సంపాదకీయం

మణిశంకర మనోవృత్తి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రధానమంత్రి నరేంద్రమోదీని అసభ్యమైన పదజాలంతో నిందించడం ద్వారా మాజీ కేంద్రమంత్రి మణిశంకర్ అయ్యర్ మరోసారి ‘‘నోటిలో కాలేసుకున్నాడు..’’ చిన్నపిల్లలు నోట్లో వేలేసుకున్నా కాలేసుకున్నా ముద్దుగానే ఉంటుంది, అది బుద్ధిపూర్వకంకాదుకూడ. కానీ ఏండ్లు మీరి వయసు మళ్లిన మణిశంకర్ మాత్రం బుద్ధిపూర్వకంగానే కాలును నోట్లో పెట్టుకున్నాడు! ఇలాంటి వికృత చేష్టల ద్వారా కోల్పోయిన ప్రాధాన్యాన్ని మళ్లీ సంతరింపచేసుకోవచ్చునన్నది బహుశా మణిశంకర్ ఎత్తుగడ కావచ్చు! కానీ ఈయనగారి ఈ ‘దుర్బుద్ధి’ ఇప్పటిది కాదు, గతంలో స్వాతంత్య్రవీరుడు వినాయక దామోదర్ సావర్కార్‌పై కూడ ఈ ‘అయ్యర్’ నిందాపూర్వకమైన వ్యాఖ్యలు చేశాడు, అప్పుడు కూడ కాంగ్రెస్ అధికార ప్రతినిధులు ఇతగాడిని బహిరంగంగానే ఛీకొట్టారు... ఇప్పుడు నరేంద్రమోదీని ‘‘యహ్ ఆద్మీ బహుత్ నీచ్ కిస్మ్‌కా ఆద్మీహై- ఇతడు నీచ తరగతికి చెందినవాడు - అని అయ్యర్ నిందించడం కూడ బెడిసికొట్టింది. నిజానికి ఈ మణిశంకర్ అయ్యర్ ‘కించత్’కరుడు. కాంగ్రెస్‌లో ప్రాధాన్యం లేనివాడు, మళ్లీ ప్రాధాన్యాన్ని సంతరించుకొనడానికై యత్నిస్తున్నాడు. ‘‘పటం ఛింద్యాత్ ఘటం భింద్యాత్, కుర్యాత్ వాగార్ద్భస్వరం, యేనకేనపి ఉపాయేన ప్రసిద్ధః పురుషోభవేత్..’’ అన్నది దుర్జన నీతి. ‘‘బట్టలు చింపుకోవచ్చు, కుండలను పగులగొట్టవచ్చు, గాడిదవలె ఓండ్ర పెట్టవచ్చు, ఏదో ఒక ఉపాయంతో పురుషుడు ప్రసిద్ధుడు కావాలి..!’’ మణిశంకర్ అయ్యర్ తన రాజకీయ జీవితాన్ని ఈ ‘నీతి’గ్రస్తం చేసి ఉన్నాడు. ‘‘నేను బ్రాహ్మణుడిని, అయినప్పటికీ ఆవుమాంసం తింటాను’’ అని ఈ అయ్యర్ ప్రకటించి ఉన్నాడు! రాజకీయ ప్రత్యర్థుల సిద్ధాంతాలతోను కార్యక్రమాలతోను తీవ్రంగా విభేదించవచ్చు. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఈ విభేదాలు సహజం. కానీ ఈ రాజకీయ విభేదాలు వైయక్తిక వైరుధ్యాలు కాదన్నది, కారాదన్నది కూడ పరిణత ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రాతిపదిక! మనది పరిణతి చెందిన అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ.. అంతర్జాతీయ సమాజం కూడ ఈ సంగతిని, ఈ సత్యాన్ని గుర్తించింది. అయినప్పటికీ వ్యక్తిగత దూషణలకు పాల్పడి దిగజారిపోయిన మణిశంకర్ అయ్యర్ వంటి వారు ‘కాంగ్రెస్’లో ఇప్పటికీ కొనసాగుతుండడం ఆ పార్టీని ఆవహించిన దౌర్భాగ్యం. నరేంద్రమోదీని ఇలా తిట్టినందుకు మణిశంకర్ అయ్యర్ క్షమార్పణ కోరాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ప్రకటించాడు. గుజరాత్ ఎన్నికల ప్రక్రియ సమయంలో కాకుండా ‘‘ఎన్నికలు జరుగని సమయంలో’’ అయ్యర్ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసి ఉంటే రాహుల్‌గాంధీ అయ్యర్‌ను తప్పుపట్టి ఉండేవాడా?’’ అయ్యర్ దుర్బుద్ధితో మోదీపై చేసిన వికృత వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ గుజరాత్ ఎన్నికలలో తుడిచిపెట్టుకొనిపోయే ప్రమాదం ఉంది. ఈ భయంతోనే బహుశా రాహుల్‌గాంధీ మణిశంకరాన్ని తప్పుపట్టాడు. పార్టీ నుంచి అయ్యర్‌ను తాత్కాలికంగా తొలగించాడు...
మణిశంకర్ అయ్యర్, దిగ్విజయ్‌సింగ్ వంటి కాంగ్రెస్ వారు ఏళ్ల తరబడి వివాద వ్యాఖ్యలు చేస్తున్నారు. ‘‘సున్నపువెలుగు’’ - లైమ్‌లైట్ -లో కొనసాగడానికై ఇలాంటి ‘‘ఓండ్ర పెట్టే’’ వ్యాఖ్యలు చేయడం వీరి మానసిక వికృతికి నిదర్శనం. గతంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దిగ్విజయ్‌సింగ్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం కల్ల.. కేంద్రమంత్రి పదవిని వెలగబెట్టిన అయ్యర్ మరోసారి ఆ పదవికి ఎగబాకడం కల్ల.. అందువల్ల జనం తమను మరచిపోకుండా నిరోధించే ఎత్తుగడలో భాగంగా వీరు ఇలాంటి వారు ఇలా నికృష్ట వ్యాఖ్యలకు పాలపడుతున్నారు! కేంద్రమంత్రిగా ఉండిన సమయంలోనే మణిశంకర్ అయ్యర్ వీరసావర్కార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అండమాన్ దీవులలో సావర్కార్ నిర్బంధంలో ఉండిన జైలులో స్మృతి చిహ్నాలు ఉండరాదని అయ్యర్ పదమూడేండ్ల క్రితం వ్యాఖ్యానించాడు! వినాయక దామోదర్ సావర్కార్ బ్రిటన్ వ్యతిరేక స్వాతంత్య్ర సమరయోధుడు. తన జాతీయ విప్లవ సాయుధ సమర కలాపాల ద్వారా బ్రిటన్ బీభత్స పాలకులను బెంబేలెత్తించిన భరతమాత వజ్రాలబిడ్డడు సావర్కార్. స్వాతంత్య్ర సమరానికి సహజ జీవన ప్రతీకగా మారిన వినాయక సావర్కార్ అందువల్లనే వీరసావర్కార్‌గా వినుతికెక్కాడు. బ్రిటన్ దురాక్రమణకు వ్యతిరేకంగా కలియుగం 4959వ సంవత్సరంలో ఈ స్వాతంత్య్ర సమరం మొదలైంది. నూట అరవై ఏళ్లక్రితం ఝాన్సీ లక్ష్మీబాయి, మంగళ్‌పాండే వంటివారు ఆరంభించిన ఈ సమరానికి యాబయి ఏళ్ల తరువాత స్వాతంత్య్ర వీరసావర్కార్ నాయకత్వం వహించాడు. అందువల్లనే బ్రిటన్ సామ్రాజ్యవాదులు సావర్కార్‌ను నిర్బంధించారు, అండమాన్ దీవులకు తరలించారు. జైలుగదిలోని గోడలపై సావర్కార్ ప్రథమ భారత సంగ్రామ స్మృతులను అక్షరబద్ధం చేయడం అద్భుతమైన పరిణామం! జైలుగది గోడలపై ఉన్న ఈ అక్షరాలను తొలగించాలని, జైలులో ఉన్న సావర్కార్ స్మారక చిహ్నాలను తొలగించాలని ఈ అయ్యర్, కేంద్రమంత్రిగా ఉన్న సమయంలో వ్యాఖ్యానించాడు, అందరిచేత ఛీకొట్టించుకున్నాడు!!
తొమ్మిదేళ్ల క్రితం పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన జిహాదీ బీభత్సమూకలు ముంబయిలో భయంకర మారణకాండ జరిపాయి. నూట అరవై ఆరుమందిని ఈ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నాయి. అలాంటి స్థితిలో దిగ్విజయ్‌సింగ్ పాకిస్తాన్ అనుకూల ప్రకటనలు చేయగలిగాడు. బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి, బెంగాల్‌లోకి ఈశాన్య ప్రాంతంలోకి దశాబ్దుల తరబడి లక్షలాది అక్రమ ప్రవేశకులు చొరబడ్డారు. ఈ అక్రమ ప్రవేశకుల సంఖ్య మూడు కోట్లకు పైబడిందన్నది నిర్ధారిత నిజం... కానీ బంగ్లాదేశ్ నుంచి మనదేశంలోకి అక్రమంగా ఎవ్వరూ చొరబడలేదని, కొన్ని వేలమంది కార్మికులు మాత్రమే, వ్యవసాయ శ్రామికులు మాత్రమే ఉపాధికోసం అస్సాంలోకి వచ్చి స్థిరపడినారని దిగ్విజయ్‌సింగ్ నిర్ధారించాడు. మన్‌మోహన్‌సింగ్ ప్రధానిగా ఉండిన సమయంలో దిగ్విజయ్‌సింగ్ చేసిన ఈ ‘నిర్ధారణ’ సర్వత్రా తీవ్రమైన నిరసనకు గురి అయింది. గత లోక్‌సభ ఎన్నికల ప్రచారం సమయంలో దిగ్విజయ్‌సింగ్ కూడ నరేంద్రమోదీపై అసభ్యకర వ్యాఖ్యలు చేయడం చరిత్ర...
అనగనగా ఓ రాజుగారు దేశంలోని ఒక వీరుని భార్యను చూసి మోహించాడు! పరదారా వ్యామోహం తగదని వృద్ధ మంత్రి రాజుగాడికి బుద్ధి చెబుతాడు. కానీ ‘కొత్త మంత్రి’ మాత్రం రాజును సమర్ధించాడు, ఆ వీరుని భార్యను అపహరించి తెమ్మని సైనికులను పంపాడు.. కానీ ఈ సైనికులను ఆ వీరుడు చితకకొట్టి తరిమాడు! ఇలా ‘వ్యూహం’ బెడిసిన వెంటనే ‘కొత్త మంత్రి’ వెళ్లి ఆ వీరుడికి క్షమాపణ చెప్పాడు. తమ సైనికులు చెడిపోయారని తమకు తెలియకుండా దాడిచేసి తప్పు చేశారని, తమ రాజుగారు వారిని కఠినంగా శిక్షించారని ప్రకటించాడు. ఇలా శిక్షించడం ద్వారా తమ రాజు ‘వారి’తోపాటు తాను ‘బుద్ధిమంతుల’మని ఆ వీరునివద్ద నిరూపిస్తాడు. ‘జగదేకవీరుని కథ’ అన్న పాత ‘సినిమా’లోని ఈ ఘట్టం కాంగ్రెస్ వారి వర్తమాన వ్యూహానికి చక్కగా సమన్వయం అయింది. మణిశంకర్‌ను శిక్షించిన రాహుల్‌గాంధీ తాను ‘బుద్ధిమంతుడ’నని చాటుకునే యత్నం చేస్తున్నాడు... ఇన్నాళ్లుగా మణిశంకర్‌వంటివారి ‘బుద్ధి’కి ప్రేరణ ఎవరు?? ప్రజలకు తెలుసు...