సంపాదకీయం

అనైక్య వ్యూహం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జస్థాన్, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో ప్రతిపక్షాల ‘కూటమి’ కుప్పకూలడం వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ విజయానికి దోహదం చేయగల పరిణామం. ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోరాదని ఇదివరకే నిర్ణయించుకున్న బహుజన సమాజ్ పార్టీ బుధవారం నాడు రాజస్థాన్‌లోను, మధ్యప్రదేశ్‌లోను కూడ కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకుంది. ఇలా ఈ మూడు ప్రాంతాల్లోను భాజపాకు వ్యితిరేకంగా జరుగవలసి ఉండిన ప్రతిపక్షాల ‘కలసికట్టు’ పోరు ఆరంభం కాకముందే అంతరించి పోవడం రాజకీయ చారిత్రక పునరావృత్తికి సరికొత్త నిదర్శనం! ఇలా కాంగ్రెస్‌కు, తమ పార్టీకి మధ్య తెగతెంపులు జరగడానికి కారణం కాంగ్రెస్ వారి ‘అహంకారం’ అన్నది బహుజన సమాజ్ పార్టీ-బసపా- అధినాయకురాలు మాయావతి చేసిన నిర్ధారణ. ఇతర ప్రాంతాల్లో సైతం ‘బసపా’కు, కాంగ్రెస్‌కు మధ్య సమీప భవిష్యత్తులో పొత్తు కుదరబోదన్న దానికి కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా మాయావతి వాడిన పరుష పదజాలం ధ్రువీకరణ. మధ్యప్రదేశ్ శాసనసభకు 2013లో జరిగిన ఎన్నికల్లో భాజపాకు నలబయి ఐదు శాతం, కాంగ్రెస్‌కు ముప్పయి ఆరు శాతం వోట్లు వచ్చాయట. ఆ ఎన్నికల్లో ఆరు శాతం వోట్లు తెచ్చుకున్న ‘బసపా’ కాంగ్రెస్‌తో జట్టు కట్టినప్పటికీ ఈ ‘కూటమి’ వోట్ల సంఖ్య నలబయి రెండు శాతం మాత్రమే కాగలదు. ఇది- 2013 నాటి స్థితి ఇప్పటికీ మారలేదన్న నిర్ధారణ ప్రాతిపదికగా కొనసాగుతున్న ఊహాగానం. రాజస్థాన్‌లో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వ పక్షం ప్రతిపక్షంగా మారడం దశాబ్దుల చరిత్ర. అందువల్ల ‘బసపా’ మద్దతు లేకపోయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో తాము గెలువగలమన్న ధీమా కాంగ్రెస్‌ను ఆవహించి ఉంది. మాయావతి కనిపెట్టిన ‘కాంగ్రెస్ అహంకారం’ ఇదీ! ఆత్మన్యూనతకు గురై ఉన్న, అన్ని చోట్ల ఇతర పార్టీల ‘పొత్తు’ కోసం తహతహలాడుతున్న కాంగ్రెస్ రాజస్థాన్‌లో మాత్రమే ఒంటరిపోరుకు సిద్ధవౌతోంది. ఈ ‘అహంకారం’ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లకు విస్తరించడం మాయావతి వ్యూహం. ఉత్తరప్రదేశ్‌లో దశాబ్దుల పాటు దశల వారీగా ఎదిగిన ‘బసపా’ మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కూడా ఎదగబోతోందన్నది మాయావతి నిర్ధారణ. అందువల్లనే ఛత్తీస్‌గఢ్‌లో అజిత్ జోగి నాయకత్వంలోని ‘జనతా కాంగ్రెస్’తో జట్టుకట్టిన మాయావతి కాంగ్రెస్‌కు, భాజపాకు ప్రత్యామ్నాయంగా మూడవ కూటమిని ఏర్పాటు చేసింది. క్రమక్రమంగా ఒక రాష్ట్రం తర్వాత మరో రాష్ట్రంలో కాంగ్రెస్ అంతరించిపోతోందన్నది ‘బసపా’ మరో నిర్ధారణ. ‘మూడవ కూటమి’ నాయకురాలిగా వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థిగా అవతరించాలన్నది మాయావతి కంటున్న కల.. అందువల్లనే యూపీలో కాంగ్రెస్‌తో జట్టుకట్టరాదన్నది ఆమె వ్యూహం. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ‘కాంగ్రెస్ అహంకారం’ గురించి ప్రచారం చేయడం ఈ విస్తృత వ్యూహంలో భాగం..
ఉత్తరప్రదేశ్‌లో మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, ఆయన తనయుడు, మరో మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్‌ల ఆధ్వర్యవంలోని ‘సమాజ్‌వాదీ పార్టీ’- సపా-కి, ‘బసపా’కి మధ్య కుదిరిన పొత్తు వల్ల లోక్‌సభకు, శాసనసభకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భాజపా పరాజయం పాలైంది. రాబోయే లోక్‌సభ ఎన్నికలలో ఈ రెండు పార్టీల మధ్య ‘కూటమి’ ఏర్పడినట్టయితే అది భాజపాకు గట్టి ఎదురుదెబ్బ కాగలదు. కానీ, ‘సపా-బసపా’ కూటమికీ, భాజపాకు మధ్య జరుగనున్న పోరు కారణంగా ఉత్తరప్రదేశ్ వోటర్లు ద్విధా- రెండుగా- విభక్తం కానున్నారు. అది జరిగినట్టయితే ఇప్పటికే యూపీలో ఉనికిని కోల్పోయి ఉన్న కాంగ్రెస్ పూర్తిగా అంతరించిపోవడం ఖాయం. అందువల్ల యూపీలో ఏర్పడే ‘సపా-బసపా’ కూటమిలో తాను ఇరుక్కోవాలన్నది కాంగ్రెస్ ఆకాంక్ష! దీన్ని ఆసరాగా తీసుకొని మధ్యప్రదేశ్‌లోను, రాజస్థాన్‌లోను కాంగ్రెస్‌తో జట్టుకట్టి కనీసం పదిహేను శాతం శాసనసభా స్థానాలనైనా గెలుచుకోవాలన్నది మాయావతి ఎత్తుగడ! ‘తమకు బలం లేని చోట కాంగ్రెస్ తమకు ఉదారంగా ఎక్కువ స్థానాలు కేటాయించాలి. అప్పుడు మాత్రమే యూపీలో కాంగ్రెస్‌కు తాము ఉదారంగా కొన్ని లోక్‌సభ స్థానాలను కేటాయిస్తాము..’ అన్నది మాయావతి వ్యూహం. ఇప్పుడు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో మాయావతి పార్టీకి కాంగ్రెస్ ఇలా ఉదారంగా స్థానాలను కేటాయించక పోవడం ‘అహంకార చిహ్నం’.. ఈ సాకుతో యూపీలో ‘బసపా’ కాంగ్రెస్‌తో జట్టు కట్టదు. ‘సపా-బసపా’ కూటమిలో కాంగ్రెస్‌కు చోటు దక్కదు. భాజపాకు, ‘సపా-బసపా’ కూటమికీ మధ్య పోరు కారణంగా కాంగ్రెస్ యూపీలో సమూలంగా నిర్మూలనం అయిపోతుంది..
భాజపాను వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షాల మధ్య ఇలా పరస్పర వ్యతిరేకత కూడ నిహితమైంది. భాజపాకు జాతీయ ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ మళ్లీ ఎదగరాదని, తమ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం కావాలని సమాజ్‌వాదీ నేతలు ఒకవైపున, ‘బసపా’ అధ్యక్షురాలు మాయావతి మరోవైపున ఆకాంక్షిస్తున్నారు. బ్రిటన్ దురాక్రమణ నుండి విముక్తమైన అవశేష భారత్‌లో దాదాపు మూడున్నర దశాబ్దుల పాటు కాంగ్రెస్ ఏకైక జాతీయ ప్రత్యామ్నాయంగా కొనసాగింది. ఆ సమయంలో కాంగ్రెస్ వ్యతిరేక ‘కూటమి’ని ఏర్పాటు చేయడానికి ప్రతిపక్షాలు చేసిన యత్నాలు అంతర్గత వైరుధ్యాల వల్ల ఫలించలేదు. కాంగ్రెస్‌కు తమ పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం కాగలదన్న వివిధ పక్షాల నేతల అతిశయం ఈ వైరుధ్యాలకు కారణం. 1974లో ఉత్తరప్రదేశ్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయమని ప్రచారం జరిగినట్టు చరిత్ర చెబుతోంది. భాజపాకు పూర్వరూపమైన భారతీయ జనసంఘ్‌కు, చరణ్‌సింగ్ నాయకత్వంలోని భారతీయ క్రాంతిదళ్- బేకేడీ-కు మధ్య పొత్తు కుదిరిపోయిందన్న ప్రచారం కూడ జరిగింది. ఆ ‘కూటమి’ కాంగ్రెస్‌ను ఓడించడం కూడ ఖాయమైంది. కానీ చివరి నిముషంలో బీకేడీ, జనసంఘ్‌ల ‘కూటమి’ భగ్నమైంది. ఆ రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. ఫలితంగా 425 స్థానాల ఉమ్మడి యూపీ శాసనసభలో కాంగ్రెస్‌కు 213 స్థానాలు లభించాయి. ఇరవై తొమ్మిది శాతం వోట్లు మాత్రమే దక్కిన కాంగ్రెస్‌కు ‘మెజారిటీ’ శాసనసభ స్థానాలు లభించడానికి కారణం ప్రతిపక్ష అనైక్యం.. ఇప్పుడు భాజపా ఏకైక జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా అవతరించి ఉంది. ఈ స్థితి మరికొన్ని ఏళ్ల వరకూ మారబోదన్నది స్పష్టం.. అందువల్ల ప్రతిపక్షాల ‘సమైక్య అభినయం’ భాజపాకు వ్యతిరేకంగా పునరావృత్తం కావడం ఖాయం!
గాంధీజీ నాయకత్వం వహించిన కాంగ్రెస్ మహారాష్టల్రోని వార్థా- సేవాగ్రామ్- నుంచి ‘క్విట్ ఇండియా’- భారత్‌ను వదలివెళ్లండి- అని బ్రిటన్ దురాక్రమణదారులను కోరింది. అలాంటి కాంగ్రెస్ ప్రస్తుతం రాజకీయ విదూషకుడైన రాహుల్ నాయకత్వం పాలు కావడం చారిత్రక అపహాస్యం.. మరోసారి స్వాతంత్య్ర సమరం జరగాలని- గాంధీ మహాత్ముని జయన్తి నాడు రాహుల్ వార్థా నుంచి పిలుపునివ్వడం ఈ ‘అపహాస్య’ ప్రహసనంలో వర్తమాన ఘట్టం. అవును..! కాంగ్రెస్ కార్యకర్తలు మరోసారి స్వాతంత్య్ర సంఘర్షణ చేయవలసిందే.. రాహుల్ నుంచి, వారి కుటుంబం ‘బందిఖానా’ నుంచి కాంగ్రెస్‌ను విముక్తం చేయడానికి పోరాటం జరగాలి! ఎందుకంటే రాహుల్ నాయకుడుగా ఉన్నంత కాలం కాంగ్రెస్ మళ్లీ జాతీయ రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగడం కల్ల...