సంపాదకీయం

రహదారి ‘మత్తు’ దిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జాతీయ, ప్రాంతీయ రహదారులకు ఇరువైపులా కంపుకొట్టిన మద్యం దుకాణాలు మూతపడడం స్వచ్ఛ భారత పునర్ నిర్మాణానికి దోహదం చేయగల పరిణామం! ప్రభుత్వాలు చేయలేని పనిని సర్వోన్నత న్యాయస్థానం చేసి చూపించడం న్యాయ వ్యవస్థ ‘క్రియాశీలత’-జుడీషియల్ యాక్టివిజమ్-కు సరికొత్త సాక్ష్యం! రహదారుల పక్కన ఐదు వందల మీటర్ల దూరం వరకు ఉన్న ప్రాంతంలో నెలకొని ఉన్న మద్యం దుకాణాలను మూసి వేయవలసిందేనని మార్చి ముప్పయి ఒకటవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేయడంతో దేశంలోని వేలాది కిలోమీటర్ల రహదారులకిరువైపులా కల మద్యం దుకాణాలు ఐదు వందల మీటర్ల వెనక్కి జరగవలసి వచ్చింది. ఏప్రిల్ ఒకటవ తేదీ నుండి ఈ ఉత్తరువు అమలు జరగవలసి ఉన్నప్పటికీ, ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, ఎల్ నాగేశ్వరరావు తమ ఉత్తర్వులో కొన్ని సడలింపులను ప్రకటించడం విచిత్రమైన వ్యవహారం! సామాన్య ప్రజల అవగాహనకు అంతుపట్టని వ్యవహారం. చిన్న పట్టణాలలో మాత్రం రహదారులకు ఇరువైపులా రెండు వందల ఇరవై మీటర్ల దూరం వరకు మాత్రమే మద్యం దుకాణాలు, సరఫరా కేంద్రాలు నెలకొనరాదన్నది మొదటి సడలింపు. తెలుగు రాష్ట్రాలలోను మరికొన్ని ఇతర రాష్ట్రాలలోను ఈ ఉత్తరువులు తక్షణం అమలు కాకుండా మినహాయింపు ఇవ్వడం రెండవ సడలింపు. తెలుగు రాష్ట్రాలలో మరో ఆరు నెలల తరువాత అక్టోబర్ ఒకటవ తేదీనుంచి మాత్రమే ఈ ‘రహదారి మద్యం దుకాణాల నిషేధం’ అమలులోకి రానున్నదట! తాగుబోతులకు గొప్ప వెసులుబాటు!
రహదారుల పక్కన నెలకొని ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలన్నది గత డిసెంబర్‌లో సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆ దేశం! మద్యం విక్రేతల కు, వారిని ఉత్సాహ ప రిచి ప్రోత్సహించి సాధ్యమైనంత ఎక్కువ ఆదాయం పొందుతున్న రాష్ట్ర ప్రభుత్వ నిర్వాహకులకు ఈ ఉత్తరువును అమలు విషయంలో అనేక సందేహాలు మొలకెత్తాయట.. అందువల్ల వారంతా స్పష్టీకరణల కోసం మళ్లీ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ నిషేధపుటుత్తరువు కేవలం మద్యాన్ని విక్రయించే దుకాణాలకు మాత్రమే కాక మద్యం సరఫరా చేసే భోజన శాలలకు, విశ్రాంతి గృహాలకు, వినోద కేంద్రాలకు, విలాస ప్రాంగణాలకు సైతం వర్తిస్తుందన్నది సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన స్పష్టీకరణ. రహదారుల పక్కన మద్యం దొరకకుండా చేయడంవల్ల తాగిన చోదకులు-డ్రయివర్‌లు-తూగు తూ ఊగుతూ వాహనాలను నడపడాన్ని నిరోధించవచ్చన్నది ‘సర్వోన్నత’ తీర్పులోని సారాంశం! తాగిన చోదకులు పైశాచిక నిర్లక్ష్యంతో వాహనాలను నడిపి తమ వాహనాలను ఎదురుగా వస్తున్న, ముందు వెడుతున్న వాహనాలకు గుద్దించేసి ప్రాణాలు తీస్తున్నారు, తమ ప్రాణాలు తీసుకుంటున్నారు. మద్యం సేవించి వాహనాలను నడుపరాదన్నది చట్టం నిర్దేశిస్తున్న నిబంధన! ఈ నిబంధనను వివిధ ప్రభుత్వాల విభాగాల అధికారులు, ప్రధానంగా తనిఖీలు చేసే పోలీసులు అమలు జరిపి ఉండినట్టయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉండేది కాదు. కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు ఎక్కడికక్కడ మత్తెక్కిన వాహన చోదకులను నిర్బంధించినట్టయితే మాదక చోదనం సమస్య లేదు.. ‘డ్రంకెన్ డ్రైవింగ్’ ఉండదు!
తనిఖీలు చేసే సిబ్బంది కొరతవల్ల తనిఖీ చేసేవారి అవినీతివల్ల ‘మాదక చోదకులు’ మితిమీరిపోతున్నారు. మాదక చోదనం కేవలం ప్రధాన రహదారులకు పరిమితమైన సమస్య కాదు. పట్టణాలలో, నగరాలలో ఆడపిల్లలు, మగపిల్లలు, వృద్దులు, యువకులు మత్తెక్కి వాహనాలను నడుపుతూనే ఉన్నారు. తాగిన వారు వీధులకెక్కడం ‘స్వచ్ఛ భారత్’కు విఘాతకరం, అవినీతి మరింత విఘాతకరం. అందువల్ల అవినీతి రహిత ‘స్వచ్ఛ భారతం’ మళ్లీ అవతరించినట్టయితే ‘డ్రంకన్ డ్రయివింగ్’ మాత్రమే కాక అన్నిరకాల భౌతిక బౌద్ధిక మానసిక సామాజిక రుగ్మతలు అడుగంటిపోతాయి. మద్యపానం అనాదిగా మన దేశంలో సప్త వ్యసనాలలో ఒకటి. ఈ ఏడు దురాచారాలలోను మరీ ప్రధానమైంది మద్యం సేవించడం. మద్యం సేవించడం వల్ల దుష్ప్రభావం ఆ తప్పునకు మాత్రమే పరిమితం కాదు, ‘మత్తు’ వివిధ రకాల మరిన్ని నేరాలను చేయిస్తోంది! అందువల్ల రహదారుల పక్కన మద్యాన్ని అమ్మడం నిషేధించడం పాక్షిక పరిష్కారం మాత్రమే! భారత రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా దేశమంతటికీ వర్తింపగల సర్వసమగ్ర మద్యమాన నిషేధపు చట్టాన్ని పార్లమెంటు రూపొందించడం మాత్రమే పరిష్కారం. సమగ్రమైన పరిష్కారం అదే.. ఆరోగ్యానికి భంగకరమైన మత్తెక్కించగల పానీయాలను, మాదక పదార్థాలను సంపూర్ణంగా నిర్మూలించడానికి ప్రభుత్వం కృషి చేయాలని రాజ్యాంగంలోని నలబయి ఏడవ అధికరణం నిర్దేశిస్తోంది. ఇది మార్గదర్శక సూత్రం. మార్గదర్శక సూత్రాలను అమలు చేయవలసిందిగా న్యాయస్థానాలు ప్రభుత్వాలను ఆదేశింపజాలవు. అందువల్ల ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు, అక్రమ వాణిజ్యవేత్తలు కలసికట్టుగా ద శాబ్దులపాటు ఈ స్వ చ్ఛంద రాజ్యాంగ స్ఫూర్తిని వమ్ము చేయగలిగారు. యోగం, సూర్యనమస్కారాలు వంటి ఆరోగ్యప్రేరక కా ర్యక్రమాలను ప్రోత్సహిస్తున్న ప్రస్తుత కేంద్ర ప్రభుత్వమైనా సర్వస సమగ్రమైన చట్టం రూపొందించింది మద్యం ఉత్పత్తిని, మద్యపానాన్ని సంపూర్ణంగా నిషేధించగలగాలి! యోగాభ్యాసం, మద్యపానం పరస్పర వైరుధ్యాలు..
ఇరవై వేలు అంతకంటే తక్కువ జనాభా కల పట్టణాలలోను, గ్రామాలలోను రహదారులకు రెండు వందల మీటర్లు అంతకంటే తక్కువ దూరంలో మాత్రమే మద్యం దుకాణాలు ఉండరాదన్న సడలింపువల్ల అసలు లక్ష్యం వమ్మయిపోతుంది! రహదారికి ఐదు వందల మీటర్ల-అర కిలోమీటర్-దూరంలో ఉన్న మద్యం దుకాణాలకు నడిచి వెళ్లి కొనుక్కోవడం శ్రమతో కూడిన పని, అందువల్ల తాగుబోతులు అంతదూరం నడవలేక విరక్తితో తాగుడు తాత్కాలికంగా మానేస్తారన్నది సర్వోన్నత న్యాయం చెప్పిన తీర్పు. కానీ కొన్ని చోట్ల రెండు వందల ఇరవై మీటర్లలోనే మద్యం దుకాణాలు పెట్టడానికి వీలుండడంవల్ల ఈ డ్రైవర్లు, క్లీనర్లు వెళ్లి త్వరగా మద్యం కొనుక్కుని రావచ్చు! కొన్ని చోట్ల మాత్రమే కాదు జాతీయ పథాల వెంబడి అన్ని చోట్లా ఇలా తక్కువ దూరంలోనే మద్యం దుకాణాలు ఏర్పడడం ఖాయం. ఇరవై వేల కంటే తక్కువ జనాభా కలిగిన పట్టణాలు, పల్లెలు దారుల పొడవునా కోకొల్లలు! దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు నిషేధపు నిబంధనను తెలుగు రాష్ట్రాలలో కూడ ఏప్రిల్ ఒకటి నుంచి అమలు జరిపే విధంగా సర్వోన్నత న్యాయస్థానం వారు తమ తీర్పును సమీక్షించాలి! లేనట్టయితే తెలుగు రాష్ట్రాలలో రహదారుల పక్కన కొన్న మద్యాన్ని డ్రైవర్లు కశ్మీర్ వరకు నేపాల్ వరకు తాగుతూ వాహనాలను నడుపగలరు..