సంపాదకీయం

అణువిద్యుత్ ఆర్భాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అణు విద్యుత్ ఉత్పత్తి గురించి జరిగిపోయిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. శాంతి ప్రయోజనాల కోసం అణు విద్యుచ్ఛక్తి ఉత్పత్తులను పెంచడానికి వీలుగా వివిధ దేశాలతో మన ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాల వల్ల దశాబ్ది కాలంలో జరిగిన ప్రగతి సున్న. కొత్తగా ఒక ‘యూనిట్‌‘ అణు విద్యుత్ కూడ ఈ కొత్త ఒప్పందాల వల్ల ఉత్పత్తి కాలేదు. అమెరికాతో 2008లో కుదిరిన అణు సహకార అంగీకారం ఆర్భాటానికి శ్రీకారం. అమెరికాతో ఒప్పందం కుదరడానికి ముందు కూడ మన దేశంలో అణు ఇంధనం ఉత్పత్తి జరిగింది, అణు విద్యుత్ ఉత్పత్తి జరిగింది. రష్యా సహకారంతో కుడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఏర్పడి ఉంది. 2008 సంవత్సరానికి పూర్వం కుదిరిన ఒప్పందాలకు లేని ‘ఆర్భాటం’ ఆమెరికాతో కుదిరిన ఒప్పందానికి నేపథ్యం కావడం విచిత్రమైన వ్యవహారం. ఆ తరువాత ఫ్రాన్స్‌తోను జపాన్‌తోను ఆస్ట్రేలియా తదితర దేశాలతోను మనకు అణు సహకారం ఒప్పందాలు కుదిరిపోయాయి. ఒక్క కొత్త ఉత్పాదక విభాగం కూడ ప్రారంభానికి నోచుకోలేదు. మన దేశంలో ఆరు అణు ఉత్పాదక యంత్ర వ్యవస్థ-రియాక్టర్-లు నెలకొని ఉండగా చైనాలో ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ‘రియాక్టర్’లు ఏర్పడి ఉన్నాయట! ప్రపంచవ్యాప్తంగా అణు విద్యుత్ ఉత్పత్తి, పరిమాణం క్రమంగా తగ్గిపోతోందన్నది పెద్దగా ప్రచారం కాని వ్యవహారం! ఇలా ఆదరణ తగ్గుతున్న ‘అణు విద్యుత్‌‘ ఉత్పాదక సహకారం కోసం అమెరికా విధించిన నిబంధనలు ఆ తరువాత ఇతర దేశాలకు మార్గదర్శకాలయ్యాయి. అణ్వస్త్ర పాటవ పరీక్షలను మన దేశం జరుపరాదన్నది ప్రధాన నిబంధన. ఇకపై అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరుపరాదని మన ప్రభుత్వం స్వచ్ఛందంగా నిర్ణయించుకొని ఉంది. కానీ మనం అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపినట్టయితే ‘శాంతి ప్రయోజనాల అణు విద్యుత్ సహకారం’ రద్దయిపోతుందని అమెరికా అప్పటినుంచీ ఇప్పటివరకూ బెదిరిస్తూనే ఉంది. ఈ నిబంధనను అమెరికాతో కుదిరిన ఒప్పందంలో పేర్కొన లేదు, ఇతర దేశాలతో కుదిరిన ఒప్పందాలలో పేర్కొనలేదు. అయినప్పటికీ అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరుపరాదన్న మన స్వచ్ఛంద నిర్ణయాన్ని నిర్బంధ నిబంధనగా దాదాపు ఈ ‘సహకార’ దేశాలన్నీ చిత్రీకరిస్తున్నాయి. మన దేశం మళ్లీ అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపితే శాంతి ప్రయోజనాల అణు సహకారం ఒప్పందాలు రద్దు కాగలవని పరోక్షంగా ధ్వనింప చేస్తున్నాయి.
మన ప్రభుత్వం అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరుపకుండా శాశ్వతంగా నిరోధించడం మాత్రమే అమెరికా తదితర ‘సహకార’ దేశాల వ్యూహమన్నది ఇలా స్పష్టమైంది! ఎందుకంటే శాంతి, సహకార అణు వ్యవహారాల ఒప్పందం కుదిరిన తరువాత పదేళ్లు గడిచినప్పటికీ అమెరికా తదితర ‘సహకార’ దేశాల ‘బహుళ జాతీయ వాణిజ్య’ సంస్థలేవీ మన దేశంలో అణు విద్యుత్ ఉత్పాదక విభాగాలను ప్రారంభించలేదు. అమెరికాతో కుదిరిన ఒప్పందం ప్రకారం ‘తోషిబా వెస్టింగ్ హౌస్’ అన్న బహుళ జాతీయ సంస్థ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆరు అణు విద్యుత్ ఉత్పాదక విభాగాలను-రియాక్టర్లను నెలకొల్పవలసి ఉంది. కానీ ఇంతవరకు జరిగింది సున్న.. ఈ ‘వెస్టింగ్ హవుస్’ సంస్థ దివాలా తీస్తోందట! ‘దివాలా’ ప్రక్రియకోసం ఈసంస్థ వారు సంబంధిత న్యాయ మండలికి దరఖాస్తు కూడ దాఖలు చేశారట! మహారాష్టల్రోని రత్నగిరి జిల్లా ‘జయితాపూర్’లో ఫ్రాన్స్ సంస్థ ‘అరేవా’ అతి పెద్ద అణు విద్యుత్ ఉత్పాదక సంస్థను ఏర్పాటు చేయడానికి అంగీకారం కుదుర్చుకుంది. మన ప్రభుత్వం దాదాపు రెండు వేల ఎకరాల భూమిని కేటాయించింది కూడ! ఇది దేశంలోనే అతి పెద్ద అణు విద్యుత్ ఉత్పాదక సంస్థ అని కొందరు, ప్రపంచంలోనే అతి పెద్ద సంస్థ కాగలదని మరికొందరు ప్రచారం చేశారు! హరిత పరిరక్షణ నియమాలకు విరుద్ధంగా ఈ సంస్థకు భూమిని కేటాయించినందుకు నిరసనగా 2011నుంచి రెండేళ్లకుపైగా రైతులు, అటవీ రక్షణ ఉద్యమకారులు భూసేకరణను ప్రతిఘటించారు కూడ! ‘అరేవా’ సంస్థ కూడ ఇప్పుడు భారీ నష్టాలకు గురయి ఉందట! గత ఆరేళ్లలో ఈ సంస్థకు దాదాపు ఎనబయి వేల కోట్ల రూపాయలకు పైగా నష్టాలు దాపురించాయట! ఇది కూడ దివాలా తీస్తుందన్నది జరుగుతున్న ప్రచారం!
విదేశీయ సంస్థల ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్యం - ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్టిమెంట్-లోని డొల్లతనం ఇదంతా! స్వదేశీయ పరిజ్ఞానంతోనే మరో పది అణు రియాక్టర్లను నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం గత మే నెలలో నిర్ణయించడానికి ఈ విదేశీయ సంస్థల డొల్లతనం విచిత్రమైన నేపథ్యం! విదేశీయ సంస్థల పెట్టుబడులకోసం దేశ విదేశాల ఆర్భాటపు సదస్సులను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు, విదేశాలలో పర్యటనలు జరుపుతున్న మంత్రులకు ముఖ్యమంత్రులకు ఈ ‘అణు’ పాతం గుణపాఠం కాకపోవడమే విస్మయకరం! బొగ్గు, విద్యుత్తు, ఇంధన వాయువు, ఇంధన తైలం, ఉక్కు, సిమెంట్ వంటి రంగాలలో పెట్టుబడులు పెట్టి వౌలిక ఉత్పత్తులను పెంచడానికి విదేశీయ సంస్థలు సిద్ధంగా లేవు! శరీరంలో కొవ్వును పెంచి జనాన్ని అనారోగ్యంపాలు చేయగల అనవసరమైన తినుబండారాలను, పానీయాలను తయారుచేసి అమ్మి, లాభాలను తమ దేశాలకు తరలించుకొని పోవడానికి మాత్రమే విదేశీయ సంస్థలు ఉత్సాహం చూపుతున్నాయి. విదేశీయులు పెట్టుబడులు పెట్టకపోయినప్పటికీ వౌలిక పారిశ్రామిక రంగ ఉత్పత్తులు పెరుగుతుండడం హర్షణీయం. గత మూడు నెలల కాలంలో ‘స్థూల జాతీయ ఉత్పత్తి’-గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్-జిడిపి- పెరుగుదల వేగం తగ్గినప్పటికీ బొగ్గు, విద్యుత్తు, ఇంధనం, ఉక్కు, సిమెంట్ వంటి పారిశ్రామిక ఉత్పత్తుల పెరుగుదల వేగం పుంజుకున్నట్టు ఆధికారిక గణాంకాలు ధ్రువీకరిస్తున్నాయి! విదేశీయుల పెట్టుబడుల డొల్లతనానికి ఇది ప్రత్యక్ష ప్రమాణం...
ఇతర దేశాలలో అణు విద్యుత్ ఉత్పాదక విభాగాలను నెలకొల్పిన వాణిజ్య సంస్థలు దాదాపు అన్నీ నష్టాలలో నడుస్తున్నాయట! స్వదేశాలలో అణు విద్యుత్ ఉత్పత్తి చేయడం కూడ ఈ సంస్థలకు లాభసాటి కావడంలేదు. అందువల్ల అంతర్జాతీయంగా అణు విద్యుత్ ఉత్పాదక విభాగాలు క్రమంగా మూతపడుతున్నాయి! 2013లో ప్రపంచవ్యాప్తంగా అరవై ఎనిమిది అణు విద్యుత్ కేంద్రాలుండేవట! వాటి సంఖ్య యాబయి మూడుకు పడిపోయింది! అమెరికాలోను, రష్యాలోను మొత్తం అణు విద్యుత్ కేంద్రాలు గత ఏడాది మూతపడ్డాయి. ప్రపంచవ్యాప్తంగా సౌర విద్యుత్తునకు, వాయు విద్యుత్తునకు ఆదరణ పెరుగుతోంది. మన దేశం ఆధ్వర్యంలో సౌర విద్యుత్-సౌరశక్తి-దేశాల కూటమి ఏర్పడి ఉంది! అణు విద్యుత్ వల్ల ప్రకృతి కాలుష్యగ్రస్తం అవుతోంది. వాయు విద్యుత్ సౌర విద్యుత్ జల విద్యుత్ కేంద్రాలవల్ల ‘కాలుష్యం’ ఉత్పత్తి కాదు! ప్రకృతి స్వచ్ఛతకు భంగం కలుగదు..