సంపాదకీయం

కాలుష్య తాపం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘వైశాఖం.. పోయి శాకం’- అన్నది ప్రాచీన సూక్తి! ఇప్పుడీ సూక్తి మరుగున పడింది. ‘వైశాఖం’ అంటే తెలియనివారి సంఖ్య పెరిగింది. ‘పొయ్యి’ అవసరం లేదు.. కిరాయి భోజనశాలలో కల్తీరుచుల కమ్మదనంతో కడుపునిండిన వారికి పొయ్యి ధ్యాసలేదు! అందువల్ల ప్రకృతి మొత్తం పెద్ద కుంపటిగా మారింది... ‘కుంపటి’ ధ్యాసను కలిగించడానికి!! వైశాఖమాసం రాక పూర్వమే ‘ప్రకృతి కుంపటి’ నిప్పులను వెదజల్లుతోంది! నీటి చుక్క లేని భూగర్భం కుతకుత ఉడికిపోతోంది.. సౌరశక్తి ప్రభావంతో ‘పొడివేపుడు’-డ్రైహీటింగ్-జరుగుతోంది! ‘రోహిణి ఎండలకు రోళ్లు పగులును..’ అన్నది మరో ప్రాచీన సూక్తి! ఇప్పుడు రోళ్లు లేవు, రాళ్లు కూడ కనపడవు నగరాలలో! ‘రోలు’ అంటే ఏమిటి? అని కానె్వంటు పాపను అడిగితే, ‘మిక్సీ’ చెడిపోయినప్పుడు పచ్చడి చేస్తామే... అదీ- అని సమాధానం చెప్పడం పాత కథ! ఇప్పుడు రెండు మూడు ‘మిక్సీ’లున్న ఇళ్లలో ‘రోలు’ ధ్యాస లేనేలేదు! అందువల్ల రోహిణి కార్తె ఎండలకు ‘రోళ్లు’ పగలడం లేదు... మనుషుల తలలోని వెంట్రుకలు చిట్లిపోతున్నాయి! ‘పిట్టలు రాలినట్టు’ అన్నది సామెత కాదు. చెట్టు నీడకు నోచుకోని చోట, చెట్టు నీడ చాలని చోట పిట్టలు పక్షులు మలమల మాడి రాలిపోతున్నాయి! ఈ ఏడాది రోహిణి కార్తె ఇంకా రాలేదు, మరో నెలకు కాని రాదు! అయినప్పటికీ ఎండలు మంటలను కురుస్తున్నాయి. క్రీస్తుశకం 2100వ సంవత్సరం నాటికి ప్రపంచపు సగటు ఉష్ణోగ్రత మరో ఎనిమిది డిగ్రీలు పెరుగుతుందని 2015 డిసెంబర్‌లో ప్రచారమైంది. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యవంలో స్వచ్ఛంద పర్యావరణ సంస్థలు జరిపిన పరిశోధనలు ఈ ప్రచారానికి ప్రాతిపదిక...
మన దేశంలో ఈ ఎనిమిది డిగ్రీల ‘సెల్సియస్’ మేర ఉష్ణోగ్రత పెరగడానికి 2100వ సంవత్సరం వరకూ ఆగనక్కరలేదన్నది ధ్రువపడిన వాస్తవం. గత కొన్ని ఏళ్లుగా మన సగటు ఉష్ణోగ్రత సాలీనా ఒక డిగ్రీ పెరుగుతోంది. హైదరాబాద్ మహానగరంలో గత నాలుగైదు ఏళ్లుగా ‘వసంతఋతువు‘ గ్రీష్మ ఋతువుగా మారిపోవడం ఇందుకు నిదర్శనం. రెండేళ్ల క్రితం ‘వసంతం’-ఏప్రిల్-లో ముప్పయి రెండు డిగ్రీల సెల్సియస్ ఉండిన ఉష్ణోగ్రత ఈ ఏడాది దాదాపు నలబయి మూడు డిగ్రీలకు పెరిగింది. ఈ పెరుగుదల వైపరీత్యం కావచ్చు. కానీ ఏప్రిల్, మే నెలల ఉష్ణోగ్రత సగటున ఒక డిగ్రీ పెరగడం మాత్రం ‘సహజ పరిణామం’గా మారింది! అందువల్ల ఎనిమిది డిగ్రీలు పెరగడం తెలుగు రాష్ట్రాలలో మరో పదేళ్లలోపుగానే సంభవించే పరిణామం! ఇలా సగటున ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే ఆ వేడిమికి హిమాలయ పర్వత శ్రేణులలో మంచు అరవై శాతం కరిగిపోయి రాళ్ల దిబ్బలు ఏర్పడతాయట! ‘హిమాలయం’ ‘శిలాలయం’గా మారిపోతుంది. క్రీస్తు శకం 2001 నాటికి హిమాలయాలలోని పదమూడు శాతం మంచు దిబ్బలు కరిగిపోయాయట! హిమాలయాలలోని మంచు చరియలు గంగా యమునలు సింధు బ్రహ్మపుత్రలు అనేక ఇతర నదులు జీవ వాహినులు కావడానికి కారణం! హేమంతంలో కురిసి కురిసి శకలాలుగా ఏర్పడే మంచు వేసవిలో గ్రీష్మ ఋతువులో కరిగి కరిగి నదులను నింపుతోంది! యుగయుగాల ఈ ప్రక్రియకు పెరుగుతున్న వేడిమి విఘాతకరం. కురిసే మంచుకంటే కరిగే మంచు అధికం...
పరిసరాలు వేడెక్కిపోతుండడం ప్రగతి సూచికకు ప్రాతిపదికగా మారింది. పచ్చదనం, ప్రగతి పరస్పర విరుద్ధమైన అంశాలన్నది ‘ప్రపంచీకరణ’కు గురి అయి ఉన్న నాగరికుల అవగాహన! పచ్చని చెట్లు, పశువులు, గడ్డిగాదము, పొలాలు వంటి దృశ్యాలు ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కానీ ఇలాంటి ప్రదేశాలను చూడగానే కార్లలోను, రైళ్లలోను, విమానాలలోను వెడుతున్న నవ నాగరీకులు జాలిగా ముక్కులను చిట్లించి ‘ఈ ఏరియా ఇంకా డెవలప్ కాలేదు...’ అని వ్యాఖ్యానిస్తున్నారు! వీరి దృష్టిలో సహజమైన ప్రగతి, ప్రకృతి మాత ప్రసాదించిన ప్రగతి ప్రగతి కానే కాదు, ప్రాకృతిక వ్యవస్థను ధ్వంసం చేయడమే ‘ప్రగతి’ లేదా ‘డెవలప్‌మెంట్’... ప్రాకృతిక వ్యవస్థ ధ్వంసమైన చోట వేడిమి పెరిగిపోతుండడం సహజ పరిణామక్రమం! ప్రపంచీకరణ ‘యుగం’లో ‘పరిభాష’ మారిపోయింది. పచ్చదనం ప్రగతికి చిహ్నమన్నది తరతరాల భారత జాతీయ జీవన విశ్వాసం. ఈ విశ్వాసం ప్రకృతిలో నిహితమై ఉన్న వాస్తవం! ‘పాడి, పంట’ ఉండడం పచ్చదనం. విదేశీయ దురాక్రమణ దారుల దోపిడీ ‘పరిపాలన’ పరాకాష్ఠకు చేరి ఉండిన సమయంలో కూడ ఈ సహజమైన ప్రగతి ధ్యాస మనకు ఏర్పడి ఉండేది! ‘మీరు పచ్చగా ఉండాలన్నదే మా అభీష్టం...’ పచ్చగా ఉన్న చోట తినడం, వెచ్చగా ఉన్నచోట నివసించడం... వంటి మాటలు వినబడేవి! ‘ఒకరు పచ్చగా ఉంటే వారు ఓర్వలేరు..’ అన్న ఆరోపణలు కూడ వినబడేవి! ఇదంతా భారతీయ ప్రగతి దృష్టి! ‘ప్రపంచీకరణ’ భారతీయతను దిగమింగడం నడుస్తున్న చరిత్ర! పచ్చదనం అంతరించింది, వెచ్చదనం మ రింత వేడెక్కుతోంది... భరించరాని వేడి.. శరీరాలు పొగలు కమ్ముతున్నాయి, మెదడు మొద్దుబారిపోతోంది!
కాలుష్యాన్ని నిరోధించడంలోను కాలుష్యాన్ని నియంత్రించడంలోను దశాబ్దులుగా కొనసాగుతున్న వైఫల్యం ఇలా ఎండలు మండుతుండడానికి కారణం. ఉష్ణోగ్రత విపరీతంగా పెరగడానికి కారణాలు అడవుల నిర్మూలన, పారిశ్రామిక వ్యర్థాలు పరిసరాలను ముంచెత్తడం, ప్లాస్టిక్ పదార్ధాలు గుట్టలు గుట్టలుగా పేరుకొనిపోవడం. భూగర్భం ఎండిపోవడం! ఇవన్నీ కాలుష్య కారణాలు. కాలుష్యం వల్లనే ఎండ వేడిమి పెరుగుతోంది... పట్టణాలలోను, నగరాలలోను గృహ నిర్మాణ పద్ధతి వల్ల భూగర్భం ఎండిపోతోంది. వెయ్యి చదరపుగజాలలో ఇరవై ముప్పయి ఏళ్ల క్రితం ఐదారు ఇళ్లు ఉంటే, ఏడెనిమిది కుటుంబాలు నివసించేవి. ఇప్పుడు అదే స్థలంలో ‘అంతస్థుల’ భవనాలు వెలిశాయి. ముప్పయి, నలబయి ఇళ్లు తయారయ్యాయి. యాబయి కుటుంబాలు అదే వెయ్యి చదరపు గజాలలో కూరుకుని ఉన్నాయి. భూమి విస్తీర్ణం పెరగడం లేదు, గాలి పెరగలేదు, భూగర్భ జలం పెరగలేదు. భూమిపై ఒత్తడి పెరిగింది, గాలిలో ఆక్సిజన్ తగ్గింది, నీరు ఇంకిపోయింది. వేల అడుగుల లోతు వరకు గొట్టాల ద్వారా కుళ్లగించి నీటిని తోడేశారు! ఇలా జనాభా కేంద్రీకరణ సకల విధ కాలుష్యాలకు కారణం! హైదరాబాద్ అనుభవంతో నవ్యాంధ్ర రాజధాని నగరం ‘అమరావతి’ని అడ్డంగా నిర్మించాలి! నిలువున అంతస్తుల భవనాలను నిర్మించి కాలుష్యాన్ని కేంద్రీకరించరాదు! కాలుష్యం వేడిమిని పెంచింది, సముద్రాలను పొంగించి తీర ప్రాంతాలను ఉప్పునీటితో ముంచెత్తుతోంది... ‘ప్లాస్టిక్’ భూతం ధరాతలాన్ని మంటలమయం చేస్తోంది!