సంపాదకీయం

త్రైపాక్షిక వైపరీత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ప్రభుత్వం రష్యా చైనా దేశాలతో కొత్త్ఢిల్లీలో సోమవారం జరిగిన త్రైపాక్షిక చర్చలకు ‘డోక్‌లా’ - డోక్‌లామ్ - మైదానంలో చైనా దళాలు తిష్ఠవేసి ఉండడం విచిత్రమైన నేపథ్యం. ‘డోక్ లా’ పచ్చిక మైదానం నుంచి చైనా దళాలు నిష్క్రమించినట్లు జరిగిన జరుగుతున్న ప్రచారంలోని డొల్లతనం ఈ తిష్ఠవల్ల తేటతెల్లమైపోయింది. భూటాన్‌లోను మన సిక్కింలోను విస్తరించి ఉన్న ‘డోక్ లా’ మైదానంలో ప్రస్తుతం పద్దెనిమిది వందల చైనీయ సైనికులు తిష్ఠ వేసి ఉన్నట్లు వెల్లడికావడం సోమవారం నాటి త్రైపాక్షిక చర్చలకు సమాంతరంగా సంభవించిన విపరిణామం. ‘రష్యా, భారత్, చైనా’ - రిక్ - కూటమి త్రైపాక్షిక సమావేశాలు అనేక ఏళ్లుగా ప్రతి సంవత్సరం జరుగుతున్నాయి. సోమవారం నాటి సమావేశంలో మన విదేశ వ్యవహారాల శాఖ మంత్రి సుషమాస్వరాజ్ రష్యా విదేశాంగ మంత్రి సెర్జీలావ్‌రోవ్‌తోను చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రుూతోను జరిపిన సమావేశం ఈ ‘ప్రక్రియ’లో భాగం! ఈ చర్చల వల్ల మన దేశానికి జరుగుతున్న ప్రయోజనం సున్న! ఏ ప్రధానమైన ద్వైపాక్షిక అంశం గురించి కూడ మన దేశానికి చైనాకు మధ్య ఏకాభిప్రాయం లేదు. అందువల్ల త్రైపాక్షిక, బహుళపాక్షిక కూటములలో సైతం మనదేశానికి చైనాకు మధ్య ఏకాభిప్రాయం కుదరడం అసంభవం! ఆకుకు అందని రీతిలో పోకకు పొందని రీతిలో వెలువడుతున్న ‘త్రైపాక్షిక సమష్టి ప్రకటనలలో’ నిహితమై ఉన్న వైరుధ్యాలు మన జాతీయ ప్రయోజనాలను వెక్కిరిస్తున్నాయి! బీభత్సకాండ - టెర్రరిజమ్-ను నిర్మూలించడానికి తీవ్రమైన సమష్టి కృషి జరగాలన్నది సోమవారం నాటి ‘త్రైపాక్షిక సభ’ తరువాత వెలువడిన ‘సందేశం’ - కమ్యూనిక్ - సారాంశం. కానీ ఈ ‘కమ్యూనిక్’లో మన దేశంలోకి చొరబడి దశాబ్దులుగా భయంకర రక్తపాతం సృష్టించిన ‘లష్కర్ ఎ తయ్యబా’, ‘జమాత్ ఉద్ దావా’, జాయిష్ ఎ మొహమ్మద్’ వంటి పాకిస్తానీ జిహాదీ ఉగ్ర మూకలను నిరసించ లేదు! బీభత్సంపై ఉమ్మడిపోరు ఎలా సాధ్యం?? ‘జాయిష్ ఎ మొహమ్మద్ - జెఇఎమ్ - లోని మొదటి హంతకుడైన అఝార్ మసూద్ మనదేశంలో అనేకానేక బీభత్స కృత్యాలను నిర్వహించాడు. ఇతగాడిని ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ప్రకటించడానికి ‘ఐక్యరాజ్య సమితి’ ‘్భద్రతామండలి’ ‘సర్వప్రతినిధి సభ’ చేస్తున్న యత్నాలను చైనా నిర్లజ్జగా బహిరంగంగా వ్యతిరేకిస్తోంది! అలాంటి చైనాతో కలసి మనదేశం జిహాదీ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఎలా పోరాడగలదు?? సోమవారం కొత్త్ఢిల్లీలో మూడు దేశాలు ‘‘ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని’’ సమష్టిగా పిలుపునివ్వడం ఎవరి ఆత్మవంచనకు నిదర్శనం??
మనదేశంలో దశాబ్దుల తరబడి బీభత్సకాండ సాగిస్తున్న మావోయిస్టులకు చైనానుంచి ఆర్థిక సహాయం ఆయుధ సహాయం లభిస్తుండడం జగమెరిగిన రహస్యం! చైనా ఓడ రేవుల నుంచి బయలుదేరిన నౌకలు బంగ్లాదేశ్‌లోని ‘చిట్టగాంగ్’లో ఆయుధాలను దించిపోతున్నాయని, ఆ ఆయుధాలు మన ఈశాన్య ప్రాంతంలోకి తరలివస్తున్నాయని గతంలో ప్రచారమైంది! ఈశాన్య ప్రాంతంలో బీభత్సకాండ సృష్టిస్తున్న చైనా ప్రేరిత ఉగ్రవాదులకు మనదేశాన్ని అంటుకొని ఉన్న బర్మా -మైన్మార్ -లో స్థావరాలు ఏర్పడి ఉన్నాయి. మన ఈశాన్య ప్రాంతంలో హత్యాకాండ సాగించిన ఉగ్రవాదులు మైన్మార్‌లోకి పారిపోవడం గత చరిత్ర. మైన్మార్‌లో సైనిక నియంతృత్వం కొనసాగిన కాలంలో ఆ ప్రభుత్వం చైనా చేతి కీలుబొమ్మ... ప్రజాస్వామ్య ప్రక్రియ ఆరంభమైన తరువాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చినప్పటికీ మైన్మార్‌లో చైనా ప్రమేయం పూర్తిగా తగ్గలేదు. రెండేళ్ల క్రితం మన సైనికులు మైన్మార్‌లోకి చొచ్చుకొని పోయి బీభత్సకారుల బట్టీలను బద్దలుకొట్టి వచ్చారు. - సాయుధ ప్రక్రియ సఫలమైన తరువాత చైనా ‘‘దొంగకు తేలు కుట్టినట్లు’’ మిన్నకుండిపోయింది... తమకూ మన ఈశాన్యంలో బీభత్సకాండను సృష్టించిన ఉగ్రమూకలకూ ఎలాంటి సంబంధం లేదని బుకాయించింది! కానీ మైన్మార్‌కు చెందిన బంగాళాఖాతపు నిర్జన ద్వీపాలను మన దేశానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న బీభత్స కలాపాలను సాగించడానికై చైనా ఉపయోగించుకుంటోంది. చైనాతో జట్టుకట్టి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మావోయిస్టులకు వ్యతిరేకంగా జిహాదీ బీభత్సకారులకు వ్యతిరేకంగా మనం ఎలా పోరాడగలం??
సోమవారం ఢిల్లీలో వెలుడిన త్రైపాక్షిక ప్రకటనలో పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను ప్రస్తావించకపోవడం చైనా సాధించిన వ్యూహాత్మక విజయం, మన ప్రభుత్వానికి దక్కిన వ్యూహాత్మక వైఫల్యం! పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ ముఠాల కలాపాలను కూడ పేరుపెట్టి సంయుక్త ప్రకటనలో నిరసించాలని మన ప్రభుత్వం ఎందుకని పట్టుపట్టలేదు?? ‘‘చైనా ఒప్పుకోదు కనుక...’’, అలాంటప్పుడు త్రైపాక్షిక ప్రకటన జారీ చేయకుండా మన ప్రభుత్వం నిరోధించి ఉండవలసింది! పాకిస్తానీ బీభత్స ముఠాలను నిర్లజ్జగా సమర్థించడం ద్వారా మనదేశంపై విషం కక్కుతున్న చైనాపట్ల మనకు మొహమాటం దేనికి?? ‘‘పాకిస్తానీ బీభత్సపు ముఠాలను నిరసించే విషయంలో, అభిశంసించే వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరలేదు కనుక చర్చల తరువాత త్రైపాక్షిక సమష్టి ప్రకటనను జారీ చేయడం లేదు...’’ అని మన ప్రభుత్వం ఎందుకని ప్రకటించలేకపోయింది! ‘అణు సరఫరా దేశాల కూటమి’ - న్యూక్లియర్ సప్లయర్ గ్రూప్ - ఎన్‌ఎస్‌జి - లో మన దేశానికి సభ్యత్వం కల్పించే ప్రతిపాదనను చైనా బాహాటంగానే వ్యతిరేకిస్తోంది, అఝార్ మసూద్ ముష్కరుడిని సమర్థిస్తోంది. చైనా ప్రభుత్వం ఇలా ‘‘కుండలను బద్దలు కొడుతున్నప్పుడు’’ మన ప్రభుత్వం మాత్రం ‘‘ముంతను దాచే..’’ మెతకతనాన్ని ప్రదర్శిస్తోంది!! ఇలా ‘‘అవసరమైన అభిశంసనకు’’ చోటులేని ‘‘కమ్యూనిక్’’లో సిరియాలో బీభత్సకాండకు వ్యతిరేకంగా రష్యా చేపట్టిన చర్యలను మాత్రం ఘనంగా ప్రశంసించారు. సిరియాలో ‘‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరాజ్యం’’ మూకలను అమెరికా ఐరోపా దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. రష్యా కూడా వ్యతిరేకిస్తోంది. కానీ ‘మతరాజ్యం’ ముఠా చొరబాటు ఇటీవలి విపరిణామం! సిరియా నిరంకుశ ప్రభుత్వం ఏళ్ల తరబడి ప్రజావ్యతిరేక బీభత్సకాండ సాగిస్తోంది. ఈ బీభత్స ప్రభుత్వాన్ని రష్యా చైనాలు సమర్థిస్తున్నాయి... ఉగ్రవాద వ్యతిరేక సమష్టి సమరం ఎలా సాధ్యం??
పాకిస్తాన్ రాజకీయవేత్తలతోను, రాయబారితోను కాంగ్రెస్ నాయకులు మంతనాలు సాగించినట్లు ప్రచారం అవుతుండడం సోమవారం నాటి త్రైపాక్షిక చర్చలకు మరో సమాంతర విపరిణామం! శత్రుదేశమైన పాకిస్తాన్ ప్రతినిధులతో ఇలా రాజకీయవేత్తలు రహస్య సమావేశాలు జరపడం అంతర్గత భద్రతకు ముప్పు కలిగిస్తున్న దేశ విద్రోహకలాపం.. ‘డోక్ లా’లో గత జూలైలో చైనా దళాలు ఆక్రమణ కొనసాగిన సమయంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చైనా ప్రతినిధులతో రహస్య మంతనాలకు ఒడిగట్టాడు.. కాంగ్రెస్ వారు ప్రజలకు సమాధానం చెప్పాలి!!