సంపాదకీయం

అగ్రాసనంపై ఆంధ్రుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆగస్టు పదకొండవ తేదీ బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరంతో అనేక రీతులుగా ముడివడి ఉండవ చ్చు. రెండింటిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రాజ్యసభలో ఉటంకించాడు. మొదటిది- నూట తొమ్మిది ఏళ్ల క్రితం క్రీస్తుశకం 1908 ఆగస్టు పదకొండవ తేదీన స్వాతంత్య్ర సమరవీరుడు ఖుదీరామ్ వసు బలిదానం చేశాడు. మాతృధరణి దాస్య శృంఖలాలను పగులగొట్టడానికై ఆ పద్దెనిమిదేళ్ల సమరవీరుడు తన జీవితాన్ని అర్పించగలిగాడు. 1889 డిసెంబర్‌లో జన్మించిన ఖుదీరామ్ వసు భరతమాత కన్న ‘వజ్రాల కొడుకు’! ఆగస్టు పదకొండవ తేదీకున్న ప్రాధాన్యతలలోప్రధానమంత్రి వివరించిన రెండవది- ముప్పవరపు వెంకయ్యనాయుడు స్వతంత్ర భారత ఉప రాష్టప్రతిగా పదవీ బాధ్యతలను స్వీకరించడం! వెంకయ్య నాయుడు ఈ రాజ్యాంగ సమున్నత పదవిని అధిష్ఠించడానికి పూర్వం ఉప రాష్టప్రతులైన వారందరూ బ్రిటన్ దురాక్రమిత భారత దేశంలో జన్మించిన వారు! వెంకయ్య నాయుడు స్వతంత్ర భారతదేశంలో జన్మించిన ఉప రాష్టప్రతి- అన్నది నరేంద్ర మోదీ ప్రస్తావించిన వాస్తవం! భారత ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు మూలస్తంభాలైన పాలనావిభాగాలలో పార్లమెంటు మొదటిది. ఇది శాసన నిర్మాణ విభాగం. పార్లమెంటులోని ఉభయ విభాగాలలో లోక్‌సభ జన మానస క్షేత్రానికి అద్దం, రాజ్యసభ ప్రజల బుద్ధికి ప్రతిబింబం, పరిణతకు చిహ్నం, ‘సమాఖ్య’ భావం- ఫెడరలిజమ్- ప్రస్ఫుటించే మాధ్యమం! లోక్‌సభ ప్రజల ప్రతినిధి, రాజ్యసభ ప్రదేశాలకు ప్రతినిధి, రాజ్యాల- స్టేట్స్-కు ప్రతినిధి, భూవిభాగాలకు ప్రతినిధి, మాతృభూమికి ప్రతినిధి! ఇదీ స్వతంత్ర భారత రాజ్యాంగంలోని ఎనబయ్యవ అధికరణం నిర్దేశిస్తున్న స్ఫూర్తి. ఈ గరిమను వెంకయ్య ఇనుమడింపజేయగలడన్నది ప్రధానమంత్రి సహా, భారతీయ జనతాపార్టీకి, భాజపా నాయకత్వంలోని ప్రజాస్వామ్య కూటమికి, ప్రతిపక్షాలకు చెందిన సభ్యులు వ్యక్తం చేసిన ఆకాంక్ష! మన దేశం అనాదిగా ‘సమాఖ్య’. వివిధ రాజ్యాలు అఖండ భారత సామ్రాజ్యంలో భాగం కావడం వేల ఏళ్లుగా కొనసాగిన సమీకృత రాజ్యాంగ వ్యవస్థ. ఈ సమీకృత రాజ్యాంగ వ్యవస్థకు ప్రధాన ప్రాతిపదిక వైవిధ్యాలను పరిరక్షించి పెంపొందించిన జాతీయ సాంస్కృతిక తత్త్వం! శుక్రవారం వెంకయ్య నాయుడిని అభినందిస్తూ, హర్షం ప్రకటిస్తూ రాజ్యసభలో సాగిన ప్రసంగాలకు ఈ ‘వైవిధ్య’ సమన్వయం ఇతివృత్తంగా మారింది. అనేక భాషల, ప్రాంతాల మధ్య సహజంగా నెలకొని ఉన్న భావ సమైక్యం ప్రస్ఫుటించింది! వైవిధ్య భాషలను, వైవిధ్య భావాలను సమాన స్థాయిలో రక్షించాలన్న రాజ్యసభ సభ్యుల ఆకాంక్ష కొత్తది కాదు, పునరావిష్కరణ మాత్రమే! వెంకయ్య నాయుడు గురువారం చెప్పినట్టు, నరేంద్ర మోదీ శుక్రవారం సభలో వివరించినట్టు వైవిధ్యవంతమైన, వైవిధ్యాల మధ్య, వైరుధ్యం లేని భారత జాతీయ సమాజం అనాదిగా పరిఢవిల్లుతోంది. వెంకయ్య నాయుడు రాజ్యసభాపతి పదవీ స్వీకారం సందర్భంగా ఈ చారిత్రక వాస్తవం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. సమాఖ్య స్ఫూర్తికి రాజ్యసభ ప్రతీక, ఉప రాష్టప్రతి రాజ్యసభా రథ ప్రస్థానానికి పతాక..
వ్యక్తిత్వం, కర్తృత్వం, వక్తృత్వం వంటి సుగుణాలు వెంకయ్య నాయుడి ద్వారా సర్వ సమగ్రంగా స్ఫురిస్తున్నాయన్నది ప్రధానమంత్రి రాజ్యసభలో చెప్పినమాట. వెంకయ్య నాయుడు ఇలా జీవన సాఫల్యానికి సజీవ విగ్రహం కావడం తెలుగు ప్రజలకు లభించిన తిరుగులేని గౌరవం. మారుమూల ఉన్న పల్లెటూరిలో నెల్లూరు జిల్లా చవటపాలెంలో జన్మించిన వెంకయ్య అంచెలంచెలుగా ఎదిగి ఉప రాష్టప్రతి కావడం ఆయన వ్యక్తిత్వ వికాస క్రమంలో సిద్ధించిన సమగ్రత్వం. ఈ వికాస క్రమం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణతకు చిహ్నం. నరేంద్ర మోదీ చెప్పినట్టు అతి సామాన్య కుటుంబంలో జన్మించిన వెంకయ్య ఉప రాష్టప్రతి పదవిని అధిష్ఠించడం, సామాన్యుడు అసామాన్య జాతీయ నాయకుడిగా ఎదగడం భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రసాదిస్తున్న సర్వ జన సమానత్వానికి చిహ్నం! వామనుడు త్రివిక్రముడై చెలరేగిన చరిత్ర ఈ దేశానికి ఉంది! కర్తృత్వ నిష్ఠ, బహుముఖ క్రియాశీలత వెంకయ్యలో నిబిడీకృతం కావడం మోదీ చెప్పిన మరోమాట! ఈ బహుముఖ క్రియాశీలత్వం గ్రామీణ ప్రగతి, గ్రామీణ సంక్షేమం రూపంలో వాస్తవమైంది! పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖను నిర్వహించిన సమయంలో సైతం వెంకయ్య మంత్రివర్గ సమావేశాలలో గ్రామీణ సమస్యలను ఇతోధికంగా ప్రస్తావించేవాడని ప్రధానమంత్రి చెప్పడం అట్టడుగు స్థాయికి ప్రగతిని విస్తరింపచేయాలన్న ‘అంత్యోదయ’ స్ఫూర్తికి నిదర్శనం, ‘అంత్యోదయ’ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రచారం చేసిన సనాతన భారతీయ లక్ష్యం!
వక్తృత్వ కళకు వెంకయ్య నాయుడి ఉద్యమ, రాజకీయ, పరిపాలనా జీవన ప్రసంగ పరంపరకు విస్తృత భాష్యం! ఆయన ప్రసంగాలు ‘సూపర్ ఫాస్ట్’ రైళ్లవలె స్ఫురించాయని ప్రధానమంత్రి చెప్పడం వెంకయ్య వచోగరిమకు ఘనమైన సమ్మానం! ఇవి కేవలం గాలిమాటలు కాలేదు, ప్రధానమంత్రి అభివర్ణించినట్టు వెంకయ్య నాయుడి వాగ్ధాటికి, ప్రసంగ త రంగ ప్రవాహానికి ప్రా తిపదిక. ఆ ప్రాతిపదిక ఆయన హృదయ ని హితమైన జాతీయతా శ్రద్ధ, సైద్ధాంతిక నిష్ఠ! విద్యార్థి ఉద్యమ నా యకుడిగా, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సంఘటకునిగా, భారతీయ జనసంఘ్ కార్యకర్తగా, భారతీయ జనతాపార్టీ నాయకుడిగా, ప్రజాప్రతినిధిగా, కేంద్రమంత్రిగా, స్వీయపక్ష అధ్యక్షునిగా ఆయన సాగించిన ప్రసంగ పరంపర తన సిద్ధాంతాన్ని వినిపించిన న్యాయవాది వాదం వంటిది. వెంకయ్య నాయుడు న్యాయవాది కూడ. న్యాయవాది న్యాయమూర్తిగా మారిన క్షణం నుంచి ఎలా ప్రవర్తించాలన్నది వెంకయ్య నాయుడు నిరూపించనున్న బాట.. రాజ్యసభ అధ్యక్ష పదవిని న్యాయమూర్తి పదవితో సరిపోల్చిన నరేంద్ర మోదీ చెప్పినమాట ఇది. వెంకయ్య నాయుడు జాతీయతా పథంలో సుదీర్ఘ కాలం సడలని కర్తవ్య నిష్ఠతో ప్రస్థానం సాగించాడు. ఈ ప్రస్థాన పథంలో ఆరంభం ఆయన స్వయం సేవకత్వం! కొందరు సభ్యులు గుర్తుచేసినట్టు వెంకయ్య నాయుడు ‘రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ’ వరిష్ఠులైన సోమేపల్లి సోమయ్య వంటి మహనీయుల, ప్రాతః స్మరణీయుల శిక్షణలో ఈ ప్రస్థాన క్రమాన్ని కొనసాగించాడు. ఆ మహనీయుల స్ఫూర్తికి నివాళి వెంకయ్యకు ఉప రాష్టప్రతి పదవి. పదవీ ప్రమాణ స్వీకారానికి ముందు మహాత్మాగాంధీకి శ్రద్ధాంజలి ఘటించడం సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని నిలబెట్టిన వెంకయ్య నాయుడు సర్దార్ వల్లభభాయి పటేల్‌కు, దీనదయాళ్ ఉపాధ్యాయకు పుష్పాంజలి సమర్పించడం విలక్షణ సంప్రదాయానికి మరో శ్రీకారం!
లోక్‌సభ ప్రజలకు ప్రతినిధి. ‘రాష్ట్రం ప్రజాః’- జాతి అంటే ప్రజలు- అని అనాదిగా వేదం ఉద్ఘోషిస్తోంది. ఈ జాతీయులు ఈ మాతృభూమి బిడ్డలు. ‘మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః’ భూమి తల్లి.. నేను ఆమె బిడ్డడను- అని తొలి భారతీయుడు యుగాలకు పూర్వం చెప్పాడు. తరతరాలుగా ఈ మట్టి, ఈ భూమి మనకు తల్లి! రాజ్యసభ ఈ భూమికి ప్రతినిధి!