సంపాదకీయం

చైనా తోడేలు.. అదే తీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్ ప్రదేశ్‌లో రాష్టప్రతి రామనాథ్ కోవింద్ - నవంబర్ పంతొమ్మిదవ తేదీన - పర్యటించడంపట్ల చైనా ప్రభుత్వం తెలిపిన నిరసనకు ఇటీవల జరిగిన ‘భారత చైనా’ సరిహద్దు చర్చలు విచిత్రమైన నేపథ్యం. ఈ సరిహద్దు చర్చలు దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా కొనసాగుతున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కారం కోసం ఉభయ దేశాల మధ్య జరుగుతున్న చర్చలు ‘సయోధ్య’కు సామరస్య వైఖరికి నిదర్శనమన్నది జరుగుతున్న ప్రచారం. కాని ఇలా చర్చలు జరిగిన వెంటనే ఏదో ఒక వివాదాన్ని సృష్టించడం చైనా ప్రభుత్వం వారి దశాబ్దుల పన్నాగం... ఈ విష వ్యూహాన్ని కొనసాగించడంలో భాగంగానే మన అరుణాచల్ ప్రదేశ్‌లో మన రాష్టప్రతి పర్యటించడాన్ని చైనా తప్పుపట్టింది! ఇలా అరుణాచల్ ప్రదేశ్‌లో మన రాష్టప్రతుల పర్యటనను, మన ప్రధాన మంత్రుల పర్యటనను చైనా వ్యతిరేకించడం ఇది మొదటిసారి కాదు, ఏళ్ల తరబడి చైనా ఇలా ‘సంఘర్షణాత్మక’ వైఖరిని వికృతంగా ప్రదర్శిస్తూనే ఉంది! మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ అరుణాచల్ ఏర్పాటును చైనా తప్పుపట్టింది, ప్రస్తుత ప్రధాని నరేంద్రమోదీ పర్యటనను కూడా చైనా వ్యతిరేకించింది! టిబెట్ ప్రవాస ప్రభుత్వ మాజీ అధినేత, బౌద్ధ గురువు దలైలామా ఇటీవల అరుణాచల్‌ను సందర్శించాడు. ఈ పర్యటనకు అనుమతి ఇచ్చినందుకు కూడ చైనా మన ప్రభుత్వాన్ని నిందించింది! గతంలో మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నడచిన సమయంలో ఆసియా ‘అభివృద్ధి బ్యాంకు’ వారు అరుణాచల్‌లో ‘ప్రగతి పథకాల’ను అమలు జరుపడం కోసం ఋణాన్ని మంజూరు చేసింది. కానీ చైనా ‘తెరవెనుక’ కుట్రను ప్రారంభించింది. ఈ కుట్ర కారణంగా మంజూరు చేసిన ఋణాన్ని ‘ఆసియా అభివృద్ధి బ్యాంక్’ వారు రద్దు చేశారు. దౌత్యపరంగా మన దేశానికి ఎదురైన పరాజయం అది. మన దేశంలో అనాదిగా భాగమైన అరుణాచల్ ప్రదేశ్‌లో అత్యధిక శాతం భూభాగం తమదని చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం క్రీస్తుశకం 1959 నుంచి పేచీ పెడుతోంది. ఇలా పేచీపెట్టడానికి ఏకైక కారణం చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం టిబెట్‌పై జరిపిన దురాక్రమణను మన ప్రభుత్వం ప్రతిఘటించకపోవడం. 1949వ 1959వ సంవత్సరాల మధ్య టిబెట్‌ను చైనా దురాక్రమించినప్పుడు జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిత్వంలోని మన ప్రభుత్వం ఈ దురాక్రమణను సమర్థించడం ప్రపంచ దేశాలను విస్మయపరచింది! టిబెట్‌ను చైనా దురాక్రమించడంతో 1959లో మనకూ చైనాకు మధ్య చరిత్రలో మొదటిసారిగా నాలుగువేల నూట పద్దెనిమిది కిలోమీటర్ల అతిపెద్ద సరిహద్దు ఏర్పడింది. ఇలా సరిహద్దు ఏర్పడిననాటి నుంచి అరుణాచల్, లడక్‌లోని అత్యధిక భాగం తమవని చైనా పేచీ పెడుతోంది... మన దేశంలోకి చొరబడుతోంది...!
టిబెట్ స్వతంత్ర దేశంగా ఉండి ఉన్నట్టయితే మనకూ చైనాకు మధ్య దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల సువిశాల టిబెట్ నెలకొని ఉండేది. అందువల్ల మనకు చైనాకు మధ్య సరిహద్దు ఉండేదికాదు, అరుణాచల్, లడక్, ‘డోకలామ్’ వంటి మన ప్రాంతాలు తమవని చైనా కమ్యూనిస్టులు వాదించడానికి వీలుండేది కాదు! అందువల్ల చైనా దురాక్రమణ ప్రమాదం నుంచి మనకు శాశ్వత విముక్తి లభించడానికి ఏకైక మార్గం టిబెట్ స్వాతంత్య్రాన్ని పునరుద్ధరించడం... టిబెట్‌ను కాజేయడం వల్లనే చైనాకు అరుణాచల్‌ను లడక్‌ను కూడ కాజేయాలన్న దుర్వాంఛ, దురాక్రమణేచ్ఛ పొటమరించాయి. ఎందుకంటె ఉత్తర కశ్మీర్‌లోని ‘దరద’ ప్రాంతం నుంచి లడక్‌లోను, టిబెట్‌లోను, నేపాల్‌లోను, సిక్కింలోను, భూటాన్‌లోను, అరుణాచల్‌లోను మాట్లాడుతున్న భాషలన్నీ ఒకే ‘బోటీ’ కుటుంబానికి చెందినవి. ఈ ‘బోటీ’ భాషలు భారతీయమైన సంస్కృత భాషకు రూపాంతరాలు, ‘బోటీ’ భాష లిపులు కూడా అతి ప్రాచీన భారతీయ ‘బ్రాహ్మీ’ లిపికి రూపాంతరాలు. టిబెట్ భాషకు - త్రివిష్టప భాషకు- ఇలా భారతదేశంతో సాంస్కృతిక సామ్యం ఉంది, చైనాతో లేదు! ఒకప్పుడు రెండువేల ఐదు వందల ఏళ్లకు పూర్వం టిబెట్ భారతఖండ అంతర్భాగం. ఆ తరువాత క్రీస్తుశకం 1959 వరకు స్వతంత్ర దేశం...
ఇలా టిబెట్‌ను కాజేసిన చైనాకు త్రివిష్టప భాషతో, సంస్కృతితో సామ్యం ఉన్న లడక్ నేపాల్ సిక్కిం భూటాన్ అరుణాచల్ ప్రాంతాలను కాజేయాలన్న కోర్కె కూడ రగులుతుండడానికి ఇదీ నేపథ్యం. ‘‘చైనా చేతికి టిబెట్ అరచేయి, లడక్, నేపాల్, సిక్కిం, భూటాన్, అరుణాచల్ ప్రదేశ్‌లు ఐదు వేళ్లు..’’ అని క్రీస్తుశకం 1950వ దశకంలో చైనా నియంతలు కూసిన కారుకూతలకు ఈ భాషా సాంస్కృతిక సామ్యం పునాది! కానీ టిబెట్ నిజానికి భారత సాంస్కృతిక జాతీయతలో భాగం! చైనాకు టిబెట్‌తో భాషా పరమైన సాంస్కృతికమైన, భౌగోళికమైన, రాజ్యాంగికమైన ఎలాంటి సంబంధం లేదు. 1959 నుండి తారుమారైన ఈ చారిత్రక వాస్తవం కారణంగానే చైనా అరుణాచల్‌ను కోరుతోంది. లడక్‌లోకి జొరబడి తిష్టవేసింది, ఇప్పుడు మన సిక్కింలోకి భూటాన్‌లోకి కూడా చొరబడుతోందనడానికి ‘డోక్‌లా’ -డోకలామ్- పచ్చిక మైదానం సాక్ష్యం! 2004వరకు కూడ ‘సిక్కిం’ మన దేశంలో భాగమేనని చైనా అధికారికంగా గుర్తించలేదు. ‘‘మేము సిక్కింను వదలుకొన్నాము కనుక మీరు టిబెట్‌ను మా దేశంలో భాగమని గుర్తించాలి...’’ అన్నది చైనా మన ప్రభుత్వానికి చేసిన పునరుద్ఘాటన! మనదేశం 1959లో ‘టిబెట్’ను చైనాకు అప్పగించినప్పటికీ చైనాకు ఇప్పటికీ విశ్వాసం కుదరడం లేదు, టిబెట్ ప్రవాస ప్రభుత్వం, ఉద్యమకారులు స్వాతంత్య్ర పునరుద్ధరణ కాంక్షను వదలిపెట్టకపోవడం ఇందుకు కారణం!!
రెండున్నర దశాబ్దులుగా కొనసాగుతున్న చర్చల వల్ల చైనా 1962లోను అంతకు పూర్వము దురాక్రమించిన మన భూభాగాలను తన అక్రమ అధీనంలో ఉంచుకొనగలుగుతోంది. ‘‘లడక్‌లో మేము ఆక్రమించుకున్న ప్రాంతాన్ని మాకు వదలివేస్తే అరుణాచల్‌ను భారత్‌కు వదలివేస్తాము...’’ అన్నది చైనా విధానమని పాశ్చాత్య ప్రచార మాధ్యమాలలో ప్రచారమైంది! చైనా పదేపదే అరుణాచల్‌లో మన ప్రభుత్వాధి నేతల దేశాధినేతల పర్యటనలను వ్యతిరేకించడంలోని ఆంతర్యం ఇదీ! ‘సరిహద్దు’ వివాదంపై చర్చలు జరిగినప్పుడల్లా చైనా ఇలా అరుణాచల్‌పై లేని వివాదం ఉన్నట్టుగా ప్రచారం చేస్తోంది! ‘‘పిబన్తి ఉదకం గావః మండూకేషు రుదష్యపి - కప్పలు నిరసన తెలుపుతున్నప్పటికీ ఆవులు నీరు త్రాగుతూనే ఉన్నాయి- అని అన్నట్టుగా మన ప్రభుత్వం అరుణాచల్ విషయంలో చైనా వారి రోదనను పట్టించుకోవడం లేదు.