సంపాదకీయం

వారి క్షేమం.. హర్షదాయకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారి సజల నయనాల నుంచి సంతోషం జాలువారుతోంది, వారి హృదయాలు ప్రహర్ష పరిప్లుతమయ్యాయి. నిరాశా నాస్పృహల చీకటి ఆవహించి ఉన్న ఆ ముప్పయి తొమ్మిది కుటుంబాల ప్రాంగణాలలో వేకువ అంకురించింది, విశ్వాసం మళ్లీ వికసిస్తోంది! ఈ ‘విశ్వాసం’ గత మూడేళ్లుగా మోడువారిపోయింది. ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా- ఐసిస్- ఉగ్రవాదులు 2014లో అపహరించిన భారతీయ శ్రామికుల జాడ ఇన్లాళ్లుగా తెలియక పోవడం మన ‘విశ్వాసం’ ఇలా మోడువారి పోవడానికి కారణం. ఐసిస్ జిహాదీ ముష్కర మూకల అపహరణకు గురైన ఈ భారతీయులు సజీవంగా ఉన్నారని ఇరాక్ ప్రభుత్వానికి విశ్వసనీయ సమాచారం లభించడం మన ‘విశ్వాసం’ వెలగడానికి కారణం. ఈ భారతీయ కార్మికులు ఇరాక్‌లోని ‘మోసుల్’ ప్రాంతంలోని ‘బాదుష్’ నగర శివారులోని ‘ఐసిస్’ నిర్బంధ ప్రాంగణంలో సజీవులై ఉన్నట్టు ఇరాక్ ప్రభుత్వానికి లభించిన సమాచారం. తమ దేశంలో పర్యటించిన మన విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయమంత్రి విజయకుమార్ సింగ్‌కు ఇరాక్ ప్రభుత్వం ఈ సమాచారాన్ని అందజేసిందట. విదేశీ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ఆదివారం ఈ శుభ సమాచారాన్ని ‘నిర్బంధితుల’ కుటుంబాల సభ్యులకు తెలియజేయడంతో దేశ ప్రజల హృదయాలలో హర్ష వర్షం కురిసింది. మూడేళ్ల క్రితం ఇరాక్‌లోని మోసుల్‌లో అపహరణకు గురైన మన పౌరులలో అత్యధికులు పంజాబ్‌కు చెందినవారు. సుషమా స్వరాజ్ చెప్పిన చల్లటి క బురు వినడానికి పంజాబ్ నుంచి, దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి దిల్లీకి తరలివచ్చిన ‘బంధితుల’ కుటుంబాల సభ్యుల స మావేశం హర్ష వ్యధా సంగమ ప్రదేశం. తమ కుటుంబాల వారు ఇరాక్‌లో సజీవంగా ఉన్నారన్నది వారికి ఆనందం.. ఇంకా బంధితులకు విముక్తి కలుగకపోవడం, వారు స్వదేశానికి తిరిగి రాలేకపోవడం కొనసాగుతున్న వ్యధకు కారణం. నిజానికి ఇది దేశ ప్రజల ఆనందం, దేశ ప్రజల వ్యధ కూడా!
ఇరాక్ ప్రభుత్వంతో ‘ఐసిస్’ మూడేళ్లుగా విరోధం సాగిస్తోంది. సద్దాం హుస్సేన్ అన్న మతోన్మాద నియంత అనేక ఏళ్లపాటు అంతర్గత కల్లోలాన్ని సృష్టించాడు, అంతర్జాతీయ బీభత్సకాండను ఉసిగొల్పాడు. 1990లో కువైట్ దేశాన్ని దురాక్రమించి తమ దేశంలో కలుపుకున్నాడు. అమెరికా, మిత్రదేశాల సేనలు కువైట్‌ను ఇరాక్ నుంచి విముక్తం చేయగలిగినప్పటికీ 2003 వరకూ ఇరాక్‌కు మాత్రం సద్దాం హుస్సేన్ బీభత్సపాలన నుంచి విముక్తం కలుగలేదు. అమెరికా సైన్యాల దాడుల ఫలితంగా 2003లో సద్దాం పదవిని వదలి పలాయనం చిత్తగించాడు. 2006లో ఇరాక్ న్యాయవ్యవస్థ సద్దాంకు మరణశిక్ష విధించింది. ఆ తరువాత అమెరికా నాయకత్వంలో ఇరాక్ ‘పరిమిత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ’ను ఏర్పరచుకొంది. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోసి మళ్లీ మత రాజ్యాంగ వ్యవస్థను ఏర్పాటు చేసే లక్ష్యంతో ‘ఐసిస్’ పుట్టుకొచ్చింది. అందువల్ల అనాదిగా సహజ సర్వమత సమభావ వ్యవస్థగా ఏర్పడి ఉన్న మన దేశం పట్ల ‘ఐసిస్’కు శత్రుభావం కొనసాగుతోంది. ఇరాక్ ఉత్తర ప్రాంతమైన ‘మోసుల్’ నుంచి భారతీయ కార్మికులను ‘ఐసిస్’ అపహరించడానికి ఇదీ నేపథ్యం. 2014లో మోసుల్‌ను ‘ఐసిస్’ దురాక్రమించుకున్న సమయంలో అక్కడ పనిచేస్తుండిన భారతీయ కార్మికులు పట్టుబడిపోయారు. మూడేళ్లుగా ఈ ‘బందీ’ల గురించి రకరకాల కథనాలు వెలువడినాయి. ఇప్పుడు ఇరాక్ ప్రభుత్వ సైన్యాలు మోసుల్ నగరాన్ని ‘ఐసిస్’ నుంచి విముక్తం చేయగలిగాయి. కానీ బాదుష్ ప్రాంతంలో ఇంకా ప్రభుత్వ దళాలకు, జిహాదీ ముష్కరులకు పోరాటం కొనసాగుతూనే ఉందట. బాదుష్ సమీపంలోని ‘ఐసిస్’ బందిఖానాలో ఉన్న మనవారికి విముక్తి ఎప్పుడని? ఇదీ కొనసాగుతున్న భయాందోళనా భావ భరితమైన ఉత్కంఠ..
మన దౌత్యం విఫలమైందనడం సరికాదు. ఎందుకంటే మనవారిని బందీలుగా పట్టుకున్న ‘ఐసిస్’ ఒక ప్రభుత్వం కాదు, నాగరిక నియమాలను కాని, మానవత్వపు విలువలను కాని లెక్కచేయని మతోన్మాద బీభత్స సంస్థ ‘ఐసిస్’. అందువల్ల ‘ఐసిస్’ ప్రతినిధులతో మన ప్రభుత్వం ‘చర్చలు’ జరపడం అసంభవం. ప్రతినిధులు ఎవరో బయటపడితే కదా వారిని సంప్రదించడానికి.. ‘చీకటి’ ముసుగు వేసుకున్న పైశాచిక మూకలు ‘ఐసిస్’ ఉగ్రవాదులు. పశ్చిమ ఆసియా, ఉత్తర ఆఫ్రికా ఖండాలలోని ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాల ప్రభుత్వాలు సైతం తరచూ అంతర్జాతీయ దౌత్య నియమాలను, మానవీయ మూల్యాలను ఉల్లంఘించడం చరిత్ర. 1948లో ఇజ్రాయిల్, పాలస్తీనా స్వతంత్ర దేశాలు ఏర్పడినాయి. పాలస్తీనా మాత్రమే ఉండాలని ఇజ్రాయిల్ ఉండరాదని ఈ ఇస్లాం మతరాజ్యాలు వాదించాయి. ‘ఇజ్రాయిల్‌ను విధ్వంసం చేయడానికై’ యుద్ధం ప్రకటించాయి. ఇదీ మతోన్మాద రా జ్యాంగ వ్యవస్థల వారి తర్కం.. 1978-79 సంవత్సరాలలో ఇరాన్ ప్రభు త్వం తమ దేశంలోని అమెరికా రాయబారి కా ర్యాలయం సిబ్బందిని అనేక నెలల పాటు బందీలుగా ఉంచింది. ప్రభుత్వాల స్వభావమే ఇలా ఉన్నప్పుడు ‘ఐసిస్’ వంటి ఉగ్రవాద సంస్థలు దౌత్య నియమాలకు ఎందుకు కట్టుపడతాయి? అందువల్ల మనవారిని ‘ఐసిస్’ బందిఖానా నుంచి విడిపించడానికి దౌత్యం పనికిరాదు. ముట్టడించి బందీలను విడిపించే ప్రయత్నాలు ఎక్కువ సందర్భాల్లో బెడిసికొట్టడం, ఉగ్రమూకలు బందీలను హతమార్చడం అంతర్జాతీయ చరిత్రలో భాగం. అందువల్ల ఈ ముప్పయి తొమ్మిది మంది భారతీయులు క్షేమంగా ఉండడం భగవంతుని కరుణా కటాక్షం..
మోసుల్ ప్రాంతంలో 2014 నాటికి దాదాపు పదివేల మంది భారతీయులు పనిచేస్తుడినారు. ఇరాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ‘ఐసిస్’ యుద్ధం ప్రకటించిన వెంటనే మన ప్రభుత్వం ఈ భారతీయులు స్వదేశానికి తిరిగి రావాలని సలహా ఇచ్చింది, రప్పించడానికి విమానాలను నౌకను కూడా సిద్ధం చేసింది. కానీ ఈ ముప్పయి తొమ్మిది మందినీ ‘ఐసిస్’ బందీలుగా పట్టుకున్నట్టు 2014 జూన్ 18న విస్తృతంగ ప్రచారమైంది. ఆ తరువాత మోసుల్‌కు ఎనబయి కిలోమీటర్ల దూరంలోని ‘తిక్రిల్’ నుంచి నలబయి ఆరుగురు భారతీయులను కూడ 2014 జూలైలో ‘ఐసిస్’ ఉగ్రవాదులు అపహరించుకొని పోయారు. అపహరణకు గురైన ఈ నలబయి ఆరుగురు నర్సులను ఇరవై నాలుగు గంటల తరువాత టెర్రరిస్టులు వదలిపెట్టడం కూడ దైవ ఘటన మాత్రమే! ఈ నర్సులు క్షేమంగా మన దేశానికి తిరిగి వచ్చేశారు. అందువల్ల బందీలుగా కొనసాగుతున్న ఈ ముప్పయి తొమ్మిది మంది మన కార్మికులకు భగవంతుడే దిక్కు!