సంపాదకీయం

ఎవరి మేలుకోసం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది ప్రపంచీకరణ వాతావరణం. దేశాల మధ్య సఖ్యతే దీన్ని బలోపేతం చేసే సాధనం. అందుకు విరుద్ధంగా ఏ దేశం వ్యవహరించినా.. ఫలితం ప్రమాదకరమే! అందుకు కారణం..దాదాపు అన్ని దేశాలు పరస్పర ఆధారితమైనవే..ఒక దేశం అభివృద్ధి, ప్రగతి మరో దేశ పురోగతిపైనే ఆధారపడి ఉంటుంది. ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటే..వాటి దుష్ప్రభావాన్ని అన్ని దేశాలూ అనుభవించాల్సిందే. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ అన్ని విధాలుగా అభివృద్ధి చెందిన సుసంపన్న దేశం అమెరికా..ప్రగతిలో ధనిక దేశాలనే అధిగమిస్తూ ఎప్పటికప్పుడు కొత్త పుంతలు తొక్కుతున్న చైనా మధ్య గత కొంత కాలంగా సాగుతున్న వాణిజ్య యుద్ధం. వీటిలో దేనికది తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికే ప్రయత్నించడం..పరిస్థితులు అదుపులోకి వచ్చే అవకాశాలు ఎప్పటికప్పుడు సన్నగిల్లడంతో దిక్కుతోచని వాణిజ్య వాతావరణం ప్రబలుతోంది. ఇప్పటికే ఈ రెండు దేశాల వాణిజ్య యుద్ధ ప్రభావం భారత్ సహా అన్ని దేశాలపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కనిపిస్తూనే వస్తోంది. అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర స్థాయిలో ఒడిదుడుకులకు లోనుకావడానికి అమెరికా-చైనాల ఆధిపత్య ధోరణేనని చెప్పక తప్పదు. గత కొన్ని నెలలుగా పరస్పరం రెచ్చగొట్టుకుంటూ..‘నువ్వు ఒకటంటే నేను రెండంటా’అన్న రీతిలో సాగుతున్న పరస్పర హెచ్చరికలు దాదాపుగా ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధానికి తెరతీశాయి. ఎవరూ వెనక్కి తగ్గే పరిస్థితులు కొరవడటంతో దీని తీవ్రత సమసే అవకాశాలూ మృగ్యమవుతున్నాయి. దాదాపు 34 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులపై ఇరు దేశాలు 25శాతం వాణిజ్య సుంకాన్ని వసూలు చేయడానికి సిద్ధపడటమే కాదు..ఏది ఏమైనా తమ నిర్ణయాన్ని అమలు చేసి తీరుతామన్న కృతనిశ్చయాన్నీ ప్రకటించాయి. ప్రపంచ వ్యాపార, వాణిజ్యాలను తమదైన అద్వితీయ శక్తితో శాసిస్తున్న అమెరికా-చైనాల మధ్య మొదలైన సుంకాల విధింపు యుద్ధం ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే అత్యంత తీవ్రమని చెప్పక తప్పదు. ఇప్పటికే ఈ తరహా వాణిజ్య యుద్ధాల ప్రభావాన్ని ప్రపంచ దేశాలు చవిచూసినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు అత్యంత తీవ్ర స్థాయిలో అన్ని దేశాల మనుగడపైనా ప్రభావాన్ని కనబరచడం తథ్యమని చెప్పక తప్పదు.
ఎందుకంటే దీని వల్ల ఈ రెండు దేశాలకు కలిగే నష్టం కంటే కూడా ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటూ, బలపడుతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కలిగే నష్టం అపారంగానే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.మొదటి నుంచి తన దుందుడుకు విధానాలతో ఇటు మిత్రుల్ని, అటు ప్రత్యర్థుల్ని సైతం ఇరకాటంలో పడేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో ఈ అతిపెద్ద వాణిజ్య యుద్ధానికి తెరతీశారనడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని దేశాలూ అమెరికాను దోచుకుంటున్నాయన్న బలమైన భావనతో ఉన్న ట్రంప్ దిగుమతి చేసుకున్న సోలార్ ప్యానళ్లు, వాషింగ్ మిషన్లపై భారీగానే సుంకాలు విధించారు. అంతటితో ఆగకుండా అమెరికాకు ఎగుమతి అయ్యే చైనా వస్తువులన్నింటిపైనా పన్నువేసేస్తామని హెచ్చరిక స్వరాన్నీ వినిపించారు. తాజాగా అంతపనీ చేయడంతో కారాలూ మిరియాలు నూరిన చైనా నాయకత్వం కూడా ఎదురుదాడికి దిగడం..అమెరికా వస్తువులపై పోటాపోటీగా సుంకాలను విధించడంతో దిక్కుతోచని పరిస్థితులు తలెత్తాయి. అన్నింటా అగ్రగామి అమెరికా అన్న నినాదంతో శే్వతసౌధాన్ని అధిష్టించిన ట్రంప్ రగిలించిన వాణిజ్య యుద్ధం లక్ష్యాలు ఏమైనా..ఆయన ఉద్దేశం మాత్రం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో దూసుకెళుతున్న చైనాను అన్ని విధాలుగా నిరోధించాలన్నదేనన్నది స్పష్టం. పైగా అమెరికాకు చైనాతో వాణిజ్యలోటు భారీగానే ఉంది. ఇదంతా అమెరికా ఆర్థిక వ్యవస్థకు నష్టమేనని భావిస్తున్న దేశీయ ఓటర్లను తనవైపు తిప్పుకోవడం కూడా ట్రంప్ నిర్ణయం వెనుక బలమైన కారణంగా కనిపిస్తోంది. ఇటు వాణిజ్య, అటు రాజకీయ ప్రయోజనాలను కలగలిపిన రీతిలో వ్యవహరిస్తున్న ట్రంప్‌ను అదే రీతిలో ఎదుర్కొనేందుకు సిద్ధమన్న సంకేతాలిచ్చిన చైనా సోయాబీన్, ఆటోమొబైల్స్ సహా అమెరికా ఎగుమతులన్నింటినీ లక్ష్యంగా చేసుకుని సుంకాల వడ్డన మొదలెట్టింది. ట్రంప్ నిర్ణయం వల్ల చైనాకు కలిగే వాణిజ్య పరమైన నష్టం కంటే కూడా దీని ప్రభావం చాలా తీవ్రంగానే ఉంటుందన్నది నిజం. ముఖ్యంగా, ట్రంప్‌కు తనకు తిరుగులేని ఓటరు బలం ఉందనుకుంటున్న అన్ని అమెరికా రాష్ట్రాల్లోనూ చైనా నిర్ణయం తీవ్రస్థాయి నిరుద్యోగానికి దారితీస్తుందన్న సంకేతాలే ఇందుకు నిదర్శనం.
ట్రంప్ వాణిజ్య యుద్ధం కేవలం చైనాకే పరిమితం కాలేదు. ఐరోపా యూనియన్ దేశాలు, మెక్సికో, కెనడాలు సైతం అమెరికా వస్తువులపై భారీగా సుంకాలను విధిస్తూ తమ ప్రతీకారాన్ని ఇప్పటికే చాటిచెప్పాయి. ప్రపంచ శాంతి, భద్రతలకు అన్ని దేశాల్లోనూ ఇందుకు దోహదం చేసే పరిస్థితులు పరిఢవిల్లడం ఎంత అవసరమో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ శక్తివంతం కావడానికి ఆయా దేశాల స్థూల జాతీయోత్పత్తి కూడా ఇనుమడించడం అంతే అవసరం. తమ వ్యక్తిగత వాణిజ్య ప్రయోజనాలకు నష్టం కలిగించుకోకుండా ఏ దేశం కూడా మరో దేశ దిగుమతులపై సుంకాలు విధించే అవకాశం లేదు. ఎందుకంటే..ఎగుమతి, దిగుమతులపై పరస్పరం సుంకాలు విధించుకునే పరిస్థితులకు ఇది అనివార్యంగా దారితీస్తుంది. భారత్ సహా అన్ని దేశాల అభివృద్ధి సొంత ఉత్పత్తులపై కాకుండా దిగుమతి చేసుకునే వస్తు వినియోగంపైనా ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే ఈ సుంకాల యుద్ధం తీవ్రమవుతుందో..దాని ఫలితాలు, పర్యవసానాలను అంచనా వేయడం కష్టం. కొన్ని రకాల వస్తువులపై వినియోగదారులు భారీ మొత్తాన్ని చెల్లించాల్సిన పరిస్థితులతో పాటు విదేశీ వస్తువులపై ఆధారపడి వ్యాపార వాణిజ్యాలు సాగించే వ్యాపారవేత్తలు ఉత్పత్తి, సరఫరాపరమైన సమస్యలను అనివార్యంగానే ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో పరిశీలిస్తే..తమ వాణిజ్య యుద్ధాన్ని రోజురోజుకూ తీవ్రతరం చేస్తున్న అమెరికా-చైనాలు తమ సొంత వాణిజ్య అవకాశాల్ని దెబ్బతీసుకోవడమే కాదు..ఇతర దేశాలకు అందుబాటులోకి వచ్చే అవకాశాల్నీ ఛిద్రం చేస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే వాణిజ్యపరమైన అనిశ్చితి ప్రబలం కావడంతో ఇటు అమెరికాలోనూ, చైనాలోనూ తీవ్రస్థాయిలో పెట్టుబడుల ప్రవాహానికి అడ్డుకట్ట పడింది. ఇటువంటి ప్రతికూల పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం చేతులు కాల్చుకోవడమేనన్న నిర్ణయానికి భారీ వ్యాపారవేత్తలు వచ్చేశారన్న సంకేతాలూ బలంగా కనిపిస్తున్నాయి. అమెరికా మాట ఎలా ఉన్నా..చైనాలో ఇప్పటికీ ఆర్థిక మాంద్య ప్రభావం కనిపిస్తూనే ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో అగ్రరాజ్యంతో వాణిజ్య యుద్ధానికి తెగబడటం దానికీ అనేక కోణాల్లో నష్టదాయకమే! అంతర్జాతీయ వ్యాపార వాణిజ్యాలను తమ వ్యక్తిగత ఆధిపత్య ధోరణులకు బలిచేయడం అమెరికా, చైనాలకు ఎంత మాత్రం తగదు. ప్రపంచ దేశాలు తమదైన మార్గాలను ఎంచుకోక ముందే పరిస్థితులను చక్కదిద్ది..సుహృద్భావ అంతర్జాతీయ వాణిజ్య వాతావరణాన్ని కాపాడుకోవడం ఎంతైనా అవసరం. ఆర్థిక మాంద్య ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మళ్లీ జవసత్వాలు అందించాల్సిన తరుణమిది. దీన్ని కాలదన్నుకుంటే..ఆర్థిక అనిశ్చితికి ఆహ్వానం పలుకడమే అవుతుంది.