సంపాదకీయం

‘ఔదార్య’ వాణిజ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రైతులకు విత్తనాలను అమ్ముతున్న వాణిజ్య సంస్థల ‘ఔదార్యాన్ని’ మనం అభినందించి తీరవలసిందే! ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం వారు స్వయంగా అభినందిస్తున్నారు. విత్తనాల ధరలను పదిశాతం తగ్గించాలని ప్రముఖ వాణిజ్య సంస్థలు నిర్ణయించడం ఈ ‘ఔదార్యం..!’ పత్తివిత్తనాల ధరలకు మాత్రం ఈ తగ్గింపు వర్తించదట! ‘ఎందుకయ్యా...?’ అన్న ప్రశ్నకు సమాధానం కూడ ఇతరేతర ఆహార, ఆహారేతర ఉత్పత్తులకు కావలసిన విత్తనాలను తయారు చేస్తున్న వారు చెప్పేశారు. పత్తివిత్తనాల ధరలను ప్రభుత్వమే నియంత్రిస్తోందన్నది ఈ సమాధానం. అందువల్ల పత్తి విత్తనాల ధరలను మాత్రం తాము తగ్గించజాలమని ఈ ‘విత్తనాల ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రతినిధులు’ కొత్త్ఢిల్లీలో పదహారవ తేదీన ప్రకటించారు. అంటే కంది, వరి, జొన్న, సజ్జ, రాగి, కూరగాయల వంటి పంటలకు అవసరమైన విత్తనాల ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ కూడ లేదన్న మాట..ఇప్పుడు కూడ ఎలాంటి నియంత్రణ అధికారం ప్రభుత్వానికి ఏర్పడలేదు. ప్రభుత్వానికి నియంత్రణ అధికారం ఉన్నట్టయితే ప్రభుత్వమే స్వయంగా ఈ విత్తనాల ధరలను నిర్ధారించి ఉండవచ్చు...శుక్రవారం జరిగిన సమావేశంలో సంకర జాతి-హైబ్రిడ్ పంటల విత్తనాల ధరలను తగ్గించాల్సిందిగా విత్తనాల ఉత్పత్తిదారుల సమాఖ్య ప్రతినిధులను కేంద్ర ప్రభుత్వం కోరిందట! ప్రభుత్వం వారి కోరికను అంగీకరించిన విత్తనాల ఉత్పత్తి సంస్థలు పదిశాతం ధరలను తగ్గించాయట! ఆర్ధ్ర, పునర్వసు కార్తెల-ఖరీఫ్ సీజన్ ఆరంభంలో విత్తనాలను విత్తుకునే రైతులకు ఇలా వెయ్యి రూపాయల విత్తనాలను తొమ్మిది వందలకే లభించడం విత్తనాల ఉత్పత్తిదారుల ‘ఔదార్యానికి’ చిహ్నం! ఈ ఔదార్యాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్ శుక్రవారం ప్రశంసించడం ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’కు అనుగుణమైన పరిణామం. ప్రపంచీకరణ స్వభావం, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ-మార్కెట్ ఎకానమీ-‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-కు స్వరూపం, మాధ్యమం! ధరలను నిర్ణయించడంలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రమేయం ఉండకపోవడం ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ వౌలిక లక్షణమని ‘ప్రపంచ వాణిజ్య సంస్థ’-డబుల్‌యుటిఓ-దాన్ని నడిపిస్తున్న ప్రపంచీకరణ ఆర్థిక వేత్తలు నిర్దేశించి ఉన్నారు! అందువల్ల మన ప్రభుత్వం తనంత తానుగా విత్తనాల ధరలను తగ్గించలేదు. అలా తగ్గించినట్టయితే మన దేశానికున్న ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ పరిగణనను సంపన్న దేశాలవారు రద్దు చేసే ప్రమాదం ఉంది. ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’ హోదా మనకు అత్యంత ప్రధానం...
ప్రపంచీకరణ ప్రభావం వ్యవసాయ రంగాన్ని కుదేలుమనిపిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే! ప్రభుత్వానికి అన్ని రంగాలపైనా రాజ్యాంగబద్ధమైన నియంత్రణ ఉండడడం ‘ప్రపంచీకరణ’ వ్యవస్థితం కావడానికి పూర్వం నాటి కథ! క్రీస్తుశకం 1990 దశాబ్దికి ముందు కొనసాగిన వ్యవస్థ కథ... వ్యాపార సంస్థలపైన, పారిశ్రామిక సంస్థలపైన వాటి ఉత్పత్తుల, సరఫరాల ధరలపైన ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ అధికారం లేకపోవడం నడుస్తున్న రాజ్యాంగ వ్యవస్థ కథ, స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ కథ! ‘సరఫరా, గిరాకీ’లు-సప్లయ్ డిమాండ్-ఆధారంగా ధరలు నిర్ధారణ కావడమే ‘స్వేచ్ఛా వాణిజ్యం’ అన్నది ప్రపంచీకరణ సూత్రం! సంక్షేమం, మానవత్వం అన్న సంస్కారాలకు ఈ సూత్రంలో స్థానం లేదు! అందువల్లనే విత్తనాలను ఉత్పత్తి చేస్తున్న సంస్థలు రైతులను దోచి పారేయడం రెండున్నర దశాబ్దుల ప్రపంచీకరణ...సంకర జాతి విత్తనాలు, రసాయనపు ఎఱువులు, తెగులును నిర్మూలించే విష రసాయనాలు వ్యవసాయదారునికి అనివార్యం! అందువల్ల వీటికి గిరాకీ నిరంతరం పెరుగుతోంది. ఎంత భయంకరమైన ధరలనైనా చెల్లించి విత్తనాలను రైతులు కొని తీరవలసిందే! అందువల్లనే స్వదేశీయ, విదేశీయ వ్యాపార సంస్థలు విత్తనాల ధరలను విపరీతంగా పెంచేశాయి! ఉత్పాదక వ్యయం పది రూపాయలయితే వంద రూపాయలకు ఆ విత్తనాలను అమ్మడం ‘స్వేచ్ఛా వాణిజ్య’ వేత్తలు నడిపిస్తున్న దోపిడీ క్రీడ!
పదిశాతం ధరలను తగ్గించిన విత్తనాల ఉత్పత్తిదారులు తమ అక్రమార్జనలోను, సరఫరాదారుల, దళారీలు, ఇతరుల అక్రమ ఆర్జనలోను ఇలా పదిశాతం కోత విధించుకున్నారు ఇదీ ‘ఔదార్యం..’, ఇన్నాళ్లుగా ఈ పదిశాతాన్ని దిగమింగడాన్ని ఏ పేరుతో పిలవాలి?? ఆహార ధాన్యాల ‘గింజల’- గ్రెయిన్-లకు, విత్తనాల-సీడ్స్-కూ మధ్య ఇంత భారీగా ధరల్లో అంతరం ఎందుకని ఏర్పడిందన్న ప్రశ్నకు దశాబ్దులుగా సమాధానం లేదు. వ్యవసాయంపై వాణిజ్యవేత్తలకు నియంత్రణ ఏర్పడడం ‘విత్తనాల’ ధరలు పెరగడానికి మొదటి కారణం, వాణిజ్యంపై విదేశీయుల పెత్తనం ఏర్పడడం రెండవ కారణం..ఈ రెండవ ‘కారణానికి’ కారణం ‘ప్రపంచీకరణ’.. విదేశీయ వాణిజ్య వేత్తల అమానుష స్వభావం స్వదేశీయ వ్యాపారును సైతం ఆవహించడం ప్రపంచీకరణ ఫలితం! మాతృసమాజం పట్ల వౌలిక మమకారం నశించకపోవడం ప్రపంచీకరణ ఫలి తం! కిలో కందులను రైతు దాదాపు యాబయి రూపాయలకు అమ్ముకుంటున్నాడు. కిలో కంది విత్తనాలను ఎంతకు కొంటున్నాడు?? పదిశాతం తగ్గిన విత్తనాల ధరలను తగ్గించిన ‘ఔదార్యం’ వెనుక నుంచి జరిగిపోయిన దోపిడీ వెక్కిరిస్తుండడం ప్రపంచీకరణ...కిలో విత్తనాల ధరను ఐదు వందలు రూపాయలుగా నిర్ధారించడానికి కల ‘తార్కికమైన’ ప్రాతిపదిక ఏమిటి? న్యాయం సంగతి సరేసరి...ఈ ప్రాతిపదికను విచారించే వ్యవస్థ లేదు, యంత్రాంగం లేదు, ప్రభుత్వం లేదు, ఇదీ ‘ప్రపంచీకరణ’ వ్యవసాయాన్ని ఆవహించిన తీరు! ‘్భరీ’ ధరను విత్తనాల పొట్లంపై ముద్రించడం పది శాతం తగ్గిస్తున్నామని ప్రకటించడం...ఔదార్యమా? ఔద్ధత్యమా??
గింజలను పండించే రైతు తదుపరి పంటకు విత్తనాలను ఆ గింజలనుండి ఏర్పరుచుకోవడం మన దేశంలో అనాదిగా వ్యవసాయ సంప్రదాయం! సంకరజాతి విత్తనాల ఉత్పత్తి కావడంతో ఈ సంప్రదాయం అంతరించింది. ఈ ‘సంకర’ విజ్ఞానం అవతరించి దాదాపు ఐదు శతాబ్దులయింది. ప్రతి రైతు తనంత తాను ఈ ‘సంకర జాతి’-హైబ్రిడ్-విత్తనాలు పండించుకునే వ్యవసాయ వ్యవస్థ ఎందుకని ఏర్పడలేదు! విజ్ఞానం విస్తరించడంవల్ల పెరగడంవల్ల సన్నకారు రైతులకు సదుపాయం కలగలేదు! ప్రతి గ్రామంలోను కనీసం ఒకరిద్దరు లేదా కొందరు రైతులు ‘విత్తనాల’ను ఉత్పత్తి చేసి మిగిలిన రైతులకు సరఫరా చేయడానికి వీలైన వ్యవస్థ కూడ ఏర్పడలేదు! విత్తనాల ఉత్పత్తి కేంద్రీకృతం అయింది, స్వయంసమృద్ధి గ్రామం గతమైపోయింది! సేంద్రి య, ప్రాకృత వ్యవసాయ పద్ధతులు పునరుద్ధరణ విస్తరణ మాత్రమే ‘దళారీల’ దోపిడీకి విరుగుడు!