సంపాదకీయం

కాలుష్య ప్రవాహాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నదుల నీటి కాలుష్యం నిరంతరం పెరుగుతుండడం ‘స్వచ్ఛ భారత’ పునర్ నిర్మాణ కార్యక్రమాన్ని నిలదీస్తున్న జాతీయ వైపరీత్యం! కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి- సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్- సీపీసీబీ- వారి నిర్ధారణ మేరకు గత రెండేళ్లలో ‘స్పృశించడానికి సైతం వీలులేని నీటి ప్రవాహాల’ సంఖ్య పెరిగింది. తాగడానికి అవసరమైన నీటి స్వచ్ఛత ప్రమాణాలు వేఱు, స్నానం చేయడానికి మాత్రమే ఉపయుక్తం అవుతున్న నీటి ‘అమలినత’ ప్రమాణాలు వేఱు.. స్నానం చేయడానికి మాత్రమే పనికివచ్చే నదుల నీరు తాగడానికి పనికిరాదు. కానీ ఈ స్వచ్ఛతా ‘మీమాంస’కు గత కొన్ని దశాబ్దులుగా అర్థం లేకుండా పోయింది. తాగడానికి కాని, స్నానం చేయడానికి కాని, బట్టలు ఉతకడానికి కాని, పశువులను కడగడానికి కాని పనికిరాని ‘నీటి ప్రవాహాలు’ దేశమంతటా నెలకొని ఉన్నాయి. కనీసం ముట్టుకొనడానికి సైతం ఇలాంటి ‘ప్రవాహ ప్రాంతాల’ నీరు పనికిరాదు, ముట్టుకున్నట్టయితే ఆ నీటి స్పర్శ విస్తరించినమేర దురద పుట్టడం, పుండ్లు ఏర్పడడం ఖాయం! ఇలాంటి నీరు గంగానది నుంచి తుంగా నది వరకు ఉన్న అన్ని నదులలోను ప్రవహిస్తూ ఉండడం దశాబ్దులుగా జనానికి తెలిసిన రహస్యం! ఈ ‘రహస్యాన్ని’ ‘సీపీసీబీ’ వారు నిర్ణీత కాల వ్యవధిలో ‘కొత్తగా’ ఆవిష్కరించడం దశాబ్దుల పునరావృత్తి! 2015లో ‘సీపీసీబీ’ వారు వెల్లడి చేసిన ఆధికారిక సమాచారం మేరకు ఇలా భయంకర కాలుష్యగ్రస్తమైన నదీ విభాగాల సంఖ్య మూడువందల రెండు. రెండేళ్ల తరువాత ప్రస్తుతం వీటి సంఖ్య మూడువందల యాబయి ఒకటికి చేరిందట! కేంద్ర ప్రభుత్వం గత మూడున్నర ఏళ్లుగా ‘నమామి గంగే’- గంగానదీ నమస్కారం- అన్న పేరుతో గంగను ప్రక్షాళనం చేస్తోంది. ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఈ పథకం కోసం ఖర్చుచేస్తుండడం కాలుష్య నియంత్రణ చరిత్రలో గొప్ప విప్లవం! ‘గంగాస్నానం తుంగా పానం’ అన్నది జాతీయ సమైక్య పరిరక్షణకు ప్రాతిపదిక అయిన సనాతన జీవన సూత్రం! గంగలో స్నానం చేయడం, తుంగ నీరు త్రాగడం.. అంటే ‘తుంగ’ నుంచి ‘గంగ’ వరకు యాత్ర చేయడం! తుంగ, భద్ర నదుల సంయుక్త రూపం తుంగభద్ర నది! తుంగానదీ తీరంలోనే క్రీస్తునకు పూర్వం ఐదవ శతాబ్దిలో జాతీయ సమైక్య ప్రవర్థకుడైన జగద్గురువు ఆదిశంకరాచార్యుడు దక్షిణ ఆమ్నాయ పీఠాన్ని నెలకొల్పాడు! గంగానది జాతీయ సాంస్కృతిక స్రోతస్విని. తుంగానది, గంగానది కాలుష్య ప్రవాహాలుగా మారి ఉండడం కేంద్ర ప్రభుత్వ క్షాళన పథకానికి నేపథ్యం. హరిద్వారం వద్ద గంగ నీరు వంద శాతం స్వచ్ఛతకు అనాదిగా మారుపేరు! కానీ 2001వ సంవత్సరం నాటికి హరిద్వారం వద్ద సైతం గంగనీరు కాలుష్యమయమైంది. వ్యవసాయానికి సైతం ఈ నీరు పనికిరాకుండా పోయింది! ఈ నేపథ్యంలో గంగానదీ ప్రక్షాళన మొదలైంది! ఇరవై వేల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అయినప్పటికీ గంగ మళ్లీ నిర్మల జల వాహినిగా ఇప్పటికీ మారలేదు.. దేశమంతటా అన్ని నదులలోను కాలుష్యం మరింత పెరగడం గత రెండేళ్ల చరిత్ర!!
నదుల ప్రవాహ జలాలు ఇలా కలుషితం అవుతున్నప్పుడు ఎక్కువ కాలం నిలువ ఉండే నీరు కలుషితం కావడంలో ఆశ్చర్యం ఏముంది? దేశమంతటా ఉన్న చెఱువులు, కుంటలు, చెలమలు, మడుగులు, గడుగులు, పడిమలు మురికి నీటికి ఆలవాలం అయిపోయాయి. బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు పడమటి కనుమలను, తూర్పు కనుమలను తవ్వి పారేయడం వల్ల కొండవాగులు, జలపాతాలు పూర్తిగా ఎండిపోయాయి, కనుమరుగైపోయాయి. వనవాసీ ప్రజలు నీటి చుక్కలకు నోచుకోక నిర్వాసితులైపోతుండడం ‘ప్రపంచీకరణ’ విస్తరిస్తున్న ఫలితం! వన్యమృగాల నోళ్లు, భూగర్భంలోని నీళ్లు ఎండిపోయాయి. గ్రామాలలోని కోట్ల చేద బావులు, సేద్యపు బావులు పూడిపోయాయి, పూడిపోతున్నాయి. హైదరాబాద్ వంటి మహానగరాలలో జలాశయాలను పూడ్చి ఇళ్లను, దుకాణాలను, భవంతులను, సిమెంటు అరణ్యాలను ఆ స్థలాలలో నిర్మించేశారు! నీటి పరిరక్షణ కోసం, నీటి విస్తరణ కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, ఇతర ప్రాంత ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చుచేసి పథకాలను అమలుజరుపుతున్నాయి! మహానగరాలలోని జలాశయాలలోని కోట్ల చేపలు కాలుష్యం వలయాలలో పడి ఊపిరాడక ఉసురుకోల్పోతుండడం సమాంతర బీభత్సం...
వందల తిమింగలాలు, వేల మొసళ్లు, లక్షల తాబేళ్లు ప్రతి ఏటా మృత కళేబరాలుగా మారి మన దేశపు సముద్ర తీరాలకు కొట్టుకొని వస్తుండడం కాలుష్యం సృష్టించిన ఘోరం! ఈ ఘోరాలు పునరావృత్తం అవుతూనే ఉన్నాయి. కాలుష్య నిరోధక ప్రచారం పెరుగుతున్నకొద్దీ కాలుష్యం కూడ పెరుగుతుండడం జనమెరిగిన భయంకర వాస్తవం! స్వచ్ఛ్భారత నిర్మాణం ఎలా సాధ్యం? స్వచ్ఛతను నిలబెట్టగల ప్రధాన మాధ్యమం నీరు.. కాలుష్యాన్ని కడిగివేసి పుడమిని యథాపూర్వకంగా పునీతం చేయగల మాధ్యమం నీరు.. మేఘం, వర్షం, ప్రవాహ జలం! అందువల్లనే ‘నీరు భూమిని పరిశుభ్రం చేస్తోంది, పరిశుభ్రవంతమైన భూమి నన్ను, మమ్ములను పరిశుభ్రం చేస్తోంది..’ అని సృష్ట్యాదిలో వేదద్రష్టలు ఆలపించారు. ‘ఆపః పునన్తు పృథివీం, పృథివీ పూతా పునాతు మామ్..!’ ఈ జీవన వాస్తవాన్ని మొదట ‘పాశ్చాత్య నాగరికత’ ధ్వంసం చేసింది, ప్రపంచీకరణ విధ్వంసాన్ని వ్యవస్థీకరించింది,. ప్రగతి పేరుతో కాలుష్యం కొలువుతీరుతోంది, పరిశ్రమల పేరుతో ప్రత్యేక ఆర్థిక మండలాల పేరుతో దుర్గంధం కేంద్రీకృతం అవుతోంది. శీతల పానీయాలు, ‘ఐస్‌క్రీమ్’లు నోళ్లను దుర్వాసన నిలయాలుగా మార్చాయి, కడుపులలో ‘కంపు’ను పెంచుతున్నాయి. ఇదంతా పాశ్చాత్య నాగరికత కల్పించిన ప్రగతి భ్రాంతి, ప్రపంచీకరణ విస్తరింపచేస్తున్న ‘అభ్యుదయ పారవశ్యం..’ అందువల్లనే నదుల నీటి నుంచి ఐదు శాతం కాలుష్యాన్ని ప్రభుత్వాలు తొలగించేసరికి పరిశ్రమల నుంచి మరో పదిహేను శాతం కాలుష్యం వచ్చి నదులలో చేరిపోతోంది! ‘కేంద్రీయ కాలుష్య నియంత్రణ మండలి’ వారు తరచు కనిపెడుతున్న వినూతన కాలుష్య స్రవంతులకు ఇదీ కారణం! ‘నదీ వేగేన శుద్ధ్యతే....’- నది ప్రవహించడం, నదిలోని నీరు సహజంగా పరిశుద్ధం అవుతోంది- అన్నది ప్రాకృతిక వాస్తవం! ఈ ప్రాకృతిక వాస్తవాన్ని పారిశ్రామిక విష రసాయన వ్యర్థాలు పరిమార్చుతుండడం వాణిజ్య ప్రపంచీకరణ ఫలితం!
కాలుష్యం పరిమాణం నదుల నీరు జీర్ణించుకునే స్థాయిలో ఉన్నప్పుడు ప్రవాహగతి క్రమంలో నీరు పరిశుద్ధం కాగలదు, స్నానయోగ్యం కాగలదు, పానయోగ్యం కాగలదు! కానీ నదుల నీరు జీర్ణించుకోలేని భయంకరమైన మోతాదులో పారిశ్రామిక రసాయన విష వ్యర్థాలు నదులలో కలసిపోతున్నాయి. అందువల్ల అజీర్తికి గురి అవుతున్న నదులు కాలుష్యాన్ని కక్కుతున్నాయి! పారిశ్రామిక వ్యర్థాలు నీటి ప్రవాహాలలో కలవకుండా నిరోధించాలి! అధికార అవినీతి ప్రవాహాలు, రాజకీయ అవినీతి ప్రవాహాలు నిర్నిరోధంగా పారిశ్రామిక కాలుష్యాన్ని నదులకు చేరవేస్తూనే ఉన్నాయి..!