సంపాదకీయం

‘హోధా’ రాజకీయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుతూహలంతో కుతకుతలాడిపోయిన వారి గుండెలు బహుశా కుదుటపడి ఉంటాయి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మొదలైనప్పటి నుంచి ప్రారంభమైన ఈ ‘మహా ఉత్కంఠ’ దాదాపు నెల రోజులుగా ఈ కుతూహలగ్రస్తులకు నిద్దురను దూరం చేసి ఉంటుంది. ‘మృదంగ సందేహం నిస్సందేహం’ అన్నట్టుగా బుధ,గురువారాల్లో సంభవించిన విపరిణామాల వల్ల ప్రచార మాధ్యమాలలో, రాజకీయ పక్షాలలో సుడులు తిరిగిన ఉత్కంఠ శమించింది. దేని గురించి ఉత్కంఠ? ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక తరగతి రాష్ట్రం హోదా- స్పెషల్ కాటగిరీ స్టేటస్- లభిస్తుందా? లేదా? - అన్నది ఉత్కంఠకు ప్రాతిపదిక కాలేదు. ఎందుకంటే ఈ హోదాను కట్టబెట్టడం రాజ్యాంగ ప్రకారం వీలు కాదన్నది బహిరంగ రహస్యం. ఆర్థిక సంఘం నివేదిక ద్వారా, రద్దయిన ప్రణాళికా సంఘం నిర్ధారణ ద్వారా, ‘నీతి ఆయోగ్’ నివేదిక ద్వారా, కేంద్ర ప్రభుత్వం వారి ప్రకటనల ద్వారా రెండేళ్ల క్రితమే ఈ సంగతి తేటతెల్లమైపోయింది. 2014లో ఆర్భాటంగా, హడావుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంట్ ఆమోదింప చేసిన భారతీయ జనతా పార్టీ నిర్వాహకులు, కాంగ్రెస్ నాయకులు ‘తేళ్లు కుట్టిన దొంగల’ వలె వౌనం వహించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఈ కఠోర రాజ్యాంగ వాస్తవాన్ని అంగీకరించడం చరిత్ర. భాజపా శాసన సభ్యుడు ఆకుల సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ శాసనసభా సమావేశంలో ఈ వాస్తవాన్ని ‘తారీఖుల’ను ఉటంకించి సోదాహరణంగా ప్రస్తావించబోయినప్పుడు ముఖ్యమంత్రి అసహనం ప్రదర్శించి అడ్డుకోవడం నిన్న మొన్నటి చరిత్ర. రాజ్యాంగపరమైన అవగాహన లేకుండా ‘పప్పులు పెట్టి పోరు మాన్పిన’ పద్ధతిలో రాజకీయ మహదాకాంక్షలతో ‘హోదా’ను వాగ్దానం చేసిన వారు 2014లో ‘ఈ ఘనత మాదంటే మాది’ అని పోటీ పడ్డారు. రాజ్యాంగ వాస్తవాల నిర్ధారణ జరిగాక రెండేళ్లుగా ‘తప్పు మీదంటే మీది..’ అంటూ ఎవరికి వారు తప్పుకున్నారు, తప్పించుకుంటున్నారు. ప్రస్తుత రాజ్యాంగ నియమాల ప్రకారం అసాధ్యమైన ఈ ‘హోదా’ ఐదేళ్లపాటు ఉండాలా? లేక పదేళ్లపాటు కొనసాగించాలా? అన్న మీమాంస కూడా రెండేళ్ల క్రితమే సద్దుమణిగిపోయింది. ‘ఊరందరికీ తెలిసిన సంగతిని ఊలప్పగారు ఎవరి చెవిలోనూ ఊదనక్కరలేదు..’ మరి నెల రోజులకు పైగా ‘కుతూహలగ్రస్తుల’ను కుతకుతలాడించిన ‘ఉత్కంఠ’ దేని గురించి? భాజపాతో తెలుగుదేశం ‘తెగతెంపులు’ చేసుకుంటుందా? లేదా? అన్నది ఉత్కంఠకు అసలు ప్రాతిపదిక! తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చందశేఖరరావు జాతీయ స్థాయిలో ‘మూడవ రాజకీయ కూటమి’ని నడిపించడానికి నడుం బిగించిన తరువాత ఈ ఉత్కంఠ పతాక స్థాయికి చేరింది. ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే ‘కూటమి’లో చేరి ఒకే వేదికపై కూర్చుని ఒకే లక్ష్యంతో ప్రసంగించే భవిష్యత్ దృశ్యాలను సైతం కొంతమంది ప్రచార మాధ్యమ దార్శనికులు అపుడే ఆవిష్కరింపచేశారు. బుధ, గురువారాల్లో అమరావతిలోను, కొత్త ఢిల్లీలోను సంభవించిన విపరిణామాలు ఉత్కంఠ క్షుధార్తులకు గొప్ప సంతృప్తిని కలిగించి ఉంటాయి. భాజపా, తెదేపా పరస్పరం తెగతెంపులు చేసుకుంటున్నాయి..
తెదేపాకు చెందిన అశోక్‌గజపతిరాజు, సుజనా చౌదరి కేంద్ర మంత్రివర్గం నుంచి వైదొలగడం, భాజపా ప్రతినిధులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం నుంచి వైదొలగడం ఈ విపరిణామాలు. ఏపీ ప్రభుత్వం రానున్న ఆర్థిక సంవత్సరానికి ‘ఆదాయ వ్యయ ప్రణాళిక’- బడ్జెట్-ను శాసనసభకు సమర్పించిన రోజుననే ఈ విపరిణామాలకు ‘ముహూర్తం’ నిర్ణయం కావడం విచిత్రమైన వ్యవహారం. అందరి దృష్టి ‘రాజీనామా’లపై కేంద్రీకృతం కావటంతో ఏపీ ప్రభుత్వం సమర్పించిన సర్వ సామాజికవర్గ సంక్షేమ ‘బడ్జెట్’ ప్రచార ప్రాధాన్యం కోల్పోయింది. ప్రత్యేక హోదా లభించకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ఆదాయ వ్యయ పరిమాణం గత మూడేళ్లుగా పెరుగుతుండటం హర్షణీయ పరిణామం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కృషి అభినందనీయం. 2017-2018లో ‘బడ్జెట్’ పరిమాణం దాదాపు లక్షా యాభయి ఎనిమిది వేల కోట్ల రూపాయలు కాగా, కొత్త ఆర్థిక సంవత్సరం ‘బడ్జెట్’ దాదాపు లక్షా తొంబయి ఒక్క వేల కోట్లకు పెరిగింది. ద్రవ్యోల్బణాన్ని, ధరల పెరుగుదలను అధిగమించి బడ్జెట్ పరిమాణం పెరగడం వాస్తవ ప్రగతికి నిదర్శనం. ఏమైనప్పటికీ తాజా రాజకీయ కోలాహలం ‘బడ్జెట్’ ముచ్చట్లను దిగమింగి వేసింది..
రాజ్యాంగ నిబంధనలను గురించి కాక రాజకీయ సంబంధాలను గురించి చర్చించడానికి ‘ప్రత్యేక తరగతి హోదా’ ప్రాతిపదిక కావడం నిరాకరింపజాలని నిజం. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం చేసిన సుదీర్ఘ స్పష్టీకరణను గతంలో చంద్రబాబు కూడా చేసి ఉండడం చరిత్ర.. ‘ప్రత్యేక హోదా’ను ప్రసాదించక పోయినప్పటికీ ప్రత్యేక ఆర్థిక సహాయం- స్పెషల్ ప్యాకేజీ- ద్వారా కేంద్ర ప్రభుత్వం ఏపీని ఆదుకోనున్నదని జైట్లీ చెప్పిన మాట! ‘స్టేటస్’ లభించినట్టయితే సమకూర గల నిధులతో సమానమైన నిధులను ‘ప్యాకేజీ’ ద్వారా సమకూర్చగలమన్నది జైట్లీ అన్న మాట. ఇది కొత్త సంగతి కాదు. రెండేళ్లకు పైగా కేంద్ర ప్రభుత్వం చెబుతూనే ఉంది. అన్ని రాష్ట్రాలలోను అమలు జరుగుతున్న సమీకృత ప్రగతి, సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం అరవై శాతం నిధులను, రాష్ట్ర ప్రభుత్వాలు నలబయి శాతం నిధులను సమకూర్చుతుండటం సహకార సమాఖ్యలో ఇమిడి ఉన్న ఆర్థిక సూత్రం! ఈశాన్య ప్రాంతాలకు సమకూర్చుతున్న రీతిలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు జరిపే ఈ పథకాలకు కేంద్ర ప్రభుత్వం తొంబయి శాతం నిధులను సమకూర్చిందని, సమకూర్చునున్నదని జైట్లీ స్పష్టం చేసి ఉన్నాడు. ‘స్పెషల్ కాటగిరీ స్టేటస్’ పేరుతో లభించనున్న ముప్పయి శాతం అదనపు నిధులు ‘స్పెషల్ ప్యాకేజీ’ పేరుతో ఏపీకి లభించనున్నాయి. పేరు ఏదైనప్పటికీ లభించే ఆర్థిక సహాయంలో తేడా లేదు. ఇదే మాటను చంద్రబాబు కూడా చెప్పి ఉన్నాడన్నది భాజపా శాసనసభ్యులు చేస్తున్న వాదం! రాజకీయ ప్రదర్శనల వల్ల, ధర్నాల వల్ల, పరస్పరం నిందించుకోవడం వల్ల, మంత్రుల రాజీనామాల వల్ల రాజ్యాంగ వాస్తవాలు మారవు! ‘స్టేటస్’ పేరుతోనే ఆర్థిక సహాయం లభించాలన్న పట్టుదలతో ఉన్నవారు రాజ్యాంగాన్ని సవరింపచేయడానికి యత్నించాలి. లేదా ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం’లో పేర్కొన్న విధంగా ‘స్టేటస్’ను ప్రదానం చేయడానికి చర్యలు తీసుకోవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించవలసిందిగా కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో న్యాయ యాచికను దాఖలు చేయాలి.
ఈ రాజ్యాంగ ప్రత్యామ్నాయాలను కాక రాజకీయ ప్రత్యామ్నాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంచుకుంది. దశలవారీగా భాజపాతో తెగతెంపులు చేసుకోవాలన్నది తెలుగుదేశం పార్టీ వారి అభీష్టమన్న సందేహం అతార్కికం కాదు. ఈ ‘తెగతెంపుల’ వల్ల ‘భాజపా’ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కాని, తెలుగుదేశం నిర్వహిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాని కూలిపోయే ప్రమాదం లేదు. లేదన్నది చంద్రబాబు కూడ అంగీకరించిన వాస్తవం. కర్నాటకలో కొన్నాళ్లు హెచ్‌డి దేవగౌడ నాయకత్వంలోని ‘జనతాదళ్’తో జట్టుకట్టిన భాజపా ‘తెగతెంపుల’ తరువాతనే సొంతంగా అధికారంలోకి రాగలిగింది. మహారాష్టల్రో ‘శివసేన’తో తెగతెంపులు చేసుకొని, ఒంటరిగా పోటీ చేసినందువల్లనే భాజపాకు ముఖ్యమంత్రిత్వ పదవి దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఈ ‘తెగతెంపులు’ తమ పార్టీ ఎదుగుదలకు దోహదకరమన్నది భాజపాలోని అధికాధికుల అంతరంగమట..!