సంపాదకీయం

సుజల స్ఫూర్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీరామ్‌సాగర్ జలాశయం పునరుజ్జీవన పథకానికి గురువారం తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శంకుస్థాపన చేయడం మరో జల విప్లవ శుభారంభం. నదులలో ఎగువ ప్రాంతం నుంచి దిగువ ప్రాంతాలకు, పర్వతసీమల నుంచి సాగర క్షేత్రం వైపు నీరు ప్రవహించడం సహజ పరిణామక్రమం! కానీ నదుల నీటిని దిగువ ప్రాంతాల నుంచి ఎగువకు తరలించుకొని రావడం మానవుడు సాధించగలుగుతున్న అద్భుతం, విచిత్రం. ఇలాంటి అద్భుతానికి రూపకల్పన చేస్తున్న శాస్తవ్రేత్తలు, తెలంగాణ ప్రభుత్వ నిర్వాహకులు అభినందనీయులు! ఒక నదిపై నిర్మించిన జలాశయం ఉన్న ప్రదేశం కంటే ఎత్తున ఉన్న వ్యవసాయ భూములకు నీటిని చేరవేయడానికి ‘ఎత్తపోతల’-లిఫ్ట్ ఇరిగేషన్- వ్యవస్థ ఇప్పటికే దేశమంతటా ఏర్పడి ఉంది. నదుల అనుసంధానం ద్వారా ఒక నదిలోని మిగులు జలాలు సముద్రం పాలు కాకుండా నీరు తక్కువవున్న మరో నదికి మళ్లించడం ద్వారా వ్యవసాయ భూముల దప్పిక తీర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి! ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా గోదావరీ నదులను ఇలా అనుసంధానం చేయడానికి పూనుకుంది, తొలి విజయం సాధించింది కూడ! ఒక నదిపై ఒకేచోట పెద్ద పెద్ద ఆనకట్టలు కట్టి వేల ఎకరాల పంట పొలాలను అడవులను వందల గ్రామాలను జలమయం చేయడం గత చరిత్ర! గుజరాత్‌లో నదులపై అనేక చోట్ల చిన్న చిన్న ఆనకట్టలు కట్టి చిన్న జలాశయాలను ఏర్పాటు చేసినట్టు ప్రచారమైంది. అదే స్ఫూర్తితో మహారాష్ట్ర ప్ర భుత్వం కూడ చిన్న చిన్న జలాశయాల నిర్మాణం మొ దలుపెట్టింది! తెలంగాణ ప్ర భుత్వం ఇప్పుడు ఆరంభించిన ‘పునరుజ్జీవన పథకం’ జల విప్లవ పథంలో మరో ప్రగతి పదం! ఇలా గోదావరి నీటిని, ప్రాణహిత నీటిని ‘వెనక్కి విరిజిమ్మే-రివర్స్ పంపింగ్-పథకం గతంలో ఊహకందని అద్భుతం! ఈ అద్భుతాన్ని ఆవిష్కరించి ఆచరణకు తెస్తున్న ఘనత తెలంగాణ ప్రభుత్వానిది!
శ్రీరామ్‌సాగర్ ఇందూరు-నిజామాబాద్ ప్రాంతంలోని పోచంపాడు వద్ద గోదావరిపై ఏర్పడి ఉంది! దశాబ్దుల క్రితం ఏర్పడిన ఈ జలాశయం ఇంతవరకు నిండలేదన్నది విచిత్రమైన వాస్తవం! మహారాష్ట్ర సరిహద్దులో నెలకొని ఉన్న ఈ జలాశయానికి గోదావరి నుంచి తగినంత నీరు ఎందుకు రావడం లేదన్నది అంతుపట్టని వ్యవహారం. మహారాష్టల్రో ప్రవహిస్తున్న గోదావరి నీరు అక్కడ నిర్మాణమైన జలాశయాలను నింపడానికి సరిపోతుందన్నమాట! ఆందువల్ల శ్రీరామ్‌సాగర్ పొంగి పొరలడానికి వలసిన నీరు మహారాష్ట్ర నుండి తెలుగుసీమకు తరలిరావడం లేదన్న మాట! ఆందువల్లనే పదునాలుగు లక్షల ఎకరాల నుంచి పదహారు లక్షల ఎకరాలను పండించగల శ్రీరామ్‌సాగర్ నుండి కేవలం ఐదున్నర లక్షల ఎకరాలకు నీరు లభించడం దశాబ్దుల వైపరీత్యం! ఇప్పుడు శ్రీరామ్‌సాగర్‌కు దిగువన కరీంనగర్ ప్రాంతంలో నెలకొని ఉన్న కాళేశ్వరం నుండి మేడిగడ్డ జలాశయం నుంచి నీటిని ఎగువకు తరలించుకుని రావడం పునరుజ్జీవన పథకంలోని మహత్తర మాధ్యమం. గోదావరి నది మహారాష్ట్ర నుంచి తెలంగాణలో ప్రవేశించిన తరవాత శ్రీరామ్‌సాగర్‌ను పూర్తిగా నింపలేకపోతోందన్నది తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన మహా విషయం. దశాబ్దుల తరబడి రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సంగతిని గుర్తించకపోవడం నిర్లక్ష్య భావానికి నిదర్శనం. కానీ కేవలం గుర్తించడంవల్ల ప్రయోజనం శూన్యం! పరిష్కారాన్ని కూడ తెలంగాణ ప్రభుత్వం అనే్వషించగలిగింది. ఆనకట్టకు దిగువన దాదాపు రెండువందల కిలోమీటర్ల దూరంలో వున్న కాళేశ్వరం వద్ద ప్రాణహిత గోదావరితో సంగమిస్తోంది. అక్కడి నుంచి దశలవారీగా నాలుగుచోట్ల ‘ఎత్తిపోతల’ పథకాల ద్వారా శ్రీరామ్‌సాగర్‌ను తొంబయి శతకోటి ఘనపుటడుగుల-టిఎమ్‌సిల-నీటితో నింపడం ఈ ‘రివర్స్ పంపింగ్’ పథకం! పరమశివుని జటాజూటం నుంచి దూకిన గంగను వెనక్కి మళ్లించి మళ్లీ ‘జటాజూటం’లో నిలబెట్టడం వంటిది ఈ ప్రక్రియ! గోదావరి నీటిలో రెండువందల యాబయి ‘టిఎమ్‌సి’లు సముద్రం పాలవుతోందట! మరి ఈ తొంబయి ‘టిఎమ్‌సి’ల నీటిని శ్రీరామ్‌సాగర్ వద్దనే ఎందుకని నిరోధించలేకపోతున్నాము? అంటే శ్రీరామ్‌సాగర్ వద్ద గోదావరిలో అంత నీరు లేదన్నమాట! వట్టిపోయిన గోదావరికి ప్రాణహిత నది మళ్లీ నీటిని సమకూర్చుతోందన్నమాట, జీవం పోస్తోందన్నమాట! ప్రాణహిత అన్న పేరు ఇలా ఈ ఉపనదికి సార్ధకం అవుతోంది. ప్రాణహిత గోదావరికి ప్రాణం..ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కినె్నరసాని వంటి ఉపనదులు చేరుతున్న కొలదీ గోదావరి ప్రవాహ పరిమాణం, ఉద్ధృతి పెరుగుతోంది మరి. అందువల్లనే రెండున్నర వందల టిఎమ్‌సిల నీరు సముద్రం పాలవుతోంది! ఇలా సముద్రం పాలవుతున్న జలాలను వెనక్కు మళ్లించి అదనంగా తొమ్మిది లక్షల ఎకరాలను సతత శ్యామలం చేయాలన్న ఆలోచన అంకురించడం పరమాద్భుతమైన పరిణామం. దేశంలో మరే ప్రాంతంలోనైనా ఇలాంటి పథకానికి--రివర్స్ పంపింగ్-రూపకల్పన జరిగిందా? ఇంతదూరం నీరు ఎగువకు పయనిస్తోందా?
ఇలా కేవలం శ్రీరామ్‌సాగర్ జలాశయం కింద దాదాపు మరో తొమ్మిది లక్షల ఎకరాలకు వచ్చే ఏడాది నుంచి నీరు లభించడం ఆహార ధా న్యాల ఉత్పత్తిని పెంచగల పరిణామం! తెలంగాణ ప్ర భుత్వం క్రమక్రమంగా వ్యవసాయ ఆధార ప్రగతిని ఉత్పత్తిని ఇలా పెంచగలుగుతుండడం ముదావహం. నీటిపారుదల లేని భూములు ‘దేవమాతృకలు’, వర్షం కురిస్తే ఒక పంట పండవచ్చు! కానీ ఇప్పుడు ‘నదీ మాతృకలు’గా మారుతున్న వ్యవసాయ క్షేత్రాలు రెండుపంటలను ప్రసాదించనున్నాయి! తెలంగాణ ప్రభుత్వం సంకల్పించినట్టు ‘కాకతీయ జల ఉద్యమం’ ద్వారా కోటి ఎకరాలకు రెండవ పంట కోసం నీరు లభించినట్టయితే వ్యవసాయ ఉత్పత్తులు ఇబ్బడి ముబ్బడి కాగలవు! ‘రాష్ట్ర స్థూల ఆదాయం’లోను, ‘స్థూల జాతీయ ఆదాయం’లోను వ్యవసాయం వాటా పెరిగినప్పుడు మాత్రమే ప్రగతి పరిపుష్టం అవుతుంది! కానీ మన దేశంలో ప్రస్తుతం ‘జిడిపి’లో వ్యవసాయం వాటా చాలా తక్కువగా ఉంది! వౌలిక పారిశ్రామిక రంగం వాటా కూడ తక్కువగానే ఉంది! అనవసరమైన వస్తువులను ఉత్పత్తి చేసే పారిశ్రామిక రంగం వాటా ఎక్కువగా ఉంది! వీటికి మించి ‘సేవల’ రంగం వాటా గొప్పగా ఉంది! అనవసరమైన వస్తువుల ఉత్పత్తివల్ల, ‘సేవల’ వల్ల ‘జిడిపి’ పెరగడం కేవలం కృత్రిమమైన ప్రగతి! అది ‘వాపు’ మాత్రమే, బలుపు కాదు! మానవ జీవనం పరిపుష్టం కావడానికి కంది పప్పు కావాలి, ‘కోకోకోలా’ అవసరం లేదు! కానీ ‘ప్రపంచీకరణ’ మన నెత్తికెక్కిన తరువాత ‘కృత్రిమ ప్రగతి’ విస్తరించిపోతోంది! సహజమైన ప్రగతికి ప్రతీకలైన ‘పాడిపంటలు’ అడుగంటిపోవడానికి ప్రాతిపదిక ఏర్పడింది. ‘నీరు, పాలు’ దొరకని పల్లెటూళ్లలో ‘బీరు,సారా’ మాత్రం పుష్కలంగా లభిస్తాయి.
తెలంగాణ ప్రభుత్వం వారి ‘కాకతీయ’ పథకం ఈ వైపరీత్యానికి అడ్డుకట్ట కానుంది, సహజమైన ప్రగతిని పెంపొందించనుంది! సహజమైన ప్రగతి పాడిపంటలు! ‘సుజల కళ’తో పాటు, పాలు, పెరుగును పెంపొందించే పథకాలను అమలు జరపాలి! గొర్రెలతోపాటు దేశవాలీ ఆవులను కూడ పెంచి పోషించే పథకాలను ప్రారంభించాలి!