సంపాదకీయం

మానసిక ఆరోగ్యానికి పెద్దపీట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరికీ మానసిక ఆరోగ్యమూ అంతే ముఖ్యం. దాదాపు 130 కోట్లు దాటిన భారత జనాభాలో మానసిక వత్తిళ్లతో, జన్మతః వచ్చిన లోపాలతో నిస్సారమైన జీవితాలను కొనసాగిస్తున్న వారి సంఖ్య తక్కువేమీ కాదు! ఇ టీవలి కాలంలో మానసిక వత్తిళ్ల కారణంగా ఆత్మహత్యలు పెరిగిపోవడం తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాజాగా చేపట్టిన ‘మానసిక ఆరోగ్య సంరక్షణ శాసనం’ అనేక రకాలుగా ఈ జటిల సమస్యకు సరైన పరిష్కారం అందించేదేననడంలో ఎ లాంటి సందేహం లేదు. ముఖ్యంగా మానసిక సమతూకం లేని వ్యక్తులు ఆత్మహత్యలకు పాల్పడటం, అందుకు యత్నించడం అన్నది చాలా తీవ్ర సమస్యగా మారింది. భారత శిక్షాస్మృతిలోని 309 సెక్షన్ ప్రకారం ఆత్మహత్యాయత్నం నేరం. అయితే, మానసిక రోగులు ఇలాంటి చర్యలకు పాల్పడితే పరిస్థితి ఏమిటి? అన్ని విధాలుగా సరైన ఆరోగ్యంతో ఉన్న వారితో సమానంగానే వీరి ఆత్మహత్యా యత్నాలనూ నేరంగా పరిగణించాలా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో మానసిక రోగులు ఆత్మహత్యలకు యత్నించడాన్ని నేరంగా పరిగణించకుండా వారికి సరైన చికిత్సను అందించే మార్గాలనూ సుసంపన్నం చేస్తూ ఈ శాసన రూపకల్పన జరగడం ముదావహం. ఒక రకంగా చెప్పాలంటే ప్రధాని నరేంద్ర మోదీ తన ‘మన్ కి బాత్’లో చేసిన సూచనలకు ఈ శాసనంలో తగిన స్థానం లభించింది. మానసిక రోగుల్ని విస్మరించడానికి వీల్లేదని, వారు ఆరోగ్య పరంగా, హక్కుల పరంగా ఎదుర్కొంటున్న సమస్యలపై బహిరంగంగానే చర్చించి పరిష్కరించాలంటూ ఉ దాత్త రీతిలోనే మోదీ తన అంతరంగాన్ని ఆవిష్కరించారు. ఆరోగ్య భారతంలో వ్యక్తుల మానసిక, ఆర్థిక జీవన ప్రమాణా లూ కీలకమే. వీటికి అతీతంగా ఈ లక్ష్యాన్ని సా ధించడం నేల విడిచి సాము చేయడమే అవుతుంది! ఇప్పటి వరకూ మానసికమైన ఆరోగ్య సమస్యల విషయంలో ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తిన చందంగానే వ్యవహరించాయి.
తగిన చికిత్స లేక, తోడుగా ఉండేవారు కరవై ఇలాంటి వ్యక్తులు దిక్కులేని జీవితాల్ని అయోమయ, నిస్సార పరిస్థితుల్లోనే గడపాల్సి వస్తోంది. ఇవి చాలా సందర్భాల్లో ఆత్మహత్యలకూ దారితీస్తున్నాయని చెప్పడానికి దృష్టాంతాలెన్నో ఉన్నాయి. సమ్యల్ని దాచుకుంటే ముదిరిపోతాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యుల్లో మానసిక స్థితిగతులు సరిగా లేని వారి విషయంలో మరింత జాగ్రత్త వహించాలి. వారు ఎప్పుడు ఎలాంటి చర్యలకు ఒడిగడతారో తెలియదు కాబట్టి అనునిత్యం వారిని కనిపెడుతూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి వ్యక్తులకు తగిన చికిత్సను సరైన సమయంలో అందించగలిగితే కొంతలో కొంతైనా సమస్య తీవ్రతను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. కానీ, మన దేశంలో మానసిక రోగుల సమస్యలు ముదిరిపోయిన తర్వాత గానీ లేదా ఏమి చేస్తున్నామో తెలియని స్థితిలో వారు ఆత్మహత్యలకు పాల్పడితన తర్వాత గానీ బయటికి రాని పరిస్థితి. ఇలాంటి వారికి ఆధునిక ఆరోగ్య సౌకర్యాలు, కౌనె్సలింగ్ వంటివి అందుబాటులోకి రాకపోవడానికి కారణం ఆయా కుటుంబ సభ్యులు వీరి స్థితిని బయటపెట్టక పోవడమే! బయట పడితే ఎక్కడ పరువుపోతుందోనని భావించడమే! ఈ రకమైన భావన నుంచి బయటపడి మానసిక రోగులు ఎవరైనా వారికి తగిన చికిత్సను అందించేందుకు ముందుకు రావాలి. అందుకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పరమైన వైద్య విజ్ఞాన సౌకర్యాలను వినియోగించుకుంటేనే సమస్య తీవ్రం కాకుండా ఉంటుంది. ఇందుకు ఏ మాత్రం భిన్నంగా వ్యవహరించినా అది ఆయా రోగుల పరిస్థితి మరింత క్షీణించడానికి, ఎవరైనా తమ స్థితిని స్వార్థానికి వాడుకునే స్థాయికి వారు బలహీన పడిపోతారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి వచ్చినా బాధాకరమే. దాన్ని విస్మరించడం క్షమించరాని నేరమే అవుతుంది. వీటన్నింటికీ తగిన పరిష్కారం ఇచ్చే రీతిలో ఆలస్యంగానైనా కేంద్రం ముందుకు రావడం, అన్ని విధాలుగా శాసనాన్ని లోపరహితంగా తీర్చిదిద్దడం సకాలంలో చేసిన సరైన ప్రయత్నమే. సమాజంలో నిస్సార జీవితాలను వెళ్లదీస్తున్న వారికి చేయూతనందిచడమే.. ముఖ్యంగా ఈ రకమైన రోగుల న్యాయపరమైన హక్కుల్ని, ఆస్తి హక్కుల్ని పరిరక్షించేందుకూ ఈ శాసనంలో గట్టి ఏర్పాటే జరిగింది. చికిత్స చేయించుకునే హక్కునూ వీరికి కల్పించింది. అంతే కాదు, తమకు ఏ రకమైన చికిత్స కావాలో కూడా నిర్ణయించుకునే హక్కునూ వీరికి కల్పించడమన్నది కూడా కీలకమైన అంశం.
వలసపాలకుల కాలంలో రూపుదిద్దుకున్న అనేక శాసనాలే ఇప్పటికీ అమలు కావడానికీ ఈ వైద్య సంరక్షణ బిల్లు తెరదించింది. ఈ శాసనాల వల్లే అనేక రకాలుగా చట్టాలను తప్పుడుగా అన్వయించేందుకు, ముఖ్యంగా నేరన్యాయ విధానం సరైన రీతిలో అమలు కాకపోవడానికి ఆస్కారం ఏర్పడింది. ఆ ధోరణికి కేంద్ర తాజా యత్నం పాతర వేసింది. మామూలు స్థితిలో ఎవరూ ఆత్మహత్య చేసుకోవాలనుకోరు. అనివార్యమైన, భరించలేని, మానసిక స్థితి దిగజారిన పరిస్థితుల్లోనే ఇలాంటి కృ త్యాలకు ఒడిగడతారన్న వాస్తవికతకు ‘మెంటల్ హెల్త్‌కేర్ బిల్లు’ అద్దం పట్టింది. ఇలాంటి కృత్యాలకు పాల్పడే వారిని భారత శిక్షాస్మృతి సెక్షన్ల ప్రకారం విచారించి శిక్షించకూడదని నిర్ద్వంద్వంగా తెలియజేయడమన్నది ప్రశంసనీయం. మానసిక స్థితి సరిగాలేని వ్యక్తుల్ని మామూలు వ్యక్తుల మాదిరిగా ప్రాసిక్యూట్ చేయడమన్నది నేర న్యాయ వ్యవస్థకు వనె్న తెచ్చేది కాదు. ఇప్పటివరకూ దేశంలో ఇలాంటి కేసుల విషయంలో జరుగుతున్నది ఇదే. తమ జీవితాలకు సంబంధించి వ్యక్తులకు పూర్తిస్థాయి హక్కుల్ని కల్పించడం ఈ బిల్లులోని మరో కీలక అంశం. మానసిక రోగులైనంత మాత్రాన వీరికి ఇష్టారాజ్యంగా చికిత్స చేయడానికి వీల్లేదన్న అంశంపైనా ఈ శాసనం దృష్టి పెట్టింది. చికిత్సలో ఏ మాత్రం లోపాలున్నా, నాణ్యత లోపించినా ఫిర్యాదు చేసే అవకాశాన్ని మానసిక రోగుల సంరక్షకులకు కల్పించింది. అన్ని జిల్లాల్లోనూ మానసిక ఆరోగ్య సంరక్షణ సమీక్షా బోర్డుల ఏర్పాటుకూ ఈ శాసనం వీలు కల్పించడం మానసిక ఆరోగ్య భారతం దిశగా ఓ బలమైన అడుగు వేయడమే. ఇతరత్రా బాధాకరమైన చికిత్సల జోలికి పోకుండా పరోక్ష ఇథనేసియాను కోరుకునే హక్కును ఇక బతికే అవకాశం లేని రోగులకు కల్పించడం కూడా సరైన నిర్ణయమే. ఇప్పటి వరకూ ఈ రకమైన రోగులకు ఏ రకమైన చిక్సిత్స చేయాలన్నది వైద్యుల నిర్ణయంగా ఉండేది. ఇప్పుడు రోగులు కోరుకునే విధంగా చికిత్సనందించే ప్రక్రియకు గుర్తింపు లభించింది. మానసిక రుగ్మత శాపం కాదని, అదీ ఓ శారీరక లోపమేనన్న ఉదాత్త భావనతో వీరిని ఆదుకుంటే వారిని సరైన దారిలో పెట్టడం కష్టమేమీ కాదు. ఇందుకు కుటుంబ సభ్యుల సహకారం.. ప్రభుత్వ పరమైన తోడ్పాటూ తోడైతే ఇలాంటి వ్యదార్థ జీవితాలను ఉద్ధరించడం పెద్ద సమస్య కాదు.