సంపాదకీయం

ఆహార భద్రత..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహార భద్రత చట్టం అమలుకాకపోవడం పట్ల సర్వోన్నత న్యాయస్థానం సోమవారం వ్యక్తం చేసిన ఆగ్రహం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మరో న్యాయాభిశంసన! 2013 సెప్టెంబర్ పదవ తేదీన ‘అమలులోకి వచ్చిన’ ఈ చట్టం వాస్తవంగా ‘అమలు జరగడం లేదన్న’ది సర్వోన్నత న్యాయమూర్తులు మదన్ బి లోకుర్, ఎన్‌వి రమణ చేసిన నిర్ధారణ. హర్యానా వంటి రాష్ట్రాలలో ఈ పథకం అమలు జరపడానికి ‘రాష్ట్ర ఆహార మండలి’- స్టేట్ ఫుడ్ కమిషన్- ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం న్యాయ ప్రమేయానికి దారితీసిన పరిణామం. పార్లమెంటు ఆమోదించిన ‘జా తీయ ఆహార భద్రతా శాసనం’- నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్- ప్రకారం ప్రతి రాష్ట్రంలోను ‘ఆహార భద్రతా మండలి’ ఏర్పడవలసి ఉంది. హర్యానాలో ఏర్పడిన ‘మండలి’ ఉద్యోగులు, అధికారులు నాలుగేళ్లుగా పనిలేకుండా కూర్చుని ఉన్నట్టు సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించడం సామాన్య ప్రజల ఆహార భద్రత పట్ల రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యానికి అద్దం.. అనేక రాష్ట్రాలలో ‘ఆహార భద్రతా మండలి’ కూడ ఏర్పడలేదట. ఏర్పడిన కొన్ని రాష్ట్రాలలో ఈ ‘మండలి’కి కార్యక్రమాలు సున్న.. ‘దారిద్య్రరేఖ’కు దిగువన ఉన్న కోట్లమంది పిల్లల, మహిళల, నిరుపేదల అన్నార్తిని తీర్చడానికి వీలుగా రూపొందిన ఈ ‘ఆహార భద్రతా పథకం’ గురించి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు ధ్యాస కూడ లేకపోవడం సర్వోన్నత న్యాయాగ్రహానికి ప్రాతిపదిక. ఈ కేంద్ర పథకం అమలు జరగని రాష్ట్రాల జాబితాలో మన తెలుగు ప్రాంతాలు కూడ ఉండడం ఇప్పుడు బయటపడిన కఠోర వాస్తవం. కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాలలో కూడ ఈ పథకం ప్రారంభం కాలేదట! ఈ చట్టాన్ని అ మలుజరపవలసిన బా ధ్యత నుంచి కేంద్ర ప్ర భుత్వం తప్పించుకోజాలదన్నది సుప్రీం కోర్టు చేసిన నిర్ధారణ. బాధ్యతను రాష్ట్రాలకు వ దిలేసి కేంద్రం ముఖం తిప్పుకొనడం పట్ల న్యా యమూర్తులు నిరసన వ్య క్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించి, ఆదేశించి ఈ సంక్షేమ పథకాన్ని అమలు జరిపించవలసిన బాధ్యత రాజ్యాంగంలోని 256వ అధికరణం ప్రకారం కేంద్ర ప్రభుత్వానిదేనని కోర్టు స్పష్టం చేసింది. ఇలా ఆదేశించడం ‘సమాఖ్య’- ఫెడరల్- స్ఫూర్తికి విరుద్ధం కాదన్నది ‘సుప్రీం’ వివరణతో మరోసారి స్పష్టం కావడం అభిలషణీయ పరిణామం. కేంద్ర ప్రభుత్వం తమ అధికార పరిధిలోకి చొరబడుతోందని ఇటీవలి కాలంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానంగా ప్రాంతీయ రాజకీయ పక్షాలు అధికారం నిర్వహిస్తున్న చోట్ల- ఆరోపించడం నడుస్తున్న చరిత్ర. కేంద్ర ప్రభుత్వం కూడ ‘అది రాష్ట్రాల బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వాల అధికార పరిధిలోకి మమ్ములను చొరబడమంటారా?’ అని ప్రశ్నిస్తున్న సందర్భాలు ఏర్పడి ఉన్నాయి. రాజ్యాంగంలోని 256వ అధికరణాన్ని ప్రస్తావించడం ద్వారా సుప్రీం కోర్టు ఈ ‘సమాఖ్య స్ఫూర్తి’నే మరోసారి స్పష్టీకరించినట్టయింది.
రాజ్యాంగంలోని 256వ అధికరణం ప్రకారం పార్లమెంటు ఆమోదం ద్వారా రూపొందిన చట్టాలకు అనుగుణమైన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిపాలనాధికారాన్ని నిర్వహించవలసి ఉంది. ఈ ‘నిర్వహణ’ కొనసాగడానికి వీలుగా రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలను ఇచ్చే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉందని 256వ అధికరణం నిర్దేశిస్తోంది. అందువల్ల ఆహార భద్రత పథకాన్ని అమలు జరిపించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నది సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్థారణ. వాస్తవానికి ఈ ‘ఆహార భద్రతా పథకం’ కేంద్ర ప్రభుత్వ నిధులతోనే అమలు జరగాలన్నది చట్టంలోని ప్రధానాంశం. కేంద్ర ప్రభుత్వం నిధులను ఇస్తున్నప్పుడు పథకాన్ని అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కలుగుతున్న ఇబ్బంది కూడ లేదు. అయినప్పటికీ ఈ పథకం మూలనపడి ఉండడం అంతుపట్టని వ్యవహారం. కేంద్ర ప్రభుత్వం చట్టం చేయడానికి పూర్వం నుంచీ కూడ కొన్ని రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి ఆహార భద్రతా పథకాలు అమలు జరుగుతున్నాయి. సబ్సిడీ-రాయితీ-లపై అతి తక్కువ ధరలకు ఆహార పదార్థాలను ప్రభుత్వాలు నిరుపేదలకు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థలోని చౌక దుకాణాల ద్వారా పప్పులు, ఉప్పులు, నూనె, చక్కెర, గోధుమపిండి, బియ్యం వంటివి దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి లభిస్తున్నాయి. రేషన్ కార్డులకు బదులుగా ఆహార భద్రత కార్డులను కూడ రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసినట్లు ప్రచారమైంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు ఆహార భద్రత విషయంలో మిగిలిన రాష్ట్రాలకు మార్గదర్శకంగా ఉంటున్నట్టు ప్రచారమైంది. పాఠశాలల, కళాశాలల విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న సంక్షేమ వసతిగృహాలలో సన్నబియ్యం- మేలైన బియ్యం-తో వండిన ఆహారాన్ని వడ్డిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది కూడ. ఇది ఆహార భద్రతా పథంలో మరో ప్రగతి పదం.. అయినప్పటికీ సుప్రీం కోర్టు అసంతృప్తికి గురైన జాబితాలో తెలుగు రాష్ట్రాలు కూడ ఉండడం అంతుపట్టని వ్యవహారం..
‘ఆహార భద్రత’ మన సమాజంలో ఏర్పడి ఉన్న అనేక వైరుధ్యాలకు ప్రతీకగా మారి ఉండడం దశాబ్దుల చరిత్ర. ఈ దశాబ్దుల చరిత్ర మన దేశాన్ని విదేశీయులు దారుణంగా దోచిన శతాబ్దుల చరిత్రకు కొనసాగుతున్న వా రసత్వ వైపరీత్యం. ఒకప్పుడు మనదేశంలో ‘ఆ కలి’ ఎరుగని సమాజం పరిఢవిల్లింది. స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థ కొనసాగిన సహస్రాబ్దుల కాలంలో గ్రామాలు పాడిపంటలతో దేశాన్ని పరిపోషించాయి. మన దేశం నుంచి ఇతర దేశాలకు పుష్కలంగా ఆహారం ఎగుమతి అయింది. వాగులు, వంకలు, నదులు, బావులు, చెఱువులు వ్యవసాయ క్షేత్రాలను నిరంతరం సస్యశ్యామలం చే శాయి. కానీ విదేశీయ దురాక్రమణదారులు దేశంలో చొరబడిన తరువాత, వారు ‘పాలకులు’గా చెలామణి అయిన తరువాత మన ‘పాడిపంటలు’ ధ్వంసం కావడం మొదలైంది. ఈ విధ్వంస విధానాల కారణంగానే దేశమంతటా కరవు కాటకాలకు నిలయమైంది. గంగా బ్రహ్మపుత్ర నదుల పరీవాహ ప్రాంతమైన వంగసీమ- బెంగాల్-లో క్రీస్తుశకం పద్దెనిమిదవ శతాబ్ది నాటి భయంకరమైన క్షామం చరిత్రను విషాద స్మృతులకు గురి చేసింది. వంగ ప్రాంత జనాభాలోని మూడింట రెండు వంతుల మంది నశించిపోవడం ఈ చరిత్ర. విదేశీయులపై బెంగాల్ ప్రాంతంలోని ‘సన్యాసులు’- ధర్మాచార్యులు- పద్దెనిమిదవ శతాబ్దిలో చేసిన తిరుగుబాటుకు కారణం ఈ కరవు. ఈ సన్యాసుల విప్లవం చరిత్ర ప్రసిద్ధం. బంకించంద్ర ఛటర్జీ వంద ఏళ్ల తరువాత రాసిన ‘ఆనంద మఠం’ నవలకు ఈ ‘విప్లవం’ ఇతవృత్తం.. ‘సుజల సుఫల’ అయిన భరతభూమి 1947 నాటికి విదేశాల వద్ద ‘తిండి కోసం’ బిచ్చమెత్తవలసి రావడం ఈ భయంకర విదేశీయ దురాక్రమణ ఫలితం. 1960 దశకం చివరి వరకూ పుచ్చిపోయిన గోధుమలను, ముక్కిపోయిన ‘పాలపొడి’ని మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం ఆహార భద్రతకు భంగం కలిగించిన విపరిణామ క్రమం..
హరిత విప్లవాలు సాధించాము, ఆహార ఉత్పత్తులు పెరిగాయి. మళ్లీ మన దేశం ఆహార ధాన్యాలను ఎగుమతి చేసే ‘అన్నపూర్ణ’గా ఎదిగింది. కానీ 1994 నుంచి మొదలైన ‘ప్రపంచీకరణ’ ఫలితంగా ఆహార భద్రతా వ్యవస్థలో అంతర్గత వైరుధ్యాలు మొదలయ్యాయి. వ్యవసాయ భూమి, అడవులు కుంచించుకొనిపోతున్నాయి. ఆవుల పశువుల హననం వికృతంగా విస్తరించింది. పల్లెల నుంచి ఇప్పటికీ వలసలు నగరాల వైపు కొనసాగడానికి కారణం మహాత్మా గాంధీ ప్రవచించిన ‘గ్రామ స్వరాజ్యం’ మళ్లీ ఏర్పడక పోవడం. స్వయం సమృద్ధ గ్రామ వ్యవస్థ ఆహార భద్రతకు శాశ్వత ప్రాతిపదిక. గోసంతతిని, సంప్రదాయ సేంద్రియ వ్యవసాయాన్ని, అడవులను పరిరక్షించడం, పరిపోషించడం వల్ల మాత్రమే స్వయం సమృద్ధ గ్రామాలు, ఆహార భద్రత సహజంగా వికసించగలవు..