సంపాదకీయం

అబద్ధానికి అభిశంసన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నైతిక నిష్ఠ మరోసారి ధ్రువపడింది. మోదీపై బురద చల్లబోయిన కాం గ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి శృంగభంగమైంది. జనం ఎదుట ముఖం ఎత్తుకొనలేని స్థితి దాపురించింది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయనకు, ఇతర రాజకీయ ప్రముఖులకు బిర్లా-సహారా వాణిజ్య సంస్థలు లంచాలు ఇచ్చినట్టు రాహుల్ ఆర్భాటంగా చేసిన ఆరోపణలు పచ్చి అబద్ధాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం స్పష్టీకరించడం ఇందుకు ప్రమాణం! నరేంద్ర మోదీ నిజాయితీ న్యాయప్రక్రియ గీటురాయిపై నిగ్గు తేలడం మాత్రమే కొత్త సమాచారం. దశాబ్దుల రాజకీయ జీవన ప్రస్థాన క్రమంలో ఆయనకు అవినీతి బురద అంటకపోవడం పాత విషయం, జనమెరిగిన సత్యం. ఈ సత్యాన్ని జనవరి పదకొండవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం పునరుద్ఘాటించినట్టయింది! మోదీకి, ఇతర ప్రముఖులకు బిర్లా, సహారా సంస్థలు ముడుపులు చెల్లించినట్టు ఆరోపించడానికి వీలుగా రాహుల్ ఆర్భాటంగా దృశ్యమాధ్యమాలలో బయటపెట్టిన ఆధారపత్రాలు ఆ సంస్థల చిట్టాలలోవి కాని పేజీలు! ఈ చిట్టాలలోని ఈ పేజీలను నమ్మడానికి వీలు లేదని, ఈ పేజీలలోని వ్రాతల ప్రాతిపదికగా నరేంద్ర మోదీ తదితర రాజకీయ ప్రముఖులకు వ్యతిరేకంగా దర్యాప్తును ఆదేశించడానికి వీ లు కాదని సర్వోన్నత న్యాయస్థాన ధర్మాసనం సభ్యులు అరుణ్‌కుమార్ మిశ్రీ, అమిత్ వరాయ్ స్పష్టం చేయడం ఆషామాషీ ఆరోపణలు చేసే వెకిలి గాళ్లకు చెంపపెట్టు వంటిది. మన దేశంలో కంటె ఇతర దేశాలలో సరదాగా షికార్లు కొట్టడం ప్రవృత్తి అయిన రాహుల్ గాంధీ ఇలాంటి వెకిలి వేషాలవాడు! డిసెంబర్ చివరి వారంలో నాటకీయ పద్ధతిలో ‘సహారా సంస్థ వారు మోదీకి చెల్లించిన లంచాలను బయటపెట్టిన’ రాహుల్ గాంధీ అప్పుడే దేశప్రజల దృష్టిలో నవ్వులపాలయ్యాడు. ఎందుకంటే ఈ సహారా పత్రాలను విశ్వసించడానికి వీలులేదని సర్వోన్నత న్యాయస్థానం గతంలో స్పష్టం చేసింది. మరో వివాదం విచారణ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం ఈ స్పష్టీకరణ ఇచ్చిందట.. అందువల్ల అసత్యాలను దుర్బుద్ధి పూర్వకంగా ప్రచారం చేయయత్నించిన రాహుల్‌గాంధీకి ఇప్పుడు మరోసారి తలబొప్పి కట్టినట్టయింది. ఈ సహారా పత్రాలలోని ఆరోపణలకు సామంజస్వం కాని ప్రామాణికత కాని లేదని కాంగ్రెస్ వరిష్ఠ నాయకురాలు, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్ బహిరంగంగానే ప్రకటించింది. ఆమెను ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి పదవికి అభ్యర్థినిగా ప్రకటించారు. ఇలా ప్రకటించడం ఈ దశాబ్ది చతురోక్తి అయినప్పటికీ షీలాదీక్షిత్‌కు కొంత ప్రామాణికత ఉంది! రాహుల్ గాంధీ ఆరోపణలను ఇలా బహిరంగంగానే నిరాకరించిన ఆమెకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎలాంటి చర్యను తీసుకోలేదు!
రాహుల్ గాంధీ మాటలను ఇలా సొంత పార్టీ కార్యకర్తలే పట్టించుకొనకపోవడం అతగాడి విశ్వసనీయతకు ప్రధానమైన గీటురాయి. రాహుల్ కుటుంబపు నాయకత్వం కొనసాగినంత కాలం కాంగ్రెస్ మళ్లీ ఏ ఎన్నికలలో కూడా విజయం సాధించే ప్రసక్తి లేదన్న వాస్తవాన్ని పంచాయతీ స్థాయి నుంచి పార్లమెంట్ స్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ పెద్దలు, కార్యకర్తలు గుర్తించి చాల రోజులైంది. అందువల్ల వారంతా నిర్లిప్తంగా పరాజయ పరంపరల కోసం ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ అనుకూల ప్రచార మాధ్యమాల వారికి సైతం రాహుల్ గాంధీ మాటలకు ప్రాధాన్యం ఇవ్వలేని స్థితి ఏర్పడిపోయింది. జిల్లా కాంగ్రెస్ నాయకుని స్థాయి కూడా లేని రాహుల్ గాంధీని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్ష పదవీ సువర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టాలన్న వందిమాగధ బృందానికి సైతం ఆయన ఆషామాషీ ప్రవర్తన, వెకిలి చేష్టలు కొరుకుడు పడడం లేదన్నది బహిరంగ రహస్యమైపోయింది! ఈయనగారు మాధ్యమాల ప్రతినిధుల సమావేశంలో గొంతెత్తగానే ఒకరి తరువాత ఒకరుగా ప్రతినిధులు చల్లగా జారుకుంటున్నారు. బహిరంగ సభలలో వీరి అనుగ్రహ భాషణలను భరించలేక జనం పారిపోతున్న దృశ్యాలు తరచూ ఆవిష్కృతమవుతున్నాయి. లోక్‌సభలో రాహుల్‌గాంధీ మాట్లాడిన సందర్భాలు బహు తక్కువ. ఎందుకంటే అక్కడ ప్రస్తావించదగిన సమాచారం గురించి ఇతగాడికి తెలిసింది దాదాపు సున్న. అందువల్ల రాహుల్ గాంధీని ఎవ్వరూ ప్రామాణికుడిగా కాని, ప్రచార కర్తగాగానీ ఇంతవరకు గుర్తించలేదు!
కేంద్ర ప్రభుత్వం నకిలీ డబ్బుకు, నల్లడబ్బుకు వ్యతిరేకంగా యుద్ధం ప్రారంభించగానే దేశంలోని అవినీతిపరులైన ఘరానాలకు గొప్ప అసౌకర్యం ఏర్పడిపోయింది. పెద్దనోట్ల రద్దు వల్ల జరగకూడనిది ఏదో జరిగిపోతున్నట్టు ప్రచారం మొదలైంది! ప్రతిపక్షాలు ఉమ్మడి వేదికను ఉపయోగించుకుని సం దులో సమారాధన నిర్వహించడానికి కాం గ్రెస్ పార్టీ నడుం కట్టింది. అందువల్ల విశ్రాంతి తీసుకొనడం ప్రధాన వృత్తిగా ఉన్న రాహుల్ గాంధీ ఉద్యమించక తప్పలేదు. ఈ ఉద్యమం ద్వారా తనకు ప్రతిపక్షాల ఉమ్మడి నాయకత్వం దక్కిపోతుందని కలలు కన్న ఆయన కలలు కల్లలుగానే మిగిలాయి. నోట్ల రద్దు వ్యతిరేక ఉద్యమాన్ని ప్రతిపక్షాలు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న రీతిలో నిర్వహించాయి. (దిల్లీ నగరం యమునా నదీ తీరంలోనే ఉంది.) రాహుల్‌గాంధీతో జట్టుకట్టడానికి బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ మినహా మరే ప్రధాన ప్రాంతీయ పార్టీ కూడ ముందుకు రాలేదు. జట్టుకట్టిన మమతా బెనర్జీ ఉమ్మడి నాయకత్వాన్ని కాంగ్రెస్‌కు దక్కనివ్వలేదు.కాంగ్రెస్, తృణమూల్ పక్షాల ఉమ్మడి నాయకత్వాన్ని ఆమె తన నోటి ప్రాబల్యం ద్వారా తానే దక్కించుకుంది. అందువల్ల దిక్కుతోచని రాహుల్‌గాంధీకి వందిమాగథ బృందం వారు సలహా చెప్పి ఉంటారు. కుండను పగలగొట్టాలి, బట్టలను చింపుకోవాలి, గాడిద వలె ఓండ్రపెట్టాలి.. ఏదో ఒక ఉపాయంతో ప్రసిద్ధ పొందాలి అన్న సామెతను వారు బహుశా రాహుల్‌గాంధీకి చెప్పి ఉండవచ్చు. ‘ఘటం భింద్యాత్ పటం ఛింద్యాత్, కుర్వాత్ వా గార్ద్భ స్వరం, ఏనకేనపి ఉపాయేన ప్రసిద్ధ పురుషోభియేత్..’
రాహుల్‌గాంధీ ఇలా కుండను పగలగొట్టాడు. సహారా నుండి నరేంద్ర మోదీకి నలబయి కోట్ల రూపాయలు లభించినట్టు డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆరోపించాడు. అయితే, ఈ కుండ పగిలిన చప్పుడు కాంగ్రెస్‌లోనే వినిపించలేదు. మిగతా ప్రతిపక్షాలు వినలేదు! మోదీపై రాహుల్ చేసిన అవినీతి ఆరోపణల స్వరూపం ఏమిటో మాకు తెలీదు అని ఆయనతో కలిసి ఉమ్మడి వేదికలపై కూర్చుండిన ప్రతిపక్షాలు చెప్పాయి. ఆ తరువాత ప్రతిపక్షాల వారు రాహుల్‌గాంధీతో కలిసి కూర్చోవడమే మానుకున్నారు. మళ్లీ దిక్కుతోచని రాహుల్ డిసెంబర్ చివరి వారంలో విదేశాలకు విశ్రాంతి కోసం వెళ్లిపోయాడు. సుప్రీం కోర్టు వారు ఇలాంటి ఆకతాయి అల్లరి చిల్లరి అసత్యపు ఆరోపణలను నిరాకరించడం ఇలాంటి మరికొందరికి గుణపాఠం. దేశ ప్రజలకు క్షమార్పణ చెప్పాలన్న బుద్ధి రాహుల్‌గాంధీకి పుట్టకపోవడం ఆశ్యర్యకరం కాదు..