సంపాదకీయం

వెలుగుల విప్లవం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సృష్టిగత ‘ప్రస్థాన క్రమం’లో సంవత్సరానికోసారి సంభవించే పునరావృత్తి మకర సంక్రాంతి, వెలుగుల విక్రాంతి! కాంతి పథంలో నిరంతరం క్రాంతి సంభవిస్తోంది, భూమి నుండి దర్శించినప్పుడు సాపేక్షం - రిలెటివ్ - గా ఈ ‘ఖగోళ క్రాంతి’ నెలకోమారు మరింతగా ప్రస్ఫుటిస్తోంది. అందువల్ల, భూమి సూర్యుని చుట్టూ తిరగడం వల్ల, పనె్నండు నెలలలో పనె్నండు సంక్రాంతులు సంభవిస్తున్నాయి! మేష సంక్రాంతి నుంచి మీన సంక్రాంతి వరకు పనె్నండు సంక్రాంతులు ప్రతి సంవత్సరం సంభవిస్తున్నాయి! సృష్టిగత వాస్తవాలు సమాజస్థిత జీవనంగా సహజ వికాసాన్ని సంతరించుకొనడం అనాదిగా భారతజాతి చరిత్ర, ప్రపంచ చరిత్ర, విశ్వవ్యవస్థ.. సృష్టి, సమాజం వేఱువేఱుకాదు. సృష్టిలో సమాజం అవిభాజ్యం అంతర్‌భాగం! ఈ వాస్తవ ధ్యాస ఉన్న భారతజాతి లేదా హైందవజాతి పనె్నండు సంక్రాంతులను గుర్తించగలిగింది! మకర సంక్రాంతి నుంచి కర్కాటక సంక్రాంతి వరకు ఆరునెలల పాటు భూమి మీద ఉత్తరార్ధ గోళంలో పగటి నిడివి పెరుగుతుంది. రాత్రి నిడివి తగ్గుతుంది! దక్షిణార్ధ గోళంలో దీనికి వ్యతిరేకంగా పగటి నిడివి తగ్గి, రాత్రి నిడివి పెరుగుతుంది! కర్కాటక సంక్రాంతి నుంచి మకర సంక్రాంతి వరకు ఆరునెలల పాటు ఉత్తరార్ధ గోళంలో పగటికాల వ్యవధి క్రమంగా తగ్గింది. రాత్రి వ్యవధి పెరిగింది, గత ఆరు నెలలుగా మన దేశంలోవారికి ఉత్తరార్ధ గోళంలోని ఇతర దేశాల వారికి ఇది ప్రత్యక్ష అనుభవం. ఇదే ఆరునెలలలో దక్షిణార్ధ గోళంలో పగటి నిడివి పెరగడం, రాత్రి సమయం తగ్గడం కూడ ప్రత్యక్ష అనుభవం! మకర సంక్రాంతితో ఉత్తరార్ధ గోళంలో మళ్లీ పగటి నిడివి పెరగడం ఆరునెలలు కొనసాగుతుంది. పగలు వెలుగునకు ప్రతీక, వెలుగు ప్రగతి, వెలుగు సుగతి... రాత్రి చీకటికి ప్రతీక! అందువల్ల వెలుగును కోరే, వెలుగును పూజించే, వెలుగును పెంచే, వెలుగును పంచే భారతీయులు వెలుగు పెరగడానికి ఖగోళ మాధ్యమమైన ‘మకర సంక్రాంతి’ని ఉత్సవంగా జరుపుకుంటున్నారు. ఉత్తరార్ధ గోళంలో ఆరునెలల పాటు ‘వెలుగు’ పెరగడానికి శ్రీకారం మకర సంక్రాంతి.. అందువల్ల వెలుగును కాంక్షించే ఉత్తరార్ధ గోళంలోని ప్రజలందరూ మకర సంక్రాంతిని ‘వెలుగుల పండుగ’గా వేడుక చేసుకోవాలి! చేసుకుంటున్న భారతీయులు అనాదిగా ఈ సృష్టిగత సనాతన వాస్తవాన్ని గుర్తించినవారు! పనె్నండు సంక్రాంతులు మానవ లోకానికి సమన్వయం అవుతున్న, వర్తిస్తున్న ఖగోళ వృత్తంపై పనె్నండు శాశ్వత క్రాంతులు... ఏడాదికోసారి పునరావృత్తవౌతున్న కాలచక్రానికి ప్రతీకలు! క్రాంతి విప్లవం, క్రాంతి పరివర్తనం! మకర సంక్రాంతి మహాకాంతుల పరివర్తనం..
అంతరిక్షంలో అసంఖ్యాక నక్షత్రాలు - స్టార్స్ - నక్షత్ర సముదాయ బ్రహ్మాండాలు - గెలాక్సీలు - విస్తరించి ఉన్నాయి. ఇదంతా విశ్వవ్యవస్థ - కాస్మిక్ ఆర్డర్ - ఆద్యంత రహిత తత్త్వం! భూమితోను సౌరకుటుంబంతోను క్రమపద్ధతిలో అనుసంధానమై ఉన్న ఇరవై ఏడు ‘నక్షత్రాల’ను భారతీయులు అనాదిగా గుర్తించారు! ఈ నక్షత్రాలు భూమధ్య రేఖకు అటూఇటూ నిర్దిష్టమైన అంతరిక్ష కక్ష్యలలో విస్తరించి ఉన్నాయి. భూమి భ్రమణంవల్ల సాపేక్షంగా ఈ ఇరవై ఏడు నక్షత్రాలు దాదాపు యాబయి మూడు నిముషాల వ్యవధిలో ప్రతి రోజు ఉదయించి అస్తమిస్తున్నాయి. ఇవి ‘అశ్వని’ నుంచి ‘రేవతి’ వరకు ఉన్న నక్షత్రాలు! అంటే అశ్వని నక్షత్రం ఉదయించిన తరువాత దాదాపు యాబయి మూడు నిమిషాలకు భరణి నక్షత్రం ఉదయిస్తోంది. ఇలాగే రేవతి వరకు అన్ని నక్షత్రాలు... భూమి పరిభ్రమణంవల్ల ‘సాపేక్షం’గా సూర్యుడు ప్రతి నక్షత్రంతో కలసి పదమూడు లేదా పదునాలుగు రోజులపాటు ఉదయించినట్టు దృశ్యమానం అవుతోంది. ఇలా సూర్యుడు ఇరవై ఏడు నక్షత్రాలతోను కలసి ఉదయించడం పూర్తయ్యేసరికి ఒక ‘సౌరమాన’ సంవత్సరం పూర్తవుతోంది! ఇవే ఇరవై ఏడు కార్తెలు! అశ్వని నక్షత్రంతో కలసి సూర్యుడు ఉదయించడం ఆరంభమైతే అది అశ్వని కార్తె ఆరంభం. మృగశిర నక్షత్రంతో కలసి సూర్యుడు ఉదయించినప్పుడు ‘మృగశిర’ కార్తె! ఈ ‘కార్తె’లు గురించి వ్యవసాయదారులకు బాగా తెలుసు!
సౌలభ్యం కోసం ఇరవై ఏడు నక్షత్రాలను పనె్నండు ‘రాసు’లుగా వ్యవస్థీకరించడం కూడ ఖగోళ వాస్తవానికి అనుగుణం! అందువల్ల రెండు నక్షత్రాలు మరో పాతిక నక్షత్రం కలసి ఒక ‘రాసి’ ఏర్పడింది. ఇరవై ఏడు ‘నాలుగు’లు నూట ఎనిమిది. పనె్నండు ‘తొమ్మిదులు’ నూట ఎనిమిది! ఇదీ ఖగోళ వ్యవస్థ. ఇలా పనె్నండు ‘రాసు’లు భూమధ్య రేఖకు అటూఇటూ సగంసగం విస్తరించి ఉన్నాయి. దక్షిణ భాగంలో చివరిది మకర రాసి, అదే ‘మకర’ రేఖ - ‘కాప్‌క్రార్న్ -! ఉత్తరభాగంలో చివరిది ‘కర్కట’ రాసి, ఇదే కర్కాటక రేఖ - కాన్సర్ -! నక్షత్రాలు ‘రాసు’లుగా ఏర్పడినందున ప్రతి ‘రాసి’ భూమిపై - రిలెటివ్‌గా - ప్రతిరోజు ఉదయించి అస్తమిస్తోంది! అందువల్ల సూర్యుడు ఒక రాసితో కలిసి నెలరోజులపాటు ఉదయిస్తున్నట్లు భూమి మీద దృశ్యమానం అవుతోంది. అంటే ఆ ‘రాసి’ ఉదయిస్తున్న సమయంలోనే సూర్యుడు ఉదయిస్తున్నాడు. అలా ఉదయించడం ఆరంభమయ్యే రోజు ‘సంక్రాంతి’.. మేషరాసితో కలిసి సూర్యుడు ఉదయించడం ఆరంభం కాగానే ‘మేష’ సంక్రాంతి ఏర్పడుతోంది. ‘సౌరమానం’ పాటించే తమిళనాడు వంటి చోట్ల మేష సంక్రాంతి నూతన సంవత్సరాది! నెల తరువాత ‘సాపేక్షం’గా ‘రాసి’ ముందుకెళ్లిపోతోంది, రెండవ రాసి ‘వృషభం’ వచ్చి సూర్యునితో కలిసి ఉదయించడం మొదలవుతోంది. ఇలా ప్రతి సంక్రాంతి నాడు ‘రాసి’ ముందుకెళ్లి మరొక రాసి వచ్చి సూర్యునితో కలుస్తోంది... ఉదయంలో! ఇదంతా సంవత్సరానికోసారి పునరావృత్తి! ఇలా మకర ‘రాసి’తో కలిసి సూర్యుడు ఉదయించడం ఆరంభమైన సమయం మకర ‘సంక్రమణం’! దూరంగా మకర రేఖపై ఉదయించిన సూర్యుడు మకర, కుంభ, మీన, మేష, వృషభ, మిథున రాసులతో కలిసి ఉదయిస్తూ ఆరునెలలపాటు ఉత్తరంగా ‘జరగడం’ వల్ల ఈ ఉత్తరాయణంలో ఉత్తరార్ధ గోళంలో వెలుగు పెరుగుతుంది. ఉత్తరార్ధ గోళంలో చివరన - మన మధ్యప్రదేశ్ గగనంలో - ఉన్న ‘కర్కట’ రాసిని సూర్యుడు చేరే వరకు వెలుగు విస్తరిస్తూనే ఉంటుంది. పగటి నిడివి పెరుగుతూనే ఉంటుంది!
ఇలా మకర సంక్రాంతి మానవులు కల్పించుకున్న ‘కృత్రిమ’ ఉత్సవం కాదు, సర్వమత సర్వభాషా సర్వ దేశస్థులకు ఉత్తరార్ధ గోళంలో ప్రస్ఫుటిస్తున్న సనాతన క్రాంతి దృశ్యం... కాంతిని పెంచే విప్లవం! చీకటి తగ్గిపోనున్నది. సమస్యలు చీకటులు... పరిష్కారాలు వెలుగులు, వైరుధ్యాలు చీకటులు.. సమన్వయం వెలుగుల వలయం! ఆర్థిక, రాజకీయ, న్యాయపాలన, సామాజిక పరిధులలో చొరబడిపోతున్న చీకటులను తొలగించడానికి వెలుగులు నడుం బిగించడం మకర సంక్రాంతి, భౌతిక, బౌద్ధిక, ధార్మిక, ఆధ్యాత్మిక, సాంస్కృతిక క్షేత్రాలను ఆవహించి ఉన్న వైరుధ్యం గ్రహణ విముక్తి మధుర విక్రాంతి! గ్రహాలు, నక్షత్రాలు, ‘రాసులు’, బ్రహ్మాండాల మధ్య వైవిధ్య స్వరూపాల మధ్య, వైరుధ్యంలేని సమన్వయం నెలకొని ఉండడం సృష్టి ప్రస్థానక్రమం, వైవిధ్య స్వరూపాల మధ్య అద్వితీయ స్వభావం ఇది. భారత జాతీయ జీవనం అనాదిగా ఈ సృష్టి ప్రస్థాన క్రమానికి అద్దం.. మకర సంక్రాంతి ఈ అద్దంలో భాసిస్తున్న శుభంకర దృశ్యం!