మెయన్ ఫీచర్

‘చంద్ర’ప్రభ మసకబారుతోందా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాజు కఠినాత్ముడిగానే కాదు, గొప్ప మానవతావాదిగానూ ఉండాలి. మొహమాటం ఉంటే రాజు చులకన అవుతాడు. అది ఏలిక బలహీనతను ప్రజలకు ప్రదర్శించడమే! రాజ్యసౌభాగ్యం కోసమే కాదు, సొంత మనుగడకు అవసరమైతే అయినవారిని దూరం ఉంచాలి. ఫలానా వారికి మాత్రమే ప్రీతిపాత్రుడిగా ఉంటే ఆ రాజ్యంలో అసంతృప్తి మొదలై , అది అసమ్మతిగా రూపుదిద్దుకుంటుంది. ఆ కొలువులో కొందరికే న్యాయం జరుగుతుందన్న ప్రచారం ప్రత్యర్థి దేశాలకు చేరితే, రా జ్యంలో అంతర్గత కలహాలు రేగడం సులభమవుతుంది. రాజు పరిపాలన, పర్యవేక్షణ మాత్రమే చేయాలి. సహచరులకు, మంత్రులకు తమ తెలివిని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి. యుద్ధంలో చివరి సేనానిగా మాత్రమే రావాలి. కింది స్థాయి అధికారులు చేసే తప్పులు సరిదిద్దకపోతే ఆ వైఫల్యం రాజుకే చెందుతుంది. మొత్తంగా రాజు తాను చేయవలసిన పనిమాత్రమే చేయాలి’.. పాలకులు ఎలా ఉండాలన్న దానిపై విదురుడు ఒక సందర్భంలో చెప్పిన నీతి ఇది. పాలకుడు ఏం చేయాలో అది చేయకుండా, చేయకూడని పనులు చేస్తే ఆ వెలుగు తరిగిపోవడానికి పెద్దగా సమయం అవసరం లేదు. రెండున్నరేళ్ల క్రితం ఆంధ్ర రాష్ట్ర పాలకుడిగా అవతరించిన చంద్రబాబు పరిపాలన తీరుతెన్నులు పరిశీలిస్తే ‘విదురనీతి’ని ఆయన చదవలేదోమోననిపిస్తుంది.
చంద్రబాబు గెలిచిన వెంటనే మిగిలినవారిలా పట్ట్భాషేకం చేసుకోలేదు. అత్యంత క్లిష్టమైన విద్యుత్ సమస్యపై దృష్టి పెట్టి, ముందుగానే విద్యుత్ కొనుగోలు చేశారు. ప్రమాణానికి ముందే సంస్కరణలు ప్రారంభించిన ఫలితంగా నవ్యాంధ్రప్రదేశ్ లోటు నుంచి మిగులుకు చేరుకోగలిగింది. మరి ఇంత దూరదృష్టి ఉన్న ఆయన దక్షత- మిగిలిన వ్యవహారాల్లో ఎందుకు దెబ్బతింటోందన్నది టిడిపి నేతలకు అంతుపట్టని విషయం. కానీ, మారుతున్న తరం ఆలోచనలు, పెరుగుతున్న ప్రజల అవసరాలు, వీటికిమించి రాజకీయాలతో ముడిపడిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మనసును అంచనా వేయడంలోనే బాబులో చురుకుదనం లోపించింది. ఆయన రాజకీయ జీవితం చిత్తూరు నుంచి మొదలై హైదరాబాద్‌లో కొనసాగింది. ఇనే్నళ్ల రాజకీయ జీవితం అంతా హైదరాబాద్ కేంద్రంగానే సాగడంతో కోస్తా జిల్లాల మనస్తత్వంపై బాబుకు పెద్దగా అంచనా ఉండకపోవచ్చని, అందుకే సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవచ్చన్న చర్చ జరుగుతోంది. ఐదేళ్ల పాలనకు ప్రజల తీర్పు ఇచ్చినప్పుడు పాలకుల అంచనాలు, లక్ష్యాలు కూడా అక్కడికే పరిమితమవ్వాలి. అప్పుడే లక్ష్యం చేరుకోవచ్చు. కానీ, బాబు ఆలోచనలు పదేళ్లకు సాగుతున్నాయి. అది మంచిదే. అయితే ముందు ఐదేళ్ల ఎన్నికల వైతరణి దాటాలి కదా?! ఉదాహరణకు భూసేకరణ అంశానే్న తీసుకుంటే.. గత రెండున్నరేళ్లలో అవసరానికి మించి భూసేకరణ జరుగుతోందన్న భావన, దానివల్ల తమ జీవనోపాధి పోతోందన్న ఆగ్రహం రైతుల్లో మిగిలిపోయింది. బందరు పోర్టుకు 2 వేల ఎకరాలు చాలన్న బాబు ఇప్పుడు తానే అంతకు మూడింతల భూసేకరణకు ఉబలాటపడుతున్నారు. ఇది అవసరమా? ఇచ్చిన ఐదేళ్ల కాలానికి భవిష్యత్తు పేరుతో భూములు లాగేసుకుంటే రైతులు దూరమవడం సహజమే కదా? చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులతో ‘తెలుగు’ వెలుగు తగ్గిపోతోందన్న ఆందోళన బహిరంగమే. వైసీపీ నుంచి తెచ్చుకున్న ఎమ్మెల్యేలలో మళ్లీ గెలిచే ముఖాలు రెండు, మూడు కూడా కనిపించవు. మరి దానివల్ల వచ్చే లాభమేమిటో పక్కనపెడితే, ఆయా నియోజకవర్గాల్లో ముఠా తగాదాలు రావణకాష్టంలా సాగుతున్నా ఎవరినీ పిలిచి హెచ్చరించిన దాఖలాలు లేవు. ఇద్దరు నేతలు రోడ్డున పడితే పిలిచి హెచ్చరించి, అవసరమైతే వేటు వేయాల్సిన అధినేతలో మొహమాటం పోకడలు మొత్తం పార్టీకే చేటు తెస్తున్నా చంద్రబాబులో చలనం లేదు.
ఇప్పుడున్న ఎమ్మెల్యేలలో 80 శాతం మందిపై అవినీతి మరకలున్నాయన్నది బహిరంగమే. మళ్లీ వారిలో గెలిచే ముఖాలు సగం కూడా ఉండవన్నది కాదనలేని నిజం. రాజకీయాల్లో కొనసాగే వారికి ఖర్చులు అధికంగానే ఉంటాయి. ఓటుకు నోటు ఇస్తే తప్ప ఓటెయ్యబోమని జనం తెగేసి చెబుతున్న దౌర్భాగ్యం! అవి కాకుండా చావుకు, పెళ్లిళ్లకు ఎంతోకొంత ఇచ్చుకోక తప్పని అనివార్యత. ఈ పరిస్థితిలో తాము అవినీతికి పాల్పడకుండా డబ్బులు ఎలా సంపాదించాలన్నది సదరు ఎమ్మెల్యేల ప్రశ్న. నేటి వ్యవస్థ గురించి పైకి ఎన్ని కబుర్లు చెప్పుకున్నా అవినీతి మకిలి అంటని రంగం ఒక్కటంటే ఒక్కటీ కనిపించదు. కాబట్టి కాసేపు వారి మాటే నిజమనుకున్నా దానికీ పరిమితి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఎమ్మెల్యేలకు ఆదాయం పెద్దగా ఉండదు. కొందరికి బదిలీలు, కాంట్రాక్టు కమీషనే్ల ఆధారం. ఇతర కులాల ఎమ్మెల్యేలు, దండిగా ఆదాయ వనరులున్న జిల్లాల్లో ఎమ్మెల్యేల ఆదాయం అంతకు ఇరవై రెట్లు ఎక్కువగా ఉంటోంది. ఎక్కువ ఆదాయం ఉన్న ఎమ్మెల్యేలను తక్కువ ఆదాయం ఉన్న ఎమ్మెల్యేలు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ఫలితంగా ఇద్దరూ పోటీలుపడి పడి మరీ దోచుకుంటున్న వైనం, చివరకు ప్రభుత్వంపైనే అవినీతి మరక పడేందుకు కారణమవుతోంది. రోడ్డున పడి, అవినీతికి పడగలెత్తుతున్న ఎమ్మెల్యేలను పిలిచి కనె్నర్ర చేసి ఉంటే ఈ దౌర్భాగ్యం దాపురించేది కాదు కదా?!
పదేళ్ల ప్రతిపక్షంలో భుజాలు పుండ్లు పడేలా పనిచేసిన కార్యకర్తల స్థానంలో పైరవీలు, కాంట్రాక్టర్లు, రెండున్నరేళ్ల క్రితం ఎవరినైతే రాబందులంటూ రచ్చ చేశారో ఇప్పుడు అవే ముఖాలు పాలకుల చుట్టూ దర్శనమిస్తున్న వైనాన్ని శ్రేణులు మెచ్చవు. సచివాలయం నుంచి క్యాంపు ఆఫీసు వరకూ పార్టీ కార్యకర్తలకు ప్రవేశం, బాబు-చినబాబు దర్శనభాగ్యం దుర్లభమవుతోంది. ఇలాంటి చర్యలతోనే కదా 2004లో బాబు ఒకసారి ఓడిపోతే తెలిసొస్తుందని కొందరు, తమ ఎమ్మెల్యే ఈసారి ఓడిపోతే సరిపోతుందని మరికొందరు కోపంతో సొంత పార్టీనే ఓడించింది?! అదొక్కటేకాదు. అధికారులకు పెత్తనమిచ్చి పార్టీని మరుగుజ్జును చేసిన వైనం కూడా బాబు నాటి అధికార వియోగానికి ఒక ప్రధాన కారణమే కదా? ఆ గుణపాఠాలేవీ ఈ రెండున్నరేళ్లలో నేర్చుకున్నట్లు లేదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా ఉండేందుకు వివిధ కులాలు, వర్గాలకు అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు కొంత కవచంలా పనికొస్తున్నాయి. పథకాలను జనాలకు చేర్చే కార్యకర్తలు ఆగ్రహంతో ఉంటే ఏ పార్టీకయినా భవితవ్యం ఉండదు. వైఎస్ తొలి సంతకంతోపాటు, తనతో కష్టాల్లో ఉన్న వారిని మొదటి రోజునుంచి, చనిపోయే గంట ముందు వరకూ ఏదోరకంగా ఆదుకున్నారు. పిలిచి మరీ ఆయన సాయం చేసిన వైనాన్ని ఇప్పటికీ కథలుగా చెప్పుకుంటారు. బాబు ఆ విధంగా ఎంతమందిని పిలిచి భుజం తట్టారన్న ప్రశ్నలు గత రెండున్నరేళ్ల నుంచి ఇప్పటికీ వినిపిస్తుండటంపై ఆత్మపరిశీలన అవసరం. రెండున్నరేళ్లలో తాను చేయాల్సిన పనులు చేయకుండా, చేయకూడని పనులు మీదేసుకుని కష్టాలు కొనితెచ్చుకోవడం స్వయంకృతమే.
పెద్దనోట్ల రద్దుపై బిజెపి ముఖ్యమంత్రులే వౌనంగా ఉన్న సమయంలో, అది తన ఘనతేనని ప్రచారం చేసుకుని తప్పులోకాలేసిన తెలుగుదేశాధీశుడు జనాగ్రహాన్ని ఆలస్యంగా తెలుసుకున్నారు. వచ్చిన ఇబ్బందులను అధిగమించేందుకు రోజూ రాత్రి పది వరకూ అధికారులతో సమీక్షలు పెట్టి లేని తలనొప్పి కొనితెచ్చుకున్నారు. ఇప్పుడు పరిష్కారకర్తగా మారి, ఆ సమస్యను పరిష్కరిస్తే వచ్చే ‘ఇమేజ్’ అంతా మోదీ ఖాతాలోకి చేరుతుందే తప్ప, బాబు కష్టానికి ఫలితం ఏమిటి? 2004లో సర్కారు భూములు, సంపదను పెంచితే ఆ తర్వాత వచ్చిన పాలకులు వాటిని కొల్లగొట్టిన వైనాన్ని గుర్తు చేస్తున్న సీనియర్ల విశే్లషణ అబద్ధం కాదు. బాబు స్థాయి, ఇమేజీకి తగిన సిఎంఒ లేని లోటు కనిపిస్తూనే ఉంది. బాబు కనుసన్నలలో ఉండాల్సిన సమాచారశాఖలో లెక్కలేనన్ని పవర్ సెంటర్లు.. ఎవరేం చేస్తున్నారో తెలియని గందరగోళం..!
అనాథగా మారిన ఎపికి ఒకరూపు తెచ్చేందుకు గత రెండున్నరేళ్లలో రేయంబవళ్లు తాను కష్టపడి, అధికారులను కష్టపెడుతున్నా ప్రజల్లో వ్యతిరేకతను ఏమైనా తగ్గించుకోగలిగారా? అన్నది ప్రశ్న. బాబును ఆకాశానికెత్తి, అందుకు ఫలితంగా అన్ని ప్రయోజనాలు దండుకున్న నయా మీడియా రాజగురువులుంగారు కూడా, ఈ మధ్య ప్లేటు మార్చడం బట్టయినా ‘తెలుగు’ వెలుగు తగ్గుతోందని గ్రహించాలి కదా?! మునుపు జగన్ దీక్ష చేసినా, ఇడుపులపాయలో నెలవారీ ప్రజాదర్బార్లు నిర్వహించినా, ధర్నాలు చేసినా, బాబుకు లేఖలు రాసినా పట్టించుకోని బతకనేర్చిన సదరు మీడియా, ఇప్పుడు హఠాత్తుగా జగన్‌కూ ప్రముఖ స్ధానం ఇవ్వడం ప్రారంభించిందంటే, జనంలో అధికార పార్టీ ప్రభ తగ్గుతుందన్న సంకేతమే కదా?! మరి కళ్లెదుట కనిపించే ఇన్ని లోపాలు, బలహీనతలు సరిదిద్దుకోకుండా మరో పదేళ్ల ‘దూరాలోచన’ బాబుకు లాభమా? నష్టమా??
*

మార్తి సుబ్రహ్మణ్యం సెల్: 97053 11144