సంపాదకీయం

కశ్మీర్‌లో మళ్లీ చర్చలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్ము కశ్మీర్‌లో నిరంతర చర్చ- సస్టైండ్ డయిలాగ్- జరుపడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిని నియమించడం పట్ల విభిన్న వ్యాఖ్యలు వెలువడడం సహజం! ఎందుకంటే జమ్ము కశ్మీర్‌లో ‘చర్చల ప్రహసనం’ దశాబ్దులుగా కొనసాగుతోంది! కొత్తగా చర్చించదగిన ‘మహా విషయం’ ఏమిటన్నది వేచి చూడదగిన ఉత్కంఠ కారకం.. ‘నిఘామండలి’-ఇంటిలిజెన్స్ బ్యూరో-పూర్వ సంచాలకుడు దినేశ్వర్ శర్మను కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా నియమించినట్టు సోమవారం ప్రకటించిన దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఈ ‘మహావిషయం’ గురించి వివరాలను ఆవిష్కరించకపోవడం ఉత్కంఠకు కారణం! జమ్ము కశ్మీర్‌లో ఎవరితో చర్చించాలి! ఏమి చర్చించాలి?-అన్న వ్యవహారంలో దినేశ్వర్ శర్మకు సంపూర్ణ అధికారాన్ని ఇచ్చినట్టు మాత్రమే రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించాడు! అందువల్ల జమ్ము కశ్మీర్‌లో బీభత్సకాండను కొనసాగిస్తున్న ‘జిహాదీ’ మూకల ప్రతినిధులతోను, బీభత్స కారులను సమర్ధిస్తున్న ‘హురియత్’ వంటి దేశ విద్రోహపు ముఠాల ‘పెద్దల’తోను కూడ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి చర్చలు జరుపనున్నాడన్న వ్యాఖ్యలకు, ప్రచారానికి అవకాశం ఏర్పడింది! ఈ బీభత్సకారులతో కాని, విద్రోహ ముఠాలతో కాని దినేశ్వర్ శర్మ చర్చలు జరుపుతాడా లేదా అన్నది అందువల్ల వేచి చూడదగిన ‘మహా విషయం’! ఏమయినప్పటికీ గత మూడేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వం పాకిస్తాన్ ప్రేరిత ‘జిహాదీ’ బీభత్స మూకలను నిర్మూలించడానికి జరుపుతున్న ‘యుద్ధం’ ఈ చర్చల పేరుతో ఆగరాదన్నది ఆకాంక్ష.. జమ్ము కశ్మీర్‌లో అధీనరేఖ-లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌ఓసి-పొడవునా మన సైనిక దళాలు రెండుసార్లు పెద్ద ఎత్తున బీభత్స స్థావరాలపై దాడి చేసి ధ్వంసం చేయడం ఈ ‘యుద్ధం’లో భాగం! ఈ సాయుధ చికిత్స-సర్జికల్ స్ట్రయిక్-ల కారణంగా ‘జిహాదీ’ ముఠాల, కశ్మీర్ లోయలోని వారిని సమర్ధిస్తున్న ముఠాల, వారిని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ సైనిక దళాల ‘పన్నాగం’ చాలావరకు భగ్నమైంది! గత ఏడాది సెప్టెంబర్‌లో మొదటిసారి మన సైనికులు ఈ ‘సాయుధ చికిత్స’ జరిపారు. గత సెప్టెంబర్‌లో ‘ఆపరేషన్ అర్జున్’ పేరుతో మన సైనికులు ‘అధీనరేఖ’ వెంబడి మరోసారి సాయుధ చికిత్స జరిపారు. 2014 మే 26 వరకు పదేళ్లపాటు మన ప్రభుత్వం పాటించిన ‘మెతక’ విధానానికి విరుద్ధంగా గత మూడేళ్లలో ‘జిహాదీ‘ పైశాచిక కాండను నిర్మూలించడానికి మన ప్రభుత్వం యత్నిస్తోంది!
అందువల్ల ఇప్పుడు ‘చర్చ’ల పేరుతో మరోసారి ‘చర్య’కు విఘాతం కలుగరాదన్నది ప్రభుత్వ విధానం కావాలి! కశ్మీర్‌ను కాని మొత్తం దేశాన్ని కాని పట్టి పీడిస్తున్న జిహాదీ ఉగ్రవాదం మన దేశాన్ని బలహీన పరచాలన్న పాకిస్తాన్ సైనిక దళాల పథకంలో భాగం! నిరంతరం రక్తపాతం సృష్టించాలన్నది పాకిస్తాన్ జిహాదీల విధానం. జమ్ము కశ్మీర్‌లో పుట్టి పెరిగిన జిహాదీలు కావచ్చు, పాకిస్తాన్‌లోని స్థావరాలలో బీభత్స స్వభావాన్ని సంతరించుకుని జమ్ము కశ్మీర్‌లోకి చొరబడుతున్న ‘జిహాదీ’లు కావచ్చు-రెండు రకాలను ఉసిగొల్పుతున్నది పాకిస్తాన్ సైనిక దళాలు మాత్రమేనన్నది జగత్ ప్రసిద్ధం! ‘హిజ్‌బుల్’, ‘సిమి’, ‘ఇండియన్ ముజాహిదీన్’ వంటి ‘జిహాదీ’ ముఠాలు మన దేశంలోనే తయారయ్యాయి. లష్కర్ ఎ తయ్యబా, జమాత్ ఉద్ దావా, జాయిష్ ఏ మొహమ్మద్, తాలిబన్ తండాలు పాకిస్తాన్‌నుండి చొరబడ్డాయి. ఈ ముఠాలన్నింటినీ అనుసంధానం చేస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వ విభాగం పేరు ‘ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ! ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం-ఐసిస్-,‘అల్‌ఖాయిదా’ ముఠాలు సైతం మన దేశంలోకి చొరబడడం పాకిస్తాన్ పన్నాగంలో భాగం. మయన్మార్ నుంచి మన దేశంలోకి చొరబడి తిష్ఠ వేసి ఉన్న వేలాది ‘రోహింగియా’లు సైతం జిహాదీ ఉగ్రవాదులుగా రూపొందడం సరికొత్త వికృత పరిణామం..
అందువల్ల జమ్ము కశ్మీర్‌లో వౌలిక సమస్య ఒక్కటే... పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదం! ఈ ఉగ్రవాదం క్రీస్తు శకం 1947 నుంచీ కొన సాగుతోంది. జమ్ము కశ్మీర్‌లోని మూడవ వంతు పాకిస్తాన్ అక్రమ అధీనంలో కొనసాగుతుండడానికి కశ్మీర్ లోయలోని లక్షలమంది హిందువులు నిర్వాసితులు కావడానికి ఈ బీభత్స కాండ ఏకైక కారణం! అందువల్ల పాకిస్తాన్ అధీనంలో జమ్ము కశ్మీర్‌ను తిరిగి మనం పొందగలగడం చర్చలకు కాని, చర్యలకు కాని లక్ష్యం కావాలి! కానీ ఈ చర్చలు కశ్మీర్‌లోని బీభత్సకారులతో కాక పాకిస్తాన్‌తో జరగాలి! పాకిస్తాన్‌తో చర్చల వల్ల ఎలాంటి ‘సయోధ్య’ ఏర్పడ బోదన్నది ఏడు దశాబ్దుల అనుభవం. పాకిస్తాన్ విధానం-మన దేశాన్ని బద్దలు కొట్టాలన్న విధానం-లో మార్పు వస్తే కాని కశ్మీర్‌లో బీభత్స కృత్యాలను సాగిస్తున్న వారిలో మార్పురాదు! అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వం ‘జిహాదీ’లను ఉసిగొల్పడం మానేవరకూ, ఆ దేశంతో మనం ఎలాంటి ‘చర్చలు’ జరుపరాదు, ఐక్యరాజ్యసమితిలోను, అంతర్జాతీయ సమాజంలోను పాకిస్తాన్ ప్రభుత్వ భయంకర బీభత్స జిహాదీ స్వభావాన్ని బహిర్గతం చేయడానికి ప్రభుత్వం కృషి చేయాలి. ఇది మొదటి చర్య, రెం డవ చర్య కశ్మీర్‌లోను దేశంలోను బీభత్సకాండ జరుపుతున్న ‘జిహాదీ’ ముష్కరులను అణచివేయడం. ఈ రెండు రకాల చర్యలనూ మన ప్రభుత్వం గత మూడేళ్లకు పైగా కొనసాగిస్తోంది! ఈ ‘చర్చల’ వల్ల లక్ష్య సాధన జరిగే వరకూ ఈ చర్యలను ఆపరాదు. కానీ ఇప్పుడు మళ్లీ ‘చర్చల’ను ప్రారంభిస్తోంది! ‘చర్చల’ పేరుతో ‘చర్యల’కు విఘాతం కలుగడం గత అనుభవం!
టెర్రరిస్టులను కఠినంగా అణచివేయడం వల్లనే కశ్మీర్ లోయ ప్రాంతంలో మళ్లీ సర్వమత సమభావ వ్యవస్థ ఏర్పడగలదు. సర్వమత సమభావం అనాదిగా భారతీయ స్వభావం! కానీ కశ్మీర్ లోయలో మాత్రం ‘జిహాదీ’ల బీభత్సకాండ ఫలితంగా ఈ స్వభావం భంగపడింది. అందువల్లనే అల్పసంఖ్యలోని హిందువులు నిర్మూలనకు గురి అయ్యారు. నిర్వాసితులైన ఈ హిందువులు మళ్లీ లోయలోని తమ పూర్వ నివాసాలకు పూర్వజుల ప్రాంతానికి వెళ్లి నిర్భయంగా జీవించగలిగే పరిస్థితులు ఏర్పడాలి! అలా ఏర్పడడం సర్వమత స్వభావానికి అనుగుణం... ‘జిహాదీ’ టెర్రరిస్టులతోను, దేశద్రోహులతోను ‘చర్చలు’ మళ్లీ మొదలు కావడం వల్ల ఈ రెండు లక్ష్యాలు-పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్‌ను మళ్లీ స్వాధీనం చేసుకోవడం, హిందువుల పునరావాసం-నెరవేరతాయా? విచ్ఛిన్నకారులతోను, జిహాదీలతోను చర్చలు జరిపే ప్రసక్తి లేదని గత ఏప్రిల్ 28న కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది. దినేశ్వర్ శర్మ ‘చర్చలు’ ఈ ‘నివేదన’ పరిధిలో మాత్రమే కొనసాగాలి...