సంపాదకీయం

జపాన్‌తో పెరిగిన మైత్రి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జపాన్‌లో నవంబర్ పదకొండవ తేదీ నుంచి జరిపిన పర్యటన అనేక వ్యూహాత్మక ప్రాధాన్యాలను సంతరించుకొంది. ఉభయ దేశాల మధ్య శుక్రవారం కుదిరిన ‘అణు’ సహకార అంగీకారం గురించి ప్రచారం ఎక్కువగా జరుగుతున్నప్పటికీ, చైనా దురాక్రమణ వ్యూహాన్ని ప్రతిఘటించడానికి తూర్పు, ఆగ్నేయ ఆసియా దేశాలు జరుపుతున్న సమష్టి కృషి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా మరోసారి ప్రస్ఫుటించింది! తూర్పు ఆసియా దేశాలతోను పసిఫిక్ ప్రాంతపు ఆసియా దేశాలతోను మన బంధం బలపడకుండా అనేక ఏళ్లపాటు వ్యూహాత్మకంగా అడ్డుకోగలిగిన చైనా, ఇటీవలి కాలంలో ‘ఒంటరి’ అయిపోయింది! మన ప్రభుత్వం ప్రారంభించిన ‘తూర్పు దిశాదర్శనం’- లుక్ ఈస్ట్ - విధానం ‘తూర్పు దిశా కార్యాచరణ’గా ప్రగతి సాధిస్తుండడం సమాంతర పరిణామం! జపాన్, చైనాలు చారిత్రక శత్రు దేశాలుగా మనుగడ సాగిస్తున్నందువల్ల మన దేశం జపాన్‌తో దౌత్య, వాణిజ్య, వ్యూహాత్మక సంబంధాలను పెంచుకోవడం చైనాకు నచ్చని వ్యవహారం! అందువల్లనే గత మూడేళ్లుగా జపాన్‌తో పెరుగుతున్న మన మైత్రిని చైనా బహిరంగంగానే నిరసిస్తోంది. మన ప్రభుత్వం పట్ల పరుష పదజాలం వాడకపోయినప్పటికీ మనం జపాన్‌తో చర్చలు జరిపిన ప్రతి సందర్భంలోను చైనా జపాన్ ప్రభుత్వాన్ని, ప్రభుత్వ అధినేతను నీచమైన పదజాలంతో నిందిస్తూనే ఉంది! జపాన్‌తో మన దేశపు సంబంధాలు నిజానికి దౌత్య, వాణిజ్య, వ్యూహాత్మక పరిణామాలకు పరిమితమైనవి కావు. హైందవ సంస్కృతి సహస్రాబ్దులపాటు తూర్పు ఆసియా దేశాలను ప్రభావితం చేసిన చరిత్రకు సంబంధించినవి. చారిత్రక స్మృతులకు స్ఫురిస్తున్న సుదూర గతం నుంచీ కూడ వైదిక బౌద్ధమతాలు మన దేశంనుంచీ తూర్పు ఆసియాకు విస్తరించడం నిరాకరింపజాలని నిజం! ఈ మతాలు, హైందవ సంస్కారాలు తూర్పు ఆసియాను దురాక్రమించలేదు, ధ్వంసం చేయలేదు, మానవీయ జీవనవౌలిక మూలాలను పరిరక్షించడానికి, పెంపొందించడానికి దోహదం చేశాయి, చేస్తున్నాయి. నరేంద్ర మోదీ 2014 ఆగస్ట్, సెప్టెంబర్‌లలో జరిపిన జపాన్ పర్యటనకు ఈ ‘సాంస్కృతిక బంధం’ నేపథ్యం... ఇప్పటి పర్యటనకు సైతం ఇదే నేపథ్యం! అయినప్పటికీ చైనా ప్రభుత్వం ‘్భరత్ జపాన్’ మైత్రిని తన ఆధిపత్య రాజకీయ నేత్రాలతో మాత్రం వీక్షిస్తోంది. ఎందుకంటె భారత్ జపాన్‌లు కేంద్ర బిందువులుగా తమ దేశానికి వ్యతిరేక తూర్పు, ఆగ్నేయ, ఈశాన్య ఆసియా దేశాల సంఘటన ఏర్పడుతోందన్నది చైనా భయం. భారత్, జపాన్‌ల మధ్య శుక్రవారం కుదిరిన శాంతి ప్రయోజనాల ‘అణు సహకార అంగీకారం’తో ఈ ‘సంఘటన’ మరింత బలపడింది...
తూర్పు ఆసియాలో చైనా విస్తరణవాదం కారణంగానే జపాన్ ప్రభుత్వం మన దేశంలో ఈ ఒప్పందాన్ని కుదుర్చుకొనడానికి నిబంధనలను సడలించింది! ఈ అభిప్రాయం అతార్కికం కాజాలదు. ఎందుకంటె మన దేశం ఇంతవరకు ‘అణ్వస్తవ్య్రాప్తి నిరోధక వ్యవస్థ’- నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ- ఎన్‌పిటి-లో చేరలేదు. ‘అణుపాటవ పరీక్షా ప్రయోగ నిరోధక సమగ్ర వ్యవస్థ’ - కాంప్రహెన్సివ్ టెస్ట్ బాన్ ట్రీటీ - సిటిబిటి - లో భాగస్వామి కాలేదు! ఈ రెండు ఒప్పందాల వ్యవస్థలూ అగ్ర దేశాలకు అనుకూలంగాను మన దేశానికి ఇతర ప్రవర్ధమాన దేశాలకు వ్యతిరేకంగాను ఉన్నందువల్లనే ఈ వ్యవస్థలలో మన దేశం ఇంతవరకు చేరలేదు... వివక్ష తొలగి అన్ని దేశాలకు వర్తింపగల సమాన నిబంధనలు ఏర్పడేవరకు ఎన్‌పిటిలోను ‘సిటిబిటి’లో చేరరాదన్నది మన విధానం. అయితే ‘ఎన్‌పిటి’లోను ‘సిటిబిటి’లోను మనం సభ్యత్వం తీసుకున్న తరువాత మాత్రమే మన దేశంతో ‘అణు సహకారపు ఒప్పందం’ కుదుర్చుకుంటామని జపాన్ ప్రభుత్వం 2010నుంచి చెబుతున్నది. అందువల్ల ఈ ‘ఒప్పందం’ ‘‘ఇదిగో అదిగో...’’అంటూ 2010నుంచి ఊహాగానాలు మాత్రమే కొనసాగాయి. ‘సిటిబిటి’, ‘ఎన్‌పిటి’లో మనం చేరిన తరువాత మాత్రమే మన దేశంలో ‘శాంతి ప్రయోజనాల అణుసహకారపు ఒప్పందం’ కుదుర్చుకోగలమని గతంలో బెదిరించిన అమెరికా 2008లో ఈ నిబంధనను సడలించింది! మన దేశంతో అణు సహకారపు ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఆ తరువాత ఫ్రాన్స్, రష్యాలు కూడ మన దేశంలో అమెరికా తరహా ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయినప్పటికీ జపాన్ మాత్రం ఈ ‘సిటిబిటి’ ‘ఎన్‌పిటి’ సభ్యత్వం నిబంధనను ఇన్నాళ్లుగా ‘పట్టుకొని ఉండడం’ విచిత్రమైన వ్యవహారం. ఇప్పుడు జపాన్ కూడ ఈ నిబంధనను సడలించింది. మనతో శాంతి ప్రయోజనాల అణు సహకారానికి అంగీకరించింది. నరేంద్రమోదీ ప్రభుత్వం సాధించగలిగిన దౌత్య, వ్యూహాత్మక విజయం ఇది...
‘సిటిబిటి’, ‘ఎన్‌పిటి’ నిబంధనలు వివక్షతో కూడి ఉన్నాయి. అమెరికా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్, చైనాలకు ఈ నిబంధనలు అనుకూలం! ఈ ఐదు ఈ ‘వ్యవస్థ’లలోని వౌలిక దేశాలుగా చెలామణి అవుతున్నాయి. ఈ దేశాలు మాత్రం నిర్నిరోధంగా అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరుపవచ్చునని, ఈ ‘వ్యవస్థ’లలో భాగస్వాములయ్యే మిగిలిన దేశాలు మాత్రం అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరుపరాదన్నది నిబంధన. ఈ వివక్షాయుతమైన నిబంధన తొలగిపోయే వరకూ ఈ వ్యవస్థలలో చేరరాదన్నది మన విధానం. ‘నిషేధం’ అన్ని దేశాలకు సమానంగా వర్తించాలన్నది మన విధానం. మన దేశం ఇకపై అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరపబోదని మన ప్రభుత్వం ఇదివరకే ప్రకటించి ఉంది. ఇది మనంతకుమనమే స్వచ్ఛందంగా విధించుకున్న నిషేధం... కానీ అగ్రరాజ్యాల ఆధిపత్యానికి ప్రతీక అయిన ‘సిటిబిటి’ ‘ఎన్‌పిటి’లను ఆమోదించరాదన్నది మన జాతీయ స్వాభిమానానికి సంబంధించిన అంశం, మన స్వతంత్ర విధానానికి నిదర్శనం... జపాన్ ఇప్పుడు ఈ నిబంధనను సడలించడానికి ప్రధాన కారణం పెరుగుతున్న చైనా ‘విస్తరణ’ ప్రభావం! వియత్నాంకు తూర్పుగాను, చైనాకు దక్షిణంగాను విస్తరించిన సముద్ర ప్రాంతంలోని అనేక దేశాలతో చైనాకు ‘ప్రాదేశిక వివాదాలు’ కొనసాగుతున్నాయి! ఈ సముద్ర ప్రాంతం దేశాలు అందువల్ల తమకు చైనా దురాక్రమణ ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నాయి. జపాన్‌కు దక్షిణంగాను చైనాకు తూర్పుగాను విస్తరించిన సముద్ర ప్రాంతం కూడ చైనా దుందుడుకు విధానంవల్ల కల్లోలగ్రస్తమైపోయింది. జపాన్‌కు చెందిన ‘శంకా’కు ద్వీపాలు తమవని చైనా పేచీపెట్టి ఉంది... అందువల్ల వియత్నాం థాయ్‌లాండ్ వంటి తూర్పు ఆసియా దేశాలు, జపాన్‌తోను మన దేశంతోను కలసి చైనా ‘విస్తరణ’ను భౌతిక దురాక్రమణను అడ్డుకోవాలని భావిస్తున్నాయి! జపాన్‌తో మనకున్న సాంస్కృతిక బంధం దౌత్య, వాణిజ్య, వ్యూహాత్మక స్నేహంగా విస్తరిస్తుండడానికి దోహదం చేస్తున్న వర్తమాన అంతర్జాతీయ స్థితి ఇది!
పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవును అభివృద్ధిచేయడం ద్వారా చైనా అరేబియా సముద్ర ప్రాంతంలో తన దురాక్రమణ వ్యూహాన్ని వ్యవస్థీకరించింది. ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవును అభివృద్ధిచేయడానికి ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మన ప్రభుత్వం చైనా దురాక్రమణను నిరోధించే పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ చౌబహార్ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడానికి జపాన్ తనంత తానుగా ముందుకు రావడం నరేంద్రమోదీ జపాన్ ప్రధాని షింజేఏబ్‌తో జరిపిన చర్చల ఫలితం... భారత్ జపాన్ మైత్రి బలపడింది, విస్తరిస్తోంది. *