సంపాదకీయం

నీటికాలుష్యంపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరఖండ్ ప్రాంతంలో గంగానదికి ఇరువైపుల వం ద మీటర్ల దూరం వరకూ ఎలాంటి ‘వినోద విహార స్థలాల’- టూరిజమ్ క్యాంప్స్-ను ఏర్పాటు చేయరాదని ‘జాతీయ హరిత పరిరక్షణ న్యాయమండలి’- నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్- ఎన్‌జిటి- ఆదేశించడం ‘స్వచ్ఛ్భారత్’ పునర్ నిర్మాణానికి దోహదం చేయగలదు. ‘స్వచ్ఛ్భారత్’లో నీటి స్వచ్ఛత ప్రధానమైనది. మానవుని జీవన వ్యవహారాలలో నీటి ద్వారానే నిరంతరం స్వచ్ఛత ఏర్పడుతోంది. కాలుష్యాలను దుర్గంధాలను మాలిన్యాలను విషరసాయన ప్రభావాలను కడిగివేస్తున్నది నీరు. అందువల్ల నీరు స్వచ్ఛతకు స్వరూపమన్నది అనాది జీవన వాస్తవం! శుభ్రపరిచే నీరు శుభ్రతను కోల్పోవడం ఆధునిక విశృంఖల జీవన వికృత విన్యాసాల ఫలితం! అపరిశుభ్రమైన నీరు మన ఇంటిని, దేహాన్ని, దేశాన్ని, పుడమిని పరిశుభ్రం చేయలేకపోవడం ‘స్వచ్ఛత’ను పరిమార్చుతున్న వర్తమాన వైపరీత్యం. ఈ వైపరీత్యం దశాబ్దుల విశృంఖల మానవ ప్రవర్తన సృష్టించిన వికృత విన్యాసాల ఫలితం. నీరు పరిశుభ్రం చేయలేని పరిమాణంలో కాలుష్యం నిరంతరం ఉత్పత్తి అవుతోంది. ఇది మొదటి సమస్య. దీనికి ప్రధాన కారణం ‘కేంద్రీకరణ’ పరిశ్రమలు, విషరసాయన ద్రవాలను విసర్జిస్తున్న పరిశ్రమలు ఒకేచోట భారీగా ఏర్పాటు కావడం. పరిశ్రమలు దూరదూరంగా ‘వికేంద్రీకృతం’ అయినప్పుడు ఒక పెద్ద పరిశ్రమకు బదులు వంద లేదా వేయి చిన్న పరిశ్రమలు విస్తరించినపుడు ఈ విషరసాయన ద్రవాల కాలుష్యం కేంద్రీకృతం కాదు. వికేంద్రీకృత పారిశ్రామిక కాలుష్యాన్ని ఎక్కడికక్కడ నీరు కడిగి వేయగలదు. మన ఈ వికేంద్రీకృత జీవన వ్యవస్థను విదేశీయ దురాక్రమణదారులు శతాబ్దుల తరబడి భగ్నం చేశారు. స్వాతంత్య్రం వ చ్చిన తర్వాత కూడ విదేశీయులు మన నెత్తికెత్తిన ‘కేంద్రీకృత ప్రగతి’ వ్య వస్థ కొనసాగుతూనే ఉం ది. నీరు కలుషితం కావడానికి, గాలి కాలుష్యమయం కావడానికి ఇదీ కారణం. నదుల పొడవునా నెలకొని ఉన్న పరిశ్రమల నుంచి వెలువడుతున్న కాలుష్య రసాయన వ్యర్థ విష ద్రవాలు ఉపనదుల వలే నిరంతరం నదులలో కలసిపోతుండడం నీటి స్వచ్ఛతను నిర్మూలించిన మరో వైపరీత్యం. ‘నదీ వేగేన శుద్ధ్యతే’- నది నీరు వేగం వల్ల, నిరంతరం ప్రవహించడం వల్ల తనంత తానుగా పరిశుభ్రవంతం కావడం ప్రాకృతిక సత్యం. కానీ ఈ ప్రాకృతిక సత్యాన్ని పరిశ్రమల రసాయన కాలుష్యం వమ్ము చేయగలిగింది. ప్రవాహం పొడవునా వందల, వేల కిలోమీటర్ల మేర ప్రతిచోట కాలుష్య పారిశ్రామిక విష ద్రవాలు నదుల్లో కలుస్తున్నప్పుడు నదులు ఎలా సహజంగా శుభ్రపడగలవు? నదుల జలాలలో వేగంగా ప్రవహించడం ద్వారా ఎప్పటికప్పుడు స్వచ్ఛంగా మారే స్వభావాన్ని ఎక్కడికక్కడ పారిశ్రామిక విషాలు పరిమార్చాయి. అందువల్లనే మన నదులు మురికినీటి కూపాలుగా మారిపోతున్నాయి. పుడమిని శుభ్రపరచగల నీటిని మొదట శుభ్రపరచడం మన ప్రభుత్వాల విధి. కానీ పారిశ్రామిక కాలుష్యాలకు ఇప్పుడు ‘ప్రపంచీకరణ’ దుర్గంధం తోడైంది. వినోద విహార కేంద్రాలను నెలకొల్పడం పేరుతో నదీ తీరాలలో కాలుష్యాన్ని కేంద్రీకరించడం వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- సృష్టించిన అతి ప్రమాదకరమైన ‘అద్భుతం’!
జాతీయ హరిత న్యాయమండలి వారు గురువారం జారీ చేసిన నిషేధపుటుత్తరువునకు ఈ ‘కాలుష్య చరిత్ర’ నేపథ్యం. ఉత్తరఖండ్‌లో గంగానదికి ఇరువైపుల ఇప్పటికే యాబయి ఆరు ‘వినోద విహార కేంద్రాలు’ రివర్ బీచెస్- ఏర్పడి ఉన్నాయట! ఈ ‘బీచ్’ల వద్ద సమకూడుతున్న యాత్రికులు నదిలో పడవలపై ఎక్కి విహరించడం ‘పర్యాటక పరిశ్రమ’లో భాగం. ఈ పడవ విహారం వల్ల ఆయా బీచ్‌ల సమీపంలో కాలుష్యం పేరుకొనిపోతోంది. దూరదూర ప్రాంతాల వరకూ ఈ కాలుష్య ప్రభావం వ్యాపిస్తోంది. కలపను ఇతర అటవీ ఉత్పత్తులను రవాణా చేయడానికి నదీ జలాలు అనాదిగా ఉపయోగపడుతున్నాయి. ఈ రవాణా వల్ల కాలుష్యం ఏర్పడలేదు. గంగానదీ జలాలు ఉత్తరఖండ్ ప్రాంతంలో అత్యంత పరిశుభ్రంగా ఉండడం ప్రాకృతిక సత్యం. తరతరాలుగా హరిద్వార్ వద్ద సేకరించిన గంగాజలాలను దేశమంతటా ఏళ్ల తరబడి దేవతాగృహాలలో నిల్వ ఉంచుకొనడం సంప్రదాయం, కాని ఆధునికత పేరుతో గంగా తీరానికి చొరబడిన ‘కృత్రిమ నాగరికత’ హరిద్వార్ వద్ద సైతం గంగాజలాలను కాలుష్యమయం చేస్తోంది. హరిద్వార్‌కు ఎగువన ఉన్న ‘హృషీకేశం’ వద్ద గంగ మరింత పరిశుభ్రంగా ఉంటుందన్నది భారతీయుల విశ్వాసం. ఎందుకంటే మంచు కరగడం వల్ల వేసవిలోను, భారీవర్షాల వల్ల వర్షాది రుతువుల్లోను ‘గంగోత్రి’ నుంచి మొదలయ్యే నదీ ప్రస్థానం ఆరంభంలో అతి స్వచ్ఛంగా ఉండడం సహజం. పోనుపోను మైదాన ప్రాంతాలకు చేరిన తర్వాత మాత్రమే గంగాజలం స్వచ్ఛతను క్రమంగా కోల్పోతోంది. హరిద్వార్ వద్ద ‘మైదాన ప్రవేశం’ చేస్తున్న ‘గంగ’ అంతవరకూ పరమ పరిశుభ్రంగా ఉండడం చరిత్ర! హరిద్వార్ వరకు ‘గంగ’ ఉత్తరఖండ్‌లో ప్రవహిస్తోంది. పర్వత ప్రాంతాల్లోని వందల ఔషధీ గుణం కల మొక్కలు, వేళ్లు, ఆకులు, తీగల స్పర్శ వల్ల గంగాజలాలు ఆరోగ్యాన్ని పెంచే అమృతధారలుగా మారడం కూడ చరిత్ర. లక్షల ఏళ్ల ఈ చరిత్ర వందల ఏళ్లలో చెరిగిపోయింది. గత కొన్ని దశాబ్దులలో ప్లాస్టిక్, పొగాకు, అవసరం లేని ఆహార పదార్థాలు, శీతల పానీయాలు వంటివి ఉత్తరఖండ్ నదీ జలాలను స్వచ్ఛతకు దూరం చేశాయి.
జాతీయ హరిత న్యా య మండలి ఇప్పుడు ‘గం గా స్వచ్ఛ తరంగ భంగిమల’ను పునరుద్ధరించడానికి పూనుకొనడం దశాబ్దుల ప్రభుత్వ వైఫల్యాలకు చిహ్నం. శివపురి నుంచి హృషీకేశం వరకూ గల గంగానదీ తీరంలోని ‘క్యాంప్’లలో కొన్నింటిని మూసివేయాలని, కొన్నింటి పనితీరును నియంత్రించాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అధ్యక్షుడు స్వతంత్రకుమార్ ఇతర న్యాయమూర్తులు ఆదేశించడం ముదావహం. గంగానదీ జలాలు కాలుష్యవంతం కావడం మొదటి సమస్య. గంగ, ఇతర నదీ పరీవాహక ప్రాంతం పొడవునా అక్రమంగా కట్టడాలను విచ్చలవిడిగా దశాబ్దుల పాటు నిర్మించడం మరో సమస్య. ఈ అక్రమ నిర్మాణాలు నదుల నీటి మార్గాన్ని నిరోధించాయి. ఫలితంగా ఉత్తరఖండ్ తరచూ వరదలకు గురి అవుతోంది. మూడేళ్ల క్రితం బదరీనాథ్, కేదార్‌నాథ్ ప్రాంతాల్లో ‘బురద’ ఉప్పెన వచ్చి వందలాది తీర్థయాత్రికులు అకాల మృత్యువు పాలుకావడం దేశ విదేశాలలో ప్రకంపనలను సృష్టించింది. ఉత్తరఖండ్‌లో నదుల పరిశుభ్రతను, పథాలను పరిరక్షించడానికి ప్రభుత్వాలు నడుములను బిగించకపోవడం ‘ఎన్‌జిటి’ తీర్పునకు దోహదం చేసింది. పడవలలో విహరించే యాత్రికులకు పర్యావరణ ధ్యాస లేకపోవడం వల్లనే కాలుష్యం పెరుగుతోంది. ప్లాస్టిక్ పదార్థాలను వెదజల్లడం వల్ల నదులనే కాదు హిమాలయాలను సైతం కాలుష్యగ్రస్తం చేసినట్టు అనేక అధ్యయనాలలో ధ్రువపడింది.
‘ప్లాస్టిక్’ భూతం సృష్టించిన వేడి వల్ల హిమాలయ పర్వతాల్లోని మంచు శకలాలు- గ్లేసియర్స్- కరిగిపోయి రాళ్లగుట్టలు బయటపడుతున్నాయి. కొన్ని దశాబ్దుల కాల వ్యవధిలో పదమూడు శాతం ‘గ్లేసియర్లు’ ఇలా కరగిపోయాయి. ఈ వేడిమి ఇలా పెరగడానికి ప్లాస్టిక్ పదార్థాల ప్రభావం మాత్రమే గాక టిబెట్‌లో సువిశాల ప్రాంతాలను చైనా కొల్లగొట్టడం కారణం! చైనా టిబెట్‌ను తవ్విపారేస్తోంది.. ఎవరు నియంత్రించాలి?