సంపాదకీయం

‘పద్మావత్’ బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా తెలివిగా ప్రభుత్వాలను ప్రజలను బోల్తా కొట్టించగలిగామని సంబరపడిపోతున్న ‘పద్మావత్’ - ‘పద్మావతి’ - హిందీ చిత్ర నిర్మాతలకు రాజస్థాన్ ప్రభుత్వం నిర్ణయం బహుశా ఊహించని ఎదురుదెబ్బ! జనవరి 25వ తేదీన తమచిత్రం విడుదల కాగలదని చిత్రాన్ని నిర్మించిన బౌద్ధిక బీభత్సకారులు - ఇంటలెక్చువల్ టెర్రరిస్ట్‌లు - ఆర్భాటంగా చేస్తున్న ప్రకటనలు వారి అత్యాశకు నిదర్శనం. తమ రాష్ట్రంలో ‘పద్మావత్’ను విడుదల చేయడానికి, ప్రదర్శించడానికి అనుమతించబోమని రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే స్పష్టం చేయడం జనాభీష్టానికి అనుగుణం! ‘‘రాణి పద్మావతి చేసిన త్యాగం జాతీయ మర్యాదకు సంబంధించిన వ్యవహారం. పద్మినీదేవి జీవితం కేవలం చరిత్రలో ఒక అధ్యాయం కాదు, జీవన గరిమకు సంబంధించిన శాశ్వత వాస్తవం. ఆమె సౌశీల్యాన్ని కించపరిచే చిత్రీకరణలను అనుమతించబోము...’’ అని రాజస్థాన్ ముఖ్యమంత్రి తమ ప్రకటనలో స్పష్టం చేయడం అభినందనీయం, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాలకు అనుసరణీయం! రాణీ రుద్రమదేవివలె, ఝాన్సీ రాణి లక్ష్మీబాయివలె మేవాడ్ మహారాణి పద్మావతి కూడ భారతీయులందరికీ గర్వకారణమైన ఆదర్శనారి, వీరవనిత! ఆమెకు ‘కళంకాన్ని’, ‘అపవాదుల’ను అంటగట్టడానికి యత్నించిన ‘సంజయ్‌లీలా బన్సాలీ’ ముఠావారు చరిత్రకు ద్రోహం చేశారు. జాతికి ద్రోహం చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ యోగి వ్యాఖ్యానించినట్టు ‘‘్భతికంగా హత్యలు చేస్తున్నవారిని, హత్యాయత్నం చేస్తున్నవారిని శిక్షించడానికి చట్టాలు ఉన్నాయి, కానీ సంస్కృతిని సంస్కారాలను హత్య చేస్తున్నవారిని, హత్యాయత్నం చేస్తున్నవారిని శిక్షించగల చట్టాలు లేవు!..’’. అందువల్లనే సంజయ్‌లీలా బన్సాలీ వంటి చలనచిత్ర దర్శకులు నిర్మాతలు శిక్షలు తప్పించుకోగలుగుతున్నారు. అల్లాఉద్దీన్ ఖిల్జీ అనే జిహాదీ బీభత్సకారుడు మేవాడ్ మహారాణి పద్మినీదేవిని అపహరించడానికి చేసిన ప్రయత్నం చారిత్రక వాస్తవం! రావణుణ్ని అసహ్యించుకున్న సీతమ్మవలె, సైంధవుణ్ని, కీచకుణ్ని నిరసించిన పాండవపత్నివలె మహారాణి పద్మినీదేవి - పద్మావతి - అల్లాఉద్దీన్ ఖిల్జీని తృణీకరించడం చరిత్ర.. కానీ ‘బన్సాలీ’ నిర్మించిన ‘పద్మావతి’ చిత్రంలో ఈ మేవాడ్ మహారాణి అల్లాఉద్దీన్ ఖల్జీని చూసి కొంతసేపు ‘‘శృంగార భావోద్వేగానికి’’ గురి అయినట్టు చిత్రీకరించారన్నది జరిగిన ప్రచారం! ఈ ప్రచారాన్ని చిత్ర నిర్మాతలు దర్శకుడు ఖండించలేదు, నిరాకరించలేదు... అందువల్ల అనుమానాలు బలపడినాయి!
ఈ వివాదం కారణంగానే డిసెంబర్‌లో విడుదల కావలసి ఉండిన ‘సినిమా’ ఆగిపోయింది! వివాదం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదితమైంది! ‘పద్మావతి’ అన్న పేరును ‘పద్మావత్’గా మార్చినట్టయితే ఐదు చిన్న సవరణలును చేసినట్టయితే ‘సినిమా’ను విడుదల చేసుకోవచ్చునని డిసెంబర్ ముప్పయ్యవ తేదీన ‘కేంద్రీయ చలనచిత్ర అనుమతి ప్రదాన మండలి’ - సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్ట్ఫికెట్’ - సిబిఎఫ్‌సి - వారు నిర్దేశించడం విచిత్రమైన పరిణామం. ఈ ‘చిత్రం చారిత్రకం కాదని చరిత్ర ఆధారంగా నిర్మించలేదని, కేవలం కల్పితమని చిత్రం ఆరంభంలో ‘స్పష్టీకరణ’ - డిస్‌క్లెయిమర్-ను చొప్పించడం మరో విస్మయకరమైన వ్యవహారం! ‘‘ఇది చరిత్ర కాదు..’’ అని అనుకున్నప్పుడు నిర్మాతలు-వయాకమ్ సంస్థవారు -, దర్శకుడు బన్సాలీ ఆ సంగతిని నిర్మాణం మొదలయినప్పుడు ప్రచారం చేసి ఉండాలి! కానీ ఇది గొప్ప చారిత్రక చిత్రమన్న ప్రచారం జరిగిపోయింది. అనుమతికోసం ‘కేంద్రీయ చిత్ర మండలి’కి పెట్టుకొన్న దరఖాస్తులో ‘‘ఇది చరిత్ర కథనమా? కల్పితమా? సాంఘికమా?’’ అన్న ప్రశ్నలకు సమాధానం వ్రాయకుండా నిర్మాతలు ‘ఖాళీ’గా వదలిపెట్టారు. ఈ విషయమై ‘సిబిఎఫ్‌సి’ బహిరంగంగా నిర్మాతలను, దర్శకుణ్ని అభిశంసించింది. చిత్రాన్ని ఆమోదించకుండా తిప్పి పంపింది! కానీ ‘సిబిఎఫ్‌సి అనుమతి పత్రం’ - సర్ట్ఫికెట్ - రాకపూర్వమే నిర్మాతలు మాధ్యమాల నుండి ఎంపిక చేసుకున్నవారికి, తమకు ఇష్టులైనవారికి సినిమాను ప్రదర్శించి చూపారు. ఇలా చూపడం చట్ట వ్యతిరేకమని ‘సిబిఎఫ్‌సి’ ప్రసూన్ జోషి వ్యాఖ్యానించాడు! కానీ ఈ చిత్రాన్ని వ్యతిరేకిస్తున్న ‘రాజపుత్ర కరణీ సేన’ ప్రతినిధులకు మాత్రం నిర్మాతలు చూపించలేదు. సేన ప్రతినిధులకు చూపించగలమని మాట ఇచ్చిన నిర్మాతలు మాట తప్పారు!
ఇలా మొత్తం వ్యవహారానికి నిర్మాతలు అనుమానాస్పద రీతిలో నిర్వహించడానికి కారణం దుర్బుద్ధిపూర్వకమైన చారిత్రక వక్రీకరణం.. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్దిలో మన దేశంలోకి చొరబడి బీభత్సం సృష్టించిన జిహాదీల పరంపరలోనివాడు అల్లాఉద్దీన్ ఖిల్జీ. పదునాలగవ శతాబ్ది ఆరంభంనాటి ఈ జిహాదీ ముష్కరుడు ‘పరిపాలన’ పేరుతో అనాదిగా స్వజాతీయులైన హిందువులను బీభత్సకాండకు బలిచేయడం చరిత్ర! వంచించడం, దొంగచాటుగా దాడి చేయడం, హత్యలు చేయడం, మతం మార్చడం, మహిళలను అపహరించడం, లైంగిక అత్యాచారాలకు గురి చేయడం వంటి దుశ్చర్యలకు జిహాదీలు ఒడిగట్టడం శతాబ్దుల చరిత్ర! కాకతీయ సామ్రాజ్యంపై దురాక్రమించి ఆరుసార్లు ఓడిపోయిన అల్లాఉద్దీన్ ఖిల్జీ ముఠావారు ఏడవసారి వంచనతో ప్రతాపరుద్రదేవుని ఓడించడం చరిత్ర! అప్పటినుంచి, క్రీస్తుశకం 1323 నుంచి 1948 వరకు తెలంగాణ ప్రాంతం జిహాదీ బీభత్సకాండకు బలికావడం కూడ చరిత్ర! వరంగల్లు కోటను వంచనతో ధ్వంసం చేసినట్టుగానే రాజస్థాన్‌లోని మేవాడ్ రాజధాని ‘చిత్తూరు’ - చిత్తోడ్ - కోటను కూడ వంచన పద్ధతుల ద్వారా అల్లాఉద్దీన్ ఖిల్జీ పట్టుకున్నాడు. చిత్తోడ్ రాజు భీమసేన్ రతన్‌సింగ్ - భీమ్‌సింగ్ - భార్య మహారాణి పద్మావతి వందలాది ఇతర మహిళలు అల్లాఉద్దీన్ ఖిల్జీ సైనికులకు దొరకలేదు. జిహాదీలనుంచి రక్షించుకొనడానికై వారందరూ అగ్నిజ్వాలలో దూకి ‘జోహార్’ చేశారు!!
ఇది చరిత్ర! ఈ చరిత్రను జాయసీ మహమ్మద్ మల్లిక్ అన్న సూఫీ కవి ‘పద్మావత్’ అన్న పేరుతో కావ్యంగా వ్రాశాడు! అందువల్ల ‘పద్మావత్’ అన్నప్పటికీ పద్మావతి అన్నప్పటికీ చరిత్ర మేవాడ్ మహారాణికి సంబంధించినదే! ఇప్పుడు ఈ చిత్రానికి చరిత్రతో సంబంధం లేదని చెప్పడం మరో ద్రోహం! చరిత్రను వక్రీకరించడం నేరం, చరిత్ర కాదని చెప్పడం మరింత ఘోరమైన నేరం! రామాయణం, మహాభారతం ఇతిహాసాలు.. వాస్తవ జీవన చరిత్రలు. ఈ చరిత్రను కాదని కల్పితమని అంటారా?? అనేవారు దేశద్రోహులు.. అలాగే మేవాడ్ చరిత్ర కూడా వాస్తవం! అందువల్ల ఈ చరిత్రను కళంకపరచిన ఈ బన్సాలీ చిత్రాన్ని దేశవ్యాప్తంగా నిషేధించాలి!