సంపాదకీయం

హఫీజ్ ‘నిర్బంధం’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హఫీజ్ సరుూద్ అనే జిహాదీ హంతకుడిని నిర్బంధించే నాటకాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం మళ్లీ ఆరంభించింది. జిహాదీ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం గుర్తించింది. అయితే పాకిస్తాన్ ప్రేరిత ఉగ్రవాదులు కేవలం మన దేశంలో బీభత్సకాండ సాగిస్తున్నంత వరకూ ‘అంతర్జాతీయ సమాజం’ పాకిస్తాన్ వ్యతిరేక చర్యలకు పూనుకొనడం లేదు. అంతర్జాతీయ సమాజం అంటే ప్రధానంగా అమెరికా, రష్యా, చైనా, ఐరోపా దేశాల ప్రభుత్వాలు! ఈ సంపన్న దేశాలు తమ జాతీయ సమస్యలను అంతర్జాతీయ సమస్యలుగాను, తమ జాతీయ హితాన్ని అంతర్జాతీయ హితంగాను చిత్రీకరిస్తుండడం నడుస్తున్న చరిత్ర! ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశ ప్రయోజన పరిరక్షణ కోసం అంతర్జాతీయ జిహాదీ ముష్కరులపై యుద్ధం ప్రకటించాడు! ఇందులో భాగంగా ఏడు ఇస్లాం జన బాహుళ్య దేశాల నుంచి ఎవ్వరినీ తమ దేశంలోకి రానివ్వబోనని ప్రకటించాడు. ఇలా జిహాదీల దుర్మార్గపు చేష్టలకు గాను మొత్తం ఆయా దేశాల జనాభాపై ఆంక్షలు విధించడం స మంజసమా? కాదా? అ న్నది విషయాంతరం. కానీ, ఇరాక్, ఇరాన్, యెమెన్, సోమాలియా, సూడాన్, లిబియా, సి రియా దేశాల వారు అమెరికాలో ప్రవేశించకుండా నిరోధించడానికి ట్రంప్ చేసిన ప్రయత్నం పాకిస్తాన్ సర్కారుకి గొప్ప గుణపాఠం. ఎందుకంటే ఈ దేశాలన్నింటి కంటే అధికంగా జిహాదీ బీభత్సకారులు పాకిస్తాన్‌లో చెలరేగుతున్నారు. అందువల్ల తమ దేశ వాసులను సైతం ట్రంప్ అమెరికాలో ప్రవేశించనీయకుండా నిరోధించగలడన్న భయం పాకిస్తాన్ ప్రభుత్వానికి పట్టుకొంది. తమ దేశాన్ని బీభత్స రాజ్యాంగ వ్యవస్థ- టెర్రరిస్ట్‌రిజీమ్-గా ట్రంప్ ప్రభుత్వం ప్రకటించే ప్రమాదం ఉందని పాక్ ప్రభుత్వం గ్రహించినట్టుంది. అందువల్లనే 2008 నవంబర్‌లో ముంబయిలో దారుణ మారణకాండ జరిపించిన నరరూప పిశాచి హఫీజ్ సరుూద్‌ను గృహనిర్బంధానికి గురిచేసినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ఇపుడు మళ్లీ ప్రకటించింది. ఇలా హఫీజ్‌ను గృహనిర్బంధం పాలుచేసినట్టు పాక్ ప్రభుత్వం 2008 డిసెంబర్ నుంచి పలుసార్లు ప్రకటించింది. హఫీజ్ ముంబయి హత్యాకాండకు సూత్రధారి అని ఐక్యరాజ్య సమితి 2008 డిసెంబర్‌లో నిర్థారించడం ఇందుకు కారణం. అమెరికా ప్రభుత్వం కూడా హఫీజ్‌ను దోషిగా నిర్థారించడం మరో కారణం. కానీ, ఈ ‘నిర్బంధాలన్నీ’ ప్రపంచ దేశాలను వంచించడంలో భాగమని ఆ తర్వాత ధ్రువపడింది. అందువల్ల పాకిస్తాన్ తన వంచన క్రీడను మళ్లీ ఆరంభించినట్టు అనుమానం కలగడం సహజం..!
హఫీజ్ ‘లష్కర్ ఏ తయ్యబా’, ‘జమాత్ ఉద్ రావా’ వంటి జిహాదీ ముఠాలను స్థాపించాడు. ఈ ముఠాలు రెండూ ఏళ్ల తరబడి మన దేశంలో హత్యాకాండ కొనసాగిస్తున్నాయి. 2008 నవంబర్‌లో ముంబయిలో ఈ ముఠాలు సాగించిన బీభత్సకాండకు నూట అరవై మంది బలయ్యారు. అనేకమంది గాయపడ్డారు. ఈ ఘోరకాండ కంటే ముందు, తర్వాత కూడా హఫీజ్ తండాలు మన దేశంలో హత్యాకాండ సాగించడం జగమెరిగిన సత్యం. హిజ్‌బుల్ ముజాహిదీన్, జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్, సిమి, ఇండియన్ ముజాహిదీన్ వంటి పేర్లున్న మన దేశంలోని జిహాదీ ముఠాలు హఫీజ్ సరుూద్ నాయకత్వంలోని పాకిస్తానీ ముఠాలతో అనుసంధానమై ఉన్నాయి. ఈ అనుసంధానకర్త పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విభాగమైన ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్’- ఐఎస్‌ఐ! అందువల్ల పేర్లు ఏవైనప్పటికీ మన దేశంలోని జిహాదీ ఉగ్రవాద కలాపాల సూత్రధారి పాకిస్తాన్ ప్రభుత్వం. పాక్ ప్రభుత్వపు తొత్తులలో మన దేశంలో పుట్టి పెరిగి దేశాన్ని బద్దలుకొట్టడానికి యత్నిస్తున్న విద్రోహులు కూడా ఉన్నారు. ఏళ్ల తరబడి ఉంటున్నారు. 1992లో ఉన్నత పోలీసు అధికారి కృష్ణప్రసాద్‌ను, ఆయన కారు డ్రైవర్‌నూ హత్య చేసిన ముజిబ్ అహమ్మద్‌ను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2004 ఆగస్టులో అర్థాంతరంగా జైలు నుంచి విడుదల చేసింది. ఈ జిహాదీ స్వేచ్ఛగా పాకిస్తాన్‌తో సంప్రదింపులు జరిపాడు. రాకపోకలు సాగించాడు. హైదరాబాద్‌లో పెద్దఎత్తున బీభత్సకాండ జరపడానికి కుట్ర చేశాడు. 2005 డిసెంబర్‌లో మళ్లీ పట్టుబడ్డాడు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ఇలాంటి పాక్ తొత్తులు వందలాదిగా మన దేశంలో ఉన్నారు..
జిహాదీ బీభత్సకాండ జరుపుతున్నది వ్యక్తులు కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం. పాక్ ప్రభుత్వాన్ని ‘టెర్రరిస్ట్‌రిజమ్’గా ప్రకటించి, ఇరాక్ తరహాలో, అఫ్ఘానిస్తాన్ తరహాలో పాకిస్తాన్‌ను ప్రక్షాళన చేసి నూతన నాగరిక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఐక్యరాజ్య సమితి పాటుపడాలి. అదొక్కటే బీభత్సకాండ నిర్మూలనకు మార్గం. కానీ, తోడేలు వలె.. తరుముతున్న కుందేలు వలె పారిపోతున్న అభినయం చేస్తోంది. హఫీజ్ సరుూద్ వ్యవహారంలో 2008 డిసెంబర్ నుంచి పాకిస్తాన్ ప్రభుత్వం ఈ వంచనను కొనసాగిస్తోంది. జమాత్ ఉద్ దావాను నిషేధించాలని, హఫీజ్‌ను నిర్బంధించి న్యాయస్థానాలలో విచారించాలని 2008 డిసెంబర్‌లో ఐక్యరాజ్య సమితి తీర్మానించింది. ఈ తీర్మానం నిజానికి పాక్ ప్రభుత్వానికి గొప్ప మేలు చేసింది. ముంబయి మారణకాండ జరిపించినందుకు హంతక హోదాలో నిందిత స్థానంలో నిలబడవలసిన పాకిస్తాన్ ప్రభుత్వం ‘సమితి’ తీర్మానం ఫలితంగా ‘న్యాయనిర్ణేత’గా మారింది. ‘హంతకుడు న్యాయనిర్ణేతగా మారడమన్నది’ పాకిస్తాన్ ప్రభుత్వానికి మరోసారి వర్తింపచేసినట్టయింది. పాక్ ప్రభుత్వం ఈ ‘వెసలుబాటు’ను అంతర్జాతీయ సమాజాన్ని వంచించడానికి చక్కగా ఉపయోగించుకుంది. ‘సమితి’ తీర్మానాన్ని అంగీకరిస్తున్నట్టు, దాన్ని అమలు జరుపుతున్నట్టు అప్పటి పాక్ ప్రధాని యూసఫ్ రజాజిలానీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ తీర్మానం మేరకు ‘జమాత్’ను నిషేధించినట్టు కూడ పాక్ విదేశాంగ మంత్రిత్వశాఖ వారు ‘ఐరాస’కి తెలియజేశారు. ‘జమాత్’ ముఠాలోని మొదటి హంతకుడు హఫీజ్‌ను నిర్బంధించినట్టు కూడా పాక్ ప్రభుత్వం నమ్మబలికింది. కానీ, నిజానికి పాక్ ప్రభుత్వం ‘జమాత్’ను నిషేధించలేదు. హఫీజ్‌ను కేవలం సుఖవంతమైన విలాస భరితమైన గృహనిర్బంధానికి మాత్రమే గురిచేసింది. ఈ గృహనిర్బంధం సంగతి కూడ రెండునెలల తర్వాత బయటికి పొక్కింది. అంతవరకూ హఫజ్ కారాగృహ నిర్బంధంలో ఉన్నాడని మన ప్రభుత్వం భ్రమించింది. తన గృహనిర్బంధాన్ని రద్దు చేయాలని కోరుతూ హఫీజ్ లాహోర్ హైకోర్టులో ‘వినతి’ని దాఖలు చేయడంతో ‘గృహనిర్బంధం’ సంగతి వెలుగు చూసింది. జైల్లో ఉంచకుండా సొంత ఇంట్లోనే ఉంచడం ఏమిటని మన ప్రభుత్వం అడగకపోవడం మన దౌత్య వైఫల్యం..
‘జమాత్’ను నిషేధించాలని తీర్మానించే అధికారం ‘ఐరాస’కి లేదని లాహోర్ హైకోర్టు నిర్ధారించడం విచిత్రమైన పరిణామం.. జమాత్‌ను నిషేధించినట్టు ఎలాంటి అధికార పత్రాలను పాక్ ప్రభుత్వం కోర్టుకు సమర్పించలేదు. నిజానికి నిషేధించలేదు. జమాత్ నిషిద్ధ సంస్థ కాదు కాబట్టి హఫీజ్‌ను విడుదల చేయాలని 2009 జూన్ రెండవ తేదీన లాహోర్ హైకోర్టు ఆదేశించింది. ‘జమాత్’ను నిషేధించక పోవడం ద్వారా పాకిస్తాన్ ‘సమితి’ తీర్మానాన్ని ధిక్కరించింది. ఇప్పుడు మళ్లీ హఫీజ్‌ను గృహనిర్బంధంలో ఉంచినట్టు పాక్ ప్రకటించింది. జమాత్‌ను నిషేధించే విషయం నిర్ణయించనున్నదట.. కథ మళ్లీ మొదటికొచ్చింది..!