సంపాదకీయం

సందిగ్ధంలో ‘సార్క్’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్యక్తిగతంగా సాధించలేని ప్రయోజనాలను అంతర్జాతీయ స్థాయిలో ఒనగూర్చుకునేందుకు ఉద్దేశించినవే ప్రాంతీయ కూటములు. దేశాల మధ్య పోటీతత్వం పెరిగిపోవడం, వేటికవి తమ ఉనికిని చాటుకునే ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్న నేటి తరుణంలో.. దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార కూటమి (సార్క్) ఉనికికే ముప్పువాటిల్లే పరిణామాలు చోటుచేసుకోవడం మింగుడు పడని వాస్తవం. పరస్పర సహకారమే పరమావధిగా ఏర్పాటయిన సార్క్‌ను సభ్య దేశాలన్నీ శక్తిమంతం చేయాలే తప్ప నీరుగార్చే ప్రయత్నం క్షంతవ్యం కాదు. సార్క్ కూటమిలో పెద్ద దేశాలుగా ఉన్న భారత్-పాకిస్తాన్‌ల మధ్య ఎడతెగని రగడ దాని చెల్లుబాటునే ప్రశ్నార్ధకంగా మార్చే పరిస్థితికి దారితీసింది. ఉగ్రవాదమే ప్రభుత్వ విధానంగా పొరుగు దేశంలో అశాంతి రగిలిస్తున్న పాకిస్తాన్‌ను దౌత్యపరంగా ఏకాకిని చేసే ప్రయత్నంలో భాగంగా నవంబర్‌లో ఇస్లామాబాద్‌లో జరుగనున్న సార్క్ సదస్సును బహిష్కరించాలన్న భారత్ నిర్ణయం సముచితం, ప్రస్తుత వాస్తవాల నేపథ్యంలో సమర్థనీయం కూడా. ఇస్లామాబాద్ సార్క్‌కు వెళ్లేది లేదని ఎప్పుడైతే భారత్ ప్రకటించిందో.. ఇందులో భాగంగా ఉన్న అఫ్గాన్, భూటాన్, నేపాల్‌లూ వంతపాడాయి. సభ్య దేశాల మధ్య సహకారం లోపించడం, ఉద్దేశిత లక్ష్యాల సాధనలో ఎంత మాత్రం ప్రగతి లేకపోవడం వంటి అనేక అంశాలు ఇప్పటికే సార్క్‌ను బలహీన పరిచాయి. ఇప్పుడు పాక్ ఉగ్ర ధోరణి పట్ల ఒక్క భారత దేశంలోనే కాదు ఇతర సభ్య దేశాల్లోనూ తీవ్ర ప్రతికూలత వ్యక్తమవుతోందని చెప్పడానికి మరో మూడు దేశాలు ఇస్లామాబాద్ సదస్సుకు దూరం కావడమే నిదర్శనం. నేపాల్‌లో జరిగిన సార్క్ శిఖరాగ్ర భేటీ నుంచి ఇప్పటి వరకూ భారత్-పాక్‌ల మధ్య సంబంధాలు క్షీణిస్తూనే వచ్చాయి తప్ప ఏ మాత్రం మెరుగుపడలేదు. పఠాన్‌కోట్, ఉరీలపై పాక్ ఉగ్రవాదులు జరిపిన దాడులతో పరిస్థితి పరాకాష్ఠకు చేరుకుంది. గతంలో ఎన్నడూ లేని రీతిలో పాక్ దుర్నీతిని దౌత్యపరంగా ఎండగట్టి అంతర్జాతీయ సమాజం ముందు దాన్ని దోషిగా నిలబెట్టాలన్న ఆలోచనే సార్క్ ఇస్లామాబాద్ సదస్సును బహిష్కరించాలని భారత్ నిర్ణయించడానికి కారణం. ఏ విధంగా చూసినా ఇది సహేతుకం కాబట్టే ఇతర సభ్య దేశాలూ భారత్ దారి పట్టాయి.
సార్క్‌ను దెబ్బతీసేందుకు పాక్ ఎంతగా ప్రయత్నించిందో ఇతర సభ్య దేశాలను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలను భారత్ అంతగానూ ముమ్మరం చేసిందని చెప్పడానికి తాజా పరిణామాలే నిదర్శనం. గత కొన్ని నెలలుగా ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు సార్క్ తదుపరి సదస్సుపై అనుమాన మేఘాలకు దారితీశాయి. సార్క్ సదస్సు జరుగుతున్న దేశం మిగతా సభ్య దేశాలకు దౌత్యవేత్తల ద్వారా ఆహ్వానాలు అందించడం ఆనవాయితీ. కానీ, భారత్‌ను ఆహ్వానించేందుకు ఓ దూతను పంపే ప్రయత్నమూ పాక్ చేయలేదు! పాక్‌తో స్నేహానికి భారత్ పరితపించడమే తప్ప దానికి తగ్గట్టుగా ఎలాంటి సానుకూల ప్రతిస్పందన రాలేదని చెప్పడానికి దృష్టాంతాలు కోకొల్లలు. శిఖరాగ్ర భేటీ జరుగడానికి ముందు సభ్య దేశాలకు చెందిన ఆర్థిక మంత్రులు, హోం మంత్రుల సమావేశం జరుగుతుంది. ఇస్లామాబాద్‌లో జరిగిన హోం మంత్రుల సమావేశానికి హాజరైన భారత హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేదు అనుభమవే ఎదురైంది. దానిపై అప్పట్లోనే తీవ్రస్థాయి వివాదమూ చెలరేగింది. దరిమిలా అనంతరం జరిగిన సార్క్ ఆర్థిక మంత్రుల సమావేశానికి మన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాజరు కాలేదు. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్‌లు మొక్కుబడిగానే ఈ రెండు సమావేశాల విషయంలో వ్యవహరించాయి. తమతమ దేశాల్లోనూ ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ అందిస్తున్న సహకారం పట్ల తీవ్ర ఆగ్రహానే్న వ్యక్తం చేశాయి. ఇవన్నీ కూడా బాధ్యతాయుతమైన సార్క్ సభ్య దేశంగా పాకిస్తాన్ ఎంత మాత్రం తన ప్రాధాన్యతను నిలబెట్టుకునే ప్రయత్నం చేయలేదని చెప్పడానికి బలమైన సంకేతాలు. సభ్య దేశాల మధ్య శాంతియుత సంబంధాలు నెలకొన్నప్పుడే వాటి మధ్య ఇతర రంగాల్లో సహకారం పెంపొందుతుంది. అది బలమైన మైత్రీ బంధంగా, ప్రజల మధ్య మరింత సయోధ్యకు దారితీస్తుంది. ఈ ప్రాథమిక అంశాల్ని విస్మరించిన పాకిస్తాన్ పట్ల మిగతా దేశాలకు అనుకూల వైఖరి ఉండే అవకాశమే లేదు. కాశ్మీర్‌లోని ఉరీ సైనిక శిబిరంపై జరిగిన పాక్ ఉగ్రవాద మూకల దాడితో ఒక్కసారిగా పరిస్థితి అనూహ్యమైన మలుపుతిరిగింది. ఆ దాడి మూలాలను శోధిస్తామని, వాస్తవాలను వెలుగలోకి తెస్తామని చెప్పాల్సిన పాక్ ఏకంగా భారత్‌పై ఎదురుదాడికి దిగడం..అసలు ఉరీ ఘటన భారత సృష్టేనని చెప్పడం వితండవాదానికి పరాకాష్ఠ.
ఐరాస వేదికపై మాట్లాడని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత్‌పై మరింతగా నిప్పులు చెరిగారు. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయనీ విరుచుకు పడటం.. ఆ తర్వాత అదే వేదికపై మాట్లాడిన భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ పొరుగు దేశం ఉగ్ర రూపాన్ని సభ్య దేశాల కళ్లకు కట్టారు. పొరుగు దేశాల్లో కల్లోలాన్ని రగిలిస్తూ అంతర్జాతీయ శాంతికే ముప్పు తెచ్చే ఇలాంటి దేశాలకు సభ్య సమాజంలో స్థానమే ఉండకూడదంటూ నిప్పులు చెరిగారు. ఉరీ దాడి వెనుక పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద ముఠాల హస్తం ఉందని చెప్పడానికి బలమైన ఆధారాలనే భారత్ సేకరించడం.. వాటిని పాక్ హైకమిషనర్ బాసిత్‌కు అందించడంతో ఇరు దేశాలు ఇక అమీతుమీకే సిద్ధమవుతున్నాయన్న వాదనకు బలాన్నిచ్చాయి. దౌత్యపరంగా పాక్‌ను ఏకాకిని చేయడం ద్వారానే దానికి తగిన గుణపాఠం చెప్పాలన్న భారత్ ఆలోచన మరింత పదునెక్కింది. ఇందులో భాగంగా సార్క్ సభ్య దేశాలను సంప్రదించి దౌత్యపరంగా పాక్‌ను పక్కన పెట్టేందుకు చేసిన తొలి ప్రయత్నం ఫలించింది.
మూడు దేశాలు భారత బాయ్‌కాట్ నిర్ణయాన్ని సమర్థించిన నేపథ్యంలో ఇస్లామాబాద్ శిఖరాగ్రం జరిగే అవకాశం ఎంతమాత్రం కనిపించడం లేదు. రెండు దేశాల మధ్య తీవ్రమవుతున్న ఘర్షణలకు ఓ ఉదాత్త లక్ష్యంతో ఏర్పాటయిన వేదిక బలికావడం విచారకరం. సార్క్ ప్రక్రియ గాడి తప్పితే దాని వల్ల మొత్తం దక్షిణాసియా ప్రాంతానికే తీవ్ర నష్టం అనే వాస్తవాన్ని విస్మరించకూడదు. ప్రపంచ జనాభా పరంగానూ, రోజురోజుకూ తీవ్రమవుతున్న పేదరికం పరంగానూ దక్షిణాసియా దేశాలు ఉమ్మడిగా ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది.
మిగతా ప్రాంతీయ కూటములు అనతికాలంలోనే బలోపేతమైనా సార్క్ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆగిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో దాని ఉనికికే ముప్పువాటిల్లే పరిస్థితులు తలెత్తడం ఎంతైనా విచారకరం. ఉమ్మడిగానే దక్షిణాసియా సమస్యలు, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అత్యవసర సమయంలో ప్రాంతీయ సహకారానికి మూల స్తంభం లాంటి ఈ ఉమ్మడి సహకార వ్యవస్థను పరిరక్షించుకోవాలి. ఈ ప్రయత్నం యుద్ధ ప్రాతిపదికన జరుగక పోతే సార్క్ భవిత, చెల్లుబాటే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు తలెత్తుతాయి.