సంపాదకీయం

కాలుష్య కారణం..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బొగ్గు పులుసు వాయువు-కార్బన్ డై ఆక్సయిడ్-మోతాదుకు మించి గాలిలో కలుస్తుండడం పరిసరాల కాలుష్యం పెరుగుతుండడానికి ప్రధాన కారణం! పల్లెటూళ్లలోని ‘స్వచ్ఛ’ కార్యకర్తలు మొదలుకుని పర్యావరణ పరిరక్షణ కోసం పారిస్ నగరంలో కుదిరిన అంతర్జాతీయ అంగీకార రూపకర్తల వరకూ అందరూ చెబుతున్న మాట ఇది. వాహనాలు విసర్జిస్తున్న ఇంధన కాలుష్యాల వల్ల ప్రకృతి పొగచూరిపోతోందన్నది ప్రధాన ప్రచారం! ‘కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం’-పొల్యూషన్ అండర్ కం ట్రోల్- పియుసి-పొందని వాహనాలు ‘బీమా’ రక్షణ పొందడానికి అర్హం కాదని ఆగస్టు పదవ తేదీన సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు వాహన కాలుష్యానికి అభిశంసన. వాహనాల వల్ల పర్యావరణ పరిరక్షణకు ఏర్పడి ఉన్న ప్రమాద తీవ్రతకు ఈ తీర్పు మరోసారి అద్దం పట్టింది. పర్యావరణ పరిరక్షణను పెంపొందించడానికి సర్వోన్నత ఆదేశాన్ని శిరసావహించడం అనివార్యం! నగరాలను, పట్టణాలను కాలుష్య వలయంగా మార్చివేస్తున్న వాహన కాలుష్య నియంత్రణ ‘స్వచ్ఛ భారత్’ పునర్ నిర్మాణానికి అనివార్యం! పల్లెసీమలు కూడ కాలుష్యవంతం అయిపోతుండడం సమాంతర పరిణామం. పట్టణాలలో,నగరాలలో ఏర్పడుతున్నంత వాహన కాలుష్యం పల్లెసీమల్లో, అటవీ సీమల్లో లేదు, అయినప్పటికీ గ్రామీణ క్షేత్రాలలో స్వచ్ఛ వాయువులు వీచడం లేదు! ఒకప్పుడు పాలకంకుల పరిమళాలతో, సహజ సుమాల సుగంధాలతో, గరికె గడ్డి గుబాలింపుతో, మట్టినుండి వెలువడుతున్న మధురమైన వాసనలతో, తేనెపట్టులతో, చెఱకు తోటలతో పులకించిన పల్లెలు, పల్లెల పరిసరాలు నేడు కాలుష్య వాయువులతో ఊపిరాడక ఉక్కిరి బిక్కిరి కావడం ‘స్వచ్ఛ భారత్’ పునర్ నిర్మాణాన్ని నిలదీస్తున్న దృశ్యం! అడవులు కూడ కాలుష్యంతో నిండి ప్రాకృతిక ప్రాభవాన్ని కోల్పోతున్నాయి, అడవులలో వాహనాలు లేవు. వ్యవసాయ భూమి విషమెక్కిపోతోంది, రోగగ్రస్తమై పంటలను ప్రసవించలేని స్థితికి చేరుకుంటోంది.! నదుల నీరు తాగడానికి పనికిరాకపోవడానికి, స్నానం చేయడానికి యో గ్యం కాకపోవడానికి, ముట్టుకొనడానికి సైతం వీలుకాకపోవడానికి కారణం కాలుష్యం. ఈ కాలుష్యం కేవలం వాహన జనితమైనది కాదు, పరిశ్రమలు వెదజల్లుతున్న కాలుష్యం ఇది! హిమాలయాలు కరిగిపోతున్నాయి, శిలాలయాలుగా మారుతున్నాయి. హిమపర్వత ప్రాంగణాన్ని కాలుష్యగ్రస్తం చేసింది ఎవరు? ఉత్తరఖండ్ ప్రాంతంలో ‘బురద’ వరదలెత్తి వందల మందిని బలిగొనడానికి కారణం ఎవరు?? ప్లాస్టిక్ వస్తువుల ప్రభావం వల్ల పుట్టిన వేడి హిమాలయాలలోని మంచును కరిగిస్తోంది, అతిగా కరిగిస్తోంది, అక్రమంగా నదుల తీరంలో కట్టిన ఇళ్లు, పరిశ్రమలు ‘ఉత్తరఖండ్’లో మూడేళ్ల క్రితం వెల్లువెత్తిన బురద వరదలకు కారణం! సముద్రాలు పొంగుతున్నాయి, లక్షల టన్నుల ప్లాస్టిక్ సామగ్రి సముద్రంలో తేలి ఆడుతోంది, వేడివల్ల సముద్రాలు పొంగిపోతున్నాయి! చివరికి గాలిలేని, నీరులేని అంతరిక్షం కూడ ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇతర వ్యర్థ పదార్ధాలతో విష వలయంగా మారుతుండడం కాలుష్య విశ్వరూపానికి నిదర్శనం! ఈ భౌతిక కాలుష్యానికి ప్రధాన కారణం మానసిక కాలుష్యం, ఈ మానసిక కాలుష్యం అవినీతి, ఈ మానసిక విషజాడ్యం అక్రమ సంపాదన!
‘ప్రపంచీకరణ’ మన నెత్తికెక్కిన తరువాత భౌతిక కాలుష్యంతోపాటు మానసిక కాలుష్యం మరింతగా విస్తరిస్తోంది. ప్రభుత్వం, ప్రభుత్వేతర భాగస్వామ్యం-పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్-పిపిపి-తో ప్రభుత్వేతర వాణిజ్య వేత్తలు బహుళ జాతీయ సంస్థలు విస్తృత వికృత భూమికను నిర్వహిస్తుండడం అవినీతి విస్తరణకు కారణం! అవినీతి కాలుష్యం కాటువేస్తోంది, బలి గొంటోంది, అన్ని జీవన రంగాలను అతలాకుతలం చేస్తోంది! ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ ప్రభుత్వ వైద్యశాలలో శుక్ర, శనివారాలలో అనేకమంది చిన్నపిల్లలు-వీరిలో ఎక్కువ మంది నవజాత శిశువులు-అకాల మరణం పాలు కావడం ‘ప్రభుత్వ, ప్రభుత్వేతర భాగస్వామ్యం’ సృష్టిస్తున్న వైపరీత్యాలకు ఒక ఉదాహరణ మాత్రమే! ఆక్సిజన్-ప్రాణవాయువు-ను సరఫరా చేయవలసిన ప్రభుత్వేతర సంస్థ అకస్మాత్తుగా ఆక్సిజన్ సిలిండర్‌లను చేరవేయడం ఆపివేసిందట! ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాల వారు ఈ ప్రభుత్వేతర సంస్థకు చెల్లించవలసిన డెబ్బయి లక్షల రూపాయలను సకాలంలో చెల్లించలేదట! అంతమాత్రాన ప్రభుత్వ వైద్యశాల పారిపోదు, రాష్ట్ర ప్రభుత్వం పారిపోదు, వసూలు చేసుకోవచ్చు. కానీ ఆ ప్రభుత్వేతర సంస్థ ‘పైసల’ కోసం చిన్నారుల ప్రాణాలతో చెలగాటమాడింది, ప్రాణవాయువు సరఫరాను నిలిపివేసింది! నిలిపివేసిన వెంటనే వైద్యశాల యాజమాన్యం ‘ప్రత్యామ్నాయాన్ని’ అమలుచేసి ఉండాలి! నిర్లక్ష్యం నిండిన వైద్యశాల నిర్వాహకులు కూడ మానసిక కాలుష్య గ్రస్తులు, అవినీతిపరులు! పసిపిల్లల ప్రాణాలు బలి తీసుకోవడంలో ఇదీ- ‘ప్రభుత్వ-ప్రభుత్వేతర భాగస్వామ్యం’!
ఇలా అవినీతి కాలుష్యం అన్ని రకాల చట్టాలను వమ్ము చేస్తోంది, న్యాయస్థానాల తీర్పులను వమ్ము చేస్తోంది! వాహనాల వల్ల వెలువడుతున్న ‘కాలుష్య వాయువు’ను నిరోధించడానికి సర్వోన్నత న్యాయమూర్తులు మదన్ తోమర్, దీపక్ గుప్తా చెప్పిన తీర్పు దోహదం చేస్తుంది. కానీ తీర్పును అమలు చేయవలసిన అధికార యంత్రాంగంలోని అవినీతి కాలుష్యం మాట ఏమిటి? ప్లాస్టిక్ పదార్థాలు-సంచులు, సీసాలు, గొట్టాలు, ఇతర వస్తువులు-వాడరాదని ప్రభుత్వాలు ఎందుకని సమగ్రమైన చట్టాలు చేయడం లేదు! బొగ్గుపులుసు కాలుష్యాల కంటే ప్లాస్టిక్ కాలుష్యం మరింత ప్రమాదమైనది. పలచని ప్లాస్టిక్ వస్తువులు-పది మైక్రాన్ల, ఇరవై మైక్రాన్ల-వాడరాదని తరచు రాష్ట్ర, స్థానిక పాలకులు ఉత్తరువులు జారీ చేస్తున్నారు! ఈ ఉత్తరువులు అమలు జరగకపోవడం అవినీతి కాలుష్యంలో భాగం. ‘కాలుష్య నియంత్రణ వ్యవస్థ’ ఉన్నప్పుడు మాత్రమే వాహనాలను ‘సాలుసరి బీమా’ పరిధిలోకి అనుమతించడం సుప్రీంకోర్టు విధించిన నిబంధన. వాయు కాలుష్య నివారణకు ఇది మార్గమట! పరిసరాల కాలుష్య నిరోధక అధికార మండలి వారి ప్రతిపాదన మేరకు సర్వోన్నత న్యాయస్థానం ఈ నిబంధనను విధించింది. ఢిల్లీలో కేవలం ఇరవై మూడు శాతం వాహనాలు మాత్రమే ఇలా కాలుష్య నియంత్రణ పరీక్షకు నిలబడుతుండడం సర్వోన్నత న్యాయ నిర్ణయానికి ప్రాతిపదిక! కాని ‘పియుసి’ పరీక్ష చేయించకుండా, ధ్రువపత్రం పొందకుండా వాహనాలను నడపరాదని, అలాంటి వాహనాల అనుమతి పత్రాన్ని-లైసెన్సును రద్దు చేయాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరించి ఉండినట్టయితే మరింతగా కాలుష్య నివారణకు అది దోహదసపడి ఉండేది. నిజానికి వాహనాల కాలుష్యానికి కారణం వాహనాల కేంద్రీకరణ! నగరాలు, పట్టణాలు అడ్డంగా విస్తరించినట్టయితే వివిధ ప్రాంతాలలోని రహదారులపై వాహనాల కేంద్రీకరణ తగ్గుతుంది. కానీ గత కొన్ని దశాబ్దులుగా నగరాలు నిలువున పెరుగుతున్నాయి. అనేక అంతస్తుల భవనాలు నిర్మితమవుతుండడం వల్ల ఒకేచోట వాహనాలు కేంద్రీకృతం అవుతున్నాయి. గతంలో ఒక వాహనం నిలిచిన చోట ఇప్పుడు ఐదారు వాహనాలు నిలుస్తున్నాయి. కొన్ని అంతస్తుల భవనాలలో ఈ వాహనాల సంఖ్య పదిరెట్లు కూడ పెరిగింది! అందువల్ల నగర నిర్మాణ ప్రణాళికలు, నిర్మాణ రీతులు మారాలి! అంతస్తుల భవనాలను నిర్మించడం బాగా తగ్గించాలి. అప్పుడు నగరాలు, పట్టణాలు అడ్డంగా విస్తరిస్తాయి.
గాలి, నీరు, భూమి, పర్యావరణం సర్వ సమగ్రంగా కాలుష్యం అవుతుండడానికి కారణం విష రసాయనాలతో తయారయిన ఎఱువులు, పురుగుల మందులు.. వీటిని నిర్మూలించనిదే ‘స్వచ్ఛ భారతం’ అసంభవం! వీటిని నిర్మూలించాలంటే సేంద్రియ వ్యవసాయాన్ని దేశమంతటా పునరుద్ధరించాలి...