సంపాదకీయం

‘తలాఖ్’ తగదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూడు ‘తలాఖ్‌ల’ పద్ధతి అమానవీయమైనదని అలహాబాద్ ఉన్నత న్యాయమూర్తి సునీత్‌కుమార్ వ్యాఖ్యానించడం ఇస్లాం మహిళల మనోభావాలకు అనుకూలమైన పరిణామం. ఎప్పుడు పడితే అప్పుడు భర్త తన భార్యకు విడాకులనివ్వడానికి వీలు కల్పించే ఈ దారుణమైన నిబంధన ఇస్లాం మత వౌలిక తత్త్వానికి సైతం అనుగుణంగా లేదన్న ఉన్నత న్యాయస్థానం వారి వ్యాఖ్య ఉదారవాదులైన ఇస్లాం మతస్థుల అంతరంగానికి అద్దం. ఈ నిబంధన వల్ల ఏళ్ల తరబడి వేలాది మహిళలు క్రూరమైన అన్యాయానికి గురి కావడం నిరాకరించజాలని నిజం. అందువల్ల మతవ్ఢ్యౌ వాదులు తప్ప మిగిలిన సామాన్య ముస్లింలు, నిజమైన మతనిష్ఠాపరులు ‘ముమ్మారు తలాఖ్’- ట్రిపుల్ తలాఖ్- చెప్పే పద్ధతిని నిరసిస్తున్నారు. అందువల్లనే ‘ముమ్మారు తలాఖ్’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులనిచ్చే పద్ధతిని రద్దు చేయాలని అనేకమంది ముస్లిం మహిళలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇందుకు నిదర్శనం. ఈ ‘న్యాయ యాచికల’పై విచారణ జరుపుతున్న సర్వోన్నత న్యాయస్థానం ఈ విషయమై నిర్ధారించవలసి ఉంది. స్ర్తి,పురుష సమానత్వం అనాదిగా మన జాతీయ సంప్రదాయం. విదేశీయ దురాక్రమణ కొనసాగిన కాలంలో వక్రీకరణలకు గురి అ యిన ఈ సంప్రదాయం, అడుగంటిన ఈ సంప్రదాయం మళ్లీ జనామోదం పొందుతుండడం నడుస్తున్న చరిత్ర. కుల, మత, సంప్రదాయ, భాషా, ప్రాం తీయ వైవిధ్యాలు అసంఖ్యాకంగా ఉన్నప్పటికీ ఈ దేశపు సంస్కృతి అనాదిగా అద్వితీయమై ఉంది. ఈ అద్వితీయ సంస్కృతి ప్రాతిపదికగానే ఈ దేశం ఒకే జాతిగా వికసించింది. సనాతన జాతి అన్నప్పటికీ, భరతజాతి అన్నప్పటికీ, హిందూజాతి అన్నప్పటికీ- పేర్లు ఏవైనప్పటికీ మనది అనాదిగా ఒకే జాతి. ఈ జాతీయ సంస్కృతిని, జాతీయ వారసత్వాన్ని ఈ జాతిలో భాగమైన అన్ని మతాలవారు సమానంగా పాటించడం, సమానంగా స్వీకరించడం సమైక్య సమగ్రతలకు ప్రాతిపదిక. అలహాబాద్ న్యాయమూర్తి వ్యాఖ్యలో ఈ సమాన జాతీయత ధ్వనించింది. శైవ, వైష్ణవ, బౌద్ధ, జైన, సిక్కు, ద్వైత, అద్వైత, స్మార్త, సనాతన వంటి ఈ దేశంలో వికసించిన మతాలతో పాటు విదేశాల నుంచి వ్యాపించిన యూదు, పారశీక, ఇస్లాం, క్రైస్తవం వంటి మతాలవారు కూడా ఈ దేశంలో, ఈ జాతిలో సమాన భాగస్వాములు కావడం ఈ జాతీయ సర్వమత సమభావ వ్యవస్థకు అనుగుణమైన వికాస క్రమం. ఈ వికాస క్రమానికి ధ్రువీకరణ స్వతంత్ర భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం కుల, మత, భాష, ప్రాంత స్ర్తి పురుష వివక్ష లేని సర్వజన సమానత్వాన్ని నిర్ధారించడం ఈ జాతీయ వికాస క్రమంలో భాగం. అందువల్ల రాజ్యాంగ వ్యతిరేకమైన ఎలాంటి నిబంధనలు కూడా చెల్లవన్నది అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి సునీత్‌కుమార్ చేసిన నిర్ధారణ.
మూడుసార్లు ‘తలాఖ్‌లు’ చెప్పడం ద్వారా భర్త భార్యకు విడాకులివ్వడం భారత రాజ్యాంగం నిర్దేశిస్తున్న సమానత్వ, వివక్ష రాహిత్య స్ఫూర్తికి భంగకరమని న్యాయమూర్తి సునీత్‌కుమార్ వ్యాఖ్యానించడం పునరుద్ఘాటన మాత్రమే. ఏ మతానికి చెందిన జీవన నియమాలైనా- పర్సనల్ లాస్- రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉండరాదన్నది ఆయన చెప్పిన మాట! ఈ మత నియమాలు రాజ్యాంగ నియమాలను తలదన్నరాదన్నది కూడా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి చేసిన పునరుద్ఘాటన. భారత రాజ్యాంగంలోని మార్గదర్శక నియమావళి లేదా ఆదేశ సూత్రాలు- డైరక్టివ్ ప్రిన్సిపుల్స్- విభాగంలోని నలబయి నాలుగవ నిబంధన ప్రకారం పౌరులందరికీ సమానంగా వర్తించగల ‘సమష్టి పౌరస్మృతి’- యూనిఫారమ్ సివిల్ కోడ్-ను రూపొందించడం ప్రభుత్వం బాధ్యత. అందువల్ల సర్వమత భావ వ్యవస్థలో మతపరమైన చట్టాలు, నిబంధనలు రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఉండాలన్నది రాజ్యాంగ నిర్మాతల అభిప్రాయం. మూడుసార్లు ‘తలాఖ్’ చెప్పి భర్త తన భార్యను అనాథను చేయడం రాజ్యాంగంలోని సమానత్వానికి మాత్రమే కాదు, వౌలిక మానవీయ సూత్రాలకు విరుద్ధమన్న భావం దశాబ్దులుగా వ్యక్తవౌతోంది. ఇస్లాం మహిళలు స్వయంగా ఈ నిబంధనను న్యాయస్థానాలలో సవాలు చేసే స్థితికి ఎదగడం మహిళా చైతన్యానికి మరో నిదర్శనం. అయితే ఈ చైతన్యం అనేకమంది ట్రిపుల్ తలాఖ్ బాధితురాండ్ల సమస్యకు పరిష్కారం కాదు. ఈ నిబంధన తొలగినపుడు మాత్రమే ఈ అభాగ్య మహిళలకు జీవన పరిష్కారం లభిస్తుంది.
ఉమ్మడి పౌరస్మృతి రాజ్యాంగ రచనతో సమాంతరంగా రూపొంది ఉండినట్టయితే వేలాది ముస్లిం మహిళలు పురుష దురహంకార జ్వాలలకు ఆహుతి అయ్యే దౌర్భాగ్య స్థితి దాపురించి ఉండేది కాదు. కానీ ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలన్న నిబంధనను రాజ్యాంగ నిర్మాతలు ప్రభుత్వ నిర్వాహకుల విచక్షణకు వదిలివేశారు. అందువల్ల ‘వోట్లు సీట్లు’ పరమావధిగా రాజకీయా న్ని నడిపిస్తున్న ప్రభుత్వ నిర్వాహకులు ఈ ఆదేశ సూత్రాన్ని పట్టించుకోలేదు. ఐచ్ఛికమైన ఈ ఆదేశ సూ త్రాన్ని అమలు జరపవలసిందిగా న్యాయస్థానాలు ప్రభుత్వాలను ఆదేశించడానికి కూడా వీలు లేదు. అందువల్లనే సంపూర్ణ గోవధ నిషేధం, సమగ్ర మద్యపాన నిషేధం వంటి అభిలషణీయమైన ‘చట్టాల’ వలెనే ఉమ్మడి పౌరస్మృతి కూడా ఎండమావిలోని నీరుగా మారింది. రాజ్యాంగ స్ఫూర్తి నీరుకారిపోయింది. ఉమ్మడి పౌరస్మృతితో నిమిత్తం లేకుండా ‘ట్రిపుల్ తలాఖ్’ వైపరీత్యాన్ని తొలగించే అంశాన్ని ఇప్పుడైనా సర్వోన్నత న్యాయస్థానం విచారిస్తుండడం హర్షణీయం. ఈ అంశాన్ని అసలు సర్వోన్నత న్యాయస్థానం కాని ఇతర న్యాయస్థానాలు కాని విచారించడానికి వీలు లేదని ‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్’- ఎఐఎంపిఎల్‌బి- తదితర సంస్థలు వాదిస్తూనే ఉన్నాయి. ఈ వాదం వినిపించడం ద్వారా ఈ సంస్థల వారు ముస్లిం మహిళలు అన్యాయానికి గురికావలసిందేనని చాటిస్తున్నారు. భర్త తన ఇష్టం వచ్చినపుడు ‘తలాఖ్ తలాఖ్ తలాఖ్’ అని చెప్పడానికి కారణాలు చూపించనక్కరలేదట! అందువల్ల ‘విడాకులు’ కత్తుల వలే నిరంతరం ముస్లిం మహిళల నెత్తిన వేలాడుతూనే ఉంటాయి. ఫలితంగా ఇస్లాం మహిళలు నిరంతరం భయగ్రస్త జీవనాన్ని గడుపవలసి వస్తోంది. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి ఈ భయగ్రస్త మహిళా జీవన వ్యథను మరోసారి గుర్తుచేశారు.
‘ట్రిపుల్ తలాఖ్’పై తన అభిప్రాయాన్ని చెప్పవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం ఇదివరకే కేంద్ర ప్రభుత్వాన్ని కోరి ఉంది. ఈ ట్రిపుల్ తలాఖ్‌న రద్దు చేయాలని, బహు భార్యత్వాన్ని- పురుషుడు ఒక భార్య ఉండగానే మరో భార్యను స్వీకరించడం- తొలగించాలని కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ ఏడవ తేదీన సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది కూడా. ఈ విషయమై విస్తృతంగా చర్చలు జరగాలన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. న్యాయ వ్యవహారాల జాతీయ సంస్థ- లా కమిషన్ ఆధ్వర్యంలో జరుగనున్న ఈ చర్చలను బహిష్కరించాలని ఎఐఎంపిఎల్‌బి నిర్ణయించడం దురదృష్టకరం. ఉత్తరప్రదేశ్‌లోని ఓ పురుషుడు- యాబయి మూడేళ్ల వాడు తన భార్యకు ‘తలాఖ్’ చెప్పి ఇరవై మూడేళ్ల మరో యువతిని పెళ్లి చేసుకున్నాడట! అలహాబాద్ న్యాయస్థానం వారు చేసిన వ్యాఖ్యలకు ఇదీ నేపథ్యం.