సంపాదకీయం

‘అగ్ని’ కాలుష్యం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బహిరంగ ప్రదేశాలలో ‘చెత్త’ను తగులబెట్టడాన్ని ‘జాతీయ హరిత న్యాయమండలి’-నేషనల్ గ్రీన్ ట్రి బ్యునల్-ఎన్‌జిటి- నిషేధించడం పరిసరాల పరిశుభ్రతను పెంపొందించే చర్య. ‘చెత్త’ పేరుతో చెలామణి అవుతున్న ‘వ్యర్థ పదార్థం’లో విష రసాయనాలు నిండి ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. అందువల్ల బహిరంగ స్థలాలలో కాని, రహస్య ప్రదేశాలలో కాని ఇలాంటి రసాయన విష పదార్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణం కాలుష్యగ్రస్తం కావడం దశాబ్దులుగా కొనసాగుతున్న ప్రహసనం. ప్రధానంగా ప్లాస్టిక్ పదార్థాలను తగులబెట్టడం వల్ల వాతావరణ కాలుప్యం పెరుగుతోంది. చెత్తను పూడ్చిపెట్టడం ద్వారా దాన్ని తుదముట్టించేలా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మహానగరాలలోను, పట్టణాలలోను స్థానిక ప్రభుత్వాలు వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. చేస్తున్నాయి. ఇలాంటి వ్యర్థ పదార్థ ఖనన ప్రాంగణాల-లాండ్‌ఫిల్ సైట్స్-లో కూడా రద్దీ పెరిగిపోయింది. అంటే పూడ్చిన చెత్త భూమిలో కలసిపోకముందుగానే కొత్త చెత్త వందల టన్నులుగా ఆ ‘లాండ్ ఫిల్ సైట్స్’కు చేరుతోంది. ఇందుకు ప్రధాన కారణం దశాబ్దుల తరబడి దుర్బుద్ధి పూర్వకంగా నగరాలలో జరిగిన అంతస్తుల గృహసముదాయాల నిర్మాణం! నగరా లు, పట్టణాలు ‘అడ్డం’గా పెరిగినంత కాలం ఒకేచోట జనాభా కేంద్రీకృతం కాలేదు. ఒకేచోట చెత్త కేం ద్రీకృతం కాలేదు. కా లుష్యం కేంద్రీకృతం కా లేదు. కానీ ఒక ఇల్లు ఉన్న చోట కనీసం ఆరు ఇళ్లను లేదా పది ఇళ్లను నిర్మించేలా అంతస్తుల, ఆకాశహర్మ్యాల వ్యవస్థ మొదలైన తరువాత నగరాలు ‘నిలువు’నా పెరుగుతున్నాయి. ఇలా ‘నిలువు’నా పెరగడం వల్ల చెత్త భరించలేనంతగా పేరుకుపోతోంది. ఒక ఇంటివారు చెత్త వేసే చోట పది ఇళ్లవారు చెత్త వేస్తున్నారు. అందువల్ల నగరాల నడిబొడ్డులలోని ‘వ్యర్థ పదార్థ ఖనన ప్రాంగణాలు’ పట్టనంతగా చెత్త రోజూ తరలివస్తోంది. లాండ్‌ఫిల్ సైట్స్ చెత్తతో పొంగిపొరలిపోతున్నాయి. అందువల్ల పూడ్చిపెట్టడం సాధ్యం కాక చెత్తను తగులబెడుతున్నారు. విష రసాయనాలు కలసిన చెత్త తగులబడటం వల్ల పరిసరాలు మరింతగా కాలుష్యమవుతున్నాయి. అందువల్ల ‘లాండ్‌ఫిల్ సైట్స్’ సహా ఏ బహిరంగ ప్రదేశంలో కూడా చెత్తను తగులబెట్టరాదన్న హరిత న్యాయమండలి ఆదేశం ‘స్వచ్ఛ్భారత్’ ఏర్పడటానికి దోహదం చేయగలదు. బహిరంగ ప్రదేశాలలో తక్కువ మోతాదు చెత్తను తగులబెట్టేవారి నుండి ఐదువేల రూపాయలు, భారీ మోతాదులో చెత్తను తగులబెట్టేవారినుంచి ఇరవై అయిదు వేల రూపాయలు జరిమానా వసూలు చేయాలని డిసెంబర్ 22వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించడం పర్యావరణ పరిరక్షణ పథంలో మరో ప్రగతి పదం.
నగరాలలో చెత్తకు తగిన నిష్పత్తిలో ల్యాండ్‌ఫిల్ సైట్స్ లేకపోవడం భూగర్భజల కాలుష్యాన్ని సృష్టిస్తోంది. అందువల్ల చెత్తను వ్యర్థ పారిశ్రామిక విష రసాయనాలను తగులబెట్టడానికి ప్రత్యామ్నాయం చెత్తను ఖననం చేయడం కాజాలదు. జనసాంద్రత, ఇళ్ల సంఖ్య పరిమాణం పెరుగుదలకు అనుగుణంగా ఈ వ్యర్థ పదార్థ ఖనన ప్రాంగణాల సంఖ్య పెరగకపోవడం కారణం. ఇలా పెరగకపోవడానికి కారణం స్థలాభావం. ఒక చదరపు కిలోమీటరు పరిథిలో ఐదారువేల ఇళ్లు ఉన్నప్పుడు అదే పరిధిలో ఉన్న వ్యర్థ ఖనన కేంద్రం వైశాల్యం, ఆ చదరపు కిలోమీటరు పరిథిలో 40 వేల ఇళ్లు, కుటుంబాలు ఏర్పడిన తరువాత కూడా అంతే ఉంటోంది. అందువల్ల భారీ పరిమాణంలో ఒకేచోట వ్యర్థాలను పూడ్చటం వల్ల, నిక్షిప్తం చేయడం వల్ల హరించుకునే శక్తి ఆ భూభాగానికి తగ్గిపోతోంది. ఫలితంగా ఈ వ్యర్థ రసాయన విషాల దుష్ప్రభావం కిందకీ, అటూఇటూ విస్తరించి నగరాలలో భూగర్భ జలం కలుషితమైపోయింది. కాలుష్య జలాలతో స్నానం చేయడం వల్ల, బట్టలు ఉతకడం వల్ల నాగరికులు రోగగ్రస్తులవుతున్నారు. అందువల్ల జనాభాకు అనుగుణంగా తగినన్ని వ్యర్థ నిక్షిప్త ప్రాంగణాలు-లాండ్‌ఫిల్ సైట్స్ నగరాలలో ఏర్పడాలి. అప్పుడు మాత్రమే చెత్తను లాండ్‌ఫిల్ సైట్స్‌లో నిక్షిప్తం చేయవచ్చు. నగరాలలో స్థలం లేదు. అందువల్ల చెత్తను శుద్ధి చేసి నిర్మూలించడానికి-ప్రాసెసింగ్ అండ్ డిస్పోజల్ ఆఫ్ వేస్ట్-వీలుగా శుద్ధి కర్మాగారాలను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఎన్‌జిటి ఆదేశించిందట. అగ్నివల్ల, నీటివల్ల, గాలివల్ల పరిసరాలు, పుడమి ఉపరితలం ప్రక్షాళన కావడం సనాతనమైన, శాశ్వతమైన, సహజమైన ప్రాకృతిక ప్రక్రియ. కానీ నాగరికతా వికృతి వ్యవస్థీకృతమైన తరువాత...??
ఈ ఏడాది నవంబర్ మొదటి వారంలో దేశ రాజధానిలో అనేక రోజులపాటు కాలుష్యపు పొగలు కమ్ముకున్నాయి. ఈ కాలుష్యానికి ఏకైక కారణం విష రసాయనాలు విస్తరించడం. అమెరికా వంటి ఘరానా దేశాలలో కాలిఫోర్నియా, లాస్‌ఏంజిలస్ వంటి స్వచ్ఛమైన నగరాలను ఐదారు దశాబ్దులుకు పూర్వమే ఇలాంటి కాలుష్యపు పొగలు కమ్ముకున్నాయి. కాలుష్యాన్ని ని రోధించడానికి హోమం చేయడం, యజ్ఞాలు చే యడం శాస్ర్తియ ప్రత్యామ్నాయమని, ఆ తరువాత అమెరికా వారు, ఐరోపా వారు కనిపెట్టినట్లు ప్రచారం చేసుకున్నారు. ఐరోపావారు కనిపెట్టడమే గొప్ప. ఈ సహజ ‘అగ్ని మాధ్యమ క్షాళన’ మనదేశంలో జీవన విధానమై ఉంది. హోమాల్లోను, యజ్ఞాలలోను ప్రాకృతిక పదార్థాలను దహించడం వల్ల ఆకాశం, పరిసరాలు శుభ్రమైపోవడమేకాక, ప్రకృతిలో నిరంతర సంతులనం ఏర్పడుతోంది. కానీ ఇప్పుడు తగులబెట్టడం వల్ల కాలుష్యం ఏర్పడుతోంది. ఆవునేయి, మంచి గంధాన్ని హోమం చేయడం వల్ల ప్రకృతి పరిశుభ్రం కాగలదు. కానీ ఆవునెయ్యి కల్తీ అయిపోయింది. ఆవులే ‘జెర్సీ’ తదితర పాశ్చాత్య బీజాల-బ్రీడ్స్-తో సంకరమైపోయాయి. అందువల్ల కల్తీనెయ్యి టన్నులకొద్దీ తగులపెట్టినప్పటికీ వాతావరణం శుభ్రపడడం లేదు. ప్లాస్టిక్ తగులబెడుతున్నారు. పారిశ్రామిక వ్యర్థాలను తగులబెడుతున్నారు. ఇలాంటి ‘అగ్ని కార్యాల’ వల్లనే ఢిల్లీ పొగచూరిపోయింది. ప్రక్షాళనకు ప్రాతిపదికమైన ‘అగ్ని’ ఇలా కాలుష్యానికి దోహదకారి కావడం విచిత్రమైన పరిణామక్రమం. దీనిపేరు ‘ప్రగతి’ ముసుగులో జరిగిన పాశ్చాత్యీకరణ, వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్- పేరుతో విస్తరిస్తున్న మారీచ మృగ మాయాజాలం. అందువల్ల ఢిల్లీని కాలుష్యపు పొగలు కమ్ముకొనడానికి కారణమైన విష రసాయన వ్యర్థ దహనాన్ని పెద్దగా ప్రచారం చేయడం లేదు. హర్యానాలో రైతులు గోధుమ గడ్డిని కాల్చడమే ఢిల్లీ కాలుష్యానికి ప్రధాన కారణమని ప్రచారం అయింది. గడ్డిలో కూడా రసాయన విషాలు చేరిపోవడం వేరేసంగతి.
హైదరాబాద్ మహానగరంలో చెత్తను నిర్మూలించడానికి ‘స్వచ్ఛత’ను పెంచడానికి తెలంగాణ ప్రభుత్వం, మహా నగరపాలిక చేస్తున్న యత్నాలు బూడిదలో పోసిన పన్నీరుగా మారుతున్నాయన్న ప్రచారం జరుగుతోంది. 22 లక్షల గృహాలకు ఇంటికి రెండు చొప్పున చెత్తబుట్టలను సరఫరా చేయడానికి ప్రభుత్వం నడుం బిగించింది. లక్షల బుట్టలను ఇప్పటికే సరఫరా చేసిందట కూడా. ఒక బుట్టలో తడిచెత్తను, మరో బుట్టలో పొడి చెత్తను వేసుకోవాలట. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేయడం ద్వారా స్వచ్ఛతను పెంచాలన్నది పథకం. కానీ, ఈ పథకాన్ని జనం అమలు చేయడం లేదట. ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు?