సంపాదకీయం

పారదర్శక ప్రవృత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ పార్టీల పనితీరులో పారదర్శకత పెంపొందించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నడుం బిగించడం ‘నల్లధనంపై పోరాటం’లో మరో ముందడుగు. దేశ రాజధానిలో జరిగిన భారతీయ జనతాపార్టీ కేంద్రీయ కార్యకారిణి- నేషనల్ ఎగ్జిక్యూటివ్- సమావేశంలో మోదీ చేసిన ప్రసంగంలోను, సమావేశపు చర్చలలోను రాజకీయ పక్షాల అంతర్గత పారదర్శకత, ఎన్నికల్లో నల్లడబ్బు ప్రభావాన్ని నిరోధించడం ప్రధాన ఇతివృత్తం కావడం హర్షణీయం. దేశంలోని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వసూలు చేస్తున్న, దండుకొంటున్న నిధుల విషయంలో పారదర్శకత లేకపోవడం దశాబ్దుల వైపరీత్యం. ఇలా పారదర్శకత్వం లేకపోవడానికి ప్రధాన కారణం దాదాపు అన్ని రాజకీయ పక్షాలు ఎంతోకొంత నల్లడబ్బును దండుకుంటూ ఉండడం. వసూలైన మొత్తం నిధులన్నింటినీ వెల్లడించినట్టయితే ఎన్నికల ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టారన్న లెక్కలు కూడ వెల్లడించవలసి ఉంది. అలా వెల్లడించినట్టయితే దాదాపు అన్ని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు కూడ నిబంధనలు అనుమతిస్తున్న పరిమితికి మించి ఖర్చు చేసినట్టు స్పష్టమైపోతుంది. పరిమితికి లోబడి ఖర్చు చేసినట్టయితే వోటర్లను ప్రలోభ పెట్టడానికి, వోట్లను కొనుగోలు చేయడానికి వీలుండదు. పంచాయతీ ఎన్నికల నుంచి పా ర్లమెంటు ఎన్నికల వరకూ కూడ వోట్లను కొనుగోలు చేస్తున్నారన్న ఆరోపణలు నిరంతరం వెల్లువెత్తుతునే ఉన్నాయి. ఇంటింటికీ తి రిగి వివరాలు సేకరించి ‘వోటుకింత’ అని డబ్బు పంపిణీ చేయని ప్రధాన పక్షాల అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువ. ఎక్కువ మంది వోటర్లు కూడ అభ్యర్థుల వద్ద అంతోఇంతో పుచ్చుకోవడం పరిపాటి అయిపోయిందని ప్రచారమైంది. ‘మాకేమన్నా ఇచ్చిపోకూడదా!’ అని వోటర్లు స్వయంగా ప్రచార కార్యకర్తలను అడగడం కూడ బహిరంగ రహస్యం. ఇది ‘అనైతికత’ అన్న ‘అభిజ్ఞత’ వోటర్లకు లేకపోవడం కూడ రాజకీయ పక్షాలు రహస్యంగా ఖర్చు పెట్టడానికి దోహదం చేస్తోంది. ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనే ‘మహాజనం’లో ఎక్కువమందిని అభ్యర్థులు, రాజకీయ పార్టీలు నోట్లిచ్చి లారీలకెక్కించి తరలించు వస్తారన్నది నిరాకరింపజాలని నిజం. అందువల్ల కార్యకర్తలుగా చెలామణి అయ్యేవారిలో ఎక్కువ మంది కిరాయి జనం. డబ్బుకు ఇలా మందిని కొనడం పాపమని రాజకీయ పక్షాల వారు, డబ్బు తీసుకొని వోట్లు వేయడం పాపమని వోటర్లు గ్రహించడం ఒక్కటే ఎన్నికల ప్రక్రియలో నల్లడబ్బుకు విరుగుడు. సమాచారం పొందే హక్కు- రైట్ టు ఇన్‌ఫర్‌మేషన్- చట్టం ప్రకారం రాజకీయ పక్షాల నిధుల వివరాలను తెలుసుకొనే అవకాశం ఉండాలి. కాని ఈ చట్టాన్ని తమకు వర్తింపచేయరాదని దాదాపు అన్ని రాజకీయ పక్షాలు కోరాయి. తమ పార్టీ నిధుల వివరాలను వెల్లడించడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ‘్భజపా’ జాతీయ కార్యకారిణి సమావేశంలో మోదీ ప్రకటించడం పారదర్శకత పెంపొందడానికి దోహదం చేయగలదు. ‘్భజపా’కి నిధులు ఎలా లభిస్తున్నాయి? ఎవరు విరాళాలను ఇస్తున్నారు? అని తెలుసుకొనే హక్కు ప్రజలకుందని మోదీ స్పష్టం చేయడం గొప్ప ఆదర్శం.
ఈ ఆదర్శాన్ని అన్ని రాజకీయ పార్టీలూ అనుసరించవలసి ఉంది. అన్ని రాజకీయ పక్షాలు స్వచ్ఛందంగా తమకు విరాళాలను ఎవరెవరు ఇస్తున్నారో ప్రకటించినట్టయితే పారదర్శకత్వం పెరుగుతుంది. ప్రజాప్రాతినిధ్యపు చట్టంలోని నిబంధనల ప్రకారం ఇరవై వేల రూపాయల వరకూ విరాళాలను ఇచ్చే ‘ప్రదాత’ల పేర్లను రాజకీయ పక్షాలు వెల్లడించనక్కర్లేదు. అందువల్ల నల్లడబ్బు భారీ ప్రమాణంలోనే పార్టీలకు లభిస్తోందన్నది ఎన్నికల సంఘం వ్యక్తం చేసిన సందేహం. ఇటీవల బహుజన సమాజ్ పార్టీ వారి బ్యాంకు ఖాతాల్లో వంద కోట్ల రూపాయలు జమ అయిందట! అదంతా లెక్కల్లో చూపించామని, అది సక్రమమైన నిధి అని ‘బసపా’ అధినేత్రి మాయావతి ఆ తర్వాత వివరణ ఇచ్చింది. అయితే, ఆ నిధిని ఎవరెవరు ఇచ్చారన్న వివరాలను ఆ పార్టీవారు బయటపెట్టాలి. అలాగే మోదీ స్వయంగా ప్రకటించాడు కనుక ‘్భజపా’ వారు కూడ తమ పార్టీకి విరాళాలను సమర్పించిన వారందరి పేర్లు స్వచ్ఛందంగా బయటపెట్టాలి. అలా జరిగినట్టయితే మిగిలిన రాజకీయ పార్టీలు దాతల పేర్లను బయటపెట్టక తప్పదు. నిబంధనలను సవరించాలని, రెండు వేల రూపాయల కంటె ఎక్కువ నిధులను సమర్పించే వారి పేర్లను రాజకీయ పార్టీలు వెల్లడించాలని నూతన నిబంధనను రూపొందిచాలని ఎన్నికల సంఘం ఇటీవల సూచించింది. దీనివల్ల పారదర్శకత పెరుగుతుందట!
ఎన్నికల కమిషన్ ఇలా ప్రతిపాదన చేసినందుకు డిసెంబర్ ఇరవయ్యవ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగిన ‘పరివర్తన’ సభలో మోదీ ప్రశంసలు కురిపించాడు. ఈ కొత్త నిబంధనను చట్టంలో చేర్చవలసిన బాధ్యత ప్రభుత్వానిది. అందువల్ల బడ్జెట్ సమావేశాలలో ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణ చేయవచ్చు. కానీ రాజకీయ పక్షాల వారు రెండువేల రూపాయల కంటె తక్కువ విరాళాలను చెల్లించే వారి పేర్లను సైతం ఎందుకు వెల్లడించరాదు? విరాళాలనిచ్చే ‘ప్రదాతలు’ ఆ డబ్బును సక్రమ పద్ధతులలోనే సముపార్జించి ఉన్నట్టయితే ఆ పేర్లను వెల్లడించడంలో తప్పేమిటి? ఎలాంటి గరిష్ట, కనిష్ట పరిమితులు లేని రీతిలో ప్రతి రూపాయి విరాళం ఇచ్చే ప్రదాత పేరు వెల్లడి చేయడం తప్పనిసరి చేస్తూ చట్టాన్ని సవరించాలి. విరాళాలిచ్చే ‘ప్రదాతలు’ ప్రభుత్వ ఉద్యోగులు కూడ కావచ్చు. ప్రభుత్వ ఉద్యోగి అయినంత మాత్రాన వోటు వేయరాదన్న నిబంధన లేదు. వారు ఎవరికి వోటు వేశారన్నది గోప్యంగా ఉంటుంది. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడ తమకు నచ్చిన రాజకీయ పక్షానికి విరాళాలను ఇచ్చినందువల్ల వారు ఆయా పక్షాల సభ్యులైనట్టు కాదు. కానీ ఎన్నికల విధులను నిర్వహించే అధికారులు, సిబ్బంది ఇలా విరాళాలను ఇచ్చినట్టు వెల్లడైతే ప్రత్యర్థి రాజకీయ పక్షాలు వారి నిష్పాక్షికతను అనుమానించే అవకాశం లేకపోలేదు. ఎన్నికల ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రభుత్వ అధికారులు, ఉద్యోగుల నుంచి రాజకీయ పక్షాలు నిధులను వసూలు చేయకపోవడం మేలు. అన్ని విరాళాల ప్రదాతల పేర్లనూ రాజకీయ పక్షాలు వెల్లడించి తీరాలన్న నిబంధనను చట్టంలో పొందుపరచినట్టయితే ఈ మేలు వ్యవస్థీకృతం కాగలదు. ఇదంతా ఒక ఎత్తు. నిబంధనలున్నప్పటికీ రాజకీయ పక్షాలు వాటిని పాటించకపోవడం మరో ఎత్తు. విరాళాలను సేకరించిన పక్షాలు వాటిని నమోదు చేయకుంటే ఏం జరుగుతుంది?
ఈ ప్రశ్నకు సమాధానం- రాజకీయ వేత్తలలో మాత్రమే కాక సమష్టి ప్రజా స్వభావంలో నైతిక భావాలు వికసించడం. ఈ నైతికత వికసించకపోవడం వల్లనే అనేక రకాల ముఠాలు చిన్న రాజకీయ పార్టీలను స్థాపించి డబ్బు దండుకుని భోంచేస్తున్నాయి. నల్లధనం విస్తరించడానికి ఇలాంటి నామమాత్రపు పక్షాలు దోహదం చేస్తున్నాయని ఎన్నికల కమిషన్ అనుమానిస్తోందట. అందువల్ల నైతిక స్వభావం వికసించడం వౌలికమైన సమస్య. ఇలా వికసింపచేసే ప్రక్రియ బడులలో, కళాశాలలో మొదలుకావాలి. ‘నత్వహం కామయె రాజ్యం నస్వర్గం నా పునర్భవం’ - ‘నేను అధికారాన్ని, స్వర్గాన్ని, మోక్షాన్ని కోరడం లేదు. నిరుపేదల అభ్యుదయం మాత్రమే నా కోరిక’ అన్న రంతిదేవుని ఆకాంక్షను మోదీ ‘్భజపా’ కార్యకారిణి సమావేశంలో ఉటంకించాడట. ఈ ప్రవృత్తి పెంపొందాలి.