సంపాదకీయం

నగదులేని నాగరికం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నగదు రహిత నాగరికం గురించి ప్రభుత్వం వారు యాబయి రోజులకు పైగా విచిత్ర విన్యాసాలను ప్రదర్శిస్తున్నారు. నూతన ఆంగ్ల సంవత్సరం మొదలైన సందర్భంగా పాత సంవత్సరం చివరి రోజున ప్రధాన మంత్రి చేసిన శుభప్రసంగం ఈ వైచిత్రికి మరోసారి అద్దంపట్టింది. పాత ఐదువందల, వెయ్యి రూపాయల నోట్లు రద్దు చేయడం ప్రభుత్వం సాధించిన విప్లవాత్మక పరిణామం! ప్రభుత్వ సాహసం, ప్రజల త్యాగం మేలు కలయికగా యాబయి రోజుల పాటు కొనసాగిన ఈ పరిణామ క్రమం, ఈ కాలవ్యవధి ముగియడంతో పరిసమాప్తం అవుతుందన్నది త్యాగాలు చేసిన ప్రజలు కన్నకల! అందుకు ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు, రిజర్వ్‌బ్యాంక్ వారు, ఉన్నతోన్నత అధికారులు కల్పించిన విశ్వాసం. యాబయి రోజుల గడువు ముగిసిన వెంటనే ఆర్థిక కలాపాలు యథాపూర్వంగా కొనసాగుతాయన్నది ప్రభుత్వం కల్పించిన విశ్వాసం. నవంబర్ ఎనిమిదవ తేదీకి పూర్వం బ్యాంకుల ‘ఏటిఎమ్’ల ద్వారా ‘డెబిట్’ కార్డులున్నవారు రోజునకు నలబయివేల రూపాయల వరకూ తమ ఖాతాల నుంచి ఉపసంహరించుకొనడానికి వీలుండేది! అంతకుమించిన మొత్తాలను బ్యాంకులకు వెళ్లి తీసుకొనడానికి వీలుండేది! నోట్లు రద్దయిన నాటినుంచి యాబయి రోజులపాటు ఈ ఉపసంహరణలపై ఆంక్షలు అమలు జరిగాయి. ‘ఏటిఎమ్’ కార్డు ద్వారా ప్రతిరోజు రెండు వేల రూపాయలకంటె ఎక్కువ లభించలేదు! అందువల్ల ఒకే కార్డు ఉన్నవారు దాదాపు ప్రతిరోజు ‘ఏటిఎమ్’ల వద్ద బారులు తీరవలసివచ్చింది. కానీ ‘నల్లధనం’ నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం చేస్తున్న ‘యుద్ధం’లో నోట్లరద్దు భాగం కాబట్టి జనం కూడా సహకరించారు. కష్టనష్టాలు యాబైయి రోజుల తరువాత తొలగిపోగలవన్నది సామాన్య జనాల విశ్వాసం. నరేంద్రమోదీ ఈ త్యాగాలను తన ప్రసంగంలో ప్రశంసించడం.. అందువల్ల ప్రభుత్వం వారు ప్రజలకు తెలిపిన కృతజ్ఞత. ఇప్పుడు యాబయి రోజుల గడువు ముగిసింది. ‘బ్యాంకు’ లావాదేవీల వ్యవహారాలలో ప్రభుత్వం మాట నిలుపుకోవాలి! నవంబర్ ఎనిమిదవ తేదీకి పూర్వం వలె ‘ఏటిఎమ్’లలో ‘కార్డు’నకు నలబయి వేల రూపాయలవరకు- లేదా ఆయా బ్యాంకులు విధించిన గరిష్ఠ పరిమితివరకు-నగదును ఉపసంహరించుకోవడానికి వీలు కల్పించాలి! అలాగే బ్యాంకులకు వెళ్లి ఖాతాలనుంచి నగదు తీసుకునే పద్ధతిపై విధించిన, ‘వారానికి ఇరవై నాలుగు వేల రూపాయల’ గరిష్ఠ పరిమితిని ఎత్తివేయాలి! నరేంద్రమోదీ తన డిసెంబర్ ముప్పయి ఒకటవ తేదీనాటి ప్రసంగంలో ఈ సంగతులను మాత్రం ప్రస్తావించలేదు! ‘పరిమితులు’ ఎప్పుడు తొలగిపోతాయన్నది మధ్య తరగతి, సామాన్య ప్రజల మనస్సుల నుంచి తొలగని సందేహం....
‘ఏటిఎమ్’ల ద్వారా ఉపసంహరించుకునే మొత్తం పరిమితిని-ప్రతిరోజు ప్రతికార్డునకు-నాలుగువేల ఐదు వందల రూపాయలకు పెంచినట్టు, నరేంద్రమోదీ ప్రసంగం తరువాత, రిజర్వ్‌బ్యాంకు వారు అధికారికంగా ప్రకటించారట! కానీ బ్యాంకులలో నుంచి ఉపసంహరించుకొనే మొత్తాల పరిమితి మాత్రం వారానికి ఇరవై నాలుగు వేల రూపాయల నుంచి పైకి పెరగదట! నెలకు తొంబయి ఆరువేల రూపాయలకంటె ఎక్కువగా ‘సేవింగ్స్‌బ్యాంక్’ ఖాతాలున్న మధ్య తరగతి కుటుంబాల వారికి నగదు అవసరం లేదన్నది ప్రభుత్వ నిర్ధారణ! అలాంటప్పుడు ‘పరిమితి’ని విధించడం దేనికన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే రోజునకు నాలుగున్నర వేల చొప్పున నెలరోజులలో లక్షా ముప్పయి ఐదువేల రూపాయలకంటె ఉపయోగం మధ్య తరగతికి లేకపోవచ్చు! నిజంగా లేదు. అందువల్ల వారు ఏటిఎమ్‌లనుండి అంతకు మించిన మొత్తాలను ఉపసంహరించడం లేదు. ఈ యాబయి రోజులలో సైతం గరిష్ఠంగా అరవై వేల రూపాయలను- ఒక నెలలో-ఉపసంహరించిన ‘కార్డ్’ యజమానుల సంఖ్య తక్కువే! అందువల్ల కనీసం ఇప్పటికైనా ఎలాంటి పరిమితులను విధించకుండా ఉన్నట్టయితే ఆర్థిక వ్యవస్థ మామూలుగా కొనసాగడానికి వీలుంటుంది. కానీ పరిమితులన్నింటినీ తొలగిస్తామని ప్రధాన మంత్రి ప్రకటిస్తారని భావించినవారికి ఆశాభంగమైంది. ఒకరోజున గరిష్ఠంగా ఇరవై ముప్పయివేలు ‘కార్డ్’ ద్వారా ఉపసంహరించుకునే మధ్య తరగతి వారు మళ్లీ కనీసం పదిపదిహేను రోజుల వరకు ‘ఏటిఎమ్’లకు వెళ్లవలసిన పనిలేదు. కానీ ‘పరిమితి’వల్ల ప్రతి రోజుకాని, రోజు మార్చి రోజు కాని ‘ఏటిఎమ్’ల వద్ద నిలబడవలసి వస్తోంది. దీనివల్ల కృత్రిమంగా రద్దీ పెరుగుతోంది!
పెద్దనోట్ల రద్దునకు ప్రధాన ప్రాతిపదిక నల్లడబ్బును వెలికితీయడం! కానీ మధ్యలో ‘నగదు రహిత వాణిజ్యం’-కాష్‌లెస్ ఎకానమీ-డిజిటల్ ఎకానమీ-యాంత్రికమైన నగదు బదిలీ-వంటి పదజాలాన్ని ప్రభుత్వం ప్రచారం చేయడం గందరగోళానికి ప్రధాన కారణం! ‘‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ నవంబర్ డిసెంబర్ నెలల్లోనే అవతరించిందికదా...’’ అని చెప్పడం ‘చమత్కృతి’గా మారింది. ‘ఏటిఎమ్’లలో ‘నగదు’ ఉండని సమయమే సుదీర్ఘంగా కొనసాగింది కాబట్టి... ఇలాంటి ‘నగదు రహిత ఆర్థిక వ్యవస్థ’ను శాశ్వతంగా ప్రభుత్వం కొనసాగిస్తుందన్న భయాందోళనలు మోదీ నూతన సంవత్సర ప్రసంగం తరువాత నెలకొని ఉన్నాయి. వీటిని తొలగించాలన్నట్టయితే ‘పరిమితులను’ ఎత్తివేయాలి. ఎవరు ఎంత ఉపసంహరించుకున్నప్పటికీ ‘లావాదేవీలు’ నమోదవుతున్నాయి కనుక ‘నల్లడబ్బు’ బ్యాంకులలో జమ చేసినవారు చట్టం నుంచి తప్పించుకోలేరు. ఈ విషయం ప్రజలకంటె ప్రభుత్వ నిర్వాహకులకు బాగా తెలుసు! కానీ ‘పరిమితుల’ సంగతిని పక్కనపెట్టి ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆదివారం సాయంత్రం మరోసారి ‘డిజిటల్’ ప్రాశస్త్యాన్ని ప్రాధాన్యాన్ని ఏకరవుపెట్టాడు! ప్రధాన నగరాలలోను పట్టణాలలోను ‘కార్డుల’ను ‘స్వైప్’ చేసే పద్ధతిని పెట్రోల్ పంపులలోను, ‘మెగా’ దగా వాణిజ్య ప్రాంగణాలలోను ప్రవేశపెట్టినంత మాత్రాన నిత్యజీవితంలో ‘నగదు’ ప్రమేయం నామరూపాలు లేకుండా నశించిపోతుందని భావించడం ‘ప్రపంచీకరణ’ మత్తెక్కిన వారి స్వభావం. డెబ్బయిశాతం భారతీయులు పల్లెలలో ఉన్నారు. గూడెములలో ఉన్నారు. తండాలలో ఉన్నారు. వనసీమలలో ఉన్నారు. ఈ ప్రాంతాలన్నింటిలోనూ ‘స్వైపింగ్’ వ్యవస్థను, ఆన్‌లైన్-అంతర్జాల-వ్యవస్థను నెలకొల్పిన తరువాత మాత్రమే ‘డిజిటల్ ఎకానమీ’ గురించి మాట్లాడాలి! కరెన్సీ నోట్ల కొరత ఏర్పడింది కాబట్టి ‘డిజిటల్’ వ్యవస్థను గురించి ప్రచారం చేయడం గుర్రానికి ముందు బండిని నిలబెట్టడం వంటిది.
గృహనిర్మాణానికి గాను తీసుకొనే ఋణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీని తగ్గించడం, వరిష్ఠ పౌరులకు బ్యాంకులలో ఉన్న ‘జమ’లపై వడ్డీ పెంచడం వంటి పథకాలను ప్రధానమంత్రి ప్రకటించడం హర్షణీయం. ప్రధాని ప్రకటించిన రాయితీలనన్నింటినీ అమలు చేయనున్నట్లు అరుణ్‌జైట్లీ కూడా ఆదివారం హామీ ఇచ్చారు! కానీ ఈ పథకాలన్నీ పరిమిత సంఖ్యలోని ఖాతాదారులకు ప్రయోజనం కలిగిస్తాయి. ‘పరిమితులు’ ఎత్తివేయడం వల్ల మాత్రమే మొత్తం జనానికి ఆనందం కలుగుతుంది.. విజ్ఞత మరింతగా వికసించాలి!