సంపాదకీయం

తీరని దాహార్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాగడానికి మంచినీరు దొరకనివారి సంఖ్య ప్రపంచంలోకెల్లా మనదేశంలోనే అత్యధికంగా ఉందన్న నిర్ధారణ ప్రగతిని వెక్కిరిస్తున్న పరిణామం. దప్పికొన్న వానికి నెయ్యిని ఇచ్చి తాగమని చెప్పినట్టుగా మన ప్రగతి కొనసాగుతోందనడానికి ఇది మరో ఉదాహరణ మాత్రమే. వౌలిక అవసరమైన మంచినీరు దొరకని వారు ఏడున్నరకోట్లమంది ఉన్న దేశంలో సర్వజన-అన్ ఇన్‌క్లూజివ్- భాగస్వామ్య ప్రగతి’ అనే మాటలు నీటి మూటలు మాత్రమే. మనదేశాన్ని అప్రతిష్ఠపాలు చేయడానికి వీలుగా సర్వేలు జరిపి నిర్ధారణలు చేస్తున్న అంతర్జాతీయ సంస్థలున్నాయి. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు దళారీలుగాను, ప్రపంచబ్యాంక్, అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ వాణిజ్య సంస్థ వంటి అధికారిక వ్యవస్థలకు ప్రచ్ఛన్న ప్రతినిధులుగాను పనిచేస్తున్న బృందాలు అత్యధికం. అందువల్ల ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు, నిజానికి దళారీ ముఠాలు, చేస్తున్న నిర్ధారణలను హెచ్చరికలను మనం పట్టించుకోనక్కరలేదు. కానీ ఇలాంటి సంస్థలు చేస్తున్న నిర్ధారణలలో నిజం లేదని మన ప్రభుత్వం స్పష్టీకరించాలి. అలాంటి స్పష్టీకరణలను మన ప్రభుత్వం ఆవిష్కరించని సందర్భాలలో ఈ అంతర్జాతీయ సంస్థల నిర్ధారణలను నిజమని నమ్మక తప్పదు. అందువల్ల ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా ఇరవై రెండవ తేదీన వాటర్ ఎయిడ్ అన్న సంస్థ విడుదల చేసిన నివేదికలోని వివరాలను విశ్వసించకతప్పదు. ఈ నివేదిక మనదేశంలో మంచినీటికి నోచనివారు ఏడున్నరకోట్లకు పైగా ఉన్నారట! వీరందరూ మురికి నీటిని తాగడం అనివార్యమైపోతోందట. ఫలితంగా జల వాయుకాలుష్యానికి బలై ప్రతి సంవత్సరం సగటున దాదాపు లక్షా నలబై వేలమంది చిన్న పిల్లలు అకాల మరణం పాలవుతున్నారట. చైనాలో దాదాపు ఆరున్నరకోట్ల మందికి కూడా మంచినీరు లభించడం లేదట. ఇలా మనదేశం చైనా మంచినీరు దొరకని జనాభా విషయంలో అగ్రగాములై ఉన్నాయట. మనదేశం ప్రవర్థమాన దేశం. అందువల్ల సర్వ సమగ్ర ప్రగతిలో ప్రధాన అంశమైన మంచినీటి కొరత మనకు దాపురించి ఉండవచ్చు. కానీ చైనా సంపన్న దేశం. లక్షలాది కోట్ల రూపాయలను ఇతరేతర దేశాలలో పెట్టుబడులుగా వెదజల్లుతున్న దేశం. తన ఉత్పత్తులను విదేశాలకు అమ్మి భారీగా లాభాలను మూట కట్టుకుంటున్న దేశం. ఇలాంటి సంపన్న దేశంలో నీటి కొరత ఏమిటి? నీరు తాగడానికి పనికి రాకుండా ఎందుకని పోయింది? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం ఒక్కటే...అది వాణిజ్య ప్రపంచీకరణ. నీరు విక్రయ పదార్థంగా మారింది. డబ్బులు పెడితే చాలు కప్పులలో, గ్లాసులలో, సీసాలలో, పీపాలలో, ట్రక్కులలో మంచినీరు దొరుకుతోంది. కొరత దేనికి..?
జలకాలుష్యంతో జగతి విలవిలలాడిపోతుండడం, ఇప్పుడు పాతపడిన ముచ్చట. జలం లేక జనం నోళ్లు ఎండిపోతుండడం నడుస్తున్న వ్యధ. దేశంలోని అన్ని ప్రాంతాలను మంచినీటికి కటకట ఏర్పడి ఉండడం గురించి భారీగా ప్రచారమవుతోంది. మంచు కరగడం వల్లవేసవిలో సైతం నదులు పొంగి పొరలి ప్రవహించే హిమాలయ ప్రాంగణాలు సైతం మంచి నీరు దొరకక మామూలు జనాలు గడగండ్ల పాలవుతుండడం సమస్య తీవ్రతకు నిదర్శనం. కర్ణాటకలో, తమిళనాడులో, తెలంగాణలో, అవశేష ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ ప్రాంతాలలో మంచినీటికోసం మైళ్లకొద్దీ నడచి పోతున్న దృశ్యాలను మాధ్యమాలు నిరంతరం ఆవిష్కరిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్‌లో రాజస్థాన్‌లో మురికి నీటిని సైతం తాగి దప్పిక తీర్చుకుంటున్నారట. జమ్ము కశ్మీర్‌లో మంచు కరిగే సీమలో సైతం నీటి ఎద్దడి ఏర్పడిపోవడం అంతుపట్టని వ్యవహారం. ప్రపంచీకరణలో భాగంగా మనదేశంలో చొరబడి పోయిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు భూగర్భ జలాలను, ఉపరితల జలాలను భారీగా కొల్లగొట్టడం మన ప్రభుత్వాలు పట్టించుకోని వ్యవహారం. ఇలా కొల్లగొట్టడాన్ని స్వచ్ఛంద సంస్థలు ప్రచారం చేశాయి. స్వదేశీయ ఆర్థిక సంస్థలు నిరసించాయి. న్యాయస్థానాలు సైతం బహుళ జాతీయ సంస్థల నీటి దోపిడీని అభిశంసించడం ఇరవైఏళ్ల చరిత్ర. వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థితం కాకపూర్వం కూడ మనదేశంలో మంచినీటి సమస్య ఉండేది. అది కేవలం ఎండకాలానికి పరిమితమై ఉండేది. కానీ ప్రపంచీకరణ మొదలైన తరువాత అన్ని ఋతువులలోను నీటి ఎద్దడి మొదలైంది. భూగర్భ జలాలు ఇంకిపోవడం ఇందుకు కారణం!
నీటి వనరులను వాణిజ్యపు వనరులుగా మార్చాలన్నది సంపన్న దేశాలు, వర్థమాన దేశాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న కుట్రలో భాగం. 2010 ఏప్రిల్ 23వ తేదీన ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో న్యూయార్క్‌లో జరిగిన ఒక సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఈ కుట్రకు ఒక సాక్ష్యం మాత్రమే. ఈ సమావేశానికి అన్ని సభ్య దేశాలను ఆహ్వానించలేదు. సంపన్న దేశాల ప్రతినిధులు మాత్రమే పాల్గొన్న ఈ అనధికార సమావేశంలో నీటి ధరలను హెచ్చించాలని నిర్ణయించినట్టు ఆ తరువాత వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా సురక్షితమైన మంచినీటి కొరత ఏర్పడుతున్న నేపథ్యంలో ఇలా నీటిని ఆధిక ధరలకు విక్రయించాలని సంపన్న దేశాల ప్రతినిధులు నిర్ణయించడం దగాకోరు వాణిజ్య విధానాలకు నిదర్శనం. ఈ అనధికార సమావేశం జరగడానికి కొద్ది రోజులకు పూర్వం ఆర్థిక సహకార అభివృద్ధి సమా ఖ్య-ఓఇసిడి-కు చెందిన సంపన్నదేశాల ప్రతినిధులు సైతం ఇదే అధిక ధరల తీర్మానాన్ని ఆమోదించాయి. అప్పటినుంచి ఇప్పటి వరకు సంపన్నదేశాలు, ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు ఉచితంగా మంచినీరు లభించే పద్ధతిని రద్దు చేయాలని వర్ధమాన దేశాల ప్రభుత్వాలపై ఒత్తడి తెస్తూనే ఉన్నాయి. నిరుపేదలకు సైతం ఉచితంగా మంచినీరు లభించని స్థితి ఏర్పడినప్పుడు మాత్రమే బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు నీటిని విక్రయించడం ద్వారా భారీ లాభాలను దండుకోవచ్చు. ఈ ఒత్తడి ఫలితంగానే 2012 జనవరిలో అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’ ప్రభుత్వం నీటి సేవలను, ప్రభుత్వేతర సంస్థలకు అప్పగించాలన్న విధానాన్ని రూపొందించింది. ‘‘సంకుచిత’’ ప్రొటక్షనిస్ట్-జాతీయ ప్రయోజనాలకు కాక, విస్తృత జాతీయ హితానికి ప్రాధాన్యతనివ్వాలన్న విధానాన్ని చిత్తశుద్ధితో విశ్వసించిన అంతర్జాతీయ స్థాయి ఆర్థిక వేత్త మన్‌మోహన్ సింగ్! ఇళ్లకు, వ్యవసాయానికి సరఫరా చేసే నీటిపై అన్ని రకాల రాయితీలను రద్దు చేయాలని అప్పటి విధాన ముసాయిదాపత్రంలో పేర్కొన్నారు. అంటే నీటిని అందరికీ అమ్మడమే విధానం..ఈ విధానం అమలు కాకపోవడానికి కారణం 2014లో ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారడం!
భూగర్భ జలాలను పరిరక్షించడానికి ఊట చెరువులను, జలాశయాలను, విస్తృతంగా ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాలు ద్విగుణీకృత కృషిని జరపడం వల్ల సమస్య సగం మాత్రమే పరిష్కారం అవుతుంది. నీటి వనరులపై పట్టు సాధించడానికి బహుళ జాతీయ సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను వమ్ము చేయగలగడం, మిగిలిన సగం. ఈ నేపథ్యంలో భగీరథ ఉద్యమం ద్వారా రాష్ట్రంలోని అన్ని ఇళ్లకు నల్లా నీరు సరఫరా చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం ప్రశంసనీయం. ‘కాకతీయ’ ఉద్యమం ద్వారా రాష్ట్రానికి హరిత శోభలు అమరనున్నాయి. ఈ రెండు పథకాలు అన్ని రాష్ట్రాల వారికి ఆదర్శం. అనుసరణీయం..