సంపాదకీయం

‘ఆధార్’ అయోమయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆధార్ గుర్తింపు పత్రాల గురించి కొనసాగుతున్న గందరగోళానికి అసలు కారణాలు అంతుబట్టడం లేదు. ‘ఆధార్’ వ్యవస్థ ఉండాలా కొనసాగాలా అన్న విషయమై సర్వోన్నత న్యాయస్థానం నిర్థారించి ఉంది! కానీ ఆధార్ గుర్తింపు పత్రాలను ‘ఆదాయం పన్ను’ గుర్తింపు - పాన్ - పత్రాలతోను, ‘బ్యాంకు ఖాతాల’తోను, ‘సంచారవాణి’ - మొబైల్ ఫోన్ - నంబర్లతోను, ఇతరేతర అనేకానేక సంక్షేమ పథకాలతోను అనుసంధానం చేయడంలో సంబంధిత ఆధికారిక వ్యవస్థలు అనుసరిస్తున్న విధానాలు జనాన్ని భయాందోళనలకు గురి చేస్తున్న మాట మాత్రం నిరాకరింపజాలని నిజం! సార్వజనిక వ్యవహారంలో పారదర్శక పద్ధతి ప్రస్ఫుటించడానికి ఆధార్ దోహదం చేయగలదన్నది వౌలికమైన వాస్తవం! ఆర్థిక వాణిజ్య వ్యవహారాలలో ప్రభుత్వ సంక్షేమ పథకాలలో నిజాయితీ నైతిక నిష్ఠ పెరగడం ఈ వాస్తవం! కానీ వివిధ సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ ‘జాతీయ పథకాన్ని’ ఎందుకని దాదాపు పదేళ్లుగా వ్యతిరేకిస్తున్నాయి?? ఇది ఆధార్ వ్యవస్థ స్వభావానికి సంబంధించిన ప్రశ్న! జనవరి పదిహేడవ తేదీ నుంచి, - ఈ వౌలిక సమస్య పరిష్కారం కోసం, - సర్వోన్నత న్యాయస్థాన ‘రాజ్యాంగ ధర్మాసనం’ వారు వాదోపవాదాలను విననున్నారు. ఇరవై ఎనిమిది ‘ప్రజాప్రయోజన న్యాయయాచికలు’ ‘ఆధార్’కు వ్యతిరేకంగా దాఖలై ఉండడం వల్ల వాదప్రతివాదాలు విస్తృతంగా అనేక రోజులపాటు కొనసాగవచ్చు! సర్వోన్నత న్యాయనిర్ణయం వెలువడితే ఈ ఆధార్ వ్యవస్థ కొనసాగుతుందా? రద్దవుతుందా అన్నది స్పష్టవౌతుంది. కానీ ఈలోగా ‘ఆధార్’ అనుసంధాన కార్య పద్ధతి గురించి గందరగోళం కొనసాగే అవకాశం విస్తృతవౌతోంది! ప్రధానంగా బ్యాంకులవారు, ‘సెల్‌ఫోన్’ వ్యవస్థల నిర్వాహకులు గందరగోళం సృష్టిస్తున్నారు. డిసెంబర్ ముప్పయి ఒకటవ తేదీలోగా ‘బ్యాంకుల ఖాతా’లను ‘ఆధార్’తో అనుసంధానం చేయనక్కర లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టీకరించింది, సర్వోన్నత న్యాయస్థానం నిర్దేశించింది! ఈ గడువు మార్చి ముప్పయి ఒకటవ తేదీ వరకు పొడిగించడం వల్ల అనుసంధాన ‘కార్యపద్ధతి’లో నెలకొన్న గందరగోళం నుండి జనాలకు కొంత ఉపశమనం లభిస్తోంది!! నవంబర్ పదవ తేదీకి పూర్వం ‘బ్యాంకుల’ నిర్వాహకుల నుండి ఖాతాదారులకు నిరంతరం ‘సంక్షిప్త సందేశాలు’ సంచారవాణి మాధ్యమంగా ప్రసారమయ్యాయి. ‘‘మీ ఖాతాను ఆధార్‌తో అనుసంధానం చేయండి’’ ‘‘ఇది ప్రభుత్వ ఆదేశం’’ అన్నవి ఈ సందేశాలు! కానీ ఎప్పటిలోగా అనుసంధానం చేయవలసి ఉంటుందో కూడా తెలియజేయాలన్న విచక్షణ బ్యాంకుల నిర్వాహకులకు కలగలేదు. ‘సెల్‌ఫోన్’ల నిర్వాహకులు కూడా ఇదే గందరగోళాన్ని సృష్టించారు! చివరికి, ఈ ‘సందేశాల’లో తుది గడువును కూడ నిర్దేశించాలని సర్వోన్నత న్యాయస్థానం నవంబర్ పదవ తేదీన ఆదేశించవలసి వచ్చింది!!
ఇలా న్యాయాదేశాలు జారీ అయ్యేవరకు పాలనా వ్యవస్థలు, ప్రభుత్వ, ప్రభుత్వేతర వాణిజ్య వ్యవస్థలు ఏ కార్యక్రమం కూడ నిర్దిష్టంగా, నిర్దుష్టంగా చేయకపోవడం, చేయాలన్న విచక్షణ ఈ వ్యవస్థ నిర్వాహకులకు కలుగకపోవడం ‘న్యాయ క్రియాశీలత’ - జ్యుడిషియల్ యాక్టివిజం - విస్తరించడానికి ప్రధాన కారణం. ప్రభుత్వాలు, వివిధ ప్రభుత్వ రంగ వ్యవస్థలు కార్యక్రమాల నిర్వహణపట్ల చిత్తశుద్ధితో దృష్టిపెట్టాలి, విధి నిర్వహణపట్ల నిష్ఠ కలిగి ఉండాలి! తొంబయి శాతం ఉద్యోగులకు అధికారులకు నిర్వాహకులకు ఈ చిత్తశుద్ధి లేదు, ఈ కర్తవ్యనిష్ఠ లేదు! విధులను నిర్వహించవలసిన సమయంలో ‘సెల్‌ఫోన్స్’లలో మాట్లాడే కొందరు, ముచ్చట్లు చెప్పుకుంటూ మరి కొందరు కాలక్షేపం చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలోని అతిపెద్ద బ్యాంకుల శాఖా కార్యాలయాలలో ఈ దృశ్యాలు మరింతగా ఆవిష్కృతవౌతున్నాయి! ‘ఆధార్’ అనుసంధానంలో ఖాతాదారులు, వినియోగదారులు గురి అవుతున్న గందరగోళానికి ఇదీ కారణం! అందువల్ల ‘గడువు’ను నిర్దేశించాలని సుప్రీంకోర్టు చెప్పవలసి వచ్చింది. ప్రభుత్వం ముందుగానే బ్యాంకులకు ‘సెల్‌ఫోన్’ సంస్థలకు ఈ స్పష్టీకరణ ఇచ్చి ఉంటే సర్వోన్నత న్యాయస్థానం జోక్యం కల్పించుకోవలసిన అవసరం లేదు. ఇలా ‘న్యాయక్రియాశీలత’ విస్తరించడానికి దోహదం చేస్తున్న ప్రభుత్వాలు ‘న్యాయక్రియాశీలత’ను ‘న్యాయ స్థానాల చొరబాటు’ - జ్యుడిషియల్ ఓవర్ రీచ్ - గా చిత్రీకరించి గగ్గోలు పెట్టడం మరో వైపరీత్యం!
‘ఆధార్’ గుర్తింపు పత్రాలను ప్రదానం చేసే కార్యక్రమం మొదలయినప్పటి నుంచి కూడ సమాంతరంగా వ్యతిరేక ఉద్యమం మొదలైంది. ఎందుకన్నది సామాన్యులకు అంతుపట్టడం లేదు. అత్యధిక శాతం ప్రజలు ఇదివరకే ‘ఆధార్’ పత్రాలను పొంది ఉన్నారు. మిగిలిన అత్యల్ప సంఖ్యాకులు కూడ స్వచ్చందంగా ఈ పత్రాలను పొందడానికి యత్నిస్తున్నారు. అందువల్ల ‘ఆధార్’ పట్ల వ్యతిరేకత ఎందుకన్నది స్పష్టం కావడం లేదు! వోటర్ గుర్తింపు పత్రాలను జారీ చేసినప్పుడు ఈ ప్రక్రియను ఎవ్వరూ వ్యతిరేకించ లేదు. సకాలంలో గుర్తింపు పత్రాలను పొందలేని వారికి కూడా వోటు వేసే అవకాశం కల్పించాలని మాత్రమే ఉద్యమాలు ఆందోళనలు జరిగాయి. ‘జనగణన’ సమయంలో ప్రతి కుటుంబం నుంచి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. దీనివల్ల ఎవ్వరి ‘ఏకాంత స్వేచ్ఛ’ - ప్రయివసీ - కూ ఎలాంటి భంగం రాలేదు. కానీ ‘యూనిక్ ఐడెంటిటి కార్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా’ - ఉదయ్ - సంస్థ ‘ఆధార్ పత్రాల’ను జారీ చేయడం మొదలుకాగానే వ్యతిరేకత మొదలైంది. ‘జనగణన’ సమయంలో సేకరించినన్ని వ్యక్తిగత వివరాలు ఆధార్ ప్రక్రియ ద్వారా సేకరించడం లేదు. అయినప్పటికీ ‘ఆధార్’ వల్ల ‘ఏకాంత స్వేచ్ఛ’కు విఘాతం వాటిల్లుతుందన్న గగ్గోలు మొదలైంది! ‘ఏకాంత స్వేచ్ఛ హక్కు’ రాజ్యాంగం ప్రసాదించిన వౌలిక అధికారమా కాదా అన్న మీమాంస మొదలైంది. ‘ఏకాంత స్వేచ్ఛ’ రాజ్యాంగ వౌలికమైన స్వేచ్ఛగా జీవించే హక్కులో భాగమని సుప్రీంకోర్టు గత ఆగస్టులో తీర్పునిచ్చింది! అందువల్ల ‘ఏకాంత స్వేచ్ఛ’కు ఆధార్ వల్ల భంగం కలుగుతుందా! అన్నది మాత్రమే సుప్రీంకోర్టు స్పష్టం చేయవలసి ఉంది!
ఈలోగా ‘ఆధార్’తో అనుసంధానం ప్రక్రియలో ఏర్పడిన గందరగోళం తొలిగే అవకాశం లేదు! ఎందుకంటే ఒక ‘ఖాతా’ ఆధార్‌తో అనుసంధానం అయిందా? లేదా? అన్న విషయాన్ని బ్యాంకులవారు ఖాతాదారునికి వ్రాతపూర్వకంగా తెలుపడం లేదు! గంటల తరబడి ‘కౌంటర్ల’ వద్ద నిలబడి ‘ఆధార్’ పత్రాన్ని ‘పాన్’ కార్డును సమర్పించిన ఖాతాదారులకు ‘‘అనుసంధానం అయింది’’ అన్న వౌఖిక సమాధానం మాత్రమే లభిస్తోంది! పది రోజుల తరువాత అదే ‘బ్యాంకు బ్రాంచి’లోని మరో కౌంటర్ వద్ద నిలబడిన అదే ఖాతాదారుడుకు ‘మీ ఖాతా ఆధార్‌తో అనుసంధానం కాలేదు’ అని చెబుతున్నారు. ‘అదేమిటి పది రోజుల క్రితమే అనుసంధానం పూర్తయిందని చెప్పారుకదా.. అన్న ప్రశ్నకు సమాధానం లేదు. అందువల్ల అనుసంధానం గురించి వ్రాతపూర్వకంగా ఖాతాదారునికి తెలియజేయాలని ప్రభుత్వం ఇప్పుడైన బ్యాంకులను ఆదేశించాలి!