సంపాదకీయం

పెట్టుబడుల ‘డొల్ల’తనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్విట్జర్లాండ్‌లోని బ్యాంకులలో మనదేశపు ‘పన్ను ఎగవేతదారుల’ నల్లధనం మూలుగుతోందన్నది పాతకథ. సింగపూరు, హాంకాంగ్ వంటిచోట్ల భారతీయుల నల్లధనం కుప్పలుతెప్పలుగా కూరుకొని పోతోందన్నది కొత్త వ్యథ! స్విట్జర్లాండ్ జర్మనీ వంటిచోట్లనుండి రహస్య బ్యాంకు ఖాతాలలోని నల్లడబ్బును వెలికి తీయడానికి మన ప్రభుత్వం చిత్తశుద్ధితో నడుం బిగించి ఉంది! అందువల్ల ఉలిక్కిపడిన మన దేశంలోని ‘‘తేలుకుట్టిన నల్లదొంగలు’’ చప్పుడు కాకుండా పన్నాగాన్ని మార్చినట్టుంది. సింగపూరు, బహ్రయిన్, మలేసియా, హాంకాంగ్ వంటి ఆసియా ప్రదేశాలలోనే భారతీయ అక్రమ ధనవంతులు తమ సంపదను నిక్షిప్తం చేస్తున్నారట.. దగ్గరగాను ఉంటుంది, ప్రభుత్వానికి అనుమానం కూడ రాదు! స్విట్జర్లాండు బ్యాంకులలోని మనవారి నల్లడబ్బు ఏమయిపోతున్నట్టు?? అక్కడ నక్కిన మన ‘దొంగల’ నల్లడబ్బు పరిమాణం ఎందుకు తగ్గిపోయింది?? అని మన ప్రభుత్వం ‘ఆరా’ తీస్తున్న సమయంలోనే ‘సింగపూరు’ తరహా బ్యాంకులలో మనవారు దాచుకుంటున్న నల్లధనం వార్తలు వెల్లువెత్తుతున్నాయి! ‘నల్ల’కామందులు గత కొన్ని ఏళ్లుగా జాగ్రత్త పడినారన్నమాట!! సింగపూరు ఆర్థిక వ్యవస్థకు ‘వెనె్నముక’ అంతర్జాతీయ దళారీ వ్యాపారం! ఈ ‘దళారీ’తనం మలేసియాకు కూడా విస్తరించిపోయినట్లు ఇటీవల స్పష్టమైంది! మన ప్రభుత్వాలు, ప్రధానంగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల వారు, మరీ ప్రధానంగా అవశేష ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు- ‘సింగపూర్ నమూనా’ గురించి మురిసి మైమరచిపోతున్నారు! ‘సింగపూర్ నమూనా’-‘సింగపూర్ మోడల్’ గురించి జరుగుతున్న ఆర్భాటం అంతాఇంతా కాదు! ‘సింగపూర్’ పరమ ఆదర్శమైపోయినట్లు, చరమలక్ష్యమైపోయినట్లు మనదేశపు రాష్ట్ర ప్రభుత్వాల వారు కొందరు ‘ఆర్థికనృత్యం’ చేస్తున్నారు. కానీ ‘సింగపూర్ మోడల్’ డొల్లతనం ఇప్పుడు మరింతగా ధ్రువపడింది. మనదేశం నుండి తరలిపోతున్న నల్లడబ్బుతోను, ఇతర దేశాల నుంచి తరలివస్తున్న ‘అక్రమ ఆర్జన’తోను సింగపూర్‌లోని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ దళారీ వ్యాపారం చేస్తున్నాయి! సిమెంట్ కట్టడాలు, ప్లాస్టిక్ రోడ్లు, రబ్బర్ తొడుగులు, మెరిసిపోయే ఉక్కు స్తంభాలు- ఇదంతా సింగపూర్ ప్రగతి నమూనా! ఈ స్వరూపం వెనుక దాగిన, ఈ స్వరూపం వెనుక నక్కిన స్వభావం ఏమిటన్నది ‘విదేశీయ ప్రగతి’ నమూనాలను ప్రశంసిస్తున్న మనదేశం వారు ‘ఆత్మ మథనం’ చేసుకోవాలి! ఈ స్వభావం అంతర్జాతీయమైన అక్రమమైన ‘దళారీతనం’... ప్రవర్థమాన దేశాలను కొల్లగొడుతున్న ‘బహుళ జాతీయ వాణిజ్య’ సంస్థల సామ్రాజ్యం.. లండన్‌ను పారిస్‌ను శతాబ్దులపాటు ఆవహించిన ఈ వాణిజ్య సామ్రాజ్యతత్త్వం ‘పడమటి’ నుంచి తూర్పుగా విస్తరిస్తోంది...
హాంకాంగ్‌ను, సింగపూర్‌ను ఈ బహుళ జాతీయ సామ్రాజ్యవాదం ఆవహించడం వల్లనే అక్కడి బ్యాంకులలో ‘రహస్యగోపనం’ జరుగుతోంది. పారిశ్రామిక వాణిజ్య సంస్థలు తమ ‘వాటాల’ యజమానుల పేర్లను కూడ రహస్యంగా ఉంచుతున్నాయి! అందువల్ల మన ప్రభుత్వం ‘పడమటి’ వైపు‘నిఘా’ వీక్షణాలను కేంద్రీకరించడంతో మన దేశపు నల్లదొంగలు తమ అక్రమార్జనను తూర్పువైపుగా తరలిస్తున్నారు! క్రీస్తుశకం 1997 వరకూ ‘హాంకాంగ్ బ్రిటన్ వారి ‘వలస’, ఆ తరువాత చైనాలో భాగమైంది! ఈ ‘పరివర్తన’కు సమాంతర పరిణామం ‘సామ్యవాద’ చైనా ‘స్వేచ్ఛావాణిజ్య’ వ్యవస్థగా అవతరించడం. అందువల్ల హాంకాంగ్‌లోని బ్యాంకులలోను, వాణిజ్య సంస్థలలోను కూడ ‘‘మనవారు’’ సురక్షితంగా నల్లడబ్బును నిక్షిప్తం చేయగలుగుతున్నారట.. వెలుగు పెరగడం వల్ల చీకటి అంతరించడం లేదు. వెలుగు పెరిగిన చోటు నుంచి అదృశ్యమైపోయి మరోచోట అవతరిస్తోంది!! మన దేశానికి భారీగా విదేశాల నుంచి పెట్టుబడులు వచ్చి పడుతున్నాయన్న ప్రచారంలోని ‘డొల్ల’తనంలో విదేశాలకు తరలిపోతున్న నల్లధనం వివరాలు నక్కి ఉన్నాయి.
మన దేశానికి విదేశాల నుంచి తరలివస్తున్న పెట్టుబడులకంటె మన దేశం నుంచి ‘బహుళ జాతీయ వాణిజ్య’ సంస్థలు తరలించుకొనిపోతున్న లాభాల పరిమాణం, విలువ ఎక్కువ! ఇదంతా ప్రపంచీకరణ సూత్రాల మేరకు సక్రమమైపోయిన అక్రమం! కానీ పెట్టుబడులు ఎలా వస్తున్నాయన్నది మరో విచిత్రమైన ప్రహేళిక! మన దేశం నుంచి తరలిపోతున్న ‘నల్లడబ్బు’ పేరు మార్చుకుని ‘విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్యం’ - ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్ట్‌మెంట్ - పేరుతో పెట్టుబడిగా మన దేశానికి తిరిగి వస్తోంది! మనవారి నల్లడబ్బు నిక్షిప్తమైన బ్యాంకుల నుంచి ఆయా దేశాలలోని ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ ఋణాలు స్వీకరించి మనదేశంలో పెట్టుబడి పెడుతున్నాయి! ఇలా మన ‘నల్లదొంగలు’ విదేశాలలో అక్రమంగా దాచిన సొమ్ము ‘ఋణాలు’ విదేశీయ సంస్థలకు దక్కుతోంది. ఈ ఋణగ్రహీతలు ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’.. ఈ ‘ఋణాల’ను వారు మనదేశంలోని అనుత్పాదక రంగాలలో ప్రధానంగా పెట్టుబడి పెడుతున్నారు! సాంకేతిక పరిజ్ఞానం అవసరం లేని ‘పర్యాటక’ రంగంలోను, భోజనశాలల నిర్వహణ రంగంలోను ఈ విదేశీయులు పెట్టుబడులు పెట్టారు! అవసరం లేని తిండి పదార్థాలను, ఆరోగ్యాన్ని చెడగొట్టి ‘కార్పొరేట్ రంగంలోని వైద్యశాలలకు దోపిడీ చేసే అవకాశాలను విరివిగా పెంచుతున్న’’, ఐస్‌క్రీమ్‌లను, శీతల పానీయాలను, ‘‘నోళ్లను బంకపట్టించి పండ్లను పాడు చేస్తున్న’’ చాక్లెట్లను ఈ బహుళ జాతీయ సంస్థలు తయారు చేస్తున్నాయి. నిజమైన ప్రగతికి తోడుపడే ఉక్కు, సిమెంటు, విద్యుత్తు, ఇంధన తైలం, ఇంధన వాయువు, బొగ్గు వంటి వౌలిక ఉత్పత్తులను పెంచడానికి మాత్రం ఈ విదేశీయ సంస్థలు తమ పెట్టుబడులను ఉపయోగించడం లేదు. మన వంట ఇళ్లలోను, చిన్న కుటీర పరిశ్రమలలోను అనుచానంగా మనం తయారు చేసుకుంటున్న అప్పడాలు వడియాలు ఆవకాయలు సేమ్యాలు ఉప్పేరి, ఒరుగులు-చిప్స్-వంటి వాటిని ఈ విదేశీయులు ఉత్పత్తి చేసి అమ్మి సొమ్ము చేసుకొని తమ దేశాలకు తరలిస్తున్నారు. చిల్లర వ్యాపారాన్ని కొల్లగొట్టి నిరుద్యోగాన్ని పెంచుతున్నారు. ఇదంతా ‘ప్రపంచీకరణ’-గ్లోబలైజేషన్-, ‘స్వేచ్ఛావాణిజ్యం’ - మార్కెట్ ఎకానమీ - పేరుతో విదేశీయ వాణిజ్య సంస్థలు మన దేశ ప్రజలను దోచుకుంటున్న తీరు... ఈ దోపిడీకి మనదేశం నుంచి తరలివెడుతున్న ‘నల్లడబ్బు’ పెట్టుబడిగా ఉపయోగపడుతోంది...
ఇదంతా నల్లడబ్బును ఇలా తెల్ల డబ్బుగాను, విదేశీయ ప్రత్యక్ష నిధులు -ఎఫ్‌డిఐ-గాను మార్చగలగుతున్న ‘ప్రపంచీకరణ’ మారీచమృగం విస్తరింపచేస్తున్న ప్రగతి భ్రాంతి! కృత్రిమ ప్రగతి పెరుగుతోంది.. ఆర్థిక అంతరాలు మరింతగా పెరుగుతున్నాయి!!