సంపాదకీయం

జరూసలం జగడం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇజ్రాయిల్ రాజధాని ‘జరూసలం’ గురించి కొనసాగుతున్న జగడం మరోసారి తీవ్రరూపం కావడం పశ్చిమ ఆసియా కల్లోల చరిత్రలో నడుస్తున్న ఘట్టం. అమెరికా ప్రభుత్వం ఇజ్రాయిల్‌లోని తమ రాయబార కార్యాలయాన్ని టెల్ అవీల్ నుంచి జరూసలం నగరానికి తరలించడం ప్రస్తుతం కల్లోలాలు చెలరేగడానికి కారణం. ప్రాచీన జరూసలం నగరం క్రీస్తునకు పూర్వం అనేక శతాబ్దుల పాటు పాలస్తీనా యూదులకు ఆరాధన కేంద్రం. క్రీస్తుశకం, క్రైస్తవ మతం ఆరంభమైన నాటికి రోమన్ నియంతలు పాలస్తీనా నుంచి యూదుల-జ్యూస్-ను తరిమివేయడం చరిత్ర. యూదుల ఆలయాన్ని రోమన్‌లు ధ్వంసం చేయడం చరిత్ర. 1948లో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పాలస్తీనాను విభజించి యూదులకు, పాలస్తీనా ఇస్లాం మతస్థులకు పంచిపెట్టడానికి ఇదీ చారిత్రక నేపథ్యం. యూదులు అధికసంఖ్యలో ఉన్న పాలస్తీనా ప్రాంతం ‘ఇజ్రాయిల్’గాను, ఇస్లాం మతస్థులు అధికసంఖ్యలో ఉన్న ప్రాంతం స్వతంత్ర పాలస్తీనా దేశంగాను ఏర్పడినాయి. 1948వ సంవత్సరానికి ముందు పాలస్తీనా ప్రాంతం వివిధ దేశాల దురాక్రమణలకు గురి కావడం రెండు సహస్రాబ్దుల చరిత్ర. బ్రిటన్ అధీనంలో ఉన్న సమయంలో ఈ ప్రాంతంలోని వివిధ దేశాల నుంచి యూదులు వలస వచ్చి స్థిరపడ్డారు. ఆరబ్ తెగలకు చెందిన ఇస్లాం మతస్థులు కూడ వలస వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడడం చరిత్ర. అందువల్ల బ్రిటన్ దురాక్రమణ నుంచి విముక్తమైన పాలస్తీనా మతప్రాతిపదికపై విభక్తం కావడం ‘జరూసలం’ వివాదగ్రస్తం కావడానికి మూల ప్రాతిపదిక. ఇజ్రాయిల్ విధ్వంసం కోసం ఇరుగు పొరుగు ఇస్లాం మతరాజ్య వ్యవస్థలున్న దేశాల ప్రభుత్వాలు 1948 నుంచి యత్నిస్తుండడానికి ఇదీ నేపథ్యం. బ్రిటన్ తదితర ఐరోపా దేశాల వారు దురాక్రమించి ‘పాలించిన’ ప్రతిచోట ఏదోఒక దీర్ఘకాల సమస్య రగులుతూనే ఉంది. నిష్క్రమించవలసి వచ్చిన ప్రతిచోట బ్రిటన్ వారు ఇలా సమస్యలను రగిలించిపోయారు. తమ దురాక్రమణ నుంచి విముక్తమైన దేశాలు శాంతిభద్రతలతో ప్రగతిని సాధించరాదన్న ఐరోపా జాతుల దుర్భుద్ధి ‘జరూసలం’పై విభేదాలకు కారణం!
జరూసలం రాజధానిగా ఒకే పాలస్తీనా దేశాన్ని ఐక్యరాజ్యసమితి 1948లో ఏర్పాటు చేసి ఉండవచ్చు. అలాంటి పాలస్తీనాలో యూదులు, ఇస్లాం మతస్థులు సమాన అధికారాలతో సమాన భాగస్వాములు కావాలని ఐరాస నిర్దేశించి ఉండవచ్చు. సర్వమత సమభావ ప్రజాస్వామ్య వ్యవస్థ అలాంటి ‘ఏకీకృత’ పాలస్తీనాలో ఏర్పడి ఉండవచ్చు. కానీ అలా జరగలేదు. మత ప్రాతిపదికపై పాలస్తీనాను ఏర్పాటు చేశారు. ఇస్లామేతర మతాలను నిర్మూలించాలన్న ‘జిహాదీ’ల బీభత్స కాంక్ష ఈ విభజనకు ఒక కారణం. సమస్యను ప్రతిచోట రగిలించడం ద్వారా ‘శాంతి స్థాపనకు తాము శాశ్వత మధ్యవర్తులుగా ఉండాలన్న’ బ్రిటన్, అమెరికా తదితర పాశ్చాత్య దేశాల పన్నాగం విభజనకు మరో కారణం. ఇలా పాలస్తీనాలో రెండు దేశాలు ఏర్పడినాయి. ఆసియా పశ్చిమ కొసన జోర్డాన్ నదికి పశ్చిమంగాను, మధ్యధరా సముద్రానికి తూర్పుగాను వ్యాపించి పాలస్తీనా ఇలా ముక్కలైంది. పాలస్తీనా మధ్యలో ఇజ్రాయిల్ ఏర్పడింది. ఇజ్రాయిల్‌కు నైరుతి ప్రాంతంలో ‘గాజా’ను, ఇజ్రాయిల్‌కు తూర్పున ఉన్న జోర్డాన్ పశ్చిమ తీరాన్ని కలిపి పాలస్తీనాను ఏర్పరిచినారు. ఎందుకంటే ఈ రెండు ప్రాంతాలూ 1948 నాటికి ఇస్లాం జన బాహుళ్యాలు. భారత్‌కు ఇరువైపులా 1947లో పాకిస్తాన్ ఏర్పడినట్టుగా 1948లో ఇజ్రాయిల్‌కు ఇరువైపులా పాలస్తీనా ఏర్పడింది.
తమకు దాదాపురెండువేల ఏళ్ల తర్వాత స్వతంత్ర దేశం లభించినందుకు ఇజ్రాయిల్‌లోని యూదులు సంతోషించారు. తమ దేశంతో పాటు ‘అరబ్ ఇస్లాం’ ప్రజలకు మరో స్వతంత్ర దేశం ఏర్పడిన భౌగోళిక వాస్తవాన్ని అంగీకరించారు. కానీ పాలస్తీనాతో పాటు ఇజ్రాయిల్ మరో స్వతంత్ర దేశంగా ఏర్పడడానికి పాలస్తీనా పొరుగుదేశాలు అంగీకరించలేదు. ఇస్లామేతర మతాల ఉనికిని సహించలేని ఈ ఇరుగు పొరుగు దేశాల జిహాదీ స్వభావం ఇందుకు కారణం. ఇజ్రాయిల్ స్వతంత్ర దేశంగా ఏర్పడిన వెంటనే, తొలిరోజుననే ఆ దేశంపై ఈజిప్ట్, సిరియా, జోర్డాన్, లెబనాన్ వంటి పొరుగు దేశాలైన ఇస్లాం మతరాజ్యాలు దాడి చేశాయి. ఇజ్రాయిల్‌ను ‘ఆర్పివేయడం’- ఎక్స్‌టింగ్ విషింగ్- ఈ దేశాల లక్ష్యం! చిట్టి దేశమైన ఇజ్రాయిల్‌ను విధ్వంసం చేయడం తృటిలో సాధ్యమన్నది ఈ పెద్ద దేశాల దుర్బుద్ధి. కానీ ఇజ్రాయిల్ ఈ దేశాల సమష్టి దురాక్రమణను ప్రతిఘటించింది, తిప్పికొట్టింది. ఫలితంగా ఆరబ్ ముస్లింల కోసం ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన పాలస్తీనా దేశం ఏర్పడలేదు. ‘గాజా’ను ఈజిప్ట్, జోర్డాన్ నది పశ్చిమ తీరాన్ని జోర్డాన్ ఆక్రమించాయి. అంతటితో ఇజ్రాయిల్ ఇరుగు పొరుగు దేశాలు మిన్నకుండిపోలేదు. మరోసారి 1956లోను, 1967లోను ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికి యత్నించాయి. ఈ యుద్ధాలలో ఇజ్రాయిల్ గెలిచింది. 1967లో గాజాను పశ్చిమ తీరాన్ని ఆక్రమించుకొంది. అప్పటినుంచి లక్షలాది పాలస్తీనా ప్రజలు శరణార్థులయ్యారు. ఇలా పాలస్తీనా ముస్లింలు శరణార్థులు కావడానికి కారణం ఇజ్రాయిల్ ఉనికిని సహించలేని ఆరబ్ దేశాలు. ఆరబ్ దేశాలు ఏ యుద్ధంలో గెలిచి ఉండినప్పటికీ ఇజ్రాయిల్ మిగిలి ఉండేదికాదు. యూదులు అక్కడ మిగిలి ఉండేవారు కాదు. కానీ ‘అసమర్థ దుర్జను’లైన ఆరబ్ దేశాల ప్రభుత్వ నిర్వాహకులు 1973లో, 1982లో ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికి విఫలయత్నం చేశారు. ఇజ్రాయిల్‌లో మాత్రం సర్వమత సమభావ ప్రజాస్వామ్యం వికసిస్తోంది. ఇజ్రాయిల్ జనాభాలో దాదాపు ఇరవై మూడు శాతం ఉన్న పాలస్తీనా ముస్లింలు యూదులతో సమానంగా హాయిగా జీవించగలుగుతున్నారు.
పాలస్తీనా విమోచన సంస్థవారు 1990వ దశకం వరకు ఇజ్రాయిల్‌ను ధ్వంసం చేయడానికి యత్నించి ఘోరంగా నష్టపోయారు. 1993లో ఇజ్రాయిల్ ఉనికిని గుర్తించారు. వెంటనే ఇజ్రాయిల్ జోర్డాన్ నది పశ్చిమతీరాన్ని, గాజా ప్రాంతాన్ని పాలస్తీనాగా ఏర్పాటు చేసింది. స్వయం పాలనను ప్రసాదించింది. అయినప్పటికీ వివిధ జిహాదీ ముఠాలు ఇప్పటికీ ఇజ్రాయిల్‌పై బీభత్సకాండను సాగిస్తున్నాయి. జరూసలం రగడ ఈ విస్తృత వివాదంలో భాగం! విస్తృత వివాదం పరిష్కారమై ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాలు ఇరుగు పొరుగు మిత్రదేశాలుగా మారినట్టయితే జరూసలం సమస్యను పరిష్కరించడం సులభ సాధ్యం! రామాయణంలో పిడకల వేట వలె అమెరికా ప్రభుత్వం ఇప్పుడు టెల్ అవీల్ నుంచి జెరూసలం నగరానికి తన రాయబార కేంద్రాన్ని మార్చింది. అతిగా ప్రతిస్పందించిన గాజాలోని మతోన్మాదులు ఇజ్రాయిల్‌లోకి చొరబడే యత్నం చేశారు. ఈ చొరబాటును నిరోధించడంలో భాగంగా ఇజ్రాయిల్ సైనికులు జరిపిన కాల్పులలో అనేకమంది పాలస్తీనా నాయకులు మరణించడం దురదృష్టకరం.