సంపాదకీయం

రౌహానీ స్నేహయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాబహార్ ఓడరేవు అఫ్ఘానిస్థాన్‌కూ, మధ్య ఆసియా దేశాలకు సువర్ణ సింహద్వారమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించడం ఇరాన్‌తో మన స్నేహసంబంధ ప్రాధాన్య విస్తృతికి నిదర్శనం. ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ మనదేశంలో జరిపిన పర్యటన సందర్భంగా ఈ ప్రాధాన్య విస్తృతి మరింతగా ప్రస్ఫుటించింది. రౌహనీ పర్యటన సందర్భంగా ఇరాన్‌కూ, మనదేశానికీ మధ్య తొమ్మిది కొత్త ఒప్పందాలు కుదిరాయి. ‘చాబహార్’ ఓడరేవు హాసన్ రౌహానీ పర్యటన సందర్భంగా ఢిల్లీలో ఉభయ ప్రభుత్వాల మధ్య జరిగిన చర్చలకు ప్రధాన ఇతివృత్తం! చాబహార్- చాహ్ బహార్- ఓడరేవుఇరాన్ ఆగ్నేయ ప్రాంతానికి చివరన ‘ఒమాన్ సింధు శాఖ’ తీరంలో నెలకొని వుంది. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ నైరుతి ప్రాంతంలో నెలకొని ఉన్న ‘గ్వాడార్’ ఓడరేవుకు అత్యంత సమీపంలో ‘చాబహార్’ నెలకొని ఉండటం వ్యూహాత్మక, వాణిజ్య ప్రాధాన్యం కలిగిన భౌగోళిక వాస్తవం! పాకిస్తాన్‌లోని గ్వాడార్ ఓడరేవులో చైనా నౌకాదళం రక్షణ బలగాలు తిష్ఠవేసి ఉండటం మన పడమటి సముద్ర తీరం భద్రతకు ప్రమాదకరంగా పరిణమించిన విపరిణామం! చాబహార్‌ను అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని ఇరాన్ ప్రభుత్వం మనకు అప్పగించడం అందువల్ల చైనా దురాక్రమణ వ్యూహానికి పటిష్టమైన ప్రతిఘటన! ఇది మనకు లభించిన వ్యూహాత్మక విజయం! ‘చాబహార్’ ఆధునీకరణకు, అభివృద్ధికి సంబంధించిన ఒప్పందాన్ని ఇరాన్ ప్రభుత్వం గతంలోనే మనదేశంతో కుదుర్చుకుంది. ఈ ప్రకల్పానికి సంబంధించిన తొలిదశ నిర్మాణాలు పూర్తయ్యాయి కూడా! చాబహార్‌లోని కొంత ప్రాంతాన్ని మనదేశానికి వాణిజ్య కలాపాల కోసం అప్పగించడానికి ఇరాన్ అంగీకరించడం రౌహానీ పర్యటన సందర్భంగా కుదిరిన కొత్త ఒప్పందం..
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2016 మే నెలలో ఇరాన్‌ను సందర్శించిన సందర్భంగా ‘చాబహార్’ ఒప్పందం కుదిరింది. చాబహార్ వాణిజ్య మండలంలో దాదాపు లక్షా నలబయి మూడువేల కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టడానికి ఆ ఒప్పందం వీలు కల్పించింది. ఇలా ఒప్పందం కుదరడం మన ఇరుగు పొరుగు ప్రాంతంలోను, పశ్చిమ ఆసియా ప్రాంతంలోను వ్యూహాత్మక ప్రాధాన్యం సంతరించుకున్న చారిత్రక పరిణామం! పాకిస్తాన్‌లోని ‘గ్వాడార్’లో తిష్ఠవేసిన చైనా ఇరాన్‌లోని చాబహార్‌కు విస్తరించకుండా నిరోధించిన పరిణామం. దశాబ్దుల పాటు ఇరాన్ పాకిస్తాన్‌తో అతి సన్నిహితంగా మెలిగింది. 1970వ దశకంలో రేఝా షా మహమ్మద్ పహ్లవీ ప్రభుత్వాన్ని ఇస్లాం మతోన్మాదులు కూలదోసినప్పటి నుంచి ఈ సాన్నిహిత్యం మరింత పెరిగింది. రూహూల్లా అయేతుల్లా ఖొమైనీ నాయకత్వంలో ఇరాన్‌లో 1989 వరకు మతోన్మాద రాజ్యంగ వ్యవస్థ కొనసాగింది. 1990వ దశకంలో ఎన్నికల ద్వారా ప్రభుత్వాన్ని ఎన్నుకొనే ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడినప్పటికీ మతోన్మాద శక్తుల ప్రాబల్యం క్షీణించలేదు. 2005లో అధ్యక్షుడిగా ఎన్నికయిన మహ్మద్ అహ్మద్ నౌజాద్ మతోన్మాద ప్రణాళికను అమలు జరపడం చరిత్ర. ఇతని పరిపాలన కాలంలోనే ఇరాన్ అణ్వస్త్ర పాటవ పరీక్షలు జరిపిందన్న ప్రచారం జరిగింది. అణ్వస్త్ర నిర్మాణ పరిజ్ఞానం చైనా నుంచి పాకిస్థాన్‌కు, పాకిస్థాన్ నుంచి ఇరాన్‌కు చేరిపోయింది. అందువల్ల సహజంగానే ‘ఇరాన్-పాకిస్తాన్-చైనా’ బంధం బలపడింది. ఈ ‘అణ్వస్త్ర’ నిర్మాణ కార్యక్రమాన్ని రద్దు చేయాలన్న ఐక్యరాజ్య సమితి తీర్మానాలను ఇరాన్ పట్టించుకోలేదు. ఫలితంగా అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై దౌత్య, ఆయుధ, వాణిజ్య ఆంక్షలను విధించింది! ఇరాన్, అమెరికాల మధ్య వైరం 1979 నుంచి కొనసాగింది. 1979లో ఇరాన్ రాజధాని టెహరాన్‌లో అమెరికా రాయబార కార్యాలయంపై ఇరాన్ ప్రభుత్వం దాడిచేసి అనేక నెలల పాటు అక్కడి సిబ్బందిని బందీలుగా ఉంచింది. అంతర్జాతీయ దౌత్య నియమాలను ఇలా ప్రభుత్వమే ఉల్లంఘించడం ‘బీభత్స రాజ్యాంగ వ్యవస్థ’- టెర్రరిస్ట్ రిజీమ్ స్వభావం! 1990వ దశకంలో మతోన్మాదులపై మత సమన్వయ వాదులు ‘విజయం’ సాధించినప్పటికీ మహ్మద్ అహ్మదీ నౌజాద్ ప్రభుత్వం వారంలో మళ్లీ మతోన్మాదం ప్రస్ఫుటించింది! మన దేశానికి ఇరాన్ నుంచి పాకిస్తాన్ గుండా ఇంధన వాయువును సరఫరా చేయడానికి కుదిరిన ఒప్పందం అహ్మద్ నౌజాద్ పాలనలో కూలబడిపోవడం చరిత్ర! ఈ ‘ఇరాన్- పాకిస్తాన్- ఇండియా’ ఐపిఐ ఇంధన వాయు పథకం ‘ఇరాన్-పాకిస్తాన్’ పథకంగా కుదింపునకు గురి అయింది. అహ్మద్ నౌజాద్ నాయకత్వంలోని ఇరాన్ ప్రభుత్వం మాట తప్పింది!
ఇరాన్ నుంచి మనదేశం వరకు నిర్మాణం కావలసి ఉండిన ఈ ఇంధన వాయువును సరఫరా చేసే ‘గొట్టపు మార్గం’ - పైప్‌లైన్- పాకిస్తాన్‌లోనే ఆగిపోయింది. చైనా ప్రభుత్వం రంగ ప్రవేశం చేయడం ఇందుకు ఉదాహరణ! అందువల్ల ‘గ్వాడార్’లో తిష్ఠవేసిన చైనా ప్రభుత్వం ‘చాబహార్’పై కూడా కనే్నసింది! కానీ 2013లో హసన్ రౌహానీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం ఇరాన్‌లో మతోన్మాదులపై మత సమన్వయ వాదులు సాధించిన విజయం. రౌహనీ ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండను నిరసిస్తోంది! ఈ జిహాదీ వ్యతిరేక విధానం కారణంగానే ఇరాన్‌తో మన మైత్రి మళ్లీ బలపడింది. పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న జిహాదీ బీభత్సకాండ తమ దేశానికి విస్తరించకుండా నిరోధించడానికి వీలుగా ఇరాన్ మనదేశంతో జట్టుకట్టింది! ‘చాబహార్’ ఓడరేవు అభివృద్ధి పథకాన్ని మన దేశానికి అప్పగించడానికి ఇదీ నేపథ్యం! గత ఏడాది మే నెలలో రౌహనీ తిరిగి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం మన దేశంతో ఇరాన్ మైత్రి కొనసాగడానికి దోహదకరమైంది. గత డిసెంబర్‌లో చాబహార్ ఓడరేవు గుండా మన దేశానికీ అఫ్ఘానిస్తాన్ మధ్య, మన దేశానికీ, మధ్య ఆసియా దేశాలకు మధ్య ‘రవాణా’ సంబంధాలు, రాకపోకలు ప్రారంభం కావడం ‘పాకిస్తాన్-చైనా’ కూటమికి వ్యూహాత్మక ప్రతిఘటనకు మరో శ్రీకారం.
ఇలా మనకూ ఇరాన్‌కు మధ్య కొనసాగుతున్న ద్వైపాక్షిక స్నేహసంబంధాలలో అంతర్జాతీయ వైరుధ్యాలు నిహితమై ఉండడం నిరాకరింపజాలని వాస్తవం! ఇరాన్ ‘అణ్వస్త నిర్మాణ’ కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నట్టు 2011లో ‘అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ’ ఇంటర్నేషనల్ ఆటమిక్ ఎనర్జీ ఏజెన్సీ- ఐఎఇఎ- ధ్రువపరిచింది. ఫలితంగా అమెరికా ఇరాన్‌పై అనేక ఆంక్షలను ఎత్తివేసింది! అయినప్పటికీ ‘అమెరికా, ఇరాన్’ సంబంధాలు మెరుగుపడలేదు. అందువల్ల ఇరాన్‌తో మన స్నేహసంబంధాలు బలపడటం అమెరికాకు ఇష్టం లేదు! మనకు మరో మిత్రదేశమైన ఇజ్రాయిల్ పట్ల ఇరాన్ శత్రుత్వం బహిరంగ రహస్యం. ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడం తమ లక్ష్యమని అహ్మదీ నౌజాద్ అనేకసార్లు ప్రకటించాడు. కానీ రౌహానీ ప్రభుత్వం అంత తీవ్రమైన ప్రకటనలు చేయలేదు. సిరియాలోని ఇరాన్ యుద్ధ విమానాలు తమ దేశంలోని చొరబడినట్టు ఆదివారం ఇజ్రాయిల్ ఆరోపించింది. ఇరాన్‌లో మతసమన్వయ వాదులు నిరంతరం ఎన్నికలలో విజయం సాధించగలరా? అన్నది ద్వైపాక్షిక స్నేహంతో ముడిపడి ఉన్న మరో ప్రశ్న.