సంపాదకీయం

రాహుల్‌గ్రస్తం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడుగా రాహుల్ గాంధీ ఎంపిక కావడం సంస్ధాగత ప్రజాస్వామ్య వైఫల్యానికి మరో చారిత్రక నిదర్శనం, కుటుంబ వారసత్వ రాజకీయ ద్యూతక్రీడ మరింత విస్తరించిపోతోందనడానికి సరికొత్త ప్రమాణం! ఈ ‘క్రీడ’, ఈ వారసత్వ చరిత్ర మోతీలాల్ నెహ్రూతో మొదలైంది. కాంగ్రెస్ మహా సంస్థ, స్వాతంత్య్ర ఉద్యమ సంస్థ ఒక ప్రముఖ కుటుంబానికి ‘బందీ’ కావడానికి 1920వ దశకంలోనే ప్రాతిపదిక ఏర్పడింది! సంస్థాగత ప్రజాస్వామ్య ప్రక్రియ నీరుకారిపోవడం మాత్రమే కాదు, రాజ్యాంగ ప్రక్రియ ‘అప్రజాస్వామ్య’ కబంధ బంధంలో చిక్కుకుపోవడం కూడ ఈ ‘కుటుంబ’ ప్రాబల్య విస్తరణవల్ల సంభవించిన విపరిణామం! మోతీలాల్ నెహ్రూ తన కుమారుడు జవహర్‌లాల్ నెహ్రూ దొడ్డిదారిన ‘కాంగ్రెస్ సంస్థ’ను ఆక్రమించడానికి దోహదం చేశాడు! 1929లో కాంగ్రెస్ అధ్యక్షుడుగా జవహర్‌లాల్ నెహ్రూ ఎన్నిక కావడంతో ప్రజాస్వామ్య భారత రాజకీయాలలో కుటుంబ వారసత్వం అంకురించింది. ఈ ‘అంకురం’ మహా ఆధిపత్య వృక్షంగా మారి కాంగ్రెస్ పార్టీ అస్తిత్వానికి ఏకైక ప్రాతిపదిక కావడం నడుస్తున్న చరిత్ర. జవహర్‌లాల్ నెహ్రూ తరువాత ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్‌గాంధీ, అయన భార్య సోనియాగాంధీ ఇప్పటివరకూ ‘కాంగ్రెస్ సర్వస్వం’గా మారడం సంస్ధాకత ప్రజాస్వామ్యానికి దాపురించిన గ్రహణం! ఈ కుటుంబ వారసత్వ రాజకీయ గ్రహణం నుంచి కాంగ్రెస్‌కు సమీప భవిష్యత్తులో కూడ విముక్తి కలిగే అవకాశం లేదన్నది స్పష్టం. పంతొమ్మిదేళ్ల పాటు తల్లి సోనియాగాంధీ అధిష్ఠించిన కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని తనయుడు రాహుల్‌గాంధీ వారసత్వపు హక్కువలె కైవసం చేసుకొనడం ఇందుకు నిదర్శనం. జవహర్‌లాల్ నెహ్రూ కుటుంబ ఆధిపత్యం కాంగ్రెస్ సంస్థను మాత్రమే కాదు, భారత రాజ్యాంగ వ్యవస్థను కూడ వారసత్వమయ మాయాగ్రస్తం చేసింది. 1946లో మన దేశానికి తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని బ్రిటన్ సామ్రాజ్యవాదులు నిర్ణయించినప్పుడు సర్దార్ వల్లభభాయ్ పటేల్ ప్రధానమంత్రి కావాలని కాంగ్రెస్ పార్టీలోని అత్యధిక సంఖ్య ప్రతినిధులు నిర్ణయించారు. దాదాపు అన్ని ప్రాంతాల ‘ప్రదేశ్ కాంగ్రెస్ సంఘాలు’ తీర్మానించాయి. ఈ సంస్థాగత ప్రజాస్వామ్య నిర్ణయానికి వ్యతిరేకంగా జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాని కావడంతో కాంగ్రెస్ సంస్థ క్రమంగా ఆయన కుటుంబ ఆధిపత్యపు ‘చట్రం’లో ఇరుక్కుపోవడం మొదలైంది! మహాత్మాగాంధీ నిర్ణయం, పార్టీ అభీష్టానికి వ్యతిరేకంగా, నెహ్రూ ప్రధాని కావడానికి కారణం!! నెహ్రూ కుమార్తె ఇందిరాగాంధీ, ఇందిరమ్మ కుమారుడు రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రులు కావడం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థను దశాబ్దుల తరబడి ఆవహించిన వారసత్వ రాజకీయం. ఈ వారసత్వ రాజకీయం నుంచి రాజ్యాంగ వ్యవస్థ విముక్తమైంది, ప్రధాని కావడానికి 2004లో సోనియాగాంధీ చేసిన ప్రయత్నం విఫలమైపోయింది...
కానీ నెహ్రూ కుటుంబం నుంచి, నెహ్రూ వారసుల నుంచి ‘కాంగ్రెస్’ పార్టీ విముక్తి కాకపోవడం కొనసాగుతున్న వైపరీత్యం... రాజ్యాంగ వ్యవస్థను ఈ కుటుంబ వారసత్వపు భల్లూక బంధం నుంచి వోటర్లు విముక్తి చేశారు, రాహుల్‌గాంధీ కానీ నెహ్రూ కుటుంబంలో మరో వారసుడు లేదా వారసురాలు కానీ ప్రధానమంత్రి కారు, కాలేరు... కానీ కాంగ్రెస్‌పై నెహ్రూ సాధించిన పట్టు మాత్రం ఏడు దశాబ్దులుగా వదలడం లేదు, కార్యకర్తలు వదిలించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ సిద్ధాంతాలకు, స్వాతంత్య్ర ఉద్యమం నాటి నీతికి నిజాయితీకి కట్టుబడి ఉండిన కార్యకర్తలు అనేకమంది నెహ్రూ కాలంలోనే పార్టీని వదలిపోయారు! సర్దార్ వల్లభభాయి పటేల్ మరణించిన తరువాత నెహ్రూ పార్టీలో నిరంకుశ నాయకుడిగా మారాడు. ఈ నియంతృత్వ ధోరణిని ప్రతిఘటించిన ‘రాజర్షి’ పురుషోత్తమదాస్ టాండన్ వంటివారు క్రమంగా ప్రాధాన్యం కోల్పోయారు, చక్రవర్తుల రాజగోపాలాచారి వంటి వారు కాంగ్రెస్ నుంచి నిష్క్రమించారు!! నెహ్రూ తరువాత పార్టీని అదుపు చేసిన ఆయన దుహిత ఇందిరాగాంధీ పార్టీని రెండుసార్లు, 1969లోను 1977లోను చీల్చివేయడం ద్వారా ప్రత్యర్థులను పార్టీ నుండి వెళ్లగొట్టగలిగింది. ఈ ప్రత్యర్థులలో మురార్జీ దేశాయ్ వంటి మహనీయులు ఉన్నారు, అవకాశవాదులూ ఉన్నారు... అది వేరే సంగతి! కానీ కాంగ్రెస్ పార్టీ పరిధి ఇందిరాగాంధీ ప్రాబల్య మండలానికి పరిమితం కావడం చరిత్ర...
ఇందిరమ్మ తరువాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ ప్రత్యర్థులు పొటమరించకుండా జాగ్రత్తపడ్డారు. ప్రణవ్ కుమార్ ముఖర్జీ వంటి మేధావిని, ఆర్థిక వేత్తను, నిజాయతీపరుడిని పార్టీ నుంచి గెంటివేసిన ‘ఘనత’ రాజీవ్‌గాంధీది. ప్రణవ్ కుమార్ ముఖర్జీ పునఃప్రవేశం అనివార్యం కావడం వేరే సంగతి! 1998లో అధ్యక్షుడిగా ఉండిన సీతారామ్ కేసరిని బలవంతంగా గద్దె దించిన రాజీవ్‌గాంధీ భార్య సోనియాగాంధీ పార్టీని మళ్లీ కైవసం చేసుకోగలిగింది. పార్టీకి వారసత్వ ఆధిపత్యం నుంచి విముక్తి కలుగగలదన్న ఆశలు అంతటితో ఆవిరి అయిపోయాయి. పంతొమ్మిది ఏళ్లపాటు ఏకబిగిన కాంగ్రెస్ అధ్యక్ష పదవిని ‘అలంకరించిన’ సోనియాగాంధీ పార్టీని ‘మరుగుజ్జుల’ మయం గా మార్చగలిగింది, విచక్షణ వికసించిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్ నుండి బయటకు వెళ్లిపోవడం ఈ పంతొమ్మిదేళ్ల చరిత్ర! అవినీతిపరులు, ప్రజల అభిమానం సొంతంగా పొందలేనివారు, నిర్లిప్త రాజకీయవేత్తలు మాత్రమే కాంగ్రెస్‌లో కొనసాగుతున్నారు. అందువల్ల మానులేని మరుభూమినందు ఉమ్మెత్త చెట్టువలె మరుగుజ్జుల మధ్య రాహుల్‌గాంధీ మహా నాయకుడైపోయాడు!! రాహుల్‌గాంధీ నాయకత్వం వల్ల కాంగ్రెస్ కాని, కాంగ్రెస్ నాయకత్వంలోని కూటమి కాని మళ్లీ కేంద్రంలో అధికారం పొందడం కల్ల.. ఇలా ఒకప్పటి ‘మహాసంస్థ’ ఇప్పుడు రాహుల్‌గాంధీ వంటి ‘ఆషామాషీ’ రాజకీయవేత్త అధికారానికి బందీ కావడం ‘‘కుంజర యూథమ్ము దోమ కుత్తుక’’లో దిగబడడం వంటిది!!
తాత తండ్రులు సంపాదించిన ఆస్తిని యథేచ్ఛగా అనుభవిస్తూ విశృంఖంగా విహరించే ఆకతాయి అల్లరి చిల్లర కుర్రవాళ్లవలె రాహుల్‌గాంధీ పదిహేను ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీని అనుభవిస్తున్నాడు! ‘‘ఆయన ఏమి చెబుతున్నడో మాకు అర్థం కాలేదు...’’ అని కాంగ్రెస్ మిత్రపక్షాలవారు అనేకసార్లు ప్రకటించడం చరిత్ర! పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సమయంలో విదేశాలకు వెళ్లి విశ్రాంతి తీసుకున్న రాహుల్ గాంధీ ‘బాధ్యతా రాహిత్యానికి’ సజీవ విగ్రహం.. కాంగ్రెస్ విముక్తి భారత రాజకీయాల గురించి అనేకమంది ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రజాస్వామ్య విజయానికి అధికారపక్షంతో దీటైన ప్రతిపక్షం కూడ అత్యవసరం. కానీ నెహ్రూ కుటుంబ కబంధ బంధం నుంచి కాంగ్రెస్ విముక్తి కావడం సంభవమా అన్నది ప్రశ్న.