సంపాదకీయం

‘పటిమ’ చెడరాదు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేఘాలయలో ఇరవై ఏడేళ్లుగా అమలులో ఉన్న ‘సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టా’న్ని ఉపసంహరించుకొనడం ఈశాన్య ప్రాంతాలలో శాంతిభద్రతలు మెరుగుపడుతుండడానికి చిహ్నం కావచ్చు. జనంలో జాతీయతా నిష్ఠ పెరగడం ఇలా శాంతిభద్రతలు మెరుగుపడడానికి కారణం కావచ్చు! 2000వ సంవత్సరంతో పోల్చినప్పుడు ఈశాన్య ప్రాంతంలో విద్రోహ ఘటనలు, దేశ వ్యతిరేక బీభత్స ఘటనలు ప్రస్తుతం ఎనబయి ఐదు శాతం తగ్గిపోయాయన్నది ఆధికారిక ధ్రువీకరణ. అందువల్ల మేఘాలయలోను, అరుణాచల్‌లోని కొన్ని ప్రాంతాలలోను ఈ ‘సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టం’- ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్- ఎఎఫ్‌ఎస్‌పిఏ- ఆఫ్‌సా- అక్కరలేదన్నది కేంద్ర ప్రభుత్వ నిర్ధారణ! కల్లోలగ్రస్తమై ఉన్న ప్రాంతాలలో విద్రోహులను, బీభత్సకారులను అరికట్టడానికి వీలుగా సైనిక దళాలు సత్వర చర్యలు తీసుకోవడం అనివార్యం. సత్వర చర్యలను తీసుకొనడానికి వీలుగా సైనిక దళాలకు మామూలు పరిస్థితులలో కంటె ప్రత్యేకమైన అధికారాలు అవసరమన్నది ఆరు దశాబ్దుల అనుభవం. బ్రిటన్ దురాక్రమణ నుండి దేశం విముక్తమైన నాటి నుంచి నాగాలాండ్ వంటి ఈశాన్యప్రాంతాలలో దేశద్రోహులు తాండవించడం చరిత్ర. ఈశాన్య ప్రాంతాలలోని కొన్ని భూభాగాలను దేశం నుంచి విడగొట్టి ‘ప్రత్యేక దేశం’గా ఏర్పాటు చేయాలన్నది ఈ దేశద్రోహులైన మతోన్మాదుల లక్ష్యం! ఈ లక్ష్యసాధన కోసం బీభత్సకాండకు పూనుకున్న మతోన్మాదులు ఈశాన్య ప్రాంతాన్ని రక్తసిక్తం చేయడం చరిత్ర! మత ప్రాతిపదికపై 1947లో జరిగిన అఖండ భారత విభజన ఈశాన్యంలోని మతోన్మాద బీభత్స ముఠాలకు ప్రేరణ. అందువల్ల నాగాలాండ్‌లో దాదాపు ఆరు దశాబ్దులుగా ‘ఆఫ్‌సా’ అమలులో ఉంది. ఈ చట్టాన్ని ఎత్తివేయాలని దేశ విద్రోహ కల్లోలకాండ తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కూడ కొంతమంది ‘సైనిక వ్యతిరేకులు’, బృందాలు, సంస్థల వారు, రాజకీయ పక్షాల వారు కోరడం చరిత్ర. కాని ‘ఆఫ్‌సా’ను ఎత్తివేసినట్టయితే దేశ విద్రోహులతో, బీభత్సకారులతో పోరాటం జరుపుతున్న సైనికుల చేతులను కట్టేసినట్టు కాగలదన్నది దశాబ్దుల అనుభవం. ఇప్పుడు ఈశాన్యంలో ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయన్నది ఆధికారిక ధ్రువీకరణ. అందువల్ల మేఘాలయలోను, ‘అరుణాచల్’లోని కొన్ని ప్రాంతాలలోను ఈ చట్టం అమలును కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిందట!
ఈశాన్య ప్రాంతంలోని కొన్నిచోట్ల ‘ఆఫ్‌సా’ను తొలగించారు కాబట్టి తమ రాష్ట్రంలోనూ ఈ చట్టం అమలుకాకుండా నిలిపివేయాలని జమ్మూ కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న ‘పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ’- పిడిపి- కోరడం ఆశ్చర్యకరం కాదు. ‘పిడిపి’ ఏళ్లతరబడి ఈ చట్టాన్ని మాత్రమే కాదు, జమ్మూ కశ్మీర్‌లో సైనిక దళాల ఉనికిని సైతం వ్యతిరేకించింది. దేశ సమగ్రతను కోరేవారు, జాతీయ సమైక్య భావనిష్ఠులు సైనికుల ఉనికిని కాని, సైనికులకు ప్రత్యేక అధికారాలను కల్పించడాన్ని కాని వ్యతిరేకించడం లేదు. తమ సైనికులు విదేశాలకు వెళ్లి యుద్ధాలు చేసి ప్రాణాలు కోల్పోడాన్ని వివిధ దేశాలలోని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. తమ సైనికులు ఇతర దేశాల ప్రయోజనాల పరిరక్షణ కోసం బలికారాదన్నది ఆ వ్యతిరేకతకు ప్రాతిపదిక! స్వదేశంలోనే సైనికుల ఉనికిని వ్యతిరేకించడం బహుశా మన దేశానికి మాత్రమే పరిమితమైన కొందరి ప్రత్యేకత. మన సైనికులు విదేశాల దురాక్రమణ నుంచి మన సరిహద్దులను, విద్రోహుల నుంచి బీభత్సకారుల నుంచి మనలను- ప్రజలను- రక్షిస్తున్న జాతీయ వీరులు, భరతమాత వజ్రాల బిడ్డలు. ఒక కవి అన్నట్టు సైనికులు..
ఒకడు నిశాతటిని చీల్చి
దిశ చూపెడి దినకరుడు,
ఒకడు దేశ విద్రోహుల
మసిచేసెడి ‘నిటులాక్షుడు’...
ఒకడు దనుజ రీతి కూల్చి
ధర్మం నిలిపెడి ధీరుడు,
ఒక్కొక్కడు సరిహద్దుకు
ప్రాణం పోసెడి ‘అమరుడు’!
ఇలా సైనికులు జమ్మూ కశ్మీర్‌లో నెలకొని ఉండడంతో ఆ రాష్ట్రంలో కల్లోలకాండకు బీభత్సకాండకు అడ్డుకట్ట పడుతోంది. దశాబ్దులుగా సైనికులు తమ ప్రాణాలను నిరంతరం ధారవోసి సమరం సాగిస్తూన్నప్పటికీ పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ప్రత్యక్ష బీభత్సకారులు, పరోక్ష బీభత్సకారులు అణగారిన జాడలేదు. ‘జిహాదీ’ల ప్రత్యక్ష బీభత్సకారులు కశ్మీర్‌ను నిరంతరం రక్తసిక్తం చేస్తున్నారు, పాకిస్తాన్ సైనికులు- రేంజర్స్- ప్రచ్ఛన్న బీభత్నకారులు. అధీనరేఖ- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి-ను నిరంతరం అతిక్రమిస్తున్నారు, దొంగచాటుగా మన భద్రతాదళాలను హత్య చేస్తున్నారు!!
అయినప్పటికీ కశ్మీర్ నుంచి ‘సైనిక దళాలను ఉపసంహరించాలన్న గొంతెమ్మ కోర్కెను ‘పిడిపి’వారు సందు దొరికినప్పుడల్లా వెళ్లగక్కుతునే ఉన్నారు. ఉపసంహరణ ప్రస్తుత పరిస్థితులలో అసాధ్యం. 1989కి పూర్వం కశ్మీర్‌లోయ ప్రాంతంలో సైనిక దళాల సంఖ్యను బాగా తగ్గించినందువల్లనే 1989-1990 సంవత్సరాలలో పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పిన జిహాదీ బీభత్సకారులు మరోసారి పేట్రేగిపోయారు, లోయ ప్రాంతం నుంచి హిందువులను- కశ్మీర్ పండిత కుటుంబాలను- తరిమివేశారు. 1947లో లోయ ప్రాంతం మొత్తం జనాభాలో ఇరవై మూడు శాతం ఉండి హిందువులు 1990 నాటికి ‘సున్న శాతం’ కావడానికి కారణం పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ హంతకులు దశాబ్దులుగా సాగించిన రక్తపాతం. ‘చేతులు కాలిన తరువాత ఆకులు పట్టుకొన్న’ విధంగా కేంద్ర ప్రభుత్వం 1992 నుంచి కశ్మీర్ లోయలో భారీ సంఖ్యలో మోహరించినప్పటికీ, నిర్మూలనకు గురై జమ్మూలోను ఇతరచోట్ల తల దాచుకుంటున్న కశ్మీరీ హిందువులు తిరిగి తమ స్వస్థలాలకు, సొంత ఇళ్లకు పోలేకపోతున్నారు. ఈ వైపరీత్యానికి, కొనసాగుతున్న విషాద కథకు ఏకైక కారణం మన ప్రభుత్వం 1991కి పూర్వం కశ్మీర్‌లోయలో తగినంత మంది సైనికులను నెలకొల్పలేకపోవడం. సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు లేకపోవడం. 1990 నాడు హిందువులను ‘లోయ ప్రాంతం’ నుంచి సమూలంగా నిర్మూలించిన ‘జిహాదీ’లు శాంతించలేదు, ఎందుకంటె రక్తం రుచి మరిగిన తోడేళ్లు కోరలు మొత్తం ఊడిపోయేవరకు ఆవుల గొంతులను కొరికి చంపడం మానవు. అందువల్ల ‘జిహాదీ’లు 1992 తరువాత సైనికులపై సైనిక స్థావరాలపై సైనిక వాహనాలపై ప్రత్యక్ష సమరం సాగిస్తున్నారు. ఎందుకంటె ఈ పాకిస్తాన్ తొత్తుల లక్ష్యం కశ్మీర్‌ను మన దేశం నుంచి విడగొట్టడం. సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు లేనట్టయితే జిహాదీ బీభత్సకాండను అదుపుచేయడం అసాధ్యం! జమ్మూ కశ్మీర్‌లో బీభత్సపు ముఠాల్లో చేరుతున్న ‘యువకుల’ సంఖ్య గత ఏడాది కంటె ఈ ఏడాది బాగా పెరిగినట్టు ప్రభుత్వాలే ధ్రువీకరిస్తున్నాయి!
అందువల్ల జమ్మూ కశ్మీర్ నుండి సైనిక బలగాలను తగ్గించడానికి గాని, ‘ఆఫ్‌సా’ను ఎత్తివేయడానికి కాని ప్రభుత్వం పూనుకోరాదు. భారతీయ జనతాపార్టీతో జట్టుకట్టి ఉన్న ‘పిడిపి’ని ‘్భజపా’ విధానాలు ప్రభావితం చేయాలి. ‘పిడిపి’ విధానాలతో ‘్భజపా’ ప్రభావితం కారాదు. ఈశాన్య ప్రాంతంలోని దేశ విద్రోహులు, ప్రత్యేక దేశాలను కోరినవారు క్రమంగా అంతరించిపోయారు. తమ స్వభావాన్ని మార్చుకొని జాతీయ ప్రధాన స్రవంతిలో చేరుతున్నారు. కానీ కశ్మీర్‌లో ‘కథ’ వేఱు..