగా పూర్తి స్వాతంత్య్రంతో పనిచేసేలా ఓ టారిఫ్ నియంత్రణ అధారిటీని ఏర్పాటు చేయాలి. అన్నింటికంటే ముఖ్యం కొత్తగా రైళ్లు వేయాలన్నా, లైన్లు వేయాలన్నా కూడా అది ఆర్థిక సాధ్యాసాధ్యాల ప్రాతిపదికగానే జరగాలే తప్ప ఇందులో అన్య ప్రయోజనాలకు ఎలాంటి ఆస్కారం ఉండకూడదు. ప్రత్యేక బడ్జెట్‌ను రద్దు చేసినా రైల్వేలకు ఉన్న ప్రాధాన్యతను కొనసాగిస్తామని, అవి మరింత సమర్థంగా, అర్థవంతంగా పనిచేసేలా చేస్తామన్న హామీని కేంద్రం నిలబెట్టుకోవాలి. కేవలం విలీన నిర్ణయం తీ సుకున్నంత మాత్రాన మార్పులు వాటంతట అవే రావు. అం దుకు అవసరమైన రాజకీయ, ఆర్థిక చిత్తశుద్ధిని చాటుకోవాలి. ఓ చారిత్రక నిర్ణయం తీసుకున్న కేంద్రం కొత్త చరిత్రను సృష్టించే విధంగా రైల్వేలకు కాయకల్ప చికిత్స చేయాలి. వాటి పూర్వ ఔన్నత్యాన్ని పునరుద్ధరించాలి.