సంపాదకీయం

‘ప్రచ్ఛన్న’ ప్రమేయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన స్థూల జాతీయ ఉత్పత్తి ఈ ఆర్థిక సంవత్సరంలో ఎనిమిది శాతం పెరుగుతుందన్నది ‘నీతి ఆయోగ్’ చేసిన నిర్ధారణ. మన దేశపు స్థూల జాతీయ ఆదాయం ఈ ఆర్థిక -2016,2017- సంవత్సరంలో ఏడు శాతం పెరుగుతుందన్నది ‘ప్రపంచబ్యాంక్’ వారు చేసిన నిర్ధారణ. ఈ సమాంతర నిర్ధారణలలో ఇలా ఒక శాతం అంతరం ఏర్పడి ఉండడం విచిత్రమైన వ్యవహారం. ప్రస్తుతం మన స్థూల జాతీయ ఉత్పత్తి -గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పరిమాణం దాదాపు కోటి ఇరవై మూడు లక్షల కోట్ల రూపాయలు. అందువల్ల ఒక శాతం ‘తేడా’ విలువ లక్షా ఇరవై మూడువేల కోట్ల రూపాయలు. ఈ ‘తేడా’ మన రక్షణ వ్యయంలో దాదాపు సగం. ఎనిమిది శాతం పెరిగినట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి మన ‘జిడిపి’ పరిమాణం దాదాపు కోటి ముప్పయి మూడు లక్షల కోట్లు కాగలదు. ప్రపంచబ్యాంకు వారి లెక్కల ప్రకారం ఈ ‘పరిమాణం’ లక్షా ఇరవై మూడువేల కోట్లు మేర తగ్గిపోయినట్టవుతుంది. ప్రపంచ బ్యాంకువారు ఇలా ‘తక్కువ’ వృద్ధిని ఎందుకని అంచనా వేస్తున్నారు? ఎవరి అంచనా తప్పు?? ‘నీతి ఆయోగ్’ చేసిన అంతర్గత నిర్ధారణ సరిఅయినదా? ప్రపంచబ్యాంకువారి అంతర్జాతీయ నిర్ధారణ సరిఅయినదా? మనదేశంలోని రాజకీయ వేత్తలు, మేథావులు ఆర్థిక నిపుణులు, ప్రచార మాధ్యమాల వారు ‘అంతర్గత నిర్ధారణ’లకంటె అంతర్జాతీయ నిర్ధారణలకు ప్రాధాన్యం ఎక్కువ కల్పించడం నడుస్తున్న చరిత్ర! మన పొరుగున చైనా అంతర్జాతీయ అభిప్రాయంకంటె అంతర్గత నిర్ధారణలకు అధిక ప్రాధాన్యం ఇస్తోంది! అందువల్లనే ప్రపంచబ్యాంకువారు కాని, ఇతరేతర అంతర్జాతీయ సంస్థలుకాని చైనా అంతర్గత ఆర్థిక వ్యవస్థ గురించి తమ ‘అంచనాల’ను పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఏమాత్రం ‘తేడా’ కనిపించినప్పటికీ చైనా ప్రభుత్వం పెద్దనోటితో అంతర్జాతీయ సంస్థలపై విరుచుకొని పడుతుంది! మన ప్రభుత్వం ‘నీళ్లు నములుతూ’ ఉంటుంది! మన ‘నిర్ధారణ’కంటె ప్రపంచబ్యాంకువారి ‘నిర్ధారణ’ సరియైందన్న అభిప్రాయం లేదా భ్రాంతి వ్యాపించే విధంగా మనదేశంలో విశే్లషణలు కూడా కొనసాగుతున్నాయి! మన ప్రభుత్వ సంస్థ -నీతిఆయోగ్- అంచనా వేసినట్టు ఎనిమిది శాతం ‘జిడిపి’ పెరుగుదల సాధ్యం కాదన్న అనుమానాలు ప్రచారమవుతున్నాయి. ఎందుకంటె ఐదువందల రూపాయల, వెయ్య రూపాయల ‘పెద్ద’ కరెన్సీ నోట్లు రద్దయిపోయినందువల్ల సంభవించే ప్రభావాన్ని- లేదా ప్రమాదాన్ని- ‘నీతి ఆయోగ్’వారు పరిగణించలేదన్నది జరుగుతున్న ప్రచారం. అంటే పెద్దనోట్లు రద్దువల్ల ‘జిడిపి’ ప్రగతి ఒకశాతం మేర తగ్గిపోవచ్చునన్నది ప్రపంచబ్యాంకు నిర్ధారణలను నిజమని ప్రచారం చేయడానికి యత్నిస్తున్నవారు తేల్చదలచిన ‘నిగ్గు’...
ఇలా ‘నిగ్గు’ తేల్చడానికి యత్నిస్తున్నవారు నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి పరోక్షంగా కృషి చేస్తున్నారు. పెద్దనోట్ల రద్దువల్ల ‘ప్రగతి’ స్తంభించిపోయిందని ఆర్భాటం చేస్తున్న రాజకీయ ప్రతిపక్షాల వాదాన్ని ఈ పరోక్ష ప్రత్యర్థులు ఆర్థిక సిద్ధాంతాల ద్వారా ధ్రువపరుస్తున్నారు. అంటే ‘‘పెద్దనోట్లు రద్దు చేయడం తప్పు’’ అన్నది ఇలాంటి ప్రచ్ఛన్న విరోధుల వాదం. వీరు తమ వాదాన్ని నిరూపించుకొనడానికి ‘ప్రపంచబ్యాంకు’ నిర్ధారణ ఆయుధంగా లభించింది! పెద్దనోట్లు రద్దువల్ల నల్లడబ్బు సంచులున్నవారి ‘ప్రగతి’ స్తంభించి ఉండవచ్చు! కానీ దానివల్ల ‘తెల్లడబ్బు’ ప్రాతిపదికగా నిర్ధారణ జరుపుతున్న ‘జిడిపి’ పరిమాణం ఎలా తగ్గిపోతుంది!! ఇలాంటి తర్కానికి నిలబడని నిర్ధారణలు జరిగిపోతున్నాయి. మనదేశపు ఆర్థిక స్వాభిమాన స్వయం సమృద్ధిని, సాంస్కృతిక అస్తిత్వ పరిరక్షణకు దోహదం చేసే పరిణామాల ప్రాధాన్యం తగ్గించడం, వ్యతిరేక పరిణామాల ప్రాధాన్యం పెంచడం లక్ష్యాలుగా అంతర్గతంగానే ఒక విపరీత విచారధార కొనసాగుతోంది. ఈ విచారశీలులు దేశానికి ‘హిత శత్రువులు’. గొప్ప తార్కిక సమీక్షల పేరుతో లోపాలున్నట్లు ధ్వనింపచేయడం వీరి పని. అందువల్ల ‘స్థిరాస్తి వ్యాపారుల’ -రియల్ ఎస్టేట్ బిల్డర్స్- ‘ప్రగతి’ తగ్గిపోయిన సంగతి గొప్ప గా ప్రచారవౌతోంది! ‘నోట్ల రద్దు’ వల్ల నల్లడబ్బు ప్రభావం తగ్గింది. ఫలితంగా ‘స్థిరాస్థి’ రంగంలో ధరలు తగ్గి మధ్య తరగతికి మేలు జరుగుతుంది. దీన్నిగురించి పెద్ద ప్రచారం లేదు! వేసవిలో సామాన్యులకు మంచినీరు తగినంత దొరకకపోవడం కంటె, నీటి కొరత వల్ల ‘బీరు’ ఉత్పత్తులు తగ్గిపోవడం గురించి ‘విపరీత విచార శీలులు’ ఎక్కువ ‘బాధ’ను ప్రచారం చేయడం ఒక ఉదాహరణ మాత్రమే!
అందువల్ల ‘నీతిఆయోగ్’ నిర్ధారణ నోట్లు రద్దువల్ల తప్పిపోతోందని ప్రపంచబ్యాంకువారు కనిపెట్టినట్లు ఒకశాతం మేర మన ‘జిడిపి’ పెరుగుదల తగ్గిపోతుందని ‘అంతర్గత’ విపరీత విచార శీలురు కనిపెట్టారు. ఇలా ప్రపంచబ్యాంకు నిర్ధారణలను, ‘మూడీస్’, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’వంటి ‘పరపతి అంచనాల’ అంతర్జాతీయ సంస్థల ‘పరిశోధక ఆవిష్కరణల’ను ప్రశంసించడం మన దేశంలో ‘అంతర్జాతీయస్థాయి’కి నిదర్శనం. మూడీస్, ‘స్టాండర్డ్ అండ్ పూర్స్’ వంటివి వివిధ దేశాల ‘పరపతి స్థాయి’ని ఎప్పటికప్పుడు నిర్ధారించి సలహాలనిస్తుంటాయి, హెచ్చరికలు చేస్తుంటాయి. ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత ఈ ‘స్వచ్ఛంద’ సంస్థలు మాత్రమే కాక ‘ప్రపంచబ్యాంకు’, ‘అంతర్జాతీయ ద్రవ్యనిధి’ వంటి అధికారిక సంస్థలు సైతం ‘సబ్సిడీ’లను ఎత్తివేయాలని ప్రవర్ధమాన దేశాలకు నిరంతరం సలహాలిస్తున్నాయి. ఈ సంస్థలు కోరుతున్న ప్రధాన ‘సంస్కరణ’ ఇది. ఇలా ప్రవర్ధమాన దేశాలలో ‘సబ్సిడీ’లు రద్దయినట్టయితే వ్యవసాయం, పారిశ్రామిక ఉత్పత్తుల ఉత్పాదక వ్యయం పెరుగుతుంది. ఫలితంగా అంతర్జాతీయ విపణిలో ప్రవర్ధమాన దేశాల వస్తువుల ధరలు, సంపన్న దేశాల వస్తువుల ధరలకంటె ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కొనుగోలు చేసేవారు అధిక ధరల ‘ప్రవర్ధమాన’ వస్తువులను కొనరు. తక్కువ ధరల ‘సంపన్న’ సామాగ్రిని కొంటారు. ఫలితంగా ప్రవర్ధమాన దేశాల వస్తువులు అమ్ముడుపోవు, వాణిజ్యం లోటు పెరిగిపోతుంది! ఇదంతా సంపన్న దేశాల దీర్ఘకాల వ్యూహంలో భాగం! ప్రపంచబ్యాంకును సంపన్న దేశాలు పరోక్షంగా నియంత్రిస్తున్నాయి. అందువల్ల ప్రపంచబ్యాంకు వారు ‘సంస్కరణ’లను అమలు జరపాలని, లేనట్టయితే ‘జిడిపి పెరుగుదల’ తగ్గిపోతుందని మనదేశంవంటి ప్రవర్ధమాన దేశాల వారిని హెచ్చరిస్తూ ఉంటుంది! ‘నీతిఆయోగ్’ నిర్ధారణకు, ప్రపంచబ్యాంకు నిర్ధారణకు మధ్య ఇలా అంతరం ఉండడానికి ఇదీ నేపథ్యం...
సంపన్న దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ మన దేశంలో నిర్నిరోధంగా చొరబడిపోవడానికి, విస్తరించిపోవడానికి వీలు కల్పించడం ప్రపంచబ్యాంకు కోరుతున్న సంస్కరణలలో మరో ప్రధాన అంశం. ఈ నిర్నిరోధపు చొరబాటును అమెరికా కోరుతోంది. ఐరోపా కోరుతోంది. చైనా కోరుతోంది. ఈ సంపన్న దేశాల మాట ప్రపంచబ్యాంకు నోట తరచూ వినిపిస్తోంది. మన అంతర్గత వ్యవహారాలలో విదేశీయ ప్రభుత్వాల, తథాకథిత -సోకాల్డ్- అంతర్జాతీయ సంస్థల రాజకీయ, దౌత్య ప్రమేయం ప్రత్యక్షంగా సాగుతోంది! కానీ ఆర్థిక వాణిజ్య రంగాలలో ఈ అక్రమ ప్రమేయం ప్రచ్ఛన్నంగా కొనసాగుతోంది. మన ‘జిడిపి’ పెరుగుదలను ‘ప్రపంచబ్యాంకు’ కొన్ని నెలల వ్యవధిలోనే మూడుసార్లు తగ్గించడం ఈ పరోక్ష అక్రమ ప్రమేయం.. మన ప్రభుత్వాలు ఈ పరోక్ష ప్రమేయాన్ని నిరసించడం లేదు. ఈ అక్రమ పరోక్ష ప్రమేయ ప్రభావానికి గురయిపోతుండడం వౌలిక వైపరీత్యం.