సంపాదకీయం

పొగచూరిన ‘ప్రగతి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఊరంతా నిండిన వేదికపై ఊపిరి ఆడడం లేదు- అన్నది నగరీకరణ కాలుష్యం గురించి ఒక కవి చెప్పిన మాట! ఇది కల్పన కాదు, కఠోర వాస్తవమన్నది అనేకసార్లు ధ్రువపడింది, నిరంతరం ధ్రువపడుతోంది. సరికొత్త ఉదాహరణ స్వతంత్ర భారతదేశం రాజధాని. స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడమన్నది సర్వ స్వతంత్ర సార్వభౌమ జాతీయతకు ప్రతీక! కానీ భౌతికంగా మన దేశపు నగరాల్లో ఇప్పుడు స్వేచ్ఛా పరిమళ పవనాలు లేవు, దుర్గంధ భూయిష్టమైన కాలుష్య వాయువును మాత్రమే మనం నిరంతరం ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఉపయోగిస్తున్నాము. శ్వాసక్రియతోపాటు శ్వాసకోశాలు సైతం కాలుష్యగ్రస్తమైపోయి చిత్ర విచిత్ర రుగ్మతలకు గురి అయి ఉండడం మన నగరాలలోని, పట్టణాలలోని ప్రాకృతిక వ్యవస్థ. రాజధాని కాబట్టి ఢిల్లీ మహానగరం కాలుష్య కేంద్రీకరణలో పరాకాష్ఠను సాధించింది! అందువల్లనే సువిశాల ఢిల్లీ మహానగరం కాలుష్యపు పొగలను కక్కుతోంది, జనం ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. వాయుకాలుష్య సూచికలు ప్రతిరోజూ పెరుగుతున్నాయట! జా తీయ రాజధాని ప్రాంగణాన్ని ఏడురోజులుగా కాలుష్యపు పొ గలు కమ్ముకొ ని ఉండడంతో మూడురోజులపాటు పాఠశాలలను మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించిం ది, ఐదురోజులపా టు అన్ని రకాల నిర్మాణ కలాపాలను ఆపివేశారు. బడులను, కార్యాలయాలను మూసివేసినంత మాత్రాన జనాలకు ప్రధానంగా పిల్లలకు ఊపిరి పీల్చుకునే సమస్య ఎలా తీరుతుంది? నిర్మాణాలను ఆపినందు వల్ల దినసరి కూలి తెచ్చుకునే కూలీలకు ఉపాధి ఉండదు! వీధులు, ఇళ్లు, భవనాలు, తోటలు, నీటి వనరులు మొత్తం సమానంగా ధూమంతో ఆవృతమైన మహానగరంలో పాఠశాలలు మూసినా ఒకటే, తెరిచినా ఒకటే! ముక్కులకు శ్వాస ముసుగులు ధరించడంతో సమస్య తీరలేదట! పొగవల్ల కళ్లు మండుతున్నాయట! పొగ తెరలను చీల్చుకుని వాహనాలను నడపడం మరింత కష్టంగా ఉందట! ఢిల్లీ శివారులోని ఒక విద్యుత్ ఉత్పాదక కేంద్రాన్ని కూడా మూసివేసారట! కాలుష్యం నిండిన పొగలు వ్యాపించడానికి కారణాలు ఎనె్నన్నో ఉన్నాయన్నది జరుగుతున్న ప్రచారం. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా పేల్చినందున కాలుష్యం పొగలు ఏర్పడినాయన్న విచిత్ర వాదం కూడా వినిపిస్తోంది! ఢిల్లీ పరిసరాలలోని హర్యానా ప్రాంతంలో వ్యవసాయ భూములలో పంట కోసిన తరువాత మొక్కల మొదళ్లను రైతులు తగులబెట్టడం పరిపాటి! ఇది తరతరాల సంప్రదాయం. కానీ గతంలో ఎప్పుడు లేని విధంగా ఇలా తగులబెట్టడంవల్ల పొగ వచ్చి ఢిల్లీలో కూర్చుందట! ఇది మరో విచిత్రం..
కానీ, అసలు కారణం దీర్ఘకాలంపాటు కొనసాగుతున్న కేంద్రీకరణ. నిర్ణీత స్థలంలో నిర్ణీత సంఖ్యలో జనం, చెట్లు, నీరు, జీవ జాలం ఉన్నప్పుడు ప్రకృతిలో నిహితమై ఉన్న సహజమైన సంతులనం దెబ్బతినదు. ఇలా దెబ్బతిననంత వరకు వాతావరణం, పరిసరాలు, నీరు, భూమి పరిశుభ్రంగా ఉంటాయి. జలకాలుష్యం, వాయుకాలుష్యం స్థలకాలుష్యం ఏర్పడదు. నిర్ణీత స్థలంలో చెట్టు కాని మొక్కకాని ఇతర జీవజాలం కాని లేని రీతిలో జనం మాత్రమే కేంద్రీకృతం అవుతున్నారు. జనంలేని చోట కాలుష్య విషవాయువులను, రసాయన విషప్రవాహాలను ప్రదానం చేస్తున్న సిమెంటు ప్రాంగణాలు విస్తరించిపోతున్నాయి. ఈ విస్తరణ పేరు- పారిశ్రామిక ప్రగతి! పారిశ్రామిక ప్రగతి పేరిట పరిశ్రమలను ఒకేచోట కేంద్రీకరిస్తున్నారు. ఈ కేంద్రీకరణ కాలుష్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది! అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలోని కొన్ని నగరాలలో నీలాకాశం కనిపించకుండా దట్టమైన పొగలు ఏర్పడినాయని మూడు, నాలుగు దశాబ్దుల క్రితం ప్రచారమైందట! ఆ తరువాత వారు నివారణ చర్యలు, ప్రక్షాళన చర్యలు తీసుకున్నారట! మనదేశం మాత్రం నిరంతరం కేంద్రీకరణ వైపు దూసుకుని పోతోంది! వాణిజ్య ప్రపంచీకరణ మొదలైన తరువాత ఈ ఇరవై ఏళ్లలోనే కాలుష్యం అత్యధికంగా కేంద్రీకృతమైపోయింది. పర్యావరణ పరిరక్షణ కోసం ఏర్పడిన హరిత నిబంధనలను అతిగా పాటించడం వల్ల ఆర్థిక ప్రగతి ఆగిపోతుందన్నది మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉన్న సమయంలో 2014 వరకు పదేళ్లు కొనసాగిన విధానం. అందువల్ల హరిత నిబంధనలు నీరు గారిపోయాయి! సంపన్న దేశాలవారు తమ దేశాల్లో హరిత నిబంధనలు పాటిస్తున్నారు. నగరాల చుట్టూ, నగరాల మధ్యలో సహజ వనాలను ఏర్పాటు చేస్తున్నారు. సంపన్న దేశాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన దేశం వంటి ప్రవర్ధమాన దేశాలలో ఆకుపచ్చని పంటలను, అడవులను అంతం చేస్తున్నాయి. ఇలా అంతం చేస్తున్న ప్రక్రియ పేరు వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్!
ఢిల్లీ కాలుష్య ధూ మంతో నిండిపోవడం ప్రతీక మాత్రమే! దేశంలోని మరో తొంబయికి పైగా నగరాలు ఇలా కాలుష్యం పొగలను కక్కడానికి సిద్ధంగా ఉన్నాయట! తెలంగాణ రాజధాని హైదరాబాదు కూడా ఒకటి. ఆంధ్రప్రదేశ్‌లో రూపొందుతున్న రాజధాని అమరావతి నిర్మాణం తీరు కూడా కాలుష్యాన్ని కేంద్రీకరించడానికి దోహదం చేస్తోంది! నగరాలలో అన్ని రంగాలకు చెందిన ప్రగతి కేంద్రీకృతం అవుతోంది మరి! రాజధాని కేవలం పాలనా కేంద్రంగా ఉండాలన్నది యుగాల నాటి భారతీయ విధానం. దీన్ని ఇప్పుడు అమెరికా వంటి సంపన్న దేశాల వారు పాటిస్తున్నారు. అమెరికాలోని రాజధానులు- వాణిజ్య కేంద్రాలు కాదు, విద్యా కేంద్రాలు కాదు, పారిశ్రామిక వాటికలు కాదు, క్రీడా ప్రాంగణాలు కాలేదు! అమరావతిలో కూడా పరిపాలన నగరాన్ని నిర్మిస్తే చాలు! రాష్ట్ర ప్రభుత్వం అక్కడే కేంద్రీకృతం చేయాలనుకుంటున్న వాణిజ్యాది నగరాలను ఎనిమిది వేరు జిల్లాలలో నిర్మించడం ద్వారా కాలుష్యాన్ని వికేంద్రీకరించవచ్చు! కానీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిది తొమ్మిది నగరాలను అమరావతిలో ఏర్పాటు చేయాలని మొండిపట్టుదలతో ఉంది! అందువల్ల అమరావతికి కాలుష్యం కాటు తప్పదు! హైదరాబాదు నగరాన్ని రద్దీలేని విధంగా తీర్చిదిద్దాలంటే మొదట సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయ భవనాలను నగరం మధ్యనుండి దూరంగా శివారు ప్రాంతాలకు తరలించాలి!
అంతస్థుల భవనాలను నిర్మించడం గొప్ప అని భావించడం వల్ల ఢిల్లీలోను, అన్ని నగరాలలోను కాలుష్యం కేంద్రీకృతమైపోయింది! గతంలో అడ్డంగా నాలుగు ఇళ్లు ఉన్నచోట గత ముప్పయి ఏళ్లలో నలబయి ఇళ్లు ఏర్పడినాయి. అంతస్థుల భవనాల నిర్మాణ పద్ధతి ఈ వైపరీత్యానికి కారణం! ఒక వాహనం నిలిచిన చోట ఐదారు వాహనాలు నిలుస్తున్నాయి. వంద వాహనాలు తిరిగిన గల్లీలో ఐదారు వందల వాహనాలు తిరుగుతున్నాయి. రోడ్లు పగిలిపోతున్నాయి, భూగర్భ జలం ఇంకిపోయింది. ఎందుకంటే నాలుగు కుటుంబాలు నివసించిన స్థలంలో నలబయి కుటుంబాలవారు ఒకరినెత్తిన మరొకరుగా అంతస్థులలో కూరుకునిపోయారు. ఇంతమందికి ఆ స్థలంలోని నీరు చాలదు, భూగర్భం ఎండిపోతుంది. గాలి చాలదు. గాలి కాలుష్యంతో నిండింది! ఢిల్లీ ప్రజల కళ్లను మండిస్తున్న పొగ ఇలా పుట్టుకొచ్చింది! గడ్డిని కాల్చడం వల్ల కాదు!