సంపాదకీయం

పొంతన లేని ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ఆర్థికవ్యవస్థలో ఏడుశాతం ప్రగతి ప్రస్ఫుటిస్తోండడం ముదావహం. ప్రతి ఏడు మునుపటి సంవత్సరం కంటే ఏడుశాతం మేర ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరిగినట్టయితే ప్రతి ఏడేళ్లకూ ఈ ఆదాయం రెట్టింపు కావాలి! మన ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు కావడానికి కూడ కృషి చేస్తోంది. చైనా ఆర్థికప్రగతి వేగం కంటే మన ప్రగతి వేగం పెరిగిపోయిందన్నది కూడ జరుగుతున్న ప్రచారం. కాని దేశంలో ఉద్యోగాలు మాత్రం సాలీనా ఒక శాతం మాత్రం పెరుగుతున్నాయట. మన దేశంలో యువకుల సంఖ్య ప్రపంచంలో మిగిలిన అన్ని దేశాల్లో కంటే ఎక్కువగా ఉంది. ఈ పరిమాణం ఇంకా ఎక్కువ కాబోతోంది. పనిచేయగల వారి సంఖ్య అంటే పద్దెనిమిది, నలబయి ఐదు ఏళ్ల మధ్య వయసు వారి సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి భవిష్యత్తులో మనం మరింత ఎక్కువగా ఆర్థిక ప్రగతిని సాధించగలమన్నది జరుగుతున్న ప్రచారం. ఈ పనిచేయగల వారిలో వంద శాతం మందికి ఉద్యోగ ఉపాధులు లేకపోవడం మన ‘ప్రగతి’ని వెక్కిరిస్తున్న పరిణామం. ఏ ఉద్యోగం, ఉపాధి లేని వారి సంఖ్య ఐదు శాతం స్థాయిలోనే కొనసాగుతూండడం మన వ్యవస్థలోని అంతర్గత వైరుధ్యం. ఏటా ఒక శాతం ఉద్యోగాలు పెరగడం, పద్దెనిమిది ఏళ్లు నిండి ఉపాధి కోసం ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారి సంఖ్య అంతకంటే ఎక్కువగా పెరుగుతుండడం ఈ అంతర్గత వైరుధ్యానికి కారణం. పనిచేయగల సామర్ధ్యం, పనిచేసి ఆర్జించవలసిన అవసరం ఉన్నవారిలో కేవలం అరవై ఒక్క శాతం ఏడాది పొడవునా ఉపాధిని పొందగలుగుతున్నారట. మిగిలిన వా రికి ఆరు నెలల నుంచి పదకొండు నెలలపాటు మాత్రమే ఉపాధి లభిస్తోంది. ఈ వివరాలను ప్రభుత్వ అనుబంధ ఆధికారిక సంస్థలు వెల్లడిస్తున్నాయి. యోగ్యతకు త గిన ఉద్యోగం లేదా ఉపాధి లభించకపోవ డం మన దేశంలో దశాబ్దులుగా సాగుతున్న వైపరీత్యం. ఉద్యోగాలు చేస్తున్న వారిలో దాదాపు ముప్పయి ఐదు శాతం చాలీచాలని ఆదాయం లభించే పనుల- అండర్ ఎంప్లాయ్‌మెంట్-లో సతమతమైపోతున్నారు. నియతంగా సాలీనా వేతనవృద్ధిని, ద్రవ్యోల్బణం ప్రాతిపదికగా ఇతర భత్యాల్ని పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ ప్రభుత్వేతర సంఘటిత రంగ కార్మికులు సుఖజీవనం సాగిస్తూండవచ్చు. కానీ ఏళ్ల తరబడి జీతభత్యాల పెరుగుదలకు నోచుకోని అసంఘటిత రంగాల శ్రామికుల జీవనం ప్రగతి రాగంలో ప్రధానమైన అపశ్రుతి.. ఉద్యోగ ఉపాధి అవకాశాలు గత మూడేళ్లలో ఎంతమేరకు మెరుగయ్యాయన్నది స్పష్టం కావలసి ఉంది.
స్థూల జాతీయ ఉత్పత్తి- జిడిపి-లో వ్యవసాయ రంగానికి చెందిన ఉత్పత్తుల ‘వాటా’ ఎంతన్నది నిజమైన ప్రగతి సూచకం. భూమి, ఆహార ఉత్పత్తి, ఆహార ఆధార పరిశ్రమల మాధ్యమంగా లభిస్తున్న ఆదాయం పెరగడం సహజ ప్రగతికి నిదర్శనం. పారిశ్రామిక రంగంలో సిమెంటు, ఉక్కు, విద్యుత్తు, బొగ్గు, ఇంధన తైలం, ఇంధన వాయువు వంటి వౌలిక ఉత్పత్తులు పెరగడం కూడ సహజ ప్రగతికి చిహ్నం. మిగిలిన పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలు కృత్రిమమైన ప్రగతి చిహ్నాలు. అక్కరలేని అనివార్యం కాని వినిమయ వస్తువుల ఉత్పత్తులు పెరగడం వల్ల లభిస్తున్న ఆదాయం కాని, ఈ ఉత్పాదక రంగాలు కాని ఎప్పటికప్పుడు ‘కుదేలు’మని కూలపడే ప్రమాదం పొంచి ఉంది. విదేశాల ‘సంకుచిత’ ఆర్థిక విధానాల ప్రభావం మన ఆర్థిక రంగాన్ని క్రుంగదీస్తుండడం నడుస్తున్న వైపరీత్యం. ‘ప్రపంచీకరణ’ సృష్టించిన వైపరీత్యం ఇది! ప్రపంచీకరణ వ్యవస్థ మొదలైన తర్వాత మన దేశంలోకి చొరబడిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు సృష్టించిన వైపరీత్యం ఇది. ఈ ‘బహుళ’ వాణిజ్య సంస్థల సదుపాయం కోసం మన ప్రభుత్వాలు వికేంద్రీకృత పారిశ్రామిక విధానాలకు స్వస్తి చెప్పాయి. కేంద్రీకృత ప్రగతిని పెంపొందిస్తున్న ‘ప్రత్యేక ఆర్థిక మండలాల’ను ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా గ్రామాలలోను, చిన్న పట్టణాలలోను ఉపాధి అవకాశాలు తగ్గడం రెండు దశాబ్దుల చరిత్ర. జనాభా,కృత్రిమప్రగతి నగరాలలోను, ప్రత్యే ఆర్థిక మండల ప్రాంగణాలలోను, పారిశ్రామిక వాటికలలోను కేంద్రీకృతం అవుతోంది. ఉపాధి ఉద్యోగాల అవకాశాలున్న ఈ కేంద్రాలకు గ్రామీణులు తరలిపోతుండడం ఈ కేంద్రీకరణ ఫలితం..
విదేశీయుల నిధుల సహాయంతో కాక స్వదేశీయుల పెట్టుబడుల ప్రాతిపదికగా తమ ప్రభుత్వం పారిశ్రామిక ప్రగతిని సాధిస్తుందని 2014 నాటి లోక్‌సభ ఎన్నికలకు పూర్వం భాజపా వారు ప్రచారం చేశారు. ఈ మూడేళ్లలో ఆ వాగ్దానం అమలు జరుగలేదన్నది బహిరంగ రహస్యం. విదేశాల వాణిజ్య సంస్థలు మన దేశంలోని వివిధ అనుత్పాదక, సేవల రంగాలలోకి చొరబడడానికి వీలు కల్పిస్తున్న మన్‌మోహన్ సింగ్ ఆర్థికనీతి ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. మన్‌మోహన్ సింగ్ ప్రధాన మంత్రిత్వంలో పదేళ్లు నడచిన కాంగ్రెస్ ప్రభుత్వ కాలం నాటి విధానాలకు సమగ్ర ప్రత్యామ్నాయాలను మోదీ నాయకత్వంలోని భాజపా ప్రభుత్వం రూ పొందించి అమలుజరుపగలదన్న విశ్వా సం 2014 ఎన్నికల సందర్భంగానే వెల్లి విరిసింది. విదేశాంగ, రక్షణ విధానాలలో మోదీ ప్ర భుత్వం విప్లవాత్మక ప రివర్తనను కల్పించింది కూడ. చైనా విస్తరణను, వ్యూహాత్మక దురాక్రమణను, పాకిస్తానీ జిహాదీ కృత్యాలను ప్రతిఘటించడంలోను, కాలుష్యం, అవినీతి అంటని భౌతిక బౌద్ధిక ‘స్వచ్ఛత’ను పెంపొందించడంలోను మోదీ ప్రభుత్వం గణనీయ ప్రగతి సాధించింది. ఆర్థిక, వాణిజ్య రంగాల్లో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వ కాలం నాటి విధానాలను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఇదీ పొంతన కుదరని అంతర్గత వైరుధ్యం..
భారత్‌లో నిర్మించండి- మేక్ ఇన్ ఇండియా- పథకం వౌలిక రంగాలలోని విదేశీయ సంస్థల పెట్టుబడులను ఆకర్షించలేక పోతోంది. అమెరికా, ఫ్రాన్స్ దేశాలతో కుదిరిన అణువిద్యుత్ సహకార ఒప్పందాల ప్రాతిపదికగా ఒక్క ఉత్పాదక సంస్థ కూడ అంకురించలేదు. మన ప్రభుత్వమే పది స్వదేశీయ అణువిద్యుత్ ఉత్పాదక విభాగాలను ఏర్పాటు చేస్తుందట! ఇది శుభ పరిణామం. విదేశీయ సంస్థలు ఇలాంటి వౌలిక ఉత్పత్తులను పెంపొందించడం లేదన్నది మన ప్రభుత్వాలు ఆశించిన ప్రపంచీకరణ స్ఫూర్తికి విఘాతకరమైన పరిణామం. వౌలిక పారిశ్రామిక రంగాల్లో మాత్రమే విదేశీయ సంస్థలు ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం 1994లో ప్రభుత్వం ప్రకటించిన ప్రపంచీకరణ విధానం. కానీ విదేశీయ సంస్థలు ఈ వౌలిక ప్రగతి కోసం పెట్టుబడులు పెట్టడం లేదు. రసాయన విషాల శీతల పానీయాలను, చాక్లెట్లను, పిజ్జాలను, అప్పడాలను, సేమ్యాలను, మసాలా దినుసులను తయారు చేసి అమ్ముతున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’ ఇదేనా...?