సంపాదకీయం

‘సాంకేతిక’ ఉగ్రవాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కులభూషణ్ జాధవ్ ‘క్షమా యాచన’కు పాల్పడినట్టు పాకిస్తాన్ సైనిక దళాల అధికారులు చేస్తున్న ప్రచారం వాస్తవాలను ఘోరంగా వక్రీకరించడానికి పన్నిన పన్నాగంలో భాగం! నిరపరాధి అయిన కులభూషణ్ జాధవ్ ‘ఘోరమైన నేరాలను చేసినట్టు’ స్వయంగా అంగీకరించాడని, పశ్చాత్తాపం ప్రకటించాడని, తనను ‘క్షమించి శిక్షను రద్దు చేయవలసింది’గా పాకిస్తాన్ సైనిక దళాల అధిపతి ఖమర్ జావీద్ బజ్వా అనే వాడికి వినతిపత్రం సమర్పించాడని ప్రకటించడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదారి పట్టించడానికై ఈ కుట్రకు రూపకల్పన చేసింది. మన దేశానికి చెందిన కులభూషణ్ జాధవ్ నిర్దోషి అన్న, ఆయనను ఇరాన్‌నుంచి పాకిస్తాన్ దళాలు అపహరించాయన్న వాస్తవాలను ‘అంతర్జాతీయ న్యాయస్థానం’లో ధ్రువపరచడానికి మన ప్రభుత్వం యత్నిస్తోంది! ఈ నిజాలను అబద్ధాలని నిరూపించడానికి అంతర్జాతీయ న్యాయస్థానంలో పాకిస్తాన్ చేసిన ప్రయత్నం విఫలమైంది! కులభూషణ్ జాధవ్ నిర్దోషి అని ఆయనను నిర్బంధంనుంచి విముక్తుడిని చేసి మన దేశానికి పంపించాలని అంతర్జాతీయ న్యాయస్థానం తీర్పు చెప్పడం ఖాయమన్న భయం పాకిస్తానీ పౌర ప్రభుత్వాన్ని, సైనిక దళాలను పట్టుకుంది. అందువల్ల జాధవ్ ‘ఘోరమైన నేరాలను చేసినట్టు’ అంగీకరించాడని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని నమ్మించడానికి పాకిస్తాన్ ఘోరమైన వక్రీకరణకు పాలుపడింది! జాధవ్ నేరం అంగీకరించాడని, క్షమాభిక్షను కోరుతున్నాడని ‘నిరూపించడానికి’ వీలైన ‘ప్రచార దృశ్యాన్ని’-వీడియో- గురువారం పాకిస్తాన్ సైనిక దళాలు విడుదల చేయడం ఈ ‘ఘోర వక్రీకరణ’ కుట్రలో భాగం...
చేయని నేరాన్ని చేసినట్టుగా జాధవ్ అంగీకరించడం అసంభవం. అందువల్ల పాకిస్తాన్ సైనిక దళాలు విడుదల చేసిన ‘దృశ్యఖండిక’ సాంకేతిక బీభత్సం మాత్రమే! జమ్ము కశ్మీర్‌లోకి పాకిస్తాన్ ప్రభుత్వం భయంకర పైశాచిక బీభత్సకారులను ఉసిగొల్పుతుండడం నిర్ధారిత వాస్తవం. వివిధ దేశాల ప్రభుత్వాలు ఈ వాస్తవాన్ని గుర్తించాయి. పాకిస్తాన్‌ను నిరసిస్తున్నాయి! మన దేశ మంతటా పాకిస్తానీ జిహాదీ ఉగ్రవాదులు దశాబ్దుల తరబడి కొనసాగిస్తున్న పైశాచిక హత్యాకాండ కూడా జగద్విదితం...అందువల్ల ఈ వాస్తవాన్ని కప్పిపుచ్చి, మన దేశాన్ని అబద్ధ ప్రచారంతో అప్రతిష్ఠపాలు చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం, సైన్యం అమలు జరుపుతున్న కుట్రలో భాగం జాధవ్ వివాదం! 1993లో పాకిస్తాన్ ప్రభుత్వం ముంబయిలో జరిపించిన భయానక పైశాచిక కాండను జరిపిన వారు దోషులని ఇటీవల ప్రత్యేక న్యాయస్థానం ధ్రువపరిచింది! ఇలా తమ నేరం ధ్రువపడినప్పుడల్లా పాకిస్తానీ పెత్తందార్లు మన దేశంపై అభాండాలను అపనిందలను వేయడం గత కొంతకాలంగా అమలు జరుగుతున్న కుట్రలో భాగం. చైనా దళాలు పాకిస్తాన్ దురాక్రమిత జమ్ము కశ్మీర్‌లో తిష్ఠ వేసినప్పటినుంచి ఈ కుట్ర కొనసాగుతోంది. పాకిస్తాన్‌లోని బలూచిస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవునుంచి చైనా ఆక్రమణలో ఉన్న ‘సింకియాంగ్’లోని కశ్‌గఢ్ వరకు ఈ ఉభయ దేశాలు నిర్మిస్తున్న ‘ఆర్థిక వాణిజ్య వాటిక’ దురాక్రమిత కశ్మీర్ గుండా విస్తరిస్తోంది! దీన్ని మన ప్రభుత్వం తీవ్రంగా నిరసించడం చైనా కొత్త ఎత్తుగడకు కారణం! మన ప్రభుత్వం కూడ పాకిస్తాన్‌లో బీభత్స కలాపాలను నిర్వహిస్తోందన్న అసత్య ప్రచారం ఈ కొత్త ఎత్తుగడ. బలూచిస్థాన్‌లో దశాబ్దుల తరబడి కొనసాగుతున్న సమరంలో మన దేశానికి ఎలాంటి ప్రమేయం లేదు! 1947లో అఖండ భారత్ విభజన జరిగి పాకిస్తాన్ ఏర్పడినప్పుడు బలూచిస్థాన్‌లోని సంస్థానాలు, బ్రిటన్ అధీనంలోని ప్రాంతాల వారు కూడ పాకిస్తాన్‌లో కలవడానికి ఇష్టపడలేదు. బలూచిస్థాన్ లేని పాకిస్తాన్ ఏర్పాటునకు ‘పాకిస్తాన్ నిర్మాత’ మహమ్మదాలీ జిన్నా 1947కు పూర్వం అంగీకరించాడు కూడ! అందువల్ల అఖండ భారత్ విభజన తరువాత బలూచిస్థాన్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం ఆక్రమించుకున్న నాటినుంచి బలూచీ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఉద్యమిస్తూనే ఉన్నారు. ఈ ఉద్యమంతో మనకు ప్రమేయం లేదు...
మన ‘ప్రమేయం’ ఉందన్న అసత్యాన్ని ప్రచారం చేయడం చైనా, పాకిస్తాన్‌ల ఉమ్మడి ఎత్తుగడ! చైనా నౌకాదళం గ్వాడార్ ఓడరేవులో తిష్ఠ వేయడాన్ని, ‘ఆర్థిక వాణిజ్య వాటిక’ను నిర్మించడాన్ని బలూచీ స్వాతంత్య ఉద్యమకారులు వ్యతిరేకిస్తుండడం కూడ మన దేశానికి వ్యతిరేకంగా ‘చైనా, పాకిస్తాన్’ల ఉమ్మడి దురాగ్రహం ప్రబలడానికి మరో కారణం! జాధవ్‌ను ఇరాన్‌నుంచి పాకిస్తాన్ దళాలు అపహరించుకొని పోవడానికి ఆయనను నేరస్థుడుగా నిలబెట్టే షడ్యంత్రానికి ఇదంతా నేపథ్యం. తాను బలూచిస్థాన్‌లో బీభత్స కాండను సృష్టించడం ద్వారా అనేక మంది ప్రాణాలను తీసినట్టు జాధవ్ ‘ఒప్పుకున్నాడని’ పాకిస్తాన్ సైనిక దళాలు ప్రచారం చేసాయి. ఇదే నిజమైతే జాధవ్ ఏఏ ఉగ్రవాద హత్యాకాండలో పాల్గొన్నాడన్నది పాకిస్తాన్ ప్రభుత్వం వివరించాలి! ఫలానా ఘటనలో జాధవ్ పాత్రధారి అని కాని సూత్రధారి అని కాని నిరూపించగల ‘సాక్ష్యాధారాల’ను పాకిస్తాన్ చూపించడం లేదు. సూత్రధారుడయినట్టయితే ఆయన ప్రతినిధులుగా బీభత్స కృత్యాలను నిర్వహించిన వారెవరు? ఈ సంగతిని కూడ పాకిస్తాన్ సైనిక దళాలు కాని, పౌర ప్రభుత్వం కాని చెప్పడంలేదు! జాధవ్‌ను అతి రహస్యంగా బంధించి ఉంచిన పాకిస్తానీలు, ఆయనకు వాస్తవాలు తెలియనివ్వడంలేదు, ఆయనకు పాకిస్తాన్ సైనిక న్యాయస్థానం విధించిన మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానం తాత్కాలికంగా రద్దు చేయడం ఈ వాస్తవాలలో ఒకటి మాత్రమే!
మన దేశపు నౌకాదళంలో పనిచేసి స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేసిన కులభూషణ్ జాధవ్ వ్యాపారం చేయడం కోసం ఇరాన్‌లో వెళ్లి స్థిరపడినాడు. గత సంవత్సరం మార్చిలో పాకిస్తాన్ సైనిక దళాలు ఆయనను టెహరాన్‌నుంచి అపహరించుకొని వెళ్లడం పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్సకాండ-స్టేట్ టెర్రరిజమ్‌లో భాగం! జాధవ్ మన దేశపు గూఢచారి అని మొదట ప్రకటించిన పాకిస్తాన్ ఆయనను రహస్యంగా సైనిక న్యాయస్థానంలో ‘విచారించి’ మరణ శిక్షను విధించింది! నిజంగా జాధవ్ గూఢచారి అయినట్టయితే ఆయన వద్ద ఆయన పేరుతో ‘పాస్‌పోర్టు’ ఉండదు. కానీ జాధవ్ గూఢచారి కాదు కనుక ఆయన తన పేరుతోనే ‘పాస్‌పోర్టు’ తీసుకున్నాడు...అంతర్జాతీయ న్యాయస్థానంలో ఈ వాస్తవం ధ్రువపడింది! అంతర్జాతీయ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించవచ్చునన్న విశ్వాసంతో పాకిస్తాన్ ఇప్పుడీ కొత్త దుశ్చర్యకు పూనుకుంది....