సంపాదకీయం

‘పెట్రో’ మంటకు నేపథ్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీర్ఘకాల చికిత్స గురించి ఎవ్వరికీ ధ్యాస ఉన్నట్టులేదు, తత్కాల ‘విచికిత్స’ను మాత్రం వేల గొంతులతో ఆవిష్కరిస్తున్నారు. ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలను విపక్షాల వారు తిట్టిపోస్తుండడం ఈ తాత్కాలిక విచికిత్స! కానీ పెట్రోలు ధరలు, పెట్రోలియం ఉత్పత్తుల ధరలు పెరగడం, పెరుగుతుండడం ఏడెనిమిదేళ్లుగా కొనసాగుతున్న సమస్య! ఒకరోజు ‘్భరత్ బంద్’ చేసినంత మాత్రాన పెట్రోలియం ఉత్పత్తుల ధరలు దభీమని నేలకు దిగవు. కేంద్ర ప్రభుత్వం వారు, రాష్ట్రాల ప్రభుత్వాల వారు విడివిడిగా విధిస్తున్న సుంకాలను తగ్గించినట్టయితే పెట్రోలు ధరలు, ‘డీజెల్’ ధరలు కొంతమేరకు తగ్గవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం పెట్రో ధరలను లీటర్‌కు రెండు రూపాయలను తగ్గించింది. రాజస్థాన్ ప్రభుత్వం ప్రకటించిన సుంకాల తగ్గింపువల్ల పెట్రోలు ధర లీటర్‌కు దాదాపు మూడు రూపాయల మేర తగ్గిందట. కానీ పెట్రోలు, పెట్రోలియం ఉత్పత్తుల ఉత్పాదక వ్యయం కంటె ఈ ఉమ్మడి సుంకాల విలువ నూట యాబయి శాతం కంటె ఎక్కువగా ఉండడం వాణిజ్య వైపరీత్యం. ‘స్వేచ్ఛా విపణి’- మార్కెట్ ఎకానమీ-కి బుద్ధి మాత్రం పెద్దగా ఉంది, హృదయం మాత్రం లేదు. ఈ వాణిజ్య బుద్ధి ‘గిరాకీ’ని పెంచి జనాన్ని భయంకరంగా దోచుకొనడానికి ఉపయోగిస్తోంది. కృత్రిమంగా కొరతను సృష్టించడం, కొరత ఏర్పడినట్టు ప్రచారం చేయడం, జనం ‘కొరత’ భయంతో ఎగబడి కొనుగోలు చేయడం, విక్రేతలు ధరలను భయంకరంగా పెంచి అమ్మడం- ఇదంతా ‘మార్కెట్ ఎకానమీ’- మాయాజాలం. నిజంగా వస్తువులకు కొరత ఉన్నట్టయితే- పెట్రోలు కొరత ఏర్పడడం ప్రస్తుత సందర్భం- ధరలు పెంచినంత మాత్రాన ‘లభ్యత’ ఎలా పెరుగుతుంది? ఉప్పు పప్పు బియ్యం కూరగాయల వలె పెట్రోలు వాడకం కూడ ‘్ధరల ప్రాతిపదికగా’ పెరగదు, తగ్గదు. అది నిత్యావసరం, జన ‘జీవన ప్రస్థాన’ ప్రగతి రథ చక్రాలకు ఇంధనం. అంతర్జాతీయ రంగంలో పెట్రోలు ఉత్పత్తులు తగ్గినందువల్ల ధరలు పెరుగుతున్నాయన్న ప్రభుత్వం వారి వాదం అతార్కికమైనది. మన దేశంలోకి దిగుమతి అవుతున్న పెట్రోలియం పరిమాణం తగ్గిందా? తగ్గి ఉన్నట్టయితే ఏ మేరకు తగ్గింది?? ఈ ప్రశ్నలను ప్రతిపక్షాల వారు అడగడం లేదు. అడిగినట్టయితే సరైన సమాధానం లభించే ప్రమాదం ఉంది. అందువల్ల ‘ప్రభుత్వ విధానం విఫలమైంది..’ అన్న పాటను మాత్రమే ప్రతిపక్షాల వారు మళ్లీమళ్లీ పాడుతున్నారు. పెట్రోలు, డీజెల్ నూనె తదితర ఇంధన పదార్థాల ధరలను నిరంతరం పెంచడం నిజానికి మాజీ ప్రధాని, అంతర్జాతీయ స్థాయి ఆర్థికవేత్త మన్‌మోహన్ సింగ్ అభీష్టం. ‘పెట్రోలియం’ ధరలు నిరంతరం పెరగడానికి వీలుగా ఆయన ‘చక్కని’ ప్రాతిపదికను సిద్ధం చేశాడు. ఈ ‘ప్రాతిపదిక’ పేరు ‘అంతర్జాతీయ అనుసంధానం..’
ప్రస్తుత ప్రభుత్వం కూడ ఈ ‘అంతర్జాతీయ అనుసంధానం’ పరిధిలోనే ‘గిరికీ’లు కొడుతోంది. ‘ఇది అంతర్గత సమస్య కాదు, అంతర్జాతీయ సమస్య.’ అన్న మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వం నాటి పాట నరేంద్ర మోదీ ప్రభుత్వం నోట కూడ వినిపిస్తోంది. ప్రపంచీకరణలో భాగంగా వ్యవస్థీకృతమై ఉన్న ‘మార్కెట్ ఎకానమీ’ ప్రదర్శిస్తున్న బంగారపు జింకల మాయా విన్యాసాలలో పెట్రోలు ధర పెరగడం ఒకటి మాత్రమే! స్థూల జాతీయ ఆదాయం పెరుగుదల ప్రాతిపదికగా మాత్రమే దేశ ఆర్థిక సౌష్టవాన్ని నిర్ధారించడం ప్రపంచీకరణలో భాగం! ధరలు, ద్రవ్యోల్బణం, విదేశీయ వాణిజ్యంలో ఏర్పడి ఉన్న లోటు పెరగడం గురించి కాని, రూపాయి విలువ, ఎగుమతులు తగ్గిపోతుండడం గురించి కాని ‘రిజర్వ్ బ్యాంకు’ వారు ఆందోళన చెందడం లేదు, ప్రభుత్వ నిర్వాహకులు ఆందోళన చెందడం లేదు. అసలు ఈ అంశాల పట్ల ధ్యాస కూడ ఉన్నట్టు లేదు. చైనా కంటె వేగంగా మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జిడిపి- పెరుగుతోందన్న ‘ప్రపంచ బ్యాంకు’ వారి ప్రశంసాపత్రాన్ని చూసి ప్రభుత్వం మురిసిపోతోంది. ఫ్రాన్స్ దేశపు ‘జిడిపి’ విలువ కంటె మన ‘జిడిపి’ విలువ ఎక్కువ అన్నది మురిసిపోవడానికి మరో కారణం. కేవలం ‘జిడిపి’ ప్రాతిపదికగా జాతీయ ఆర్థిక సౌష్టవాన్ని లెక్కకట్టడం సరికాదని గతంలో సర్వోన్నత న్యాయస్థానం హెచ్చరించింది కూడ!
స్వేచ్ఛా వాణిజ్య విపణిని సర్వసమగ్రంగా వ్యవస్థీకరించాలన్నది ‘ప్రపంచీకరణ’కర్త మన్‌మోహన్ సింగ్ అభీష్టం, ఆశయం, లక్ష్యం. ప్రభుత్వ ప్రమేయం లేని ఈ స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ కోసం పదేళ్లపాటు 2014 మే 25వరకు ఆయన ప్రభుత్వం కృషి చేసింది. దేశ ప్రజలు ‘కారుచౌక’గా పెట్రోలును కొని వృథాచేస్తున్నారన్నది మన్‌మోహన్ సింగ్‌ను మిక్కిలి ఆందోళనకు గురిచేసిన వాస్తవం. పెట్రోలియం ధరల ‘హేతుబద్ధీకరణ’ జరగాలని ప్రధానమంత్రిగా ఉండిన సమయంలో మన్‌మోహన్ సింగ్ బహిరంగ వేదికలపై పదే పదే వాక్రుచ్చడం చరిత్ర. ఈ ‘హేతుబద్ధీకరణ’- రాషనలైజేషన్-కు మరో పేరు పెట్రోలియంపై రాయితీలను రద్దు చేయడం. ఈ ‘వాక్రుచ్చుడు’నకు అనుగుణంగానే 2009లో మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీర్తి పారీఖ్ అధ్యక్షతన అధ్యయన సంఘాన్ని నియమించింది. మన్‌మోహన్ సింగ్ అంతరంగాన్ని అర్థం చేసుకున్న ‘కీర్తిపారీఖ్ సంఘం’ వారు పెట్రోలు పంపిణీ వ్యవస్థపై ప్రభుత్వ నియంత్రణను తొలగించాలని, పెట్రోలు ధరలు భారీగా పెంచాలని సూచించడం చరిత్ర. కీర్తిపారీఖ్ సంఘం సిఫార్సులన్నింటినీ ప్రభుత్వం వెంటనే ఆమోదించలేదు. దశలవారీగా పెట్రోలు ధరలను పెంచింది. 2012 మే నెల 23వ తేదీన ఒకేసారి లీటరుకు ఏడున్నర రూపాయల చొప్పున పెట్రోలు ధరలను పెంచడం ద్వారా మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం దేశంలోని వినియోగదారులను విస్మయచకితులను చేసింది. అప్పటినుంచి ఇప్పటివరకు పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం పెట్రోలియం పంపిణీ వ్యవస్థను ‘అంతర్జాతీయ విపణి’తో అనుసంధానం చేసింది. అందువల్ల పెట్రోలియం ధరలపై ప్రభుత్వం నియంత్రణను కోల్పోయింది.
ఇలా ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం ‘మార్కెట్ ఎకానమీ’ వౌలిక స్వభావం. ‘గిరాకీ’, ‘సరఫరా’- డిమాండ్ అండ్ సప్లయ్- ప్రాతిపదికగా బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వారు, పెట్రోలియాన్ని ఎగుమతి చేస్తున్నవారు నిర్ధారిస్తున్నారు. గిరాకీని పెంచడానికి వీలుగా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు. ఈ ‘వ్యవస్థ’-మార్కెట్ ఎకానమీ-ను ‘ప్రపంచీకరణ’- గ్లోబలైజేషన్-కు పూర్వం అధికాధిక దేశాలు నిరసించేవి. కానీ ప్రస్తుతం ప్రతి ప్రభుత్వం కూడ తమ దేశానికి ‘మార్కెట్ ఎకానమీ’ హోదా కావాలని కోరుకుంటున్నాయి. అందువల్ల పెట్రోలియం ధరలు పెరుగుతూనే ఉంటాయి. ఈ అంతర్జాతీయ అనుసంధానాన్ని రద్దుచేయడం ధరల పెరుగుదలకు దీర్ఘకాల పరిష్కారం. పెట్రోలియం ఉత్పత్తులను ‘వస్తు సేవల పన్నుల’- జిఎస్‌టి- పరిధిలోకి తేవడం తాత్కాలిక పరిష్కారం..